| పేరు (ఆంగ్లం) | Chukka Ramayaiah | 
| పేరు (తెలుగు) | చుక్కా రామయ్య | 
| కలం పేరు | ఐ.ఐ.టి రామయ్య | 
| తల్లిపేరు | నరసమ్మ | 
| తండ్రి పేరు | అనంత రామయ్య | 
| జీవిత భాగస్వామి పేరు | – | 
| పుట్టినతేదీ | 11/20/1925 | 
| మరణం | – | 
| పుట్టిన ఊరు | వరంగల్ | 
| విద్యార్హతలు | – | 
| వృత్తి | ఐఐటీ శిక్షకులు, సామాజిక ఉద్యమకారుడు, మాజీ శాసన మండలి సభ్యులు | 
| తెలిసిన ఇతర భాషలు | – | 
| చిరునామా | – | 
| ఈ-మెయిల్ | – | 
| ఫోను | – | 
| వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – | 
| స్వీయ రచనలు | చిన్న పాఠం  దేశదేశాల్లో విద్య బడిపంతుళ్ళకు రాజకీయాలా? చదువుల తోవ చదువులో సగ చిట్టి చేతులు (వ్యాస సంపుటి) దర్యాప్తు ఈ మట్టి రుణం తీర్చుకుంటా నడక జ్ఞాన లోగిళ్ళు ఇంటి భాష (వ్యాస సంపుటి)  | 
| ఇతర రచనలు | – | 
| ఈ-పుస్తకాల వివరాలు | https://www.amazon.in/Books-Chukka-Ramaiah/s?rh=n%3A976389031%2Cp_27%3AChukka+Ramaiah,  | 
| పొందిన బిరుదులు / అవార్డులు | – | 
| ఇతర వివరాలు | – | 
| స్ఫూర్తి | – | 
| నమూనా రచన శీర్షిక | ప్రాధమికం (పుస్తకం) | 
| సంగ్రహ నమూనా రచన | ప్రాథమిక విద్య చదివే శిశువులో పరిపూర్ణ వికాసం తీసుకురావడం చాలా కష్టమైన పని. ఇందుకు ఉపాధ్యాయుడు ప్రతి రోజు తనకు తాను ప్రయోగశాలగా మారాలి. | 
చుక్కా రామయ్య
ప్రాధమికం (పుస్తకం)
ప్రాథమిక విద్య చదివే శిశువులో పరిపూర్ణ వికాసం తీసుకురావడం చాలా కష్టమైన పని. ఇందుకు ఉపాధ్యాయుడు ప్రతి రోజు తనకు తాను ప్రయోగశాలగా మారాలి. పిల్లల వద్దకు చదువును తీసుకువెళ్ళి వారిలో ఆలోచనల విత్తనాలను నాటాలి. బోధన అంటే పాఠాన్ని పాఠంగా అప్పగించటం కాదు. పిల్లలు ఉపాధ్యాయుడు కలిసి జరిపే చర్చ నుంచి పుట్టుకుచ్చే రసాయనిక చర్యే బోధన. ప్రాథమిక విద్య చుట్టూ అనేక కీలక అంశాలున్నాయి. ఎంతో జాగ్రత్త తీసుకుని నిబద్ధతతో పనిచేస్తే కాని ప్రాథమిక విద్య లక్ష్యాలను నెరవేర్చలేం. ఇందుకు ఒక్కొక్క ఉపాధ్యాయుడు ఒక్కొక్క పాఠంగా మారాలి. వారి అనుభవాలు పాఠ్యాంశాలు కావాలి. 60 ఏళ్ళ జీవితాన్ని తరగతి గదిలోనే గడిపిన మన విద్యావేత్త, నిత్య విద్యార్థి, నిత్య ఉపాధ్యాయుడు అయిన చుక్కా రామయ్య ప్రాథమిక విద్య గురించి అనేక విషయాలను తన అనుభవమనే కొలిమి నుంచి రాజేశారు. తరగతి గదిలో తాను చూసిన అనేక విషయాలను ఈ ప్రాథమికం అన్న పుస్తకంలో మన ముందుంచారు. ఆయన అనుభవం భవిష్యత్ తరాలకు, ఉపాధ్యాయ లోకానికి ఎంతో అవసరమైనవి. ఆయన ఆలోచనలు ఎంతో విలువైనవి.
పిల్లలు గడపదాటి సమాజంలోకి వస్తారు. ఇంటి పరిస్థితులు వేరు. సమాజం, సామాజిక శాస్త్రం వేరు. ఒక దశ నుంచి మరొక దశకు పిల్లలు అడుగులు వేసే పరిణామ దశ. పిల్లలు ఇంటి నుంచి బయటకు వస్తున్నారు. అదే కాకుండా పిల్లల సహజాతాలు బయటకు వచ్చే కాలం. నిన్నటి వరకు తల్లి కొంగు పట్టుకుని తిరిగే పిల్లలు సమాజం చెయ్యి పట్టుకుని తిరిగేందుకు ఎదిగే దశలో, మలుపు తిరిగే అతి కీలక దశలో ఏం నేర్చుకోవాలన్నదే ప్రాథమిక విద్య. పిల్లలు ఇంట్లో నేర్చుకున్నదానికి, సమాజంలో నేర్చుకునేదానికి మధ్య ఒక సంఘర్షణ జరుగుతుంది. ఆ సంఘర్షణే ప్రాథమిక విద్యకు పునాది. ఇళ్ళలో పిల్లలు ఇష్టమొచ్చినట్లు తిరుగుతారు. బడిలో ఒక బెంచిపై క్రమశిక్షణతో కూర్చునే దశకు వచ్చారు. పిల్లలకు ఉద్వేగాలు, ఉద్రేకాలు, ఉరుకుల పరుగులుంటాయి. వీటన్నింటిని ఎలా కంట్రోల్ చేయాలి? ఉపాధ్యాయుడు ఎలా ఉండాలి? తదితర అంశాలకు సంబంధించిన పనిముట్లను చుక్కా రామయ్య అందిస్తున్నాడు. ఇంట్లోని పిల్లలు సమాజంలో అడుగుపెట్టే దశలో నేర్చుకునే పాఠాలే ప్రాథమిక విద్యాపాఠాలు. తల్లి కడుపులో వున్న పిల్లవాడ్ని నేల మీదకు తెస్తుంది. అక్కడ కొన్ని విషయాలు నేర్చుకుంటారు. అమ్మ ఒడినుంచి పిల్లలు ప్రాథమిక విద్య బడిలోకి చేరతారు. తల్లి ప్రసవ సమయంలో తల్లడిల్లడం ఒక సంఘర్షణ. అమ్మ ఒడి నుంచి సమాజ బడిలోకి రావటం మరో ప్రసవం లాంటిది. ఈ రెండవ సంఘర్షణే ప్రాథమిక విద్య. ఈ సంఘర్షణలో నొప్పిని పిల్లలు భరిస్తారు. ఈ సందర్భంలో ఉపాధ్యాయుడు, పిల్లల మధ్య జరిగే ఏకీకరణ, కలయిక ద్వారా జరిగే రసాయనిక చర్యే పాఠశాల విద్యగా రామయ్య చెప్పారు. ఒక దశ నుంచి ఇంకో దశకు పోతున్నప్పుడు మధ్యలో జరిగే మార్పులు కీలకమైనవి. ప్రాథమిక విద్యతో పిల్లలు సమాజ ముఖచిత్రంలోకి వస్తారు. సాంప్రదాయాలను, సంస్కృతిని అది నేర్పుతుంది. తల్లి మాటలను నేర్పితే, పాఠశాల విద్య అక్షరాలు నేర్పుతుంది. తల్లి చెప్పిన మాటలు, సంస్కృతి సాంప్రదాయాలు పాఠశాలలో అక్షరాలై విరబూస్తాయి. కుటుంబంలో తల్లి ప్రేమను నేర్పుతుంది. పాఠశాల పిల్లలకు క్రమశిక్షణ నేర్పుతుంది. క్రమశిక్షణంటే కదలకుండా కూర్చోవడం కాదు. క్రమంగా ఆలోచించటం, ఆ ఆలోచనలకు ఆచరణలు ఎలాగో పాఠశాల తెలియజేస్తుంది. ఇల్లు పిల్లలకు పాకటం నేర్పితే, ప్రాథమిక విద్య సమాజంలో కాలు పెట్టి నడవడం నేర్పుతుంది. ఇంట్లో పాకుతున్నప్పుడు మోకాలు చిప్పల గిట్టలు అరిగి ఒక కొత్త కదలికలు వస్తాయి. అదే విధంగా సమాజమనే బడిలో నడిచేటప్పుడు ఆ మట్టిలో వున్న జ్ఞానం శరీరంలోకి పాకుతుంది. ఈ దశలో ప్రాథమిక విద్యకు ఎంతో ప్రాధాన్యత ఉంది. బాల్యమంటే ఒక స్థాయి, ఒక మలుపు, ఒక కుదుపు కొత్త ఆలోచనల వెలుగు. పిల్లలే దేశ సంపద. ఆ సంపదను బయటకు తెచ్చే సాధనం ప్రాథమిక విద్య. ఆ సంపద అనే విత్తనాలకు మొలకలు వేసి మొక్కలుగా మార్చే సాధనం ప్రాథమిక విద్య. బాల్యమే జీవితం. ఆ మలుపులను మన కళ్ళకు కట్టినట్లు చుక్కా రామయ్య వివరించారు. విశ్లేషించారు. ఆయన దృష్టి కోణం నుంచి మొత్తం పాఠశాల విద్యను వీక్షించవచ్చు.
– జూలూరి గౌరీశంకర్
https://kinige.com/book/Pradhamikam
———–