పేరు (ఆంగ్లం) | Jupaka Subadra |
పేరు (తెలుగు) | జూపాక సుభద్ర |
కలం పేరు | – |
తల్లిపేరు | – |
తండ్రి పేరు | – |
జీవిత భాగస్వామి పేరు | కృపాకర్ మాదిగ |
పుట్టినతేదీ | – |
మరణం | – |
పుట్టిన ఊరు | వరంగల్ జిల్లా |
విద్యార్హతలు | – |
వృత్తి | ప్రభుత్వ ఉన్నతాధికారిణిగా |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | నల్లరేగటిసాల్లు 2006 సంగతి (తమిళ్ నుండి తెలుగు) కైతునకల దండెం 2008 అయ్యయ్యో దమ్మక్క 2009 చంద్రశ్రీ యాదిలో… 2013 రాయక్క మాన్యమ్ 2014 రాయక్క మన్యం భూమిక స్త్రీవాద మాసపత్రిక కాలమిస్టుగా |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | ఆంధ్రప్రదేశ్ భాషా కమిషన్ అవార్డు 2007 జివిఆర్ కల్చరల్ పౌండేషన్ అవార్డు 2007 డా.సుశీల నారాయణ రెడ్డి ట్రస్టు అవార్డు 2009 తెలుగు విశ్వవిద్యాలయం ఉత్తమ కవయిత్రి అవార్డు 2011 నోముల కథ పురస్కారం 2013 దామోదరం సంజీవయ్య సాహితి పురస్కారం 2013 దళితమిత్ర ధనజీరావు గైక్వాడ్ ట్రస్టు అవార్టు మహారాష్ట్ర సమాజ్ భూషన్ పురస్కారం 2013 నందివాడ శ్యామల సహృదయ సాహితి పురస్కారం 2014 డా.బోయ జంగయ్య చేతన పురస్కారం 2014 రంగినేని ఎల్లమ్మ సాహితి పురస్కారం 2015 అమృత లత- అపూర్వ అవార్డు 2015 తెలంగాణ మహిళ శక్తి పురస్కారం 2015 డా.కవిత స్మాకర పురస్కారం కడప 2015 |
ఇతర వివరాలు | – |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | – |
సంగ్రహ నమూనా రచన | అత్యంత వెనకబడిన జిల్లాగా పేరుపొందిన ఆదిలాబాద్ జిల్లాలో నల్ల బంగారంగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన బెల్లంపల్లిలో దళిత కుటుంబంలో జూపాక నర్సయ్య, కోయిల కనకవీర దంపతులకు పన్నెండు మంది సంతానంలో భద్రక్క 11వ సంతానం. |
జూపాక సుభద్ర
అత్యంత వెనకబడిన జిల్లాగా పేరుపొందిన ఆదిలాబాద్ జిల్లాలో నల్ల బంగారంగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన బెల్లంపల్లిలో దళిత కుటుంబంలో జూపాక నర్సయ్య, కోయిల కనకవీర దంపతులకు పన్నెండు మంది సంతానంలో భద్రక్క 11వ సంతానం. సింగరేణి బొగ్గుగనుల్లో అగ్నికణంగా 1964 అక్టోబర్ 30న జన్మించింది. కుటుంబంలో ఎవ్వరికి చదువు ల్లేవు. పన్నెండు మంది పిల్లల్లోనే కాకుండా కుటుంబంలో అందరికంటే చురుకైన పిల్ల. అందరికీ అతిచిన్న వయస్సులోనే బాల్య వివాహలు చేశారు. కానీ భద్రక్క చురుకుదనం తండ్రిలో ఆత్మవిశ్వాసాన్ని పొంపెందించింది. స్కూల్ పంపించాలని అనుకున్న ఇంట్లో వాళ్ళు చదువుకున్న పెండ్లి చేయలా? చదువు లేకున్న పెండ్లి చేయలా కదా! చదువుకుంటే ఏం చేస్తది అని కుటుంబం నుండి ప్రశ్నల వర్షం కురిసేది. బాల్యమంతా సింగరేణి బొగ్గు గనుల చుట్టూ తిరిగింది. ఆ గనులకి లాగానే భద్రక్క కూడా తవ్వినా కొద్దీ వెల్లబోసేదంతా మండే ఇంధనమే ఉంది. ఆ గనుల పొరల్లో వున్నట్టు నీళ్ళు, అగాధాలూ, చీకట్ల సామ్యం వుందని బాల్య స్మృతులు యాదికొచ్చాయి భద్రక్కకు.
బాల్యం-విద్య
సింగరేణిలో దళితుల ఇళ్ల పక్కనే ప్రైమరీ స్కూలు నాల్గవ తరగతి దాకా వుండేది. భద్రక్కను ఆ స్కూల్లో చేర్పించిండ్రు. భద్రక్కగా ఉన్న పేరు ఆ స్కూల్ టీచర్ భద్రక్క ఏంది భద్రక్క అని సుభద్రగా నమోదు చేసుకుంది. ఆనాటి నుండి చదువుల ప్రస్థానం మొదలు పెట్టింది సుభద్ర. చదువులో మెరిట్ విద్యార్థిగా పేరు తెచ్చుకుంది. రెండు గదుల్లో నాలుగు క్లాసులు జరిగేవి. అది తడ్కలతో కట్టింది గనక అందరూ దాన్ని తడ్కల బడి అనేటోళ్ళు. మాకున్న ఒకే వొక్క సారు నాలుగు క్లాసులకు పాఠాలు చెప్పేవాడు. ”ఒక్కొక్క క్లాసుకు వారానికి రెండు పాఠాలు జరిగితే మహా ఎక్కువ”. వారంలో జరిగే రెండు క్లాసులు మినహా మిగతా టైమంతా మగపిల్లలు సెరువులో ఈతలకూ, పరికి పండ్లకూ, రేగ్గాయల సెట్లల్లకూ, సైకిల్ తొక్కనీకి గ్రౌండ్లకు పోయేవాల్లు. కానీ మా ఆడపిల్లలం బొమ్మరిల్లాటలూ, గురుగులాటలూ, బొమ్మల పెండ్లి ఆటలూ, ఆడటం టైం కాగానే ఇంటికీ పోయేటోల్లం. ఇంటికి పోయినసంది పుస్తకాల సంచి అడ పడేసి పోచమ్మ చెరువు కాడ నుండి నీళ్ళు మోసుడు, బొగ్గు, పెండ, ఎర్రమట్టి, మొగ్గు తెచ్చేటోల్లం, గిన్నెలు తోమడం, వాకిలూడ్చే పనులు చేసెటోల్లం. మొగ పోరగాండ్లను గాలికి వదిలేసినట్టు మా ఆడ పోర గాండ్లని కూడా వదిలేస్తే వాళ్ళ తాతల సొమ్మేంబోయేదోనని పించేది.
నాల్గవ తరగతి వరకూ చెప్పీ చెప్పని, వినీ వినని పాఠాలతో, దీపం కింద చదివీ చదవని పరీక్షలతో, బయటపడి, దళితుల ఇండ్లకి రెండు కిలో మీటర్ల దూరమున్న మాగంటి చంద్రన్న హైస్కూల్లో చేర్పించిండ్రు. ”నాల్గో తరగతి దాకా చదివిన పది, పదిహేను మంది నా క్లాసు ఆడ పిల్లల్లో ముగ్గురం మాత్రమే కొత్త స్కూల్లో (హై స్కూల్లో) చేరినాము”. ఆ స్కూలు ఊరు, వాడకు దూరంగా ఆఫీసర్ల కాలనీ మధ్యలో వుండేది. సింగరేణి బొగ్గుబావులు తవ్వే కార్మికుల పిల్లలు అక్షరాన్ని అందుకోవాలంటే రోజూ నాలుగు కిలోమీటర్ల దూరం నడవాల్సి వచ్చేది. ఆఫీసర్ల కాలనీ వాళ్ళు, మా స్కూల్ టీచర్లు, ఆ కాలనీ పిల్లలు ‘అండీ’, ‘గారు’ అని ప్రతీ మాటకు వాడేవారు. ఆ పదాలు నాకు కొత్తగా వింతగా అనిపించేవి. వాటిని పట్టుకోవాలని ప్రయత్నించాను కానీ నా భాషకు యిప్పటి వరకు అతకలేదు. క్లాసులో టీచర్ లేకుంటే క్లాసు వాళ్ళ మీద, స్నేహితుల మీద, టీచర్ల మీద, క్లాసు సబ్జెక్టుల మీద, పూల మీద, పళ్ళ మీద, గాలి మీద నేల మీదంతా కవితలు రాసి క్లాసులో చదివి ఆనందపడేది. వాటి ప్రయోజనం కూడా దోస్తుల వరకు, క్లాసు రూము వరకే వుండేది. అలాగే క్లాసు రూమ్‌లో ముందు వరుసలో కూర్చునేది. నేటికీ ఎక్కడైనా ముందు వరుసలోనే కూర్చుంటా. ఏదైనా సబెక్టులో ఒక్క మార్కు తక్కువ వచ్చినా రాత్రంతా చదివేది. స్కూల్ రెండు కిలోమీటర్ల దూరం ఉండటంతో రోజు స్కూల్‌కు సద్ది (టిఫిన్) తీసుకోని వెళ్ళేది, కానీ ఒక్కొక్కరోజు సద్ది పాసిపోయేది అలా చాలా రోజులు పగటికీ తినకుండా ఉండేది.
మన మాటుండది ముచ్చెటుండది..
పుస్తకంలో వున్న భాషకు, ఈ ‘అండీ’, ‘గారు’ భాషకు తేడా ఏమీ కనిపించకపోయేది. ఆ భాష నాకు నోరు తిరగ నట్లుండేది. నేనకునేట్లుగా లేకపోయేది. పేరుకు తెలుగే కానీ మా యింట్ల వాళ్ళు, మా పరిసరాల వాళ్ళు మాట్లాడే భాషే కాదు. అంతా అయోమయంగా వుండేది. అవ్వను అడిగితే ‘సదువంటే గట్లనే వుంటది బిడ్డా, అండ్ల మన మాటుండది ముచ్చె టుండది’ అనే మా ముసలవ్వ మాటలు వేరే దిక్కులేదు అనే రాజీ అర్థం తో సముదాయించి నట్టుండేది. ఆ భాష అర్థం చేసుకోవడానికి అలవాటు పడడానికి ఎంత అవస్థ పడ్డానో. ఒక్క భాషే కాదు, పాఠ్యపుస్తకాల్లో, బయటి పుస్తకాల్లో, చందమామ కథల్లో, రేడియోలల్ల, పేపర్లల్ల, సినిమాలల్ల, సినిమా పాటలల్ల ఎక్కడ విన్నా, చదివినా మా భాషగానీ, మా వాళ్ళ పేర్లు గానీ, మా దేవుళ్ళ పేర్లు గానీ, మా పండుగల పేర్లు గానీ, మా వంటకాల పేర్లు గానీ, మా వాళ్ళ కట్టుబొట్టున్న బొమ్మలు గానీ చూద్దామన్నా కనబడకపోవడానికి కారణాలు, అడ్డంకులేమిటో తెల్వక పోయేది.
నేను ఎనిమిది తరగతి వరకు తెలుగు వంటల్లో దద్దోజనం, ఆవడ, గోంగూర, పూతరేకులు, బొబ్బట్లు, ఇడ్లి, దోశ లాంటివన్నీ టీచర్ చెప్పే పాఠాల్లో వినుడే గానీ అవెట్లుంటాయో తెల్వక పోయేది. క్యాబేజి, కాలిప్లవర్ ఇంకా కొన్ని కూరగాయలు వండుకుంటారని కూడా తెలియదు. మరి మా పల్లెల్లో, మా ప్రాంతంలో వండుకునే ఉల్లిగడ్డల కూర, పచ్చి పులుసు, సింతపండు తొక్కు, బొక్కల సోరువ, వంకాయ వట్టిచాపలు, సియ్యల కూరలు, బెల్లంబువ్వ, పాషంబువ్వ, బెల్లపప్పలు, రొట్టెలు, కుడుములు, పేలాలు, గుడాలు వాటి రుచి తెలుగు వంటల్లో ఎందుకు చేరలేదు? నోరు తిరగని, అలవాటు లేని సుబ్రహ్మణ్యం, మీనాక్షి, పంకజం, సుబ్బారావు, గాయత్రి, పద్మనాభ శాస్త్రి లాంటి పేర్లే గానీ, మాకలవాటైన మా ప్రాంతపు ఎల్లమ్మ, మల్లన్న, సమ్మక్క, సారక్క, లింగయ్య, ఐలయ్య, కొమురయ్య, భద్రక్క, పోశమ్మ, ఉప్పలమ్మ పేర్లు నేను చదివే పుస్తకాలల్లుంటే బాగుండేదనుకునేది. ఆకరికి మా దేవుళ్ళు గూడ పుస్తకాల్ల, సినిమాలల్ల కనబడకుంట రేడియోల్ల వినబడకుండా వుండేది. రామేసుడు, బద్ధిపోశమ్మ, కట్టమైసమ్మ, కొమురెల్లి దేవుడు, మల్లన్న దేవుడు, సమ్మక్క, సారక్క, పోశవ్వ, ఉప్పలమ్మ దేవుల్లు మా పుస్తకాలల్లుంటే వాళ్ళకు నెమలీకలు బెట్టి మొక్కుకుంటే మంచిగుండే దనుకునేది, సదువు బాగొస్తాదనుకునేది.
కట్టు బొట్టుకు పోలికే కనబడక పొయే…
”యింకా మా పుస్తకాల్ల తెలుగు వాళ్లవని చాలా బొమ్మలుండేవి. కానీ ఆ బొమ్మల కట్టు బొట్టుకు మా వాళ్ళ కట్టు బొట్టుకు పోలికే కనబడక పొయెది. మా ఆడోల్ల గోసికట్టు, యేలి సిగె, గంటీలు, సెవుపుల్లలు, ముక్కు పోగులు, పక్క పుల్లల్లు, మీది పుల్లలు, నల్లపూసల గుండ్లు, పట్టెడ, కాళ్ళ కడాలు, సాలం కడాలు, తోడాలు, దండె కడాలు, ముంజేతి కడాలు పెట్టుకున్న బొమ్మలు మా ప్రాంతపు మొగోల్ల పంచె కట్టు, సెవు పోగులు, చేతులక్కడాలు, తలకు రుమాలు, భుజాన కండువా, కాళ్ళకు దేవుని బేడీలు, మొలపట్ట, చెవులసుట్ట వున్న బొమ్మలు ఆ తెలుగు వాళ్ళంటున్న బొమ్మల్లో వుండక పోడానికున్న అభ్యంతరాలేంటివో తెలువక పొయ్యేది. మేము పెద్దగా చేయని సంక్రాంతి వంటి పండుగల మీద ఏకంగా పాఠాలే వుండేది గాని మా వూల్లె, ప్రాంతంల చాలా గొప్పగా, పెద్దగా చేసుకునే ‘సద్దుల’ పండగ, బతకమ్మల గూర్చి వుండక పోవడం గురించి మనసు చిన్నబోయేది”.
యిక ఆంధ్రప్రదేశ్ భౌగోళిక చరిత్రలో నదుల ప్రస్తావ నొచ్చి కష్ణ, గోదావరి, పెన్నా, తుంగభద్ర నదులున్నాయని చదూకున్నపుడు, మరి మా వూరు పక్క నుంచి చాలా వూళ్ళ పొంటి పెద్దగా పారే మా ‘గంగ’ పేరు లేదేంది? అదే టీచెర్నడిగితే ‘గంగేంటి గంగా? అది వారణాసిలో వుంటది, నోర్మూసుకొని కూర్చో’ అన్నది చాలా కసురుకొంటూ. స్పష్టత కోసం పడే నా ఉత్సాహాన్ని కూడా నోర్మూయించింది. మా మంచిర్యాల ‘గంగే’ గోదావరినది అని నా కప్పటి వరకూ, ఇంకా చాలా రోజుల వరకు తెల్వలేదు. నా చదువంతా నాకు నా కుటుంబానికి, నా పరిసరాలకు సంబంధించని, సామరస్యం లేని, సమన్వయం కాని, అలవాటులేని, అలవికాని పేర్లని పదాలని గుర్తు పెట్టుకోడానికి, తిరిగి అవి పేపరు మీద పెట్టడానికే నా బాల్యపు శక్తి యుక్తులన్నీ ధార పోశాను.
అక్షర జ్ఞానం కోసం… ఆకలినే పెట్టుబడిగా…
ఇంటర్ చేసేటప్పుడు వరంగల్లోని బాలసముద్రం హాస్టల్లో చేర్పించడానికి మా అయ్యా షరతులు పెట్టిండు. కాలేజీ సదువులో ఫెల్ అయినా, అటు-ఇటు సూసినా, పెండ్లి చేసేస్తా, అందరికీ ఆదర్శంగా ఉండాలని, మన గూడెం నుండి ఇంత సదువు సదివినదానివి ఒక్కదానివే. కాలేజీలో మంచిగా సదివి పేరుకు రావాలే అని జాగ్రత్తలు చెప్పిండు. నేను సరే అన్న. అప్పుడు హాస్టల్లో చేర్పిండు.
హాస్టల్ గోడల మీద విద్యార్థి సంగమోళ్ళు ‘చదువు-పోరాడు’ అనే నినాదం, ‘మారాలీ మన సమాజము, రాజుల సంస్కతి ప్రజలది అంటే చెల్లదు చెల్లదు చెల్లదులే, హక్కులకై పోరాడుదామురా చెల్లెమ్మా’ వంటి పాటలు, సాహిత్యం నన్ను విద్యార్ధి ఉద్యమాల వైపు ఆకర్షించి, నడిపించాయి. రాజ్యహింస, దొరల దోపిడీ, దౌర్జన్యాల మీద రాసిన చిన్న చిన్న రచనలు చెసేది. ఓసారి విద్యార్ధి ఉద్యమ సావనీర్లో నాదొక పెద్ద వ్యాసం రావడం నా పట్ల నాకు నమ్మకమేర్పడింది. నేను సమాజంలో కులంగా, జెండర్‌గా ఎదుర్కొంటున్న సమస్యల్ని, భావాల్ని బాహాటంగా మాట్లాడే పరిస్థితులు కాని, రాసే వాతావరణం కనిపించకపోయేది. ఇవన్నీ రాస్తే హేళన చేస్తారేమోనని, సిన్న చూపు చూస్తారేమోనని రాసినవి కూడా చూపించడానికి భయపడేది.
బయటి వారి వివక్షలతో… కుటుంబ సభ్యుల జాగ్రత్తలతో ప్రారంభమైనా కాలేజీ సదువులు డిగ్రీని హాస్టల్‌లో ఉండి పూర్తిచేసినా. డిగ్రీ పూర్తికాగానే జాబ్‌ల కోసం అనేక రకాల పరీక్షలకు సదివేది. సివిల్స్‌కు పరీక్ష రాసినా ప్రిలిమినరి పాస్ అయినా.. మెయిన్ పాస్‌కాలేదు. ఇక్కడ ఒక్కవిషయం గుర్తించుకోవాలి. ఎందుకంటే నేను ఒకే ఒక్కసారి రాసినా మళ్ళీ మళ్ళీ రాయవచ్చని నాకు తెల్వదు అందుకు నేను ఒక్కసారి మాత్రమే రాసినా.
పిజి కోసం కాకతీయ యూనివర్శిటీలో చేరినా తరువాత ఎలాగైనా ఉద్యోగం సంపాదించాలని చాలా కష్టబడి సదువేది. యం.ఏ మొదటి సంవత్సరంలో రాసినా గ్రూప్-2 (ఏఎస్‌ఓ సచివాలయం)కు మా క్లాసుమేట్స్ ముఫ్పై, నలభై మందిమి పరీక్ష రాస్తే నాకు ఒక్కదానికే రెండు సంవత్సరాల తరువాత జాబ్ వచ్చింది. యంఏ పూర్తి కాగానే ఎల్‌ఎల్‌బిలో కూడా సీటు వచ్చి జాయిన్ అయినా రెండవ రోజే యం.ఫిల్స్‌లో సీటు, జాబ్‌లో జాయిన్ కావాలని లేటర్ వచ్చింది. అలా విద్యార్థి దశ దాటుకుని ఉద్యోగపాత్రలోకి మారిపోయినా.
ఆత్మగౌరవ తిరుగుబాటు…
ఇంటర్‌లో ఉండగా నా క్లాసుమేట్ బ్రహ్మణ అమ్మాయి నాపట్ల వివక్ష పూరితంగా చూడడం నాకు ఇబ్బందిగా అనిపించింది. అలా చాలాసార్లు చూసింది. కానీ ఒక్కరోజు నీళ్ళకాడ మాత్రం అలానే చూసింది దాంతో కుండతీసి నెత్తిమీద కొట్టిన. నా మీద ప్రిన్సిపల్‌కు కంఫ్లైంట్ చేసింది, నన్ను కాలేజీల్లోకి తీసివేయమని చెప్పింర్రు. కాలేజీ లెక్చరర్స్ మాత్రం సుభద్ర మెరిట్ విద్యార్థిని అని ప్రిన్సిపల్‌కు చెప్పి నన్ను కాపాడింర్రు.
అలాగే హాస్టల్‌లో కూడా ఓ ఘటన జరిగింది. హాస్టల్ బాత్‌రూంలో చాలా రక్తం ఉండడం చూసి వార్డెన్ పిల్లలందరిని పిలిచి అడిగింది, కానీ ఎవరిది కాదన్నరు. వెంటనే అందరిని హాస్పిటల్‌కు రెండూ, మూడు జీపులల్లో తీసుకెళ్లారు, కానీ నన్ను రమ్మంటే నేను రాను, ఆ రక్తం నాది కాదు, ఎందుకు రావాలని వెళ్ళలేదు, హాస్పిటల్ వెళ్ళకుంటే హాస్టల్ నుండి తీసేస్తానని వార్డెన్ చెప్పింది దాంతో అందరూ నన్ను హాస్టల్ నుండి తీసి వేస్తుందని భావించారు, ఆ బాత్‌రూంలో రక్తం కుక్క చేసిందని ఆయా గమనించి వార్డెన్‌కు చెప్పడం ద్వారా ఎవ్వరిని ఏమి అనలేదు. అలా హాస్టల్ నుండి వెళ్ళేెది తప్పించుకున్నాను. ఈ రెండు సంఘటనాలు నా కాలేజీ జీవితం గొప్ప పాఠంగా మారాయి. వేసవి సెలవులు వస్తే కూడా భయం వేసింది. ఎందుకంటే ఇంటికి వెళ్తే పెండ్లి చేస్తారనే భయం వెంటాడేది. కాలేజీ సెలవులుంటే హాస్టల్ బందు చేసేవారు. కానీ నాల్గురం, ఐదుగురం కలిసి హాస్టల్లోనే ఉండేటోల్లం. వార్డెన్ మాకు కొన్ని బియ్యం, పప్పు ఇచ్చేది. మేము ఒక్కపూట వండుకుని తినేవాళ్లం. అలా చదువుకోసం ఆకలిని పెట్టుబడిగా పెట్టి ప్రక్కనే ఉన్న లైబ్రరిలో అన్ని రకాల పుస్తకాలు చదవటం నాకు ప్రయోజనం కల్గింది.
హాస్టల్ నుండి సంవత్సరంలో ఒక్కటి, రెండు సార్లు మాఊరు దామరంచెపల్లికి వెళ్లినప్పుడు వివిధ కులాల మహిళలు ఓ పోరి, ఏందే, ఓ మాదిగోళ్ళపోరి.. అని వివిధ రకాలుగా పిలిచేటోళ్ళు అది విని నాకు కోపం వచ్చేది, తట్టుకోక కొన్ని సందర్భాలల్లా మీరు మా భూమిలో కూలీ పని వస్తరు, నేను ఎప్పుడైనా మీ భూమిలో కూలీకి వచ్చిన్నా… అని తిట్టేది.
ఉద్యోగం
1988లో ఏఎస్‌ఓగా రాష్ట్ర సచివాలయంలో ఉద్యోగం వచ్చిన తరువాత హైదరాబాద్ రావడం అదే మొదటిసారి. అప్పటికీ హైదరాబాద్ అంటే అంతులేని భయం. ”బిడ్డ పట్నంలా వుద్యోగం ఎట్లానో.. ఏమో? యాడ ఉంటావో.. అని భయ పడ్డాడు అయ్యా”. అప్పటీకే హైదరాబాద్‌లో మాకు తెలిసిన ఓ అక్క మౌలాలీలో ఉండేది. ఆ అక్క వద్దకు వచ్చి ఉద్యోగంలో చేరినా. అలా ప్రారంభమైనా ఉద్యోగ ప్రస్థానంలో అడు గడుగునా వివక్షలతో, అంతులేని ఆవేదనలతో కూడుకున్నది. ఇక్కడ ఉద్యోగం చేరగానే మనల్ని స్కాన్ చేస్తరు. ఇక్కడ మనకు ఎవరూ ఉండరు, వాళ్ళకైతే అందరూ కలుపుకపోతరు. మన వాళ్ళకు పనికి మాలిన పని అప్పచెప్తరు. ముఖ్యమైన సెక్షన్లకు మన వాళ్లను వేయరు. వేరేవాళ్ళకు మాత్రం అన్ని విధానాలు, విధాల చెప్తరు, ఎట్లా పని చెయాలి, ఏవిధంగా ఫైల్ రాయాలి అని చెప్తరు. మన వాళ్ళకు చెప్పేవారు ఉండరు. వాళ్ళు చిక్కగా ఉంటారు. సచివాలయం పరిపాలన కేంద్రమే కాదు, కులాల గుంపు. ఒక్క కులమోళ్ళు ఒక్కతాట కుసొని భోజనం చేస్తరు. మనవాళ్ళు వాళ్ళ వాళ్ళ గుంపులో గోవింద అనుకుంటరు, కానీ మనవాళ్ళందరిని ఒకగుంపు మాత్రం చేయరు. వీళ్ళకు గుంపుగా ఉండాలనే సొయి కూడా ఉండదు.
తెలుగు మీడియం చదివి వచ్చిన వారికి ఇంగ్లీసు రాదని, ఫైల్ రాయడం రాదని వేధిస్తరు. 2010లో హౌం శాఖలో మన పిల్లడు ఈవిధంగా వేధించడం ద్వారా ఆత్మ’హత్య’ చేసుకున్నడు. హెల్ప్ చేయకపోంగ, చెడగొడుతరు, తప్పుడు పద్దతిని చెప్తరు. నాక్కుడా ఒక్కసారి ఇట్లానే చెప్పింర్రు. నేను వరంగల్ నుండి అందులో వామపక్ష భావజాలం నుండి వస్తిని. 1990లో ఉమ్మడి సెక్రెటెరియట్‌లో ఏపిఎస్‌ఇఏ (అప్సా)లో ఎన్నికల్లో అడిషనల్ సెక్రెటరికి పోటీ చేసినా. ఆ ఎన్నికల్లో పోటీ చేసిన దాంట్లో ఒక్కదాన్నే మహిళను అందులో ఎస్సీ, మల్లా తెలంగాణ. ఇక సూడు ఒక్కరకంగానా… కానీ ఆ ఎన్నికల్లో నేనే గెలిచినా.
సచివాలయంలో అప్సా సంఘం ఒక్కటే ఉన్నది, మహిళలకు సంఘమే లేదు, కాబట్టి 1991లో ఆంధ్రప్రదేశ్ సెక్రెటెరియట్ ఉమెన్ ఎంప్లాయిస్ అసోషియేషన్‌ను ఫౌండర్ ప్రసిడెండ్‌గా మహిళ సంఘం పెట్టినం. అందులో ఫోర్త్‌క్లాసు ఆడోళ్ళను తీసుకోవాలని నిర్ణయం చేస్తే అందరూ అడ్డుకున్నారు. అందులో మనోళ్ళు కూడా ఉన్నరు. ఫోర్త్‌క్లాసు ఆడోళ్ళపై వేధింపులు ఎక్కువగా జరుగుతాయి, ఏమైనా అంటే ఉద్యోగం పోతదనే భయం ఉంటది. రికార్డు రూమ్‌లో ఫోర్త్‌క్లాసు ఆడోళ్ళను వేధిస్తే నేను ఒకన్ని కొట్టినా.
14ఏళ్ళు ఏఎస్‌ఓగా చాకిరి చేసి ఇప్పుడు అడిషినల్ సెక్రెటరిగా పని చేస్తున్నాను. కానీ చాకిరి ఎక్కువ, గుర్తింపు తక్కువ ఉండే సెక్షన్ల మనోళ్ళను పెడ్తరు. మైండ్‌లో కులగోడలు కట్టుకుని ఉంటరు. మనకు సపోర్ట్ చేసే వారు ఉండరు. పెద్ద పోస్టులో ఉన్నా మర్యాద ఇవ్వరు. ఇంకా చెప్పుకుంటాపోతే పెద్ద చరిత్ర అయితది. ముఖ్యంగా ప్రమోషన్స్‌లో మనకు అన్యాయం జరుగుతది, కానీ ఎవ్వరూ అడగరు. అదే వాళ్ళకు జరిగితే తిర్రమర్ర అయితదని తనలోని ఆవేదనను తెలిపారు. రాష్ట్ర పరిపాలన కేంద్రమైన సచివాలయంలో ఎస్సీలను ముఖ్యంగా మహిళల కష్టాలకు అంతులేదని వివరించారు. దేశంలో, రాష్ట్రంలో వివిధ విభాగాల్లో ఎన్నో ఎస్సీ, ఎస్టీ సంఘాలు ఉన్నాయి కానీ సచివాలయంలో నేటికీ ఎస్సీ, ఎస్టీ సంఘం లేదంటే అతిశయోక్తి కాదు. ఇక్కడ సంఘం ఏర్పాటు కు ఇక్కడి వారికి, బయట వారికి సంబంధాలే ఉండవు.
మా వూరి దొరసాండ్ల్రు యాదికోచ్చేది
అప్పటికే వామపక్ష భావజాలంతో అనేక కార్యక్రమాల్లో పాల్గొన్న. మా క్లాసుల్లో, కాలేజీల్లో, ఉద్యమాల్లో నాయకురాళ్ళను చూస్తే మా వూరి దొరసాండ్ల్రు యాదికోచ్చేది. పేరుకు తోటి స్త్రీలే కాని వాళ్ళ భాష తిండి, అలవాట్లు, చదువు, కట్టుబొట్టు, జీవన విధానం శ్రమ, లైంగికతలో మా కింది కులపాడోల్లకే మాత్రం పోలిక కనబడేది కాదు. ఎంత రాసుకొని పూసుకొని తిరిగినా దగ్గరి తనమనిపించక పోయేది.
నా పరిసరాల జ్ఞానం ప్రచార జ్ఞానం, దాంట్లో వున్న వైరుధ్యాలు వైవిధ్యాలు అర్ధం చేసుకునే ఘర్షణలో ప్రచార జ్ఞానమే నన్ను కబళించింది, తరాలుగా అణచబడి అడుగునబడిన నా కులం, ప్రాంతం, జెండర్, వర్గం, భాష, సంస్కతి రాశి (వెలుగు) లోకి రాకుండా రంగానికెక్కకుండా నిరోధింపబడ్డ దారుల నుండే నా ప్రయాణం, రచనలు మొదలైనవి.
రంగానికెక్కకుండా నిరోధింపబడ్డ దారుల నుండే…
యిట్లా అనేక విధాలుగా యింట్ల, బైట ఘర్షణ పడి అర్ధం కాని అభిప్రాయాల్తో వాటికి సమాధానాలు వెతికే క్రమంలో భంగపడి, బాధపడి నా బుర్రని తోడి మనసును తొలిచి మొత్తంగా నా ఆలోచనలు ఎత్తి పోతలయ్యేవి. యీ ప్రాంతం, జెండర్, వర్గం, కులం సంబంధాలకు అతీతంగా అంటనట్లున్నా కూడా నా సమస్యలకు అణచివేతలకు సామ్యము వెతికే క్రమంలో సాహిత్యంతో చాలా సాన్నిహిత్యమేర్పడింది. అట్లా చలం సాహిత్యంలో జెండర్, శ్రీశ్రీ, చాసో, కారా సాహిత్యంలో వర్గం జాతీయోద్యమ సాహిత్యంలో ప్రాంతం, గురజాడ, కందుకూరి సంస్కరణ సాహిత్యంలో నా కులాన్ని, నా గూడెం, మా కులవివక్ష, మా జీవివ విధానం, మా సంస్కృతి లేదు. సాహిత్య చరిత్రల్లో, రచయిత్రుల సంకలనాల్లో, నాకులపోల్లు వేసిన దళిత సంకలనాల్లో కింది కులాల ఆడవాళ్ళ సాహిత్యం లేదు.
కుక్క ముట్టిన పాయసంగా…
నా పర్యవరణంలో నా ప్రపంచానికి, మెయిన్ స్ట్రీమ్ ప్రచారానికి మధ్య వుండే యీ వేల మైళ్ళ దూరంలో మా జాతులన్ని మట్టి పోరల్లోనే ఇంకా బువ్వకుండ చుట్టు తిరిగే ఆకలిలోనే వున్నారు. ప్రాంత పరంగా చూస్తే తెలంగాణ రచయిత్రులు అందులో దళిత రచయిత్రులు సాహిత్యంలో అసలు కనబడరు. వలస నీతి, వర్గ నీతి, కుల నీతి, జెండర్‌నీతి, ఆ జెండర్‌లో ఆధిపత్యకుల జెండానీతి, కింది కులాల స్త్రీ రచనల్ని సాహిత్య సంకలనాలు, వూరికి దూరంగానే వుంచిన నియమం కనబడుతుంది. తెలుగు సాహిత్య చరిత్ర కోస్తాంధ్ర ఆధిపత్య పితస్వామిక విలువల పట్టుతో మొదలైంది. ఆ విలువల్లో భాగంగానే సాహిత్యమంటే కేవలం హిందూ ఆధిపత్య పురుషులు రాసిందే మేటి సాహిత్యమైంది. దళిత, బహుజనులు, స్త్రీలు రాసిన సాహిత్యాన్ని ”కుక్క ముట్టిన పాయసంగా పారేసిన క్రమం” నుంచి దళిత, మైనారిటీ, గిరిజన స్త్రీల సాహిత్యం సాహిత్యంగా యింకా గుర్తింపబడటం లేదు.
ఎన్నో దళితోద్యమాలు, ఫెమినిస్టు ఉద్యమాలు, విప్లవోద్యమాలు వచ్చినా దళిత, బీసీ, ఆదివాసి మహిళల సమస్యల్ని పట్టించుకోలేదు. సాహితీకరించడం జరగలేదు. స్త్రీ వాద ఉద్యమం దళిత మహిళా సమస్యల్ని నిశ్శబ్దంలోకి నెట్టి వేసింది. స్త్రీ వాద ఉద్యమం సీమాంధ్ర నుండి కాదు కోస్తాంధ్ర అగ్రకుల ఆడవాల్ల సమస్యల్నే ఎజెండా చేసుకొని యిప్పటిదాకా సాగుతుంది. వారి ‘పితస్వామ్య విముక్తినే స్త్రీ విముక్తి’ అనే సిద్దాంతం సమాజంలో వత్తి కులాల ఉత్పత్తి మహిళలకు అంటదు. ఈ మహిళలకు శ్రమ విముక్తి, కుల విముక్తి, ఆసామి విముక్తి తమ మగవాల్ల నుంచి కూడా విముక్తి జరగాలి. కాని యివన్నీ స్త్రీ వాదులు చీకట్లో పెట్టారు.
స్త్రీ విముక్తి సంస్కరణలు అగ్రకులాల స్త్రీలకే కానీ దళిత స్త్రీల సంస్కరణలు చేయనెలేదు. వాళ్ళ స్త్రీలు ఎప్పుడు గడప దాటలేదు కానీ దళిత, బహుజన స్త్రీలు ఎప్పుడు కూడా గడప దాటకుండా ఉండలేరు. వీరికి గడప దాటితే గాని ఇళ్లు గడవని పరిస్థితి. సంస్కరణల పరంగా సూసిన కింది కులాల్లో ఉన్న జోగిని, బసివి, దేవదాసిలాంటివి ఇప్పటికీ కొనసాగుతున్నాయి. అట్లానే సతి, వితంతు వివాహాలు కూడా పై కులాల్లోనే ఉండింది. కింది కులాల్లో లేదు కదా!
”ఎవడారగించు అమృతభోజనమున
కలిసెనో యీ లేమ గంజిబువ్వ
ఎవడు వాసము సేయు శృంగార సౌధాన
మునిగెనో యిన్నారి పూరిగుడిసె
ఎవడపహరించే ఏమయ్యె యీమెసుఖము” అని జాషువా కింది కులాలపై 1930 ప్రాంతంలోనే రాసిండు. అలాగే మెదడు ఉంది ఆలోచించనివ్వండి/ స్వేచ్ఛ ఉంది తిరగనివ్వండి/ పశువుల్లా కట్టెస్తారేందుకు? అని చలం రాసింది నేటికీ అక్షరాల సత్యాలు.
హిందూ కోడ్ బిల్లు కూడా సవర్ణ హిందువుల కోసమేనని ముందుమాటలో బాబాసాహెబ్ డాక్టర్ అంబేడ్కర్ రాసిండు. ఇప్పటి మహిళ రిజర్వేషన్ బిల్లు లెక్క. ఎందుకంటే ఇది చట్టమయితే దళిత, బహుజన మహిళాల సమస్యలపై ప్రత్యేక చట్టం ప్రవేశపెట్టాలని అంబేడ్కర్ ఆలోచన చేసిండని ఆయన రచనల్లోనే ఉంది.
తట్టలు మోసిన నెత్తిపై నిన్నెందు మోయాలి
స్త్రీ వాద సాహిత్యం పునాదులు కుల హిందూ పితస్వామ్యాల అణచివేత పునాదుల్నించే వచ్చాయి. అట్లా బహుజన మహిళల్ని నిర్లక్ష్యం చేశారు. జ్యోతిరావ్ ఫూలే, సావిత్రీ బాయీ ఫూలే, నారాయణ గురు, పెరియార్ నుంచి అంబేడ్కర్ దాకా హేతువాద సామాజిక వైతాళికుల భావాజాలాన్ని ఆధిపత్య కులాలు స్త్రీవాదం ఆదర్శంగా తీసుకోలేదు. స్త్రీ విద్యకై, స్త్రీ దురాచారాల నిర్మూలనకై పోరాడిన చైతన్యాల్ని, చరిత్రల్ని స్త్రీ వాదులు ముందుకు తీసుకొనిపోలేదు. స్త్రీ విముక్తికి పాటుబడిన బహుజన వైతాళికుల సంస్మరణలు కూడా స్త్రీ వాదులకు అంటరానివే అయ్యాయి.
జ్యోతిబాఫూలే, నారాయణ గురు, సాహు మహారాజ్, పెరియార్ ఇ.వి. రామస్వామి నాయకర్, డా.బి.ఆర్.అంబేడ్కర్ భావాజాలంతోపాటు, మార్క్సిజం ప్రభావం కూడా దళిత సాహిత్యంలో కనిపిస్తుంది. ”దేశీయ మార్స్కిజం’ అనే భావన కూడా తెలుగు దళిత సాహిత్యంలో చర్చలోకొచ్చింది. అందువల్ల దళిత సాహిత్యాన్ని కాలం, స్వభావాలను అనుసరించి గుర్తించవలసి ఉంది. అయినా, దళిత సాహిత్యం ఆవిర్భవించటానికి శతాబ్దాల సామాజిక పీడనను ఎదుర్కొన్న చారిత్రక నేపథ్యం ఉంది. ఆ నేపథ్యం నుండే ”దళిత సాహిత్యం’ స్పష్టమైన అంబేడ్కర్ తాత్త్విక భావజాలంతో ఆవిర్భవించింది. ‘మనుస్మతి’ అనేది కుల హిందూ, కుల జెండర్ అణచివేత చట్టం, అట్లాంటి మనుస్మతిని తగల బెట్టిన అంబేడ్కర్ స్ఫూర్తి చైతన్యాల్ని ఇప్పటికీ బహుజన వర్గాలు కొనసాగిస్తూ మనుస్మతిని దహనం చేస్తున్నారు. కానీ స్త్రీ వాదులు, బ్రాహ్మణ సంస్కర్తలైన వీరేశ లింగాన్ని, గురజాడ అడుగుల్ని దాటి బైట పడని అప్రజాస్వామికాల్నే పాటిస్తున్నారు. ఒక్కడ ఒక్కవిషయం గమనించలే బెంగళూరులో నాగరత్నం అనే జోగిని వారి సమస్యలపై రాసిన పుస్తకాన్ని కందుకూరు వీరేశ లింగం బ్యాన్ చేయించి కేసులు పెట్టించి జైలుకు పంపిండు. తట్టలు మోసిన నెత్తిపై నిన్నెందు మోయాలి? అని జూపాక సుభద్ర ప్రశ్నించింది.
వీరు సచ్చినా ఇంకా సాహిత్యాన్ని శాషిస్తున్నారు.
ఇప్పుడొస్తున్న అస్తిత్వ కవిత్వం చాలా బలంగా వస్తుంది. అయితే తెలుగు సాహిత్యంలో ఆధిపత్య కులాల రచనలే సాహిత్యంగా చెలామణి అవుతుంది. అగ్రవర్ణ రచయితలు, కవులు చచ్చిపోయి కూడా సాహిత్యాన్ని శాసిస్తున్నారు. అణగారిన కులాలపై ఆధిపత్య కులాలు చేసే రచనలకే పెద్దపీట వేస్తుండటం జరుగుతుంది. కాని అణగారిన సమూహాలు జెండర్లు తమ జీవితాల్ని సంఘర్షణల్ని, పోరాటాల్ని తామే సాహిత్యంగా మలిచి రచనలు చేస్తే అవి సాహిత్యం కాదని, ఎంత గొప్పగా వున్నప్పటికీ శిల్పం లేదనీ, అర్ధం కాని భాషనీ, బూతుగా వుందనీ అవాచ్యం చేయడం, చిన్న చూపు చూడ్డం జరుగుతుంది. యింకా అస్తిత్వ ఉద్యమాలు యింత ఉధతంగా జరుగుతున్నా, వాటి ప్రభావంగా అస్తిత్వ సాహిత్యం ఇంత పెద్ద ఎత్తున వస్తున్నప్పటికీ- తమ సాహిత్య పీఠాల్లో, అకాడమీల్లో ‘తమ బాధలు, అనుభవాలు సాహిత్యీకరించు కోవడం అవి స్థానిక రచనలుగానే వుండిపోతాయి, గానీ అవి ప్రాపంచిక సాహిత్య విలువల్లోకి చేరవు’ అని చర్చ చేస్తుంటారు. దళితుల జీవన విధానాన్ని చైతన్యవంతంగా వర్ణించిన సాహిత్యం దళిత సాహిత్యమవుతుంది. దళితుల అభ్యున్నతి కోసం ఎవరు రాసినా అది దళిత సాహిత్యంగానే పరిగణిస్తున్నారు. దళితులే తమ సమస్యలకు ప్రతిస్పందించి రాస్తే దాన్ని ”ఆత్మాభిమాన వాదం’గానూ దళితేతరులు దళితుల పక్షాన్ని వహించి రాస్తే దాన్ని ”ఉదార వాదం’గానూ పిలుస్తున్నారు.
http://dalithashakthi.blogspot.com/2018/09/blog-post_92.html
———–