పేరు (ఆంగ్లం) | Ramadevi Balaboyina |
పేరు (తెలుగు) | రమాదేవి బాలబోయిన |
కలం పేరు | – |
తల్లిపేరు | – |
తండ్రి పేరు | – |
జీవిత భాగస్వామి పేరు | కట్ల శ్రీనివాస్ |
పుట్టినతేదీ | – |
మరణం | – |
పుట్టిన ఊరు | ఖిలావరంగల్ |
విద్యార్హతలు | – |
వృత్తి | ఉపాధ్యాయిని |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | – |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | – |
ఇతర వివరాలు | – |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | వారసుడి కోసం |
సంగ్రహ నమూనా రచన | “అమ్మాయ్ శ్యామా.!..గీ చింతకాయ తొక్కు నూరిన. జెర వేడేడి అన్నంల ఏస్కుని తిను బిడ్డా…నోటికి రుచి గొడ్తది…కడుపుల సల్లగుంటది”అని ప్రేమగా తలనిమురుతూ వేవిళ్ళతో బాధపడుతున్న కోడలు శ్యామలను బుదగరిస్తోంది అత్త దేవమ్మ |
రమాదేవి బాలబోయిన
వారసుడి కోసం
“అమ్మాయ్ శ్యామా.!..గీ చింతకాయ తొక్కు నూరిన. జెర వేడేడి అన్నంల ఏస్కుని తిను బిడ్డా…నోటికి రుచి గొడ్తది…కడుపుల సల్లగుంటది”అని ప్రేమగా తలనిమురుతూ వేవిళ్ళతో బాధపడుతున్న కోడలు శ్యామలను బుదగరిస్తోంది అత్త దేవమ్మ
“అబ్బా…ఒద్దత్తమ్మా…కడుపుల ఏదీ నిలుస్తలేదు…గట్ల తినంగనే గిట్ల వాంతికైతాంది…గిది నాకేం పరీక్షనో ఏమో”..ఒకింత గావురం చేస్తూ అన్నది కోడలు శ్యామల
“గట్లగాదు బిడ్డా…నువ్వు ఇప్పుడు ఇద్దరి తిండి తినాలే…గీ చింతకాయతొక్కు పుల్లపుల్లగ మంచిగుంటది..తినంగనే కొంచెం సేపు అటూఇటూ తిరిగి మల్ల పండుకో”…అంటూనే కోడలు తినేదాక పట్టుబట్టింది దేవమ్మ
అబ్బో…అర్లు గల్ల అత్త అంతమంచిగ అరుసుకుంటాందనీ అదృష్టం గల్ల కోడలు మారాం చేస్తోందనీ…ఎంత కలివిడి అత్తాకోడల్లో అని మీరు పప్పులో కాలేయ్యక ముందే అసలు విషయం చెప్పాల్సిందే.
గిర్రుగిర్రున మనం మూడు నెలల కిందటి ముచ్చటకు పోవాలే…ఆరోజు ఆదివారం ఆ ఊళ్ళే అంగడి జరుగుతది..వారానికోపాలి ఇంట్లకు గావలిసినయన్నీ ఆ అంగట్ల దొరుకుతయి..ఎప్పటిలెక్కనే దేవమ్మ భర్త దేవయ్యతో కలిసి అంగడికి పోయింది..ఆ వస్తువూ ఈ వస్తువూ కొనుకుంటా…అంగడి మధ్యలకు పోయిండ్లిద్దరు.
ఆడ గిరగిరా తిరిగే రంగుల రాట్నాలు,గారడోళ్ళు,చిలుక జోస్యపోళ్ళు,అడవిలకెళ్ళి రకరకాల మూలికలు దెచ్చి అమ్మేటోళ్ళు ఉన్నరు..అవన్నీ దాటుకుంట ఒక్కో దుకాణం చూసుకుంటా..ముందుకు పోతాండ్లు మొగుడూపెళ్ళాలిద్దరు..పోంగపోంగ ఓకాడ ఓ జంగమయ్య కూసుని జరిగినముచ్చటా,జరిగేముచ్చటా జరగబోయే ముచ్చటా చెబుతాండు..అందరూ గుంపుకుగుంపుగ ఉన్నారక్కడ…ఎన్నడు అట్లాంటియి చూడని దేవమ్మను ఎందుకో కాళ్ళు అటువైపు గుంజుకపోయినయ్ .
అట్ల వాళ్ళు పోయిన్రో లేదో…అప్పటిదాకా కళ్ళు మూసుకుని మంత్రాలేవో సదువుకుంటున్న జంగమయ్య ఒక్కసారిగా కళ్ళు తెరిచి “రా ..దేవమ్మా రా”అంటూ అరిచాడు..అక్కడున్నోళ్ళందరూ గజ్జున వొణికిండ్రు…దేవమ్మకు మస్తు అప్సోస్ అయింది…”అగ్గో గీ దేవరకు నా పేరెట్లెరకా”అని దేవయ్యను అడిగింది..దేవయ్య అప్పటికే చెతులు జోడించి జంగమయ్య కాళ్ళ మీద పడి మొక్కబట్టిండు
“ఓ …దేవర నీకు దండాలు,శనార్థులు..మాకు మంచోచెడో ఏదన్నా చెప్పు సామీ..శరణు శరణు”అని వేడుకుంటాండు..
అక్కడున్నోళ్ళందరూ దేవమ్మ వైపు బీరిపోయి సూత్తాండ్లు..”గప్పటి సంది ఈడనే ఉన్నం మా పేర్లు రాలే జంగమయ్యకు…నీ పేరు నోట్లెకెళ్ళి వచ్చిందంటే…ఏందో ఉన్నది…పొయ్యి సామికి శరణుజెప్పు” అని అక్కడున్నోళ్ళంతా దేవమ్మను తొందరబెట్టిండ్లు..
దేవమ్మ పబ్బతి బట్టీ శరణుజెప్పింది.జంగమయ్య కాళ్ళ మీద పడ్డది..”శరణు దేవరా శరణు..మంచైనా గానీ షెడ్డైనా గానీ ఉన్నముచ్చటఉన్నట్లు చెప్పు సామీ నీకు శరణైతము”అని దండం బెట్టుకుంట అడిగింది.
జంగమయ్య సరం సరాయించుకుంట
“ఓం.. శ్రీశైలమల్లన్నా,సింహాద్రి అప్పన్నా,తిరుపతి ఎంకన్నా,కొండగట్టు అంజన్నా…ఎములాడా రాజన్నా నిన్ను శరణుజొచ్చిన బిడ్డలకు ఏమానతిస్తివో చెప్పు జల్ధిజెప్పు”అని రాగం తీస్తూనో…
“ఓ దేవమ్మ…ముప్పైకోట్ల దేవతల సాక్షిగ చెబుతాన విను …మీ ఇంట్ల ఆడసంతానం ఉన్నది గానీ మొగసంతానం లేదు..నువ్వు నీ కోడల్ని ఓర్తలెవ్వని నీ ఇంటికి వత్తననుకున్న వారసుడు వస్తలేడు…వచ్చేదెవ్వలనుకున్నవ్ ..గా ముక్కంటి ముందట ముద్దుగ్గూసునే గణపయ్య…గాయనంటే ఏందనుకున్నవ్ కూసున్నకాడ కుప్పలపైసలు..నిలుసున్నకాడ నిలువెత్తు పైసలు..పండుకున్నకాడ పరుపెత్తు పైసలు…నీ ఇంట్ల గలగలమని లచ్చిమి తాండవిస్తది..చదువుల తల్లి సంగీతకచెరీ చేస్తది..పిల్లగాడు పెరిగి పెద్దోడయ్యేదనుక…నువ్వు గిట్ల నీ కోడల్ని మంచిగ జూసుకోక వచ్చే వారసుణ్ణి వెనకకు మలిపినవనుకో..పెరిగేటప్పుడు పేచీ పెట్టినవనుకో…నువ్వు బికారివై రోడ్డున పడుతవు…చేతిల మంచిళ్ళుబోసెటోళ్ళు కరువైతరు చూస్కొ మల్ల జంగమయ్య మాటకు తిరుగుండదు”అంటూ ఆ జంగమయ్య పిడికెడు విభూతి తీసి దేవమ్మ దంపతుల మొఖాన ఫెడేల్మని కొట్టాడు.
అక్కడున్న చాలామందికి దేవమ్మ గడుసుదనం తెలుసు..పిల్లికి బిచ్చంబెట్టదనీ…ఊళ్ళే ప్రతీ ఒక్కరితో లొల్లి బెట్టుకుంటదనీ…కాపురానికొచ్చినసందీ కోడల్ని రాచిరంపాన పెడతాందనీ..ఊరుఊరంతా చెవులు కొరుక్కుంటుంది…ఎందుకంటే గట్టిగ అంటే దేవమ్మ వాళ్ళ చెవులు పీకి చేతుల పెడతది గాబట్టి..జంగమయ్య మంచి ఫిట్టింగుపెట్టిండని దేవమ్మను చూసినోళ్ళందరూ అక్కడనే ధైర్యంగా గుసగుసలాడుకున్నరు..
అగో గప్పటిసంది…కోడలికి రాజభోగం కల్పించింది దేవమ్మ..
అట్లనో ఇట్లనో దేవమ్మ సేవలతోని కోడలికి తొమ్మిదోనెల నిండి పండటి మగబిడ్డకు జన్మనిచ్చింది..అదేంటో పిల్లాడి చెవులు కాస్త పెద్దగా వినాయకుడిని పోలి ఉన్నాయి విచిత్రంగా…
మనవడు పుట్టిన సంతోషంలో పురుడునాడు జంగమయ్య చెప్పిన మాట మరిచిపోయి కోడలిపైకి నోరెత్తబోయింది దేవమ్మ…
పక్కనే ఉన్న కోడలి అన్న సుభాషు …చెల్లెలితో” శ్యామా…ఈ మధ్య ఓ జంగమయ్య మన ఊళ్ళె బాగ కనబడుతాండు చెల్లె…ఆయన చెప్పినయన్నీ నిజమైతయంట..పొరపాటున నియమం తప్పిండ్లో ఇగ కైలాసమే గతి అంట చెల్లే”అంటూ చెల్లెలు శ్యామలకు చెబుతున్నట్లుగా దేవమ్మకు స్పష్టంగా వినబడేటట్లు అన్నాడు సుభాషు ఉరఫ్ జంగమయ్య
దేవమ్మ నోట్లో ఉండ్రాయి కాదు కాదు పచ్చి వెలక్కాయి పడ్డట్టు అయింది ఆ మాట వినగానే…మళ్ళీ నోరెత్తితే ఒట్టు…వారసుడు పెరిగి పెద్దోడయ్యేదాక…
https://www.manatelugukathalu.com/post/varasudi-kosam-telugu-story
———–