| పేరు (ఆంగ్లం) | Sripada Subrahmanya Sastry | 
| పేరు (తెలుగు) | శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి | 
| కలం పేరు | శాస్త్రి, వాచస్పతి, తార్కికుడు, వసంతుడు, కుమారకవిసింహుడు, భటాచార్యుడు, కౌశికుడు | 
| తల్లిపేరు | మహలక్ష్మీ సోదెమ్మ | 
| తండ్రి పేరు | లక్ష్మీపతి సోమయాజులు | 
| జీవిత భాగస్వామి పేరు | – | 
| పుట్టినతేదీ | 4/23/ 1891 | 
| మరణం | 2/25/1961 | 
| పుట్టిన ఊరు | తూర్పు గోదావరి జిల్లా పొలమూరులో జన్మించాడు. | 
| విద్యార్హతలు | వేదం, జ్యోతిష్యం మరియు ధర్మ శాస్త్రాలను చదివారు. | 
| వృత్తి | శాస్త్రి తొమ్మిదేళ్ళ పాటు ప్రబుద్ధాంధ్ర పత్రిక నిర్వహించారు. | 
| తెలిసిన ఇతర భాషలు | – | 
| చిరునామా | – | 
| ఈ-మెయిల్ | – | 
| ఫోను | – | 
| వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – | 
| స్వీయ రచనలు | అనాథ బాలిక, రక్షాబంధనము, నీలా సుందరి, క్షీరసాగరమధనం, వడ్లగింజలు, ఆత్మబలి, రాజరాజు కథలు: కలుపు మొక్కలు, గులాబీ అత్తరు, శుభికే శిర ఆరోహ, తాపీమేస్త్రి , రామదీక్షితులు బి.ఏ., మార్గదర్శి, ఇలాంటి తవ్వాయి వస్తే, షట్కర్మయుక్తా, పుల్లంపేట జరీచీర, ఇల్లుపట్టిన వెధవాడపడుచు, అన్నంతపనీ జరిగింది | 
| ఇతర రచనలు | – | 
| ఈ-పుస్తకాల వివరాలు | – | 
| పొందిన బిరుదులు / అవార్డులు | – | 
| ఇతర వివరాలు | వేదవేదాంగాలు తరతరాలుగా అధ్యయనం చేసే కర్మిష్టులూ, పండితులూ అయిన కుటుంబంలో పుట్టి, సంస్కృతానికి స్వస్తి చెప్పి, తెలుగులో చిన్న కథలని రాయటం ప్రవృత్తిగా ఎన్నుకుని ఆ చిన్న కథకి కావ్యప్రతిపత్తి కలిగించిన సాహిత్య శిల్పి, సుబ్రహ్మణ్యశాస్త్రి. ఆయన ఆత్మకథ పేరు అనుభవాలూ జ్ఞాపకాలూనూ. ఈయన గాంధీ, ఖద్దరు, హిందీ – ఈ మూడింటినీ వ్యతిరేకించారు. కలం పేర్లతో శతాధిక వ్యాసాలు రాసారు. అనేక అష్టావధానాలు కుడా చేసారు. 1956 లో కనకాభిషేకం అందుకున్నారు. | 
| స్ఫూర్తి | – | 
| నమూనా రచన శీర్షిక | శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి | 
| సంగ్రహ నమూనా రచన | నేటి తెనుగు కథా రచయితలలో, మునుముందుగా జ్ఞప్తికందు కొందఱిలో శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రిగా రొకరు. ఒక రనుటకుంటే, మొదటివా రనుటయు నతిశయోక్తము కారాదు. కారణము, ఆయన వ్రాసిన ప్రత్యక్షరము సహజప్రతిభనుండి పొటమరించినది; ఆయన చేసిన ప్రతికల్పనము ప్రత్యక్షమున కవిరుద్ధమైనది; ఆయన పాత్రలచే బలికించిన ప్రతిపదము, ఇరుగుపొరుగుల మనము వినుచున్నది; ఆయన ప్రదర్శించిన ప్రతి సంవిధానము మన యనుభూతులకు దవ్వుగానిది; ఆయన కట్టిన కథ లెల్ల తెలుగుదేశపు టెల్లలు గడచిపోయినవి. | 
శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి
నేటి తెనుగు కథా రచయితలలో, మునుముందుగా జ్ఞప్తికందు కొందఱిలో శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రిగా రొకరు. ఒక రనుటకుంటే, మొదటివా రనుటయు నతిశయోక్తము కారాదు. కారణము, ఆయన వ్రాసిన ప్రత్యక్షరము సహజప్రతిభనుండి పొటమరించినది; ఆయన చేసిన ప్రతికల్పనము ప్రత్యక్షమున కవిరుద్ధమైనది; ఆయన పాత్రలచే బలికించిన ప్రతిపదము, ఇరుగుపొరుగుల మనము వినుచున్నది; ఆయన ప్రదర్శించిన ప్రతి సంవిధానము మన యనుభూతులకు దవ్వుగానిది; ఆయన కట్టిన కథ లెల్ల తెలుగుదేశపు టెల్లలు గడచిపోయినవి. ఈతీరున సుబ్రహ్మణ్యశాస్త్రిగారు అచ్చమైన తెనుగుదనమును వలచి వచ్చిన రచయిత. ఆంగలముకాని, వంగముకాని, మఱియొక వాజ్మయముకాని మర్యాదకైన జదివి చూచినవారు కారు. విశేషించి, ‘హిందీ’ ని చేరదీయరాదని చిరకాలమునుండి వారి వాదము. ఇంక, సుబ్రహ్మణ్యశాస్త్రిగారు కూడబెట్టుకొన్న సంపత్తి సంస్కృత సాహిత్య మొక్కటే. ఇటులు, విజాతీయమైన సంస్కారధోరణికి దూరముగా నిలచి, కృతకత్యగర్హితముకాని యాంధ్రత్వము నారాధించిన రచయిత రచన లెట్లుండును? అనుకరణములుకాని, అనువాదములుకాని చేయవలసిన ప్రారబ్ధము సుబ్రహ్మణ్యశాస్త్రిగారికి లేదు. యథార్థముగా ఆయన చూపులకు గనిపించిన వస్తువు, ఆయన చెవులకు వినిపించిన మాటలు మూటగట్టుకొని కథలలో బెట్టి కళ కట్టించును. ఉత్తమజాతి రచయిత చేసెడి పనియు, చేయగలిగిన పనియు నింతే! దీని వివరణము ముందు మనవిచేసెదను.
శ్రీపాదవారిది యనూచానమైన పండితవంశము. శ్రౌత స్మార్తములు, జ్యౌతిషము వీరి వంశ విద్యలు. సుబ్రహ్మణ్యశాస్త్రిగారి తండ్రిగారు యజ్వ. ఆయన కన్న మువ్వురు కుమారులలోను మన శాస్త్రిగారు మూడవవారు. వంశస్థు లందఱివలెనే వీరుకూడ శ్రౌత – స్మార్తములు, పరాయితము అధ్యయనము చేసినారు. జ్యౌతిషము స్కంధత్రయము పఠించినారు. అదికాక, వల్లూరిలో గుంటూరి సీతారామశాస్త్రిగారు, వేట్లపాలెములో దర్భా బైరాగిశాస్త్రిగారు, తమయింట, అన్నగారు శివరామ శిద్ధాంతి దీక్షితులుగారు గురువులుగా గావ్యపాఠము చేసిరి. పసినాటనే తెనుగులపై నభిరుచి యంకురించిన దగుటచే శాస్త్రిగారు, గురువుల చాటున నాంధ్రకృతులు చదువుటయు, ఏవో చిన్న చిన్న రచనలు చేయుటయు సాగించినారు. సరియైన యుపదేశ మున్నగాని కవితారచన చేయరాదని 1910 సం.లో సుబ్రహ్మణ్యశాస్త్రిగారికి నిశ్చయము కలిగినది. ఈ సునిశ్చయమే, పీఠికాపుర సంస్థాన కవులగు వేంకట రామకృష్ణులను శాస్త్రిగారికి కవితా గురువులుగా జేసినది. 1910-11 సం.లో రామకృష్ణకవుల సాహచర్యమున నెన్నో సాహిత్యపు మెలకువలు, కవిత్వపు బొలపములు శాస్త్రిగారు గుర్తింప గలిగినారు. ఇరువదియేండ్ల యీడు వచ్చుసరికి శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రిగారు సానబెట్టిన రత్నము.
ప్రధానముగా, వీరి జీవితములో మెచ్చదగిన విషయము, వీ రే యధికారిని దోసిలియొగ్గి “నెలకూలి చాకిరీ” కొడ బడకుండుట – వీరివలె నాత్మగౌరవము నధికముగా నిలబెట్టుకొనువారు తక్కువ. అట్లని, పరనిరపేక్షముగా జీవింపగల విత్తవంతుడును కాడు. ఆయనలోని తలపులు పయిమాటలు నొకటై సూటిగానుండును. దాపఱికము లేదు. చెప్పినదానికి దిరుగు డరాదు. ఎదుటివాడు సహృదయుడయినచో హృదయము ముద్దగట్టి ముందుబెట్టును. కానిచో, పిలిచినను, పెడమొగము పెట్టును. సుబ్రహ్మణ్యశాస్త్రిగారి యథార్థవాదిత బంధు విరోధమునకు గారణము కారానిది. ఇది యిటులుండగా, వారి తొలిరచన ‘వారకాంత^ యను నాటకము. కవిత్వము నాటకాంతము కావలయునన్న పెద్దలమాట సుబ్రహ్మణ్యశాస్త్రిగారు ముందునకు దెచ్చినారు. ఈసందర్భమున వారొకప్పుడు చెప్పిన ‘రేడియో’ ప్రసంగము స్మరణకు వచ్చుచున్నది.
“పాఠకునకూ, ద్రష్టకూ రసానుభవం కలిగించి తన సందేశం స్ఫుటంగా వినిపించాలంటే, రచయితకు, తక్కిన కావ్యాలకంటే నాటకం చాలా మంచిసాధనం. కాని నాటకరచన చాలా కష్టమైనది. కావ్యసామాన్యం రచించే టప్పటికంటే నాటకం రచించేటప్పుడు రచయిత గొప్పబాధ్యత వహించ వలసివుంటుంది. తనజాతివారికి సభ్యత అలవడజేయడమూ – అదితప్పిపోకుండా చూడడమూ – ఇదే ఆబాధ్యత. కవికి ఇంతశక్తీ బాధ్యతా ఉందని తెలుసుకొన్నప్పుడు, శక్తి ఉందా లేదా అని చూసుకోకుండానే నేను నాటకరచనకి పూనుకున్నాను. నేను మొట్టమొదట రాసిన నాటకం – అంటే, నాకునేనై రాసిననాటకం-“వారకాంత”. కాని దాని కర్తృత్వం నేను మరచిపోతున్నాను. నా నాటకాలలో నేను చెప్పుకోగలవి “ప్రేమపాశం”, “నిగళబంధనం”, “రాజరాజు”-ఇవి. వీటిలో ఒకటీ రంగస్థలం ఎక్కలేదు. చదివినవారు మాత్రం అనుకూలంగానూ ప్రతికూలంగాను కూడా మాట్టాడారు. కొన్ని ఏకాంకికలున్నూ రాశాను. వాటిలో నాకు మిక్కిలీ ప్రీతిప్రాత్రం “కలంపోటు’.–“
ఈ ‘వారకాంత’ నాటకములో బద్యములుకూడ జేర్చినారు. ఇది ప్రత్యేకించి చెప్పుటలో, సుబ్రహ్మణ్య శాస్త్రిగారు 1934 నుండి బొత్తిగా పద్యంధ ప్రాతికూల్యము వహించుట కారణము. ఈప్రతికూల భావము వారికి పద్యము హృద్యముగావ్రాయలేక పోవుట వలన గలిగినది కాదని యీక్రింది పద్యము సాక్ష్యము చూపుచున్నాను.
బ్రతుకు ఘటించు నోషది కరాళవిషంబున, నుక్కుతీవలం
దతి మృదునాదమున్, దహనునందు ప్రకాశము, నుప్పునీటిలో
రతసము లాణిముత్తెములు రాళ్ళను, కప్పకు జీవనంబులున్
చతురత గూర్తు వెయ్యది యసాధ్యమునీకిక దీనబాంధవా!
“అత్త – అల్లుడు” – “అలంకృతి” – “అభిసారిక” – “బాలిక, తాత” మొదలగు ఖండకావ్యములు సుబ్రహ్మణ్య శాస్త్రిగారు. మనోహరముగా రచించినవి యున్నవి.
శ్రీ శాస్త్రిగారి మొదటినవల ‘మిధునానురాగము’ అట్లే మొదటి కథ 1915 పిబ్రవరిలో వెలువడినది. “ఇరువుర మొక్కచోటికే పోదము” అని దానిపేరు. “ఇదియాది, 1923 సం. దాక గ్రాంధికములోనే శాస్త్రిగారు రచనలు సాగించుచు వచ్చిరి. క్రమముగా రెండుమూడేండ్లకు సంపూర్ణముగా వ్యావహారిక భాషావతరణము. విశేషమేమనగా వీరు గ్రాంథికము వ్యావహారికము కూడ సహజమధురమైన శైలిలో వ్రాయగలవారు. శాస్త్రిగారు ముమ్మొదట వెలువరించిన చరిత్రగ్రంథము వీరపూజ. ఆగ్రంథ మందలి గ్రాంథికశైలీ సౌభాగ్యము చాల విలువగలది. శ్మశాన వాటిక, రక్షాబంధనము ఇత్యాదులగు వీరి నవలలు ప్రజానీకములో సువ్యాప్తములై యున్నవి. సుబ్రహ్మణ్య శాస్త్రిగారి వచనరచనలో జలువ చందనము వంటి దేదోయుండి హృదయమునకు రాసికొనుచుండును. సమాసముల గడబిడలు, అన్వయముల తిరుగుడులు మచ్చునకును రానిచ్చు స్వభావ మాయన కలమునకు లేదు. ఎంతసేపును, శాస్త్రిగారి చూపు సహజత్వముమీద. ఇది యటుండె,
1920 సం.నుండి శ్రీసుబ్రహ్మణ్య శాస్త్రిగారి సర్వసిద్ధాంతములకు బీఠమై ‘ప్రబుద్ధాంధ్ర’ వెలసినది. శాస్త్రిగారి సంపాదకత్వమున నీపత్రిక తొలియేడు ప్రతిపక్షమునకు వెలువడుచు, రెండవ యేటినుండి మాసపత్రికగా మాఱినది. ఆదిలో, ప్రబుద్ధాంధ్ర సగము సంస్కృతభాషా రచనలతోను, సగము తెలుగు రచనలతోను, వెలువడుట శాస్త్రిగారి యుభయభాషా వైదుష్యాభి మానములకు నిదర్శనము. అల్పకాలముననే ‘ప్రబుద్ధాంధ్ర’ తెలుగునేల మూలమూలలకు బ్రాకి పాఠకులనువలవైచి లాగినది. ఈఆకర్షణమునకు మహోత్తమ రచయితల వ్యాసములే కాక, శాస్త్రిగారి వ్యాఖ్యలు, విమర్శనములు హేతువులైనవి. వీరి కలమునకు జంకుగొంకులు లేవని తొలుత ననుకొంటిమి. గతానుగతిక ధర్మావలంబన మాయన బొత్తిగా సహింపలేరు. దానినిబట్టి హృదయములో నుండియో ఉండకో నూటికి దొంబదిమందిచే ద్రొక్కబడుచున్న సిద్ధాంతమును అమాంతముగా శాస్త్రిగారు గర్హింతురు. వట్టి గర్హణముతో సరిపెట్టక వాడిగల వ్రాతలో బెట్టి సుప్రచారము చేయుదురు. ఆయనలోనున్న యీగుణమునకు వారి ‘ప్రబుద్ధాంధ్ర’ నిలువుటద్ద మైనది. “హిందీ – గాంధీ – ఖద్దరు” ఈమూడును శాస్త్రిగారి సిద్ధాంతమునకు విరుద్ధమైన పదార్థములు. బౌద్ధుల త్రిరత్నములవలె, భారతీయుల పారాయణములోనున్న యీమూడు శబ్దములను విమర్శించుచున్న శాస్త్రిగారి గుండెనిబ్బరమునకు అబ్బురమైన పట్టుదలకు మనము మెచ్చవలయును. ‘ప్రబుద్ధాంధ్ర’ తొమ్మిదియేండ్లునడచి మంచిప్రసిద్ధిలో నాగిపోయినది. సుబ్రహ్మణ్య శాస్త్రిగారి జీవన వైభవమునకు ‘ప్రబుద్ధాంధ్ర’ సాగిన దశాబ్దము మెఱుగు కాలము. 1934 సం.నుండి ఆపత్రికలో పద్యప్రకటనము నషేధించి, వచన రచనలే ప్రచురించెడివారు. కావున వచనవాజ్మయమున కాపత్త్రికచేసిన మేలు మఱవరానిది. శాస్త్రిగారి సర్వగ్రంధరచనము నొకయెత్తు. ఈ పత్త్రికా ప్రచురణ మొకయెత్తుగా సాగినది. సుబ్రహ్మణ్యశాస్త్రిగారు 1916 మొదలు నాలుగేండ్లు కళాభివర్థనీ నాటకసమాజము నడపిరని యిచట బేరుకొనుట వారికళాభిరతికి గుఱుతు. నాటకములలో స్త్రీ – పురుషవేష ధారణము చేసెడివారనియు వినుకలి. సంగీత కళపై వీరికెక్కువ మక్కువ. సుమారు నూరుకృతులు గురుముఖమున జెప్పుకొనిరట. కాని, గొంతెత్తి పాడగా నేను వినలేదు. 1947 నుండి సంగీత సాహిత్య సభలు జరిపించుచు వీరు రాజమహేంద్రవరమున నూత్నకళా గౌరవము చాటు చుండుట ప్రశంసింప దగిన సంగతి. నన్నయ – శ్రీనాధ జయంతులు జేగీయ మానముగా నడపించుచున్న శాస్త్రిగారి ప్రాచీన సారస్వతాదరణము నమస్కరణీయమైనది.
ఇంక, ప్రకృతము, వారు చిన్నకథలు వ్రాయుదురు. కాని, అవి గుణమున, పరిమాణమున గూడ పెద్దకథలు. సంభాషణములసంతనలో నింత పరిపక్వత గల కథారచయితలు తక్కువ. పాత్రల మాటలలో వ్యక్తులతీరులు, భంగీమములు సుస్పష్టముగా మనకు గోచరింప జేయుదురు. సాంసారికమైన ముచ్చటలు, సాంఘికమైన యాచారములు ప్రదర్శించుటలో శాస్త్రిగారిది యందివేసినచేయి. వైదికకుటుంబములలోని నడతలు వీరికథా ప్రపంచమున నచ్చుగ్రుద్దినట్లు కానుపించును. ‘వడ్లగింజలు – మార్గదర్శి – కన్యా కలే యత్నాద్వరితా’ – ఇత్యాదులయిన వీరికథలు రసవాహినులు. ప్రేమపాశం, నిగళబంధనం, రాజరాజు, కలంపోటు మొదలయిన సుబ్రహ్మణ్యశాస్త్రిగారి నాటికలకు ‘దెలుగునాట’ సుప్రసిద్ధి వచ్చినది. నాయుద్దేశములో ‘రాజరాజు’ వీరి నాటకముల కన్నిటికిని కన్నాకు వంటి దని – అందులో నన్నయపాత్ర పోషణము అనన్య సాధారణమైన తీరులో శాస్త్రిగారు తీర్చినారు. రాజరాజుకడ, ఆత్మగౌరవము వీసమంతయినను చెడిపోకుండ నన్నయచే బలికించిన పాటవము సుబ్రహ్మణ్య శాస్త్రిగారికే చెల్లినది. ఇది యన్నమాట కాదు, ప్రతిపాత్రయును రాజరాజులో జీవన్మూర్తులై కనిపించును. ఇట్టి ‘రాజరాజును’ సాహిత్య సామ్రాట్టు విక్రమదేవవర్మ మహారాజు కృతిపొందుట యభినందనీయము. ‘కలంపోటు’ మొదలగు నాటికలు వీరివి యెన్నిసారులు చదవినను జదువవలయు ననిపించును.
నాటికారచనలో, కథారచనలో, పత్రికా సంపాదకతలో శ్రీ సుబ్రహ్మణ్య శాస్త్రిగారిది తెలుగు భూమిలో నొక ప్రత్యేకపీఠము. నాలుగుదశాబ్దులనుండి బహుగ్రంథ రచనలచే భారతీ సమారాధనము చేయు శాస్త్రిగారి వయస్సు నేటికి షష్టిలో నున్నను, భౌతిక పుష్టియు, భావపుష్టియు గలిగియుండిన ధన్యులు. వారికృతు లెన్నో మునుముందు మనము పఠింపగలము.
ఆంధ్ర రచయితలు నుండి-
———–
 
					 
																								 
																								