జగద్ధాత్రి (Jagaddhathri)

Share
పేరు (ఆంగ్లం)Jagaddhathri
పేరు (తెలుగు)జగద్ధాత్రి
కలం పేరు
తల్లిపేరు
తండ్రి పేరు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ1964
మరణం
పుట్టిన ఊరు
విద్యార్హతలు
వృత్తికవయిత్రి, అనువాదకురాలు
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలు
ఇతర రచనలుhttps://www.neccheli.com/2019/09/%e0%b0%b0%e0%
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులువక్షస్థలే (ఆర్ ఎస్ క్రిష్ణమూర్తి కథా పురస్కారం)
సహచరణం (పాతూరి మాణిక్యమ్మ కవితా పురస్కారం, అజోవిభో కందాళం ఫౌండేషన్ అవార్డు)
ఇతర వివరాలుజగద్ధాత్రి రాసిన ఆటవిడుపు కవిత గురించి విమర్శకులు బొల్లోజు బాబా మాట్లాడుతూ, గ్లోబల్ వార్మింగ్, పాలస్తీనాలో పాలుగారే పసిపిల్లల బుగ్గలపైనుంచి జారే కన్నీటి చుక్కలు, అంటార్కిటికాలో కరుగుతున్న మంచు, గోద్రా మంటలు, నందిగ్రామ్, ముదిగొండ పేలుళ్ళు వంటి సమకాలీన అంశాలను స్పృశిస్తూ, ఇవి మానవాళి శాంతిని భగ్నం చేస్తున్నాయని, వీటినుంచి ఆటవిడుపు తీసుకొని కాసేపు ఆలోచించమని- ఆటవిడుపు అంటే విరామం కాదు, ఆటగాళ్లుగా మనందరం విశ్వశాంతికై తర్ఫీదు పొందే సార్ధక సమయం అనీ రచయిత్రి భావించిందని తెలిపారు.
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికరేప‌టి టీచ‌ర్లు (క‌థ‌)
సంగ్రహ నమూనా రచన‘గుడ్‌ మార్నింగ్‌ మేడమ్‌!’

రిజిస్టర్‌లో సంతకం చేసి తలెత్తి చూశాను. మా స్టూడెంట్‌. అంటే పాడేరు నుంచి వచ్చిన ట్రైబల్‌ స్టూడెంట్‌.

జగద్ధాత్రి
రేప‌టి టీచ‌ర్లు (క‌థ‌)

‘గుడ్‌ మార్నింగ్‌ మేడమ్‌!’
రిజిస్టర్‌లో సంతకం చేసి తలెత్తి చూశాను. మా స్టూడెంట్‌. అంటే పాడేరు నుంచి వచ్చిన ట్రైబల్‌ స్టూడెంట్‌.
మా బిఎడ్‌ కాలేజీకి కొంత గిరిజనుల కోటా ఉంటుంది, అందులో వచ్చిన బ్యాచ్‌లో స్టూడెంట్‌ ఈ అబ్బాయి.
నా ఇంగ్లీష్‌ మెథడాలజీనే. వీరికి సరైన అవకాశాలు కల్పించి బి.ఎడ్‌ డిగ్రీ అందిస్తే.., ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయి. వారి గూడేలు బాగుపడతాయి. వారిని చూసి మరికొందరు చదివేందుకు ముందుకొస్తారు. ఇదొక్కటే నాతో ఎంత కష్టమనిపించినా వారి భాషను కూడా నేర్చుకునేలా చేసి వారికి దగ్గరిచేసింది. కొన్ని పోస్టులు సరైన క్యాండిడేట్లు దొరక్క మిగిలి ఉండిపోతాయి. అప్పుడు చివుక్కుమంటుంది. మిగతావాళ్లు మరికొంచెం బాధ్యత తీసుకుంటే ఈ పరిస్థితి ఉండదు. వీళ్లలో ఎక్కువమంది ఇంగ్లిష్‌ మెథడాలజీ తీసుకుంటారు. ఎక్కువ పోస్టులు ఉంటాయి. సింగిల్‌ టీచర్స్‌ స్కూళ్లలో ఈసారి బ్యాచ్‌లో పది మంది ఉన్నారు. అందులో ఏడుగురు ఇంగ్లిష్‌ తీసుకున్నారు. అయితే సోషల్‌, లేదా లెక్కలు మొదటి మెథడాలజీ, రెండవది ఇంగ్లిష్‌. తెలుగు తీసుకోవడానికి ఇష్టపడరు వీళ్లు. అలాగని ఇంగ్లిష్‌ వచ్చని కాదు అస్సలు రానిది. ఇంగ్లిష్‌ తీసుకుంటే ఉపయోగం అని తర్వాత ఇంకా అభివృద్ధి ఉంటుందని.
‘ఏమిట్రా… పొద్దున్నే’ విసుగ్గా అన్నా నవ్వుతూనే. స్టాఫ్‌రూమ్‌ వైపు నడుస్తుంటే నాతో బాటే నడిచి వస్తున్నాడు తాను కూడా.
‘ఏమిటి సంగతి వెంటబడ్డావ్‌?’ నవ్వుతూ అడిగా.
‘ మరే మరండీ మేడమ్‌ ….’
‘ఏంట్రా నసుగుడు, వెళ్ళండి అందరూ ప్రాక్టికల్స్‌కి తయారు అవ్వండి. నిన్న లెసన్స్‌ ఎలాట్‌ చేశాను కదా..!
వాటికి నే చెప్పిన మోడెల్స్‌ని తయారు చేస్కోవాలి. ఎక్స్‌టర్నెల్స్‌ కన్నా ముందు నా దగ్గర చెప్పాలి అర్థమైందా? ఏరీ మీ మిగిలిన మీ కాబోయే టీచర్లూ’ ఎప్పుడూ వాళ్ళని కాబోయే టీచర్లనే అంటాను. అలా వారి చదువు గొప్పదనం గుర్తుచేస్తుంటాను. కొండ దొరలు అని కూడా అంటూ ఉంటాను. అలా వారి పెద్ద మనసుని మెచ్చుకుంటాను. నేను అంటే మిగిలిన లెక్చరర్స్‌ కూడా అలాగే అనడం, చివరికి స్టూడెంట్స్‌ స్టాఫ్‌ అందరూ వాళ్ళని అలాగే పిలుస్తారు. వాళ్ళు మాత్రం ఏమీ అనుకోరు. అసలేమైనా అనుకోవాలని కూడా తెలియని పుట్ట తేనియ అంత స్వచ్ఛమైన మనసులు వాళ్లవి.
‘అదే మేడమ్‌ మాకిచ్చిన లెసన్స్‌ అన్నిటికీ మోడల్స్‌ తయారు చేసేసాం, కానీ …మరి ….’
‘అయితే ఇంకేం తెచ్చేయండి ఈ రోజు ఓ సారి ప్రాక్టీస్‌ చేసేసుకుందాం. అసలే రేపు మనకి వచ్చే ఇంగ్లీష్‌ ఎక్స్‌టర్నెల్‌ చండశాసనుడు అంట’ బ్యాగ్‌ సొరుగులో పెట్టి నా బీరువాలో బుక్స్‌ తీయడానికి తాళం తీస్తున్న కొండా… ఒక్కసారి ఏడుపు మొదలు పెట్టాడు. ‘హే కొండా! ఎందుకలా ఏడుస్తున్నావు?’ నాకు చాలా జాలి అనిపించింది.
‘అది కాదు మేడమ్‌! లెసన్‌ ప్లాన్స్‌ అన్నీ రాసేశాం. కానీ, లెసన్‌ చెప్పాలంటే భయంగా ఉందమ్మా’
వాళ్ళందరూ క్లాస్‌ బయట నన్ను అమ్మా అంటారు. క్లాస్‌లోనే మేడమ్‌ అంటారు. వాళ్ళ పట్ల నేను చూపే ఆత్మీయత బహుశా నన్ను వాళ్లకి దగ్గర చేసింది. అందరు స్టూడెంట్స్‌ తోనూ ఆత్మీయంగా ఉండటం నా మనస్తత్వం. భుజానికి కళ్ళు తుడుచుకుంటూ తాను అలా చిన్న పిల్లాడిలా చెప్తుంటే నాకు చాలా బాధ అనిపించింది.
ఇది ప్రతి బ్యాచ్‌లోనూ నేను ఫేస్‌ చేస్తాను. వీళ్ళే కాదు, ఇంకా అసలు ఇంగ్లీష్‌ రాని వాళ్ళు కూడా మంచి అవకాశం వస్తుంది డీఎస్సీలో అని ఇంగ్లీష్‌ తీసుకుంటారు. కానీ, పాఠాలు చెప్పేదగ్గరికి వచ్చేటప్పుడు ఇలాగే డీలా పడిపోయి ఏడుస్తారు. ఒక్కొక్కసారి బాగా జ్వరం పెట్టేసుకుంటారు. ఇవన్నీ ఎక్కువ ఇంగ్లీష్‌ వాళ్లకే ఎదురవుతాయి. మళ్ళీ లెక్కలు కానీ, సోషల్‌ కానీ, సైన్స్‌ కానీ ఎంత బాగా చెప్తారో..! తెలుగులో కదా..! ఈ కొండా చేతి రాత చూస్తే అసలు ఏ కాన్వెంట్‌లో చదువుకున్న వాడైనా పనికి రాడు, ముత్యాలు పేర్చినట్టు ఉంటుంది.
‘కొండా, నువ్వు వరాలు, లచ్చుం నాయుడు, మీరంతా మొన్న నా దగ్గర బాగానే చెప్పారు కదా నాన్నా..! అలా భయపడితే ఎలా? నేనుంటాను కదా మీ పక్కనే’ అనునయంగా అన్నాను.
‘మే ఐ కమ్‌ ఇన్‌ మాడమ్‌’ గుంపుగా పదిమంది ముగ్గురు ఆడపిల్లలు, ఆరుగురు మగ పిల్లలు అందరూ నా స్టూడెంట్సే గుమ్మం దగ్గర నిలబడ్డారు.
‘యెస్‌ కమ్‌ ఇన్‌…! ఏంటర్రా అందరూ కట్ట కట్టుకుని వచ్చారు?’
‘అదే మేడమ్‌ మీతో మాటాడాలి అని..’ అందులో బాగా మాట్లాడేది ఎరికమ్మ. తాను సోషల్‌, ఇంగ్లీష్‌ అమ్మాయి. సోషల్‌ పాఠం ఆ అమ్మాయి చెప్తుంటే నిజంగా ఎంత బాగుంటుందో..! నేను నా పాఠాలు అయ్యాక సోషల్‌ పాఠాలు కూడా వింటుంటా. మంచి సామాజిక అవగాహన అన్వయంతో చెప్తారు పిల్లలు.
‘ఏంట్రా మాటాడేది ఫైనల్‌ ప్రాక్టికల్స్‌లో మీ పాఠం నన్ను చెప్పమంటారా ఏంటి ?’
‘అది కాదు మేడమ్‌ భయంగా ఉంది’
‘ఓర్నీ భయమెందుకు నా దగ్గర చెప్పలేదూ, ఎలా సులువుగా చెప్పాలో మీకు నేర్పలేదూ నేను, మరి ఇప్పుడిలా భయపడితే ఎలా?’
‘మీ దగ్గర చెప్పాలంటే ధైర్యంగా ఉంటుంది మేడమ్‌. కానీ, బయట వాళ్ల దగ్గర ….’ నసిగింది దేవమ్మ. తాను లెక్కలు, ఇంగ్లీష్‌ స్టూడెంట్‌.
‘భలే చెప్తున్నారు రా! మీరు.. ఎన్ని బ్యాచులు మీలాంటి వారిని పంపించాను. ఎన్ని సార్లు చెప్పాను. భయపడకూడదు అని’
‘అవును మరి మీ దగ్గరైతే ధైర్యంగా చెపుతారు, మీరు ఉంటారు కనుక. మీకు ప్రతి బ్యాచ్‌కి ఈ ప్రహసనం అలవాటేగా’ నవ్వుతూ అంది ఫిలాసఫీ లెక్చరర్‌. మమ్మల్ని అంటే బీ.ఎడ్‌ లెక్చరర్స్‌ని టీచర్‌ ఎడ్యుకేటర్స్‌ అంటారు.
‘ఏం చేస్తాం మణీ! ఈ ఇంగ్లీష్‌ ఉందే ఇదొక మహమ్మారిలా భయపెడుతుంది.’ నవ్వేను.
‘కానీ, మీరు ఉండబట్టి ఎక్కువ మంది ఇంగ్లీష్‌ తీసుకుంటారు మరి. మీరు ఆ మహమ్మారికి భయపడకుండా చేస్తారుగా. అయినా మీరు ఉండగా వాళ్ళకు భయమెందుకు? ఓరు హలో! మీరు ముందు నా సబ్జెక్ట్‌ రికార్డ్‌ సబ్మిట్‌ చేయండి. లాస్ట్‌ డేట్‌ రేపే, మీకు తెలుసుగా రేపు గాని ఇవ్వక పోయారో ఎల్లుండి ఇచ్చినా చించేస్తాను.’ బెదిరింపుగా అంది మణి. అనడం కాదు, ఆమె నిజంగానే చించేస్తుంది. ఆమె అంటే అందరికీ భయం కాలేజ్‌లో.
‘మేము అందరం ఇచ్చేశాం మేడమ్‌’ మమ్మల్ని ఎందుకు అంటావు అన్నట్లు ఉక్రోషంగా సమాధానం చెప్పింది సత్తమ్మ.
‘ఊ సరే సరే పదండి నా క్లాస్‌ ఉంది’ అంటూ నడిచింది మణి.
‘వెళ్ళండి. మీరంతా క్లాస్‌కి కంగారు ఏమీ లేదు నేనున్నాగా చూసుకుంటా’ అందరూ భయంగా నెమ్మదిగా క్లాస్‌కి వెళ్లేరు.
‘ఏంటి మమ్మీ డల్‌గా ఉన్నావు స్ట్రెయిన్‌ ఎక్కువైందా కాలేజ్‌లో?’ అడిగింది దివ్య.
‘లేదురా, ప్రతి ఏడాది లాగానే మళ్ళీ ప్రాక్టికల్స్‌ రేపు. ఉదయం రోజూ కంటే చాలా
ముందరే బయల్దేరాలి. ఆరుగంటల బస్సుకే వెళ్తాను.’.
కాలేజ్‌కి రోజూ నలభై కిలోమీటర్లు ప్రయాణం చెయ్యాలి రోజూ, మేముండే సిటీకి
కాలేజ్‌ ఉండే చోటు సబర్బన్‌లో ఉంటుంది.
‘ఓహౌ వచ్చేసిందా నీకు పరీక్ష రోజు! అబ్బా ఇప్పటికీ పదేళ్ల నుంచి చూస్తున్నాను.. వాళ్లకి పరీక్షలైతే నువ్వు కంగారు పడటం. ఆ మణి గారు, తెలుగు సార్‌, సోషల్‌ సార్‌, ఫిజిక్స్‌ ప్రసాద్‌ సార్‌ చూడు ఎంత హాయిగా ఉంటారో..! నువ్వు మాత్రం నా ఎగ్జామ్స్‌కి కూడా టెన్షన్‌ పడవు. కానీ, మీ కాలేజీ పిల్లల పరీక్షలంటే మాత్రం… అబ్బా లే మమ్మీ..! టీవీలో నీ ఫేవరెట్‌ సినిమా వస్తోంది. ‘ముఘల్‌ ఏ ఆజమ్‌’ చూద్దాం రా’ చెయ్యి పట్టుకుని లాగింది పాప.
‘ఏమి చేస్తాం రా! ప్రతి సారీ ఇదే ….’ ఏదో చెప్పబోయాను.
‘మాతా.. ధరణీ.. ఇంక మేము నీ సుత్తి భరించలేం గానీ లే..! సినిమా చూద్దాం’ చెయ్యిపట్టుకుని లాగి నిలబెట్టింది పాప. నేను పడుతున్న బాధ తనకేం తెలుసు చిన్న పిల్ల. మౌనంగా హాల్‌లో టీవీ దగ్గరికి కదిలాను.
విద్య మనిషి జీవితంలో అత్యంత ముఖ్యమైనది. విద్యా, ఆరోగ్యం ఈ రెంటినీ ప్రైవెటైజ్‌ చేయొద్దని మహామహులు చెప్పినా మన ప్రభుత్వాలు ఎల్పీజీ (లిబరలైజేషన్‌- ప్రైవేటైజేషన్‌-గ్లోబలైజేషన్‌) అంటూ చేయనే చేసింది. ఒక ఇంజినీరు మంచివాడు కాకుంటే ఒక బ్రిడ్జ్‌ కూలిపోతుందేమో..! కానీ, ఒక ఉపాధ్యాయుడు మంచివాడు కాకుంటే ఒక తరం పాడైపోతుంది. ఒక టీచర్‌ కనీసం 100 మందికి పాఠం చెప్తే ఆ పాఠాల్లో నాణ్యత లేకుంటే పిల్లలు ఏమి నేర్చుకుంటారు.. ఏమి చదువుతారు? ఇన్ని బి.ఎడ్‌ కళాశాలలు ఉండి కొందరు మంచి ఉపాధ్యాయులనైనా తయారు చేయగలుగుతున్నామా..! అన్నది నన్నెప్పుడూ వేధించే ప్రశ్న. బి.ఎడ్‌లో చాలా చిత్రమైన విద్యార్థులు వస్తారు. కొంతమంది డిగ్రీ నుంచి వస్తే.. మరి కొంతమంది పీజీ చదివి వచ్చిన వాళ్ళు ఉంటారు. ఇంక ఏజ్‌ లిమిట్‌ ఎక్కువ ఉంది కనుక, కొందరు ఎప్పుడో డిగ్రీలు చేసి వదిలేసినా ఇప్పుడు మళ్ళీ పిల్లలు కాస్త ఎదిగాక టీచర్లుగా ఉద్యోగాలు చేద్దామని చదవడానికి, పెళ్ళైన ఇల్లాళ్లు, పిల్లల తల్లులు వస్తారు. ‘ఏంటి అమ్మా నీ కన్నా నీ స్టూడెంట్స్‌ పెద్దగా ఉన్నారు’ అంటుంది పాప. ఇన్‌-సర్వీస్‌ హెచ్చార్స్‌ కూడా వస్తారు. అందరినీ స్టూడెంట్‌ టీచర్స్‌ అంటాం. మామూలుగా కాలేజ్‌ చదువు చెప్పినట్టు ఉండదు బి.ఎడ్‌. రకరకాల ఏజ్‌ గ్రూప్స్‌ కుటుంబ నేపథ్యాలు, ఇంకా కొందరు జీవితంలో నష్టపోయినవారు మళ్ళీ జీవితాన్ని చక్కదిద్దుకోవడానికి వస్తారు.
విడాకులు పొందిన అమ్మాయిలు, భర్తలు పోయినవారు, రకరకాల మనస్తత్వాలు. అందరినీ డీల్‌ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. బాగా చదువుకునే మెరికల్లాంటి పిల్లలు కూడా ఉంటారు. అందరికీ డిగ్రీలోనో ఇంటర్మీడియట్‌లో చెప్పినట్టు ఒకే మూసలో చెప్పేయడం కుదరదు. కొందరు ఎంతో బాగా చదువుతారు, పాఠాలు చెప్తారు. నేను ఇంగ్లీష్‌ చెప్తాను, సైకాలజీ చెప్తాను. ఉపాధ్యాయులుగా వాళ్ళు పిల్లల మనస్తత్వాలను అర్థం చేస్కోవాలి. అందుకే, మనస్తత్వ శాస్త్రం. కానీ, అది నేర్పేటప్పుడు వీళ్ళ మనస్తత్వాలను అర్థం చేసుకుని నేర్పాలి. అందరి కంటే కాస్త వయసులో పెద్ద కనుక అందరినీ అర్థం చేసుకుంటాను కనుక, నన్ను మా స్టూడెంట్స్‌ అందరూ బాగా ఇష్టపడతారు. వాళ్ళని మంచి టీచర్లుగా తయారు చేయలేమా… అన్న ఛాలెంజ్‌ నాకు నేనే చేసుకున్నాను. అందుకే ఇంత ఆలోచన, శ్రమ.
ప్రతి బ్యాచ్‌ చివరి రోజు ఫేర్వెల్‌ నాడు.. ఒకటే చెప్తాను. ‘డియర్‌ స్టూడెంట్స్‌ మీరందరిలోనూ మంచి టీచరు లక్షణాలు ఉన్నాయి. మీలో కొంతమంది డియస్సీ సాధించి ప్రభుత్వ టీచర్లు అవుతారు, కొందరు ప్రైవేట్‌ స్కూల్స్‌లో కార్పొరేట్‌ స్కూల్స్‌లో టీచర్స్‌ అవుతారు, వీళ్ళకి ఎలాగూ తప్పదు. బాగా చెప్పకపోతే తీసేస్తారు. కానీ, గవర్నమెంట్‌ టీచరు జాబ్‌ వచ్చిందా! మీరింక చదవరు.. నాకు తెలుసు, అయితే అందరికీ ఒకే మాట. మీరు గనుక టీచర్స్‌ అయితే దయచేసి అప్పుడప్పుడైనా సిన్సియర్‌గా పాఠాలు చెప్పండి ప్లీజ్‌. దేశ భవితవ్యం తరగతి గదుల్లో నిర్మింపబడుతుంది అని కొటేషన్‌ రాయడం కాదు, నిజంగా క్లాస్‌రూములు రాబోయే తరాలను తీర్చిదిద్దే ఆలయాలని గుర్తు పెట్టుకుని మసలుకోండి. ఇది నా సందేశం కాదు విన్నపం. ఇక్కడ మీరు ఏ పాఠాలు ఎలా చెప్పాలో నేర్చుకున్నారు. దానికి ఇంకా మీ తెలివితేటలు కృషి జోడించితే మంచి ఉపాధ్యాయులు అవుతారు. జాతి నిర్మాతలవుతారు. నేనేదో ఉద్విగంగా మీకు ఇవన్నీ చెప్తున్నాను అనుకుంటున్నారు. కానీ, మీ జీవితంలో మీ టీచర్‌ వృత్తిలో మీరెప్పుడూ నిత్య విద్యార్థిగా ఉంటే మంచి విద్యార్థులను తయారు చేయగలుగుతారు. అమ్మ ప్రేమ, నాన్న శిక్షణ రెండు అందించే స్నేహితుడిలాంటి మంచివారు టీచర్లు. మీ అందరూ మంచి ఉపాధ్యాయులుగా దేశానికి మంచి పౌరులను అందించేవారిగా కొనసాగాలని నా ఆశ, ఆశీర్వాదం..’
నా మాటలు ఊరికేపోవు కొందరు మంచి పేరు తెచ్చుకుని వచ్చినవాళ్లున్నారు. నేను పంపిన నాలుగో బ్యాచ్‌ అనుకుంటా… వాసు అనే అబ్బాయికి బెస్ట్‌ టీచర్‌ అవార్డ్‌ వచ్చింది. ఇలా ఎక్కడెక్కడో మా స్టూడెంట్స్‌ గురించి ఎవరెవరి నుండో వింటుంటాం. అదే ఈ వృత్తిలో ఆనందం తృప్తీ. అయితే వాళ్ళని పరీక్షలు పాస్‌ చేసేటప్పుడు మాత్రం చాలా సంఘర్షణకు గురౌతాను. ప్రాక్టికల్స్‌, రికార్డ్స్‌ మార్కులు ఏడువందల మార్కులు మా చేతిలో ఉంటాయి. అందుకే బి.ఎడ్‌ లెక్చరర్లు అంటే స్టూడెంట్స్‌ చాలా విలువ ఇస్తూ భయంగా మసలుతారు.
స్టూడెంట్స్‌కి అందరికీ మళ్ళీ పర్సంటేజ్‌ బాగుండాలి. రాత పరీక్షలలో తగ్గినా ప్రాక్టికల్స్‌లో అందరికీ ఫస్ట్‌ క్లాస్‌ మార్కులు వేయాలి. పరీక్షల పేపర్లు కరెక్ట్‌ చేసేటపుడు కూడా ఇదే బాధ నాకు. ఎప్పుడూ ఒకటే ఆలోచన నన్ను వేధిస్తుంది. ‘నాణ్యత లేని ఉపాధ్యాయులను తయారు చేసి దేశం మీదకి వదిలి ద్రోహం చేస్తున్నామా మేము.
(ఉపాధ్యాయులకే ఉపాధ్యాయులం కదా) లేక కేవలం ఈ డిగ్రీ ఉంటే జీవనోపాధి కల్పించుకుని బతకాలనుకునే వారికి సహాయం చేస్తున్నామా? ఇదే ఎప్పుడు నా మదిని వేధించే ట్రిల్లియన్‌ డాలర్‌ ప్రశ్న! విద్యా నాణ్యతా ప్రమాణాలు గురించి పట్టించుకోని ప్రభుత్వాలు, అందుకే కార్పొరేట్‌ స్కూల్స్‌లో తమ పిల్లలను కడుపుకట్టుకుని చదివిస్తోన్న తల్లితండ్రులు. అలాగని పోనీ, కార్పొరేట్‌ స్కూల్స్‌లో విద్యా ప్రమాణాలు బాగున్నాయా అంటే… అదొక నరకకూపం పిల్లలకి. నూరి రుబ్బి పిల్లల్ని బండ మెషీనుల్లాగా తయారు చేస్తున్న మన విద్యా సంస్థలు. ఏ దేశం, ఏ వ్యవస్థ బాగుపడాలన్నా అది విద్య మీద కదా ఆధారం. అలాంటి విద్యని నాణ్యంగా ఎందుకు అందించలేకపోతున్నాం అన్నదే నా వ్యధ!!!
ప్రాక్టికల్స్‌ రోజు వచ్చిన ఎక్స్‌టర్నెల్‌తో మాట్లాడుతూ పిల్లలతో పాఠాలు చెప్పించేస్తాను నేను. ముందు బాగా చెప్పే వాళ్ళని ముందు పెట్టి, తర్వాత కాస్త వీక్‌గా ఉన్న వాళ్ళు చెప్పేటప్పుడు అవతలి వాళ్ళని మాటల్లో పెట్టి సర్దేస్తుంటాను.
మేము ఎలా చెపితే అలా మార్కులు వేసేస్తారు.. సహజంగా వచ్చినవాళ్ళు. ఎందుకంటే, వాళ్ళ కాలేజీలకి మేము వెళ్ళినా అంతేగా మరి. ఇలా మా పాస్‌ పర్సెంటేజ్‌ మాత్రమే మాకు కావాలి అంతే..! మా కాలేజీలు నడవాలిగా మరి.
ఈ బ్యాచ్‌లో నాకు యాభై మంది స్టూడెంట్స్‌. నిజానికి నేను గమనించాను వాళ్ళలో చాలా ప్రజ్ఞ, తపన ఉంటాయి కానీ, భయపడతారు. ఆ భయాన్ని పోగొట్టేమా వాళ్ళంత గొప్ప వాళ్ళు ఉండరు. వాళ్ళలో చదువు పట్ల గౌరవం, ఈ చదువు తాము చదివేసుకుని తమ పిల్లలను తీర్చిదిద్దుకోవాలనే తపన మాత్రం అందరిలోనూ ఉంటుంది. ఇక్కడ పాఠాలు చెప్పలేకపోయినవాళ్ళు ఎందరో తర్వాత మంచి టీచర్లుగా ముఖ్యంగా ఇంగ్లీష్‌ టీచర్లుగా పేరు తెచ్చుకున్నారు.
‘వావ్‌ ! ఏమి చెప్పిందండీ ఈ అమ్మాయి, నీ పేరేంటమ్మా?’ వచ్చిన ఎక్స్‌టర్నెల్‌ పెద్దవారు.. సత్తమ్మ చెప్పిన టాగోర్‌ పద్యం ఎనిమిదో తరగతి పాఠం ‘డే బై డే ఐ ఫ్లోట్‌ మై పేపర్‌ బోట్స్‌’ విని చాలా సంతోష పడిపోయారు. ‘ఇలా రామ్మా, అవునూ! సియులి ఫ్లవర్స్‌ అంటే పారిజాతాలు అని ఎలా తెలుసుకున్నావు?’ వెంకట్రావు మాస్టారు చాలా సీనియర్‌ ఇంగ్లీష్‌ మాస్టారు ఆనాటి విలువలు ప్రమాణాలు పాటించేవారు. ఆయన అలా మురిసిపోతూ అడుగుతుంటే నాకు మనసు నిండిపోయింది. ‘మా మేడమ్‌ చెప్పేరు సార్‌’ సిగ్గుపడుతూ చెప్పింది సత్తమ్మ. ‘సొ నైస్‌ ఆఫ్‌ యూ ధరణి గారూ ఇలా మీలా సిన్సియర్‌గా పాఠాలు చెప్పే వాళ్ళు ఇంకా ఎక్కడో అక్కడ ఉండబట్టే మన ఉపాధ్యాయ విద్యార్థులు నాణ్యంగా తయారువుతున్నారు. అందరూ మీలాగా సిన్సియర్‌గా చెప్తే మనం మంచి ఉపాధ్యాయులను అందించగలుగుతాం. ‘ఐ కంగ్రాట్యులేట్‌ యూ’ మనస్ఫూర్తిగా అన్నారు మాస్టారు. మా వెంకట్రావు మాస్టారు నుంచి అభినందన అంటే అవార్డ్‌గా భావిస్తాం మా టీచర్‌ ఎడ్యుకేటర్స్‌ అందరం. ఆ అమ్మాయి చెప్పిన పాఠం బట్టీ నన్ను అంచనా వేసి మెచ్చుకున్న మాస్టారిని చూస్తే నాకు ఆనందంతో మనసు నిండిపోయింది. మిగిలిన వారి పాఠాలను ఎలాగో గబ గబ చెప్పించేశాను అనుకోండి. మా సత్తమ్మ లాంటి వారి పాఠాలు విన్న మాస్టారు రిలాక్స్‌ అవుతుంటే కాస్త చెప్పలేని వాళ్ళు మా కొండ, ఇంకా మరి కొందరిచేత గబుక్కున పూర్తి చేసేసి హమ్మయ్య ఈ బ్యాచ్‌ దాటేసినట్టే అని ఊపిరి పీల్చుకున్నాను. నాకు వీళ్ల మీద నమ్మకం ఎక్కువ.. భవిష్యత్తులో మంచి టీచర్లు అవుతారని. ఒక్క అవకాశం ఇచ్చాం అంతే..! నా దేశాన్ని, భావితరాలను దిద్ది తీర్చే మంచి ఉపాధ్యాయులు, వారిని వారు దిద్దుకుని మంచి సంకల్పంతో.. వెనక్కి జారపడ్డాను కుర్చీలో.

———–

You may also like...