పేరు (ఆంగ్లం) | Mythili Abbaraju |
పేరు (తెలుగు) | మైథిలి అబ్బరాజు |
కలం పేరు | – |
తల్లిపేరు | – |
తండ్రి పేరు | – |
జీవిత భాగస్వామి పేరు | శ్రీనివాస్ |
పుట్టినతేదీ | 07/27/1966 |
మరణం | – |
పుట్టిన ఊరు | – |
విద్యార్హతలు | ఎంబిబిఎస్ |
వృత్తి | రచయిత్రి |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | తోడబుట్టువు,నిమగ్న,పూల రాణి కూతురు,మంచును కరిగించిన పాపాయి |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | https://kinige.com/book/Nimagna, https://www.logili.com/home/search?q=Dr%20Maithili%20Abbaraju |
పొందిన బిరుదులు / అవార్డులు | జ్యోతి పురస్కారం |
ఇతర వివరాలు | – |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | తోడబుట్టువు |
సంగ్రహ నమూనా రచన | శ్రావణికి ఇంటికి వెళ్ళాలని లేదు.గార్డెన్ లో – చల్లగా ఉందని తీగలు అల్లించిన పందిరికింద కూర్చుంది. అక్కడ గాలి ఆడటం లేదు, అయినా కదలాలని లేదు. స్తబ్దత. మొన్న మొన్నటిదాకా కోపం తన్నుకొచ్చేది, కదిలిస్తే ఏడుపొచ్చేది – ఇప్పుడేమీ లేవు. చేసేందుకేం లేదు. అసలిట్లా అంతా ఎందుకు మారిపోవాలి ? ఇంట్లోకి ఎవరెవరో ఎందుకొచ్చి పడాలి ? అమ్మ లేకపోతే మాత్రం ? |
మైథిలి అబ్బరాజు
శ్రావణికి ఇంటికి వెళ్ళాలని లేదు.గార్డెన్ లో – చల్లగా ఉందని తీగలు అల్లించిన పందిరికింద కూర్చుంది. అక్కడ గాలి ఆడటం లేదు, అయినా కదలాలని లేదు. స్తబ్దత. మొన్న మొన్నటిదాకా కోపం తన్నుకొచ్చేది, కదిలిస్తే ఏడుపొచ్చేది – ఇప్పుడేమీ లేవు. చేసేందుకేం లేదు. అసలిట్లా అంతా ఎందుకు మారిపోవాలి ? ఇంట్లోకి ఎవరెవరో ఎందుకొచ్చి పడాలి ? అమ్మ లేకపోతే మాత్రం ?
అమ్మ.
చెరుకు మిషన్ లో తిప్పినట్లైంది.
అమ్మ లేక రేపటికి రెండేళ్ళు. నాన్నకసలు గుర్తుందో లేదో. మొన్నెప్పుడో మఠం లో పూజ చేసొచ్చారులే , సరిపోతుందా ? ఇవాళ తనతో ఉండక్కర్లేదా ? కాన్ ఫరెన్స్ అట కాన్ ఫరెన్స్. వెళ్ళకపోతే ఏమైపోతుందో ? రంజిత పోదామంటే చాలు ఎటోకటు పడిపోవటమేనా ? పోయేవాళ్ళు ఆ వర్షని కూడా తీసుకుపోకపోయారా – అదీ దాని బోడి చదువూనూ …తనమీద పడేసి … ఇంతకీ నిన్ననే దాని అసైన్ మెంట్ ఐపోయింది, ఇవాళ స్కూలే లేదు.
స్కూల్ లేకపోతే ఇదివరకెంత బావుండేది ! అప్పటికప్పుడు జీడిపప్పు పాయసమో పాలకోవానో చేసేసేది. అమ్మ- ఉద్యోగం చేసేదికాదు. ఇంట్లోనే, తనెప్పుడు ఏ వేళకి చేరినా బళ్ళోంచో ఆటల్లోంచో. ఎంత చక్కగా సర్దిఉంచేది.
ఇల్లంతా ! పువ్వులు, అగరువత్తులు, దేవుడిముందర దీపాలు – గుళ్ళోకి వచ్చినట్లుండేది. ఇప్పుడేదీ వొద్దుట. అగరువత్తులకి ఆ చిన్న రాణిగారికి అలెర్జీట. తుమ్ములొస్తాయట. పూలు కోసి తల్లోపెట్టుకోవటం రంజిత కి నచ్చదట. తననేంపెట్టుకోవద్దనలేదులేగాని , అది కాదుగా కావలసింది అసలు ? దేవుడి గదిలోకే ఎవరూ వెళ్ళరిప్పుడు- ఉందంటే ఉందంతే. ఇంటిగోడలంతా ఏవేవో వింత పెయింటింగ్ లు.రంజితే వేసిందట.. వేటిగురించో నాన్నకి చెబుతూంటే వింది గానీ అవేవీ అక్కడేం కనబడనేలేదు. వర్ష బొమ్మలే కొంచెం నయం -అర్థమవుతాయి.కళ్ళూ ముక్కులూ ఉంటాయి.
అమ్మ వెళ్ళిపోయాక ఆ ఏడాదంతా అమ్మమ్మ వచ్చిఉంది . ఇద్దరూ కూర్చుని అమ్మని తల్చుకునేవాళ్ళు. ఏడ్చేవాళ్ళు. అమ్మకిష్టమైనవి చేసేవాళ్ళు. యూనివర్సిటీ నుంచీ వచ్చి నాన్నా తమతో కలిసేవాడు. అమ్మేదో బయటికెళ్ళినట్టూ ఇహనో ఇప్పుడో వచ్చేస్తుందన్నట్టూ ఉండేది. అట్లాగే ఉంటే పోయేది కదా ? ఏమయేదట ??
అసలా రంజిత ఎలా నచ్చిందో నాన్నకి ?సరిగ్గా వంట చేయటం కూడా రాదు. సన్న- గా, ఇంత పొట్టిగా చిన్నపిల్లలా ఉంటుంది . అమ్మ చక్కగా బొద్దుగా చామంతులదండలా ఉండేది. దగ్గరికి తీసుకుంటే ఎంత హాయిగా ఉండేది …ఆ రంజిత , ఇలా అని అనుకున్నాక వచ్చి చెప్పి తనని కావలించుకోబోయింది – చీ చీ. ఆమెకి తోడు వర్ష. ఇంత కళ్ళేసుకుని తనవైపు చూస్తూనే ఉంటుంది . ఏం మాటలుంటాయి ఇద్దరికీ – అది మరీ అయిదోక్లాసయితే. అక్కా అని పిలిస్తే పలకదు శ్రావణి – అది చెల్లెలేమిటి ? క్లాస్ లో ఆ దరిద్రుడు సాగర్ అననే అన్నాడు – ‘ రెడీమేడ్ చెల్లెలు దొరికిందిరోయ్ ‘ అని. కర్మగాకపోతే అదీ కాంపస్ స్కూల్లోనే ఉండాలా ?? రంజితని పిన్నీ అని పిలుస్తావా అని నాన్న అడిగినప్పుడు తనేం జవాబు చెప్పలేదు. పిలవదు. అసలేమనీ పిలవదు. తప్పనిసరైతే, ఎదురుగ్గా ఉంటే – ఏదో మాట్లాడాలి కాబట్టి అంతే.
వర్షా వాళ్ళ నాన్న అమ్మ లాగా చచ్చిపోలేదు- అదింకా ఘోరం…అమ్మమ్మ అనలేదూ ? విడాకులు తీసుకున్నారుట – ఆయన అమెరికా పోయాట్ట.అదేమిటో మరి- ఫోన్ లూ స్కైప్ లూ ఏం ఉండవు. వర్ష ఇక్కడ నాన్న కి అతుక్కుపోయింది. నాన్న అంతకన్నా …పాపా పాపా అని దాన్ని ఏం ముద్దు చేస్తాడో – తనక్కడ ఉండగానే … బావుంటుందిలే అది , తెల్లగా బుగ్గలేసుకుని ! శ్రావణికి దిగులు ముంచుకొచ్చింది. తను ముద్దుగా ఉండదు. చిన్నగా ఉండదు. పోనీ పెద్దదా అంటే పదో క్లాస్ అంతే. ఆ…తన క్లాస్ లో మాత్రం ఆ రమ్యా అనూషా ఎంత ప్రెటీ గా ఉంటారో- అబ్బాయిలు వాళ్ళ వెనకే తిరుగుతుంటారు . తను – తనెవరికీ అక్కర్లా. అది తనకి కొంచెం ఫ్రెండ్ కాబట్టి, వినీత అంటూ ఉండేది – ” నీ కళ్ళు భలే ఉంటాయి శ్రావ్స్- ముక్కెంత సూదిగా ఉంటుందో ” అని. వాళ్ళమ్మ అనేవారు – ” పెద్దయితే అందంగా అవుతావమ్మా ” అని. వినీత లేదిప్పుడు, వాళ్ళ నాన్న యు కె వెళ్ళారు, అది వాళ్ళ అమ్మమ్మ గారి ఊరెళ్ళిపోయింది. ఎప్పుడన్నా వాట్సాప్ చేస్తుంది.
మామయ్యా అత్తయ్యా ఈ వూరొచ్చాక కొంచెం నయం . మామయ్య అమ్మకి బాబాయి కొడుకు. తనకి మటుకే చుట్టం. వాళ్ళెవరికీ ఏం కాడు. తననే పిలిచి ఇంటికి తీసుకెళుతుంటారు వాళ్ళు – అప్పుడప్పుడూ. వర్ష ని పిలవరు. అసలు దాన్ని పలకరించరు.
ఉక్క పెరిగిపోతోంది – ఇంటికిపోతేనో ? ఫాన్ వేసుకుని టీవీ పెట్టుకోవచ్చు , లేకపోతే వైఫై చూసుకోవచ్చు. మొబైల్ ఏదీ ? ఇంట్లోనే మర్చిపోయి వచ్చింది…రాత్రికొస్తారు కాబోలు వీళ్ళు.ఈ పాటికి ఫ్లైట్ ఎక్కిఉంటారు. నిన్నా మధ్యాహ్నమూ కాంటీన్ అబ్బాయి భోజనం తెచ్చిపెట్టాడు- ఈ పూట సెలవు వాళ్ళకి. ” వచ్చేప్పటికి కొంచెం రైస్ కుకర్ పెట్టి ఉంచు శ్రావణీ ” అని చెప్పివెళ్ళింది రంజిత. పెట్టదు. అస్సలు పెట్టదు. కప్ ఓ నూడుల్స్ చేసుకు తిని నిద్రపోతుంది. వర్ష ఏం తింటుందో దానిష్టం.
సరేలే. దానికి స్టవ్ వెలిగించటం రాదుగా, ఇంకో కప్ లో కూడా నీళ్ళు పోస్తే సరి.
***
డ్రాయింగ్ బోర్డ్ ముందు నిలుచుని బొమ్మ గీస్తోంది – వర్ష. మమ్మీ, నాన్న వెనకాల నిలుచున్నారు. ముందు అక్క, తను – ఇద్దరూ .. అక్క మొహాన్ని అతి శ్రద్ధగా దిద్దుతోంది – పోలికలు టక్కున తెలిసేంతగా. కాకపోతే, బొమ్మ లో అక్క నవ్వుతోంది. తనని దగ్గరగా హత్తుకుని నిలుచుంది. వర్ష మొహం మీదికీ తెలియకుండానే నవ్వు వచ్చింది. ఆ పూట సంతోషం గా అనిపిస్తోంది. నిన్నటినుంచీ ఇంట్లో వాళ్ళిద్దరే. అక్క పాలు కాచింది, తన గ్లాస్ లో పోసింది, బోర్న్ విటాకూడా వేసింది. పిలిచి చేతికివ్వలేదులే – అయినా కూడా , తనకోసమే కదా. మెస్ అబ్బాయి కారియర్ తెస్తే ఇద్దరికీ కంచాల్లోవడ్డించింది – ఇంకా ఏం కావాలీ అని అడిగి కనుక్కుంది… ఇట్లాగే ఇంకా ఇంకా ప్రేమగా అయిపోతే ఎంత బావుండు !!
తనూ, మమ్మీ – ఈ కొత్త ఇంటికొచ్చి ఆరేడు నెలలవుతోంది . అంతకుముందు ఇద్దరే ఉండేవాళ్ళు. ఇంకా ముందైతే – తలచుకోబుద్ధి కాలేదు . చాలా చాలా రోజుల కిందట డాడీ తో కలిసి ఉండేవాళ్ళు. సరిగ్గా గుర్తులేదు -రోజూ కేకలేసేవాడని తప్పించి. ఒకోసారి మమ్మీ కూడా అరుస్తుండేది. ఎందుకో ఏమిటో తెలీదు. అమ్మా తనూ ఇంట్లో ఉండటం డాడీకి ఇష్టం లేదనిపించేది. ఆఖరికి బయటికి వచ్చేశారు.
ఇక్కడికొచ్చాక మమ్మీ హాయిగా ఉంటోంది. నాన్న చాలా మంచివాడు. ఎంత నెమ్మదిగా మాట్లాడతాడో ! మమ్మీ పిలిచినట్టే పాపా అని పిలుస్తాడు తనని …ఇంకా బాగా కూడా చూసుకుంటాడు కొన్నిసార్లు.
చెప్పాడు తనతో – ” పాపా ! అక్క వాళ్ళమ్మ చచ్చిపోయిందమ్మా…అందుకని ఇంకాబెంగపడుతూనే ఉంది. నీతో సరిగ్గా ఉండకపోతే ఏమనుకోకు, నువ్వే ఇంకొంచెం కల్పించుకుని మాట్లాడు ” అని చెప్పాడు. బతిమాలుతున్నట్లు! – తనకైతే అమ్మ ఉంది , అక్కకి లేదుగా పాపం ! తను మంచి పిల్ల అని మెల్లి మెల్లిగా అర్థమైపోతుంది…ఇప్పుడు కొంచెం అవుతున్నట్లే ఉంది, కదా ?
బెల్ మోగింది. పక్కింటి ఆంటీ. ఫ్రూట్ కేక్ చేశారట , వర్షకి ఇష్టమని తెచ్చారట. సూపర్ మార్కెట్ కి వెళ్ళొచ్చేస్తారట , ఒక్కతీ ఉండగలదా అని అడిగారు. కాసేపట్లో అక్క వచ్చేస్తుందిగా- ఆ మాటే చెప్పింది. కేక్ ని డైనింగ్ టేబిల్ మీద పెట్టింది , తర్వాత ఇద్దరూ తినచ్చు…వెళ్ళి బొమ్మ పూర్తి చేసుకుంటోంది.
మళ్ళీ బెల్ మోగింది.
*****
డూప్లికేట్ తాళం తో తలుపు తీసుకుని లోపలికి వెళ్ళింది శ్రావణి. మూడు బెడ్ రూమ్ ల క్వార్టర్స్ అవి – తన గది తలుపే హాల్ లోంచి మొదట. మొబైల్ అక్కడే ఉంది బల్ల మీద. చూస్తే మూడు మిస్డ్ కాల్స్.
ఇంటి నంబర్ నుంచి . వర్ష ఎందుకు చేస్తుంది ? ఎందుకు చేసింది ?
పక్కనే దాని గది. లేదు అక్కడ. డ్రాయింగ్ బోర్డ్ మీద ఫామిలీ స్కెచ్. తనని తను గుర్తు పట్టింది …అంత బావున్నట్లు వేసిందే …పక్కన వర్ష బొమ్మ మరీ చిన్నగా , ఇంచుమించు తనని పట్టుకు వేలాడుతూ.
ఎక్కడ ఇది ? బాత్ రూమ్ లో ఉందా ?
పిలిచింది.
పలకలేదు. లోపల లేదు.
నాన్నా వాళ్ళ గది ఆ చివరన, వంటింటికి అవతలి వైపు. అక్కడేం చేస్తుంటుంది ?
నడుస్తోంది.
ఏడుపు. నోటికేదో అడ్డంగా ఉంటే అడుగునుంచి , వెక్కిళ్ళు పెట్టినట్టు.
పరుగెత్తింది.
తలుపు నెడితే – వర్ష కాదు అక్కడెవరో ఉన్నారు మంచం మీద అడ్డంగా. దేంతోనో పెనుగులాడుతున్నారు. ఆ పక్క నుంచి- అయ్యో. అదేమిటి ??? వర్ష చెయ్యి.
ఠారెత్తింది. వెళ్ళి ఆ ఆకారాన్ని లాగింది. అతను లేవటం లేదు.
” లే. లే. వదిలిపెట్టు. వదిలిపెట్టు ”
లాభం లేదు.
పేపర్ వెయిట్ తీసుకుని తలమీద గట్టిగా మోదింది. దెబ్బకి ఇవతలికొచ్చాడు.
ఎవరు ? ఎవరది ?
మామయ్య.
శ్రావణికి ఏడుపొచ్చేసింది. బిగబట్టుకుంది. ఏడవకూడదు. వర్ష ఇంకా భయపడుతుంది.
” వర్షా వర్షా ఏమైందే ఏమైందే ”
ఒక్క ఉదుటున దాన్ని పైకి లాగి కావలించుకుంది. ఏడ్చేడ్చి దాని మొహం వాచిపోయింది. బుగ్గలంతా గాట్లు.
” అయ్యో ఏమైందే ”
‘ మామయ్య ‘ చెప్పాడు – ” ఏం లేదు శ్రావణీ. వర్ష అల్లరి చేస్తుంటేనూ …కొంచెం – ”
” మాట్లాడకు. అది అల్లరి చెయ్యదు. నాకు తెలుసు. మాట్లాడకు ” – శ్రావణి గొంతు వడవడ వణికిపోయింది. నిలువెల్లా శివమెత్తింది. వెళ్ళి చొక్కా పట్టుకుని దబా దబా బాదింది.
” అరె. చెప్తే వినవే ” – వదిలించుకుని అవతలికిపోయాడు.
” ఫో. బయటికి పో. మళ్ళీ రాకు. అస్సలెప్పుడూ రాకు ”
ఎలాగూ వెళుతూన్నవాడిని ఇంకొక్క గెంటు గెంటి తలుపు తాళం పెట్టి కిందా పైనా గొళ్ళాలు బిగించి వచ్చింది.
ఏమయింది ? ఏం చేయాలి ?
వర్ష ఆపకుండా ఏడుస్తోంది.
” లేదు. లేదులే. ఊరుకో. మా అమ్మ కదూ ” – పొదువుకుని కూర్చుంది.
కాసేపటికి – దాని ఏడుపు ఊపు తగ్గాక , ఏమడగాలో తెలీకుండానే ఏదో అడిగింది. అది చెప్పినదానికి ఊపిరి పీల్చుకుంది.
” ఏం పర్వాలేదమ్మా. ఏం కంగార్లేదు. ఏడవకూడదు . నేనున్నాగా ” అంటూనే శ్రావణి గొల్లుమంది.
బయట చల్లగాలితో వాన మొదలైంది.
———–