| పేరు (ఆంగ్లం) | Sridevi Chukkayapalli |
| పేరు (తెలుగు) | శ్రీదేవి చుక్కాయపల్లి |
| కలం పేరు | – |
| తల్లిపేరు | – |
| తండ్రి పేరు | – |
| జీవిత భాగస్వామి పేరు | – |
| పుట్టినతేదీ | – |
| మరణం | – |
| పుట్టిన ఊరు | మహబూబ్నగర్ |
| విద్యార్హతలు | – |
| వృత్తి | కవయిత్రి మరియు అవధాని |
| తెలిసిన ఇతర భాషలు | – |
| చిరునామా | – |
| ఈ-మెయిల్ | – |
| ఫోను | – |
| వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | https://padyapurana.blogspot.com/2019/05/8-29-05-2019.html |
| స్వీయ రచనలు | – |
| ఇతర రచనలు | – |
| ఈ-పుస్తకాల వివరాలు | – |
| పొందిన బిరుదులు / అవార్డులు | తెలుగు విశ్వవిద్యాలయము – కీర్తి పురస్కారాలు (2019) |
| ఇతర వివరాలు | – |
| స్ఫూర్తి | – |
| నమూనా రచన శీర్షిక | శతాధికష్టావధానవేదిక |
| సంగ్రహ నమూనా రచన | సమన్వయం గోగులపాటి కృష్ణమోహన్ శుభాశంసలతో…. నిరతము సోత్సాహినియై వరపద్యములల్లుచున్న భాస్వన్మహిళా ! సరములవోలిక నల్లుచు చిరకీర్తిగ వెల్గుమింక శ్రీయుతదేవీ! |
శ్రీదేవి చుక్కాయపల్లి
సమన్వయం
గోగులపాటి కృష్ణమోహన్
శుభాశంసలతో….
నిరతము సోత్సాహినియై
వరపద్యములల్లుచున్న భాస్వన్మహిళా !
సరములవోలిక నల్లుచు
చిరకీర్తిగ వెల్గుమింక శ్రీయుతదేవీ!
డాక్టర్ అయాచితం నటేశ్వరశర్మ.
కవుల సమూహానికి నమస్సులు
ప్రార్ధన:
ఓం శ్రీ కృష్ణాయ నమః
ఓం శ్రీ సరస్వత్యై నమః
ఓం శ్రీ హయగ్రీవాయ నమః
శ్రీరంగాపుర సీమయందు జనులశ్రేయంబు పెంపొంద నో
రారంగానిను రంగరంగయని చేరంగన్ భవత్పాదముల్
కోరంగాజను భక్తకోటికిలలో కోలాహలంబై కృపా
పూరంబౌ భవదృక్కులన్ నిలుపుమా !పుణ్యిత్ములన్ జేయుమా
1) అంశం: వర్ణన
గోగులపాటి కృష్ణమోహన్
హనుమత్ జయంతి సందర్భంగా హనుమత్ విజయయాత్రలను స్వేచ్ఛా ఛందస్సు లో వర్ణించండి
పూరణ: వర్ణన
అవరోధమ్ములవేళ నాత్మబలమే ఆశ్చర్యమున్ గొల్పగా
అవనీజాతను సీతజాడగనగా నత్యంత శ్రద్ధాళువై
జవమున్ స్ఫూర్తియు జూపుచున్ జయమునన్ సంజీవననిన్ దెచ్చి యీ
భువిలో ఖ్యాతిని బొందియున్న హనుమా పూజింతు నిన్నెప్పుడున్
2) అంశం: సమస్య
“సంతానమ్మును లేని వారలె సదా సంపూజ్యులీ భూమిపై”
సమస్యాపూరణం
పంతమ్ముల్గొని దుష్టబుద్ధియుతులై పల్మారు శిక్షార్హులై
సంతోషమ్మున కడ్డుకట్టయగుచున్ సన్మార్గమున్ వీడుచున్
చింతాక్రాంతులజేసి యశ్రువులనే చిందించు దుర్మార్గులౌ
సంతానమ్ములు లేని వారలెకదా సంపూజ్యులీ భూమిపై
3) అంశం: ఛందోభాషణం
జ్ఙానప్రసూన శర్మ
సోదరి. శ్రీదేవిగారికి నమస్కారం🙏
ఛందోభాషణం
హనుమా! యంజన కేసరీ వరగుణా అర్థించితిన్ ధైర్యమున్
వినుమా!రాముని భక్తులన్ గనుటకై విచ్చేయుమా వేగమే
కనుమా దుష్టుల పాపముల్ తొలగినీ కైంకర్యముల్ సేయగన్
మనమున్ నమ్మితి నిన్నునే మరువకన్ మాకండయై గావుమా
4) అంశం: దృశ్యం – 1
లక్ష్మి మదన్
ఇది రోహిణి కార్తీ కదా! రోళ్లు పగిలే ఎండ అంటారు! రోహిణి ఎండ గురించి వర్ణించండి.
పూరణ: దృశ్యం
పొగలు జిమ్ముచు గ్రీష్మము రగులుచుండ
మండుటెండలు దేహమున్ మాడ్చుచుండె
మూగజీవులు నీటికై మూర్ఛగొనగ
శ్వేదధారలనంతమై స్వేదనొసగె
అంశం: దృశ్యం – 2
సింగీతం సంధ్యారాణి, గజ్వేల్.
పై దృశ్యం నకు స్వేచ్చా వృత్తం లో పద్యం చెప్ప మనవి🙏
పూరణ: దృశ్యం
గెలువగ తరమా సూర్యుని
ఫలముగదలపోసి నింగి పట్టున రయమున్
బలముగ పైకెగసితివే
యిలలో నీఖ్యాతిదెలుప నీశ్వరుతరమా
5) అంశం..న్యస్తాక్షరి
సరస్వతీ రామశర్మ
స.మ.ర.ము.
అక్షరాలను మెదటి స్థానంలో.. చంపకమాలలో రామాంజనేయులస్తుతి చేయండి
పూరణ: న్యస్తాక్షరి
సదయుడ తండ్రికోర్కెవినిసర్వము వీడి వనాంతరంబులో
మదినొనగూడు సంతసపు మాటున దుష్టుల సంహరించి మీ
రదనున వాలిగూల్చి బహురాయిడిలోన జయమ్మునొందగా
ముదమునొసంగునీ హనుమ ముఖ్యుడునై భువిలోన నిండగన్
6) అంశం: ఆశువు
పృచ్ఛకుడు: డా.రామక కృష్ణమూర్తి
ఈరోజు హనుమజ్జయంతి కావున చిరంజీవి అయిన ఆయనపై ఆశువుగా పద్యం చెప్పండి
పూరణ: ఆశువు
భానునికైతపించితివి పావని జానకి జాడదెల్పగా
నానతిగొన్న తక్షణమునచ్చెరువొందగ లంకకేగి నీ
సేనలచేత పోరియతి శీఘ్రము లక్ష్మణ మూర్ఛబాపుచున్
తానముజేసితీవు భవతారకమంత్రమునందు నిత్యమున్
7) ఆంశము: దత్తపది
సింగీతం నరసింహారావు
క్రాంతి,భ్రాంతి,శ్రాంతి,విశ్రాంతి అమ్మవారిని వర్ణిస్తూ పద్యం ఇష్టాఛందం దత్తపది.
పూరణ: దత్తపది
క్రాంతికి మూలము నీద్యుతి
భ్రాంతిని తొలగించి మిగుల భాసురమగుచున్
శ్రాంతినిగోరని ఘనవి
శ్రాంతివి నీవే జగమున రమవైతివిగా
8) అంశం: నిషిద్ధాక్షరి
గోగులపాటి కృష్ణమోహన్
ఎండాకాలం లో మండే ఎండలను వర్ణిస్తూ… స్వేచ్ఛా ఛందస్సు
నిషిద్దాక్షరాలు : డ
పూరణ: నిషిద్ధాక్షరి
మదికిన్ నెమ్మది లేదు తాపభయమమ్మాయేమి విజృంభణల్
రొదసేయంగ సెలంగు వాయురయముల్ రోదాత్మకంబయ్యెగా
బదులేబల్కవు మేఘముల్ జలములన్ బంధించి శిక్షించెగా
సెదతీరంగ నహర్నిశంబు భయమే స్వేదమ్ములేతెంచుగా
నేటి పద్యపూరణం కార్యక్రమానికి సమన్వయకర్తయైన కృష్ణమోహన్ గారికి
పద్యంతో ఆశీస్సులు దించిన గురువుగారు నటేశ్వర శర్మ గారికి మరియు పృచ్ఛకులకు ధన్యవాదములు
వీక్షించిన సమూహ సభ్యులకు అభినందనలు
అభినందనలు
🙏🙏
పాద్యమునిచ్చిరి పదముల
నుద్యానవనమ్ముగమదినుప్పొంగెసుధా
పద్యాలమాలవేసి,సు
సాధ్యముగలపూరణలచె సారస్వతికిన్.
🌹🙏🌹🙏
సరస్వతీ రామశర్మ
కృతజ్ఙతాభివందనాలు
పద్యపూరణెంతొ హృద్యంబుగానుండె
రాటుదేలినారు ధీటుగాను
చక్కనైన శైలి చుక్కాయపల్లిది
జ్యోతి నవ్య కృష్ణ జూడు మఖిల
గోగులపాటి కృష్ణమోహన్
సమన్వయం
https://padyapurana.blogspot.com/2019/05/8-29-05-2019.html
———–