పేరు (ఆంగ్లం) | GouriLakshmi Alluri |
పేరు (తెలుగు) | గౌరిలక్ష్మి అల్లూరి |
కలం పేరు | – |
తల్లిపేరు | అల్లూరి నరసమ్మ |
తండ్రి పేరు | అల్లూరి లక్ష్మీపతిరాజు |
జీవిత భాగస్వామి పేరు | పెన్మెత్స సుబ్రమణ్య గోపాలరాజు |
పుట్టినతేదీ | – |
మరణం | – |
పుట్టిన ఊరు | అంతర్వేదిపాలెం, సఖినేటిపల్లి మండలం, కోనసీమ జిల్లా, |
విద్యార్హతలు | బి.ఎస్.సి, ఎం.ఎ. (పొలిటికల్ సైన్స్), బ్యాచిలర్ ఆఫ్ పబ్లిక్ రిలేషన్స్ |
వృత్తి | APIIC Ltd.లో జనరల్ మేనేజర్ |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | http://gourilakshmi.com/ |
స్వీయ రచనలు | మనోచిత్రం (కథల సంపుటి) వసంత కోకిల (కథల సంపుటి) నిలువుటద్దం (కవితాసంపుటి) భావవల్లరి (కాలమ్స్) అంతర్గానం (నవల) కొత్తచూపు (కథల సంపుటి) |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | https://kinige.com/book/bhaavavallari |
పొందిన బిరుదులు / అవార్డులు | ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉగాది పురస్కారం (2018), తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారం (2017) |
ఇతర వివరాలు | – |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | స్వయంవరం |
సంగ్రహ నమూనా రచన | “వదినా!” సంభ్రమంగా పిలుస్తున్న ఆప్యాయమైన పిలుపు! ఎన్నో ఏళ్ళ తరవాత! చెవుల్లో అమృతం పోసినట్టు. ఆశ్చర్యంగా అటూఇటూ చూసింది. బస్టాప్‌లో బయలుదేరిన బస్సు కొంచెం ముందుకు పోయి ఆగింది. అందులోంచి దిగి పరుగుపరుగున వస్తోంది రేణుక. తన భ్రమకాదు కదా! నిజంగా రేణుకేనా? మళ్ళీ మళ్ళీ అపనమ్మకంగా చూసింది కామేశ్వరి. |
గౌరిలక్ష్మి అల్లూరి
“వదినా!” సంభ్రమంగా పిలుస్తున్న ఆప్యాయమైన పిలుపు! ఎన్నో ఏళ్ళ తరవాత! చెవుల్లో అమృతం పోసినట్టు.
ఆశ్చర్యంగా అటూఇటూ చూసింది. బస్టాప్‌లో బయలుదేరిన బస్సు కొంచెం ముందుకు పోయి ఆగింది. అందులోంచి దిగి పరుగుపరుగున వస్తోంది రేణుక.
తన భ్రమకాదు కదా! నిజంగా రేణుకేనా? మళ్ళీ మళ్ళీ అపనమ్మకంగా చూసింది కామేశ్వరి.
“ఏంటొదినా! అంత ఆశ్చర్యపోతున్నావ్! మీ రేణూనే. దయ్యాన్ని కాదు” నవ్వుతూ భుజం చుట్టూ చెయ్యి వేసింది రేణుక. తేరుకుని అమాంతం కౌగిలించుకుంది ఆడపడుచుని. వీపంతా చేతులతో తడిమింది ప్రేమగా. అప్పటికి అనుమానం తీరింది కామేశ్వరికి.
“ఎలా ఉన్నావె!” అడగబోయిందామె. గొంతు వణికి మాట కొరబోయింది. గుండెలో గడ్డకట్టిన దుఃఖం ఒక్కసారి కరిగంది.
రేణుక కళ్ళు నీళ్ళతో నిండిపోగా వదిన చెయ్యి గట్టిగా పట్టుకుని కళ్ళకద్దుకుంది. “నువ్వెలా ఉన్నావొదినా?” అంది గొంతు పెగుల్చుకుని.
కామేశ్వరి మాట్లాడకుండా రేణుకని కళ్ళనిండుగా చూసుకుంటూండిపోయింది చెయ్యి వదలకుండా.
“ఏంవదినా! నేను చచ్చిపోయాననుకున్నావా? అంత ఆశ్చర్యపోతున్నావ్?” నిష్టూరంగా అంది రేణుక.
ఆ మాటకి బాణం దెబ్బతిన్నట్లు వణుకుతూ, “రేణూ” అంటూ ఆమె నోరు మూసి దగ్గరకు తీసుకుని నిశ్శబ్దంగా వెక్కిళ్లు పెడుతూ ఉండిపోయింది కామేశ్వరి.
“ఎందుకొదినా అంత బాధ! నేనేమన్నా నీ కూతుర్నా?” అంటుంటే రేణుకకే దుఃఖం ముంచుకొచ్చింది. ఇద్దరూ తలవచుకుని ఒక నిమిషం దుఃఖాన్నాపుకుంటూ ఉండిపోయారు.
బస్టాప్‌లో జనం ఆట్టేలేరు. ముందుగా రేణూనే తెరుకుంటూ అంది “అన్నయ్యెలా ఉన్నాడొదినా?”
“బానే ఉన్నారు” అంది కామేశ్వరి కళ్ళు తుడుచుకుంటూ.
“రమేష్, వెంకట్”
“ఆ! టెంత్, ఇంటర్”
“నిజంగానా! అంత పెద్దవాళ్ళైపోయారా?” అని సంతోష పడిపోతూ “ఎన్నేళ్ళయిందొదినా?” అంది రేణుక.
“ఆరేళ్ళు” అంది కామేశ్వరి.
“నువ్విక్కడున్నావేంటి? వదినా?”
“నా స్నేహితురాలుంటే ఫంక్షన్ కొచ్చానిక్కడికి. మరి నువ్వు?”
“నా కథంతా రేపు చెబుతాను. రేపు నువ్వు ఇదే టైంకి ఇక్కడికి రాగలవా వదినా?”
“ఎందుకురానే! తప్పకుండా వస్తాను” అంది కామేశ్వరి.
ఇంతలో బస్ వచ్చింది. “ఇది మనింటికి పోతుంది కదా! ఎక్కెయ్ వదినా” అంటూ బస్ ఎక్కించేసింది రేణుక.
అయిష్టంగానే బస్సెక్కి కనిపించినంతవరకూ ఆత్రంగా ఆడపడుచును చూస్తూనే ఉంది కామేశ్వరి. ‘మళ్ళీ కనబడుతుందో కనబడదో’ అనిపించిందామెకు.
సీట్లో కూర్చున్నాక ఆమెలో ఆనందం ఒక్కసారిగా పెల్లుబికింది. ఎంత మంచిరోజివ్వాళ! రేణూ కనబడింది. కళ్ళలో నీళ్ళూరాయి. అసలిలాంటి రోజొకటి వస్తుందని ఊహించనేలేదు. దేవుడెంత మంచివాడు.
టికెట్టు తీసుకుని ఆలోచనల్లో పడిపోయింది కామేశ్వరి. పేరుకు ఆడపడుచైనా కూతురిలా పెరిగింది రేణు తనదగ్గర. తను కాపరానికి వచ్చేసరికి పదేళ్ళపిల్ల. పన్నెండేళ్ళపాటు తన చేతుల్లో పెరిగి అకస్మాత్తుగా మాయమయిపోయింది అందర్నీ దుఃఖసాగరంలో ముంచి.
“ఇంతకన్నా అది చచ్చిపోతేనే తక్కువ బాధుండేదేమో!” అన్నాడు తన భర్త.
పరిస్థితులతన్నంత కటువుగా మాట్లాడేటట్లు చేశాయి. ప్రాణంలా పెంచిన చెల్లిని అంతమాటన్నాడు.
కానీ తనకి మాత్రం అలా అనిపించలేదు. అలా అని రేణుక చేసిన పనిని సమర్థించే ధైర్యం లేదు.
పెళ్లయిన ఏడాదికే ఆడపడుచు రేణు భర్తనొదిలేసి పక్కపోర్షన్లో ఉండే యువకుడితో వెళ్ళిపోయింది. అందువల్ల ఎదురైన భయంకర పరిణామాలకు ప్రత్యక్ష సాక్షి తనే. అటువంటి నరకం ఎవరికీ వద్దు.
రేణుక భర్త అత్తమావలు తమని ఎన్ని మాటలన్నారో! అవన్నీ గుర్తుచేసుకుంటే ఇప్పటికీ వణికిపోతుంది తను. తల్లితండ్రీ లేనందుకు అన్నా వదినలుగా తామిద్దరే రేణూ చేసిన పనికి బాధ్యత వహించి తలవంచుకోవలసి వచ్చింది. వాళ్ళన్న మాటలకి సిగ్గిల్లిపోవలసివచ్చింది. ఆ అవమానం ఎలా మింగి తిరిగి బతుకు ప్రారంభించామో ఆ దేవుడికే తెలుసు.
ఇంట్లో కుంగిపోయిన భర్తను మామూలు మనిషిని చెయ్యడానికి తనకి సంవత్సరం పట్టింది. అప్పటికి రేణుక భర్త తన భార్య ప్రవర్తన నచ్చక తనే ఇంట్లోనుండి వెళ్ళగొట్టానని కథ అల్లి మర్యాద దక్కించుకొని మరో పెళ్ళి చేసుకున్నాడు.
అప్పుడు తన భర్త కాస్త తేరుకున్నాడు. “దాని బతుకు అది అధ్వాన్నం చేసుకోవడానికి దానికి హక్కుంది. మధ్య భర్త బతుకు బండలు చేసింది” అనుకోవడం మానేశాడు.
“అవును మగాడు! జరిగింది పీడ కలగా మర్చిపోయి కొత్త జీవితం ప్రారంభించాడు. మంచి పని చేశాడు. సుఖపడతాడు. ఎటొచ్చీ చెడింది నీ ఆడపడుచే! ఛావనీ! అది చేసిన పనికి అదే శిక్ష అనుభవించాలి. ఇప్పుడింక దాని మొగుడి ఉసురు నాకు తగలదు” అన్నాడు.
అప్పుడప్పుడూ తను “రేణూ ఎలా ఉందో! ఆ తీసుకువెళ్ళినవాడు సవ్యంగా చూస్తున్నాడో లేదో! ఎన్ని బాధలు పడుతోందో?” అని దుఃఖపడేది.
రేణూ పేరెత్తగానే భర్త తనని చచ్చేట్టు తిట్టేవాడు. అక్కడికి తనే ఆ పిల్లకి సలహా ఇచ్చి ఆ పని చేయించినట్టు అరిచేవాడు. మూడు రోజులు ముభావంగా మారిపోయేవాడు.
బహుశా చెల్లెల్ని గురించి తల్చుకోగానే ఎలా ఉందో అని అతనికీ దుఃఖం కలుగుతుండొచ్చు. దాన్ని అతడు కోపంగా ప్రదర్శిస్తున్నాడని అర్థం చేసుకుని రేణుక ప్రసక్తి తేవడం క్రమంగా మానేసింది.
పిల్లలు రేణత్త, రేణత్త అని తల్చి మర్చిపోయారు. ఇన్నేళ్ళకి ఎంత అద్భుతంగా కలిసింది. తనకి అంతరాంతరాళాల్లో రేణూ ఎక్కడో సుఖంగానే ఉందేమో అనిపించేది. అలా ఉండాలని భగవంతున్ని ప్రార్థించేది. కానీ వాస్తవ పరిస్థితులు చూస్తే అలా జరిగే అవకాశం బాగా తక్కువని ఎవరో నెత్తిన మొట్టినట్టనిపించేది.
బి.కాం ఫస్ట్‌క్లాస్‌లో పాసయ్యి ఎం.కాం.చదువుతానని పట్టుబట్టి కూర్చున్న రేణూకి బలవంతంగా పెళ్ళిచేశారు. తను పెళ్లి వద్దనేది. బాగా పైచదువులు చదువుతాననేది. “ఎక్కువ చదివితే ఎక్కువ చదివినవాణ్ణి తేవడం నాకు కష్టం. పెళ్ళయ్యాక ఇద్దరూ కలిసి ఎంతైనా చదువుకోండి” అన్నాడు భర్త.
పోనీ బాగా చదువుకుని ఉద్యోగం సంపాదించి కట్నం లేకుండా ఎవరోఒకర్ని అదే చేసుకుంటుంది అనేది తను. “నీ మొహం! సినిమాలు చూసీ, టీవీ సీరియల్స్ చూసీ ప్రపంచం మారిపోయిందనుకుంటారు మీ వదినా మరదళ్ళు. అలాంటి ఆదర్శ పెళ్ళి ఒక్కటి కూడా జరగగా నేను చూడలేదు” అని కసురుకునేవాడు తన భర్త.
చివరికి నా మొహం చూసి రేణూ ఒప్పుకుంది పెళ్లికి. పెళ్ళికొడుకు ఒక గవర్నమెంటాఫీసులో రికార్డ్ అసిస్టెంట్. ఇంటర్ ఫెయిలయ్యాడు.
“నీకు ఓపిక ఉంటే అతణ్ణి చదివించి ఆఫీసర్ని చెయ్యి. నువ్వుకూడా మని ఉద్యోగం సంపాదించుకో” అన్నాడు తన భర్త చెల్లెల్ని.
పెళ్ళి అని ఏమాత్రమూ ఉత్సాహం చూపించలేదు రేణుక. ఆ పిల్ల ఆశలరెక్కలు విరిచి ఈ పెళ్ళి చేస్తున్నం అనిపించేది. పెళ్ళికొడుకు ఓ మాదిరిగా ఉన్నాడు. అయినా రేణూ పక్కన వెలవెలబోయాడు.
పెళ్ళి అయింది. అత్తవారింటికి వెళ్ళింది. వచ్చింది. ఎక్కడా పెళ్ళికూతురి ముద్దులు మురిపాలి లేవు రేణూ దగ్గర. నవ్వడం మరిచిపోయినట్టుంది. ఏమడిగినా చెప్పలేదు.
ఒకరోజు గట్టిగా కోప్పడితే అప్పుడు చెప్పింది. అతని సర్కిల్ అంత చదువురాని వాళ్ళేనట. కొద్దిగా పేకాట, మందలవాటూ ఉన్నాయట. అతని వరసంతా చదువుకోని వాడిలాగే ఉంటుందట.
తను కంగుతింది ఆ మాటలు విని. అయినా తమాయించుకుని ఓదార్చిందామెను. “చూడు రేణూ! అతనికన్నా నువ్వు తెలివైనదానివి. చదువ్కున్నదానివి. నిజమే! కానీ అతను నీ భర్త. అతన్ని తక్కువగా భావించే ఆలోచనలు నీ మనసులోనికి రానీయకు. మెల్లిగా అతని దృష్టి చదువుపైకి మళ్ళించి డిగ్రీ చేయించు. ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుంది. ఎంతో మంది కిందస్థాయి నుండి ఎదిగి ఆఫీసర్లవుతారు. నువ్వుకూడా అలా చెయ్యొచ్చు” అని తను రేణూలో కొత్త ఆశలు నింపి కాపురానికి పంపింది.
మరో మూడునెలల తర్వాత తనూ, భర్తా రేణూని చూడడానికి వెళ్ళారు. రెండుగదుల పోర్షన్. చక్కగా ఉంది. రేణూ భర్త బాగానే మాట్లాడాడు. రేణూమాత్రం కాళ్ళు తెగ్గొట్టిన జింకపిల్లలా చూసింది మేం వచ్చేస్తుంటే. తన హృదయం కలుక్కుమంది అది చూసి.
“ఓ.కే. వదినా! నువ్వు చెప్పినట్టే ప్రయత్నిస్తున్నాను” అంది. ఆ మాటకి ఉత్సాహం వచ్చి తలనిమిరి వచ్చేశాను.
ఆరునెలల తర్వాత ఒకసారి భర్తతో కలిసివచ్చింది రేణూ. అతను ఒకరోజుండి వెళ్ళిపోయాడు. రేణుకలో పూర్వపు ఉత్సాహం లేదు. స్తబ్దుగా తయారయింది.
“ఏమంటాడే మీ ఆయన?” అడిగింది తనొక రోజు. నిట్టూర్చింది రేణుక.
“వద్దులే వదినా ఆ వివరాలు” అని మాట తప్పించబోయింది.
తనకి కోపం వచ్చింది. “అవున్లే! వదినకెందుకు చెబుతావు? తల్లికైతే చెప్పేదానివి” అంది తను నిష్టూరంగా.
“పిచ్చి వదినా! నువ్వుకాక నాకు వేరే తల్ల్లి ఉందా? చెబుతాను విను. అతనికి చదువంటే చాలా భయం. మహామొద్దు. తెలుగు పేపర్ చదవడమే కష్టం. ఆ టెంత్ ఎలా పాసయ్యాడో ఆ దేవుడికే తెలియాలి. అసలుత్తరమే రాయలేడు. అటువంటి మనిషి చేత డిగ్రీ చేయించడం ఊహకందని విషయం. అయినా ఎంతో చెప్పి చూశాను. లాభంలేదు.
నేను ఎం.కాం. చదువుతానంటే ఒప్పుకోవడంలేదు. పోనీ ఏదన్నా ఉద్యోగం చేస్తానంటే వద్దంటున్నాడు. నాకు మంచి ఉద్యోగం వచ్చేస్తే అతన్ని చిన్న చూపు చూస్తానని అనుమానం ఉన్నట్టుంది. అన్ని విధాలా నా బతుకులో చీకటే మిగిలిందొదినా!” అంది నిట్టూరుస్తూ.
“అలా అనకమ్మా చూద్దాం! రోజులన్నీ ఒక్కలాగే ఉండవుకదా. క్రమంగా అతనే మారొచ్చు” అని సముదాయించింది తను.
“లేదొదినా! అలాంటి ఆశలేదు. ఇంటి చుట్టుపక్కల ఉండే చదువు, సంధ్యాలేని ఆవారాలంతా ఈయన స్నేహితులు. వాళ్ళతో తాగుడు, పేకాట ఈయనకిష్టం. నేనిది భరించలేక పోతున్నాను. ఎంత సరి పెట్టుకుందామన్నా నా చేత కావట్లేదు.
వదినా! ఈ ప్రపంచంలో ఏ సమస్యకైనా పరిష్కారం ఉంది. కానీ ఒకసారి పెళ్ళయిన ఆడదానికి మాత్రం భర్తనుండి ఎటువంటి విముక్తీ లేదు. నా బతుకింతే! వదిలేయ్” అనేసింది రేణుక.
తను ఏం చెప్పాలో తోచక మథనపడిపోవడం గమనించి మాట మార్చింది. ఏవో నిర్జీవమైన కబుర్లు హుషారుగా చెబుతున్నట్టుగా తను నటించింది బాధను దిగమింగి. తను అలాటి నిస్సహాయ స్థితిలో ఉండగానే రెండురోజులుండి రేణుక వెళ్ళిపోయింది. అదే ఆఖరుసారి చూడడం ఆమెను. మళ్ళీ ఈ రోజే తిరిగి కలవడం.
ఆడపడుచుకి ఈడూ జోడైన భర్త దొరికితే ఎంత బావుండేదో! భగవంతుడెంత నిర్దయుడు అని తను మౌనంగా విలపించింది. ఆడపిల్లలు లేని తను రేణూయే ఆడపిల్లనుకుంది. దాని బతుకుని బండలు చేసింది మేమే అనిపించేది.
భర్త చెల్లెలి పెళ్ళి చేశాక అప్పులు తీర్చే పనిలో తలమునకలై ఉన్నాడు. అతనికీ విషయం చెప్పి బాధపెట్టడంవల్ల ప్రయోజనం ఉండదని ఊరుకుంది తను.
ఆరునెలల తర్వాత పిడుగులాంటి వార్త తెలిసింది. రేణుక పక్కపోర్షన్లో ఉంటూ లెక్చరర్‌గా పనిచేస్తున్న ఒక యువకునితో వెళ్ళిపోయిందని. మిన్నువిరిగి మీదపడినంత పైయ్యింది తమకు. తేరుకోవడానికి చాలాకాలమే పట్టింది.
ఆరు సంవత్సరాల తర్వాత ఇవ్వాళ కనబడింది. ఈ విషయం భర్తకి చెప్పి ఇద్దరూ కలిసి వెళితే రేణూ సంతోషిస్తుంది కానీ భర్త చచ్చినా రాడు. పైగా తనని కూడా వెళ్ళనివ్వడు. గప్‌చుప్‌గా వెళ్ళివచ్చేయడమే మంచిది.
రేణూ ఇప్పుడు ఎంత బావుందో! నాజూగ్గా ఆకర్షణీయంగా! పెళ్ళి అయిన రోజునుంచి ఆమె కళ్ళలో స్థిరనివాసం ఏర్పరచుకున్న దిగులిప్పుడు లేదు. ఆ కళ్ళెంతో ప్రశాంతంగా ఉన్నాయి. ఆ తీసుకెళ్ళిన కుర్రాడు ఇన్నిరోజులు ఉండి ఉంటాడా? ఉండడు. పారిపోయుంటాడు. మరి రేణూ అంత తృప్తిగా ఎలా కనబడుతోంది? బహుశా భర్తని వదిలి మరో మగాడితో వెళ్ళిపోయి అతనిచేత త్యజింపబడి జీవితంలో అన్ని లోతులూచూసి తేరుకున్నాక కలిగిన నిబ్బరం ఆమెకు ఆత్మవిశ్వాసాన్ని కలిగించిందేమో! అందుకే అంత నిశ్చింతగా ఉందేమో!
ఇక్కడే ఉంటూంటే ఇన్నాళ్ళూ కనబడకుండా ఎలా ఉండగలిగింది. ఒంటరిగా ఉంటోందేమో! ఉద్యోగం చేసుకుంటోందేమో! ఏమైనాగానీ రేణూ ఇప్పుడు చూడడానికి బంగారు బొమ్మలా ఉంది. కొత్త అందాలొచ్చినాయ్! సినిమా హీరోయిన్లా మెరిసిపోతోంది. ఎంతచూసినా తనివి తీరడంలేదు. నా దిష్టే తగులుతుందేమో కూడా! మంది దిష్టి కంటే తల్లి దిష్టి ఎక్కువంటారు. తను రేణూకి తల్లే! రేపు కల్సినపుడు దిష్టి తీసెయ్యాలి.
ఆ రాత్రి ఆలోచనలతో కామేశ్వరికి నిద్ర పట్టలేదు. మర్నాడు చెప్పిన టైంకి చెప్పిన చోటికిపోయి నిలబడింది. ఇంతలో రేణూ ఆటోలో వచ్చి వదినను ఎక్కించుకుంది.
రేణుక చేతిని తనచేతిలోకి తీసుకుని రోడ్వైపు చూస్తూండిపోయింది కామేశ్వరి. ఆ స్పర్శ ద్వారా ఎంతో ప్రేమ, ఆప్యాయత ప్రసారమయ్యాయి రేణుకకి. ఆటో ఒక పెద్ద హవుసింగ్ కాంప్లెక్స్ ముందాగింది. ఒక అపార్ట్మెంట్వైపు దారితీసింది రేణుక. ఆమెననుసరించింది కామేశ్వరి.
కాలింగ్‌బెల్ కొట్టింది రేణుక. ఒక ముప్పయ్యేళ్ళ యువకుడొచ్చి తలుపు తీశాడు. అచ్చుగుద్దినట్టు అతని పోలికలో ఉన్న బుజ్జిపాపాయి అతని వెనక నిలబడి తొంగిచూస్తోంది. సరిపడా పొడవూ, లావూతో అందంగా ఉన్న అతను కామేశ్వరిని చూసి నమస్కారం చేశాడు. ఆమెకూడా ప్రతినమస్కారం చేసింది ‘ఎవరితను?’ అనుకుంటూ. లోపలికి నడిచి ముగ్గురూ సోఫాలో కూర్చున్నారు.
“వదినా! మావారు వివేక్” పరిచయం చేసింది రేణుక. సంభ్రమంగా చూసింది కామేశ్వరి రేణుకవైపు.
“వివేక్! మా వదినమ్మ కామేశ్వరి” అందతనివైపు చూసి రేణుక. నవ్వుతూ చూశాడు తను.
ఇంతలో “మమ్మీ” అంటూ పాపాయి రేణుక ఒడిలోకి ఎక్కింది. “దీని పరిచయం అక్కర్లేదనుకుంటానొదినా! నీ మేనకోడలు తృప్తి” అంది రేణుక.
పట్టరాని ఆనందంతో కామేశ్వరి లేచి పాపాయిని బలవంతంగా లాక్కొని ఎత్తుకుని ముద్దులు పెట్టుకుంది.
“అక్కయ్యగారూ! మీవారు, పిల్లలు బావున్నారా?” స్నేహపూర్వకంగా చూస్తూ అడిగాడు వివేక్.
“ఆ! బావున్నారు” అంది కామేశ్వరి సంతోషంతో అతన్ని పరిశీలిస్తూ. ‘ఎంత హుందాగా ఉన్నాడు. ఎంత మర్యాదగా మాట్లాడుతున్నాడు! రేణూకి తగిన జోడీ’ అనుకుందామె.
అతను లేచి “రేణూ మేమిద్దరం అలా బైటికి వెళ్ళిరామా?” అనడిగాడు. రేణూ సరేనన్నట్టు తలూపింది. తృప్తి చకచకా బుజ్జి చెప్పులు తొడుక్కుని తండ్రి వెంట బయల్దేరింది. ముచ్చటగా చుసింది కామేశ్వరి.
“వదినా! నీకు మంచి కాఫీ చేస్తాను” లేవబోయింది రేణూ.
“కాఫీ తర్వాత! ముందు కథ చెప్పెయ్” అంది ఆడపడుచు చేతులు పట్టుకుని పక్కన సోఫాలో కూర్చోబెడుతూ.
రేణూ వదిననానుకుని ఆమె చేతులు తన చేతుల్లోకి తీసుకుని మొదలుపెట్టింది వాటినే చూస్తూ.
“నేను నా భర్తను ఏవిధంగానూ మార్చలేకీ నిస్సహాయస్థితిలో ఉండగా వివేక్ పక్కపోర్షన్లో అద్దెకు దిగాడు. ఒక ప్రయివేట్ కాలేజీలో లెక్చరర్‌గా పనిచేసేవాడు. తమిళియన్. మా పరిచయం మొదట స్నేహంతో మొదలయ్యింది.
మంచి స్నేహితుడిగా నాకెంతో ఊరట కలిగించాడు. క్రమంగా అది ప్రేమగా మారింది. క్షమించు వదినా! పెళ్లయిన వ్యక్తికి మరో మనిషిని ప్రేమించే హక్కుండదు. ఈ కట్టుబాట్లు మనకి తెలుసు. కానీ మనసుకు తెలీలేదు. నేను చెప్పినా అది నా మాట వినలేదు. మనసే గెలిచింది.
పెళ్ళయ్యి భర్తతో సంసారం చేస్తున్నా మానసికంగా నేను పెళ్ళికాని దానిలాగే ఉన్నాను. అందుకే నేను వివేక్ని ఒక పెళ్లికాని పిల్లలాగే ప్రేమించాను. మనసంతటితోనూ ఆరాధించాను. అతనే సర్వస్వం అనుకున్నాను. అతనూ అలాగే నన్ను ప్రేమించాడు.
రాబోయే పరిణామాలన్నీ ఆలోచించాను. సమాజంకోసం, కుటుంబ గౌరవం కోసం నా కోరికల్ని సమాధి చేసుకోవాలా? అక్కర్లేదా! అన్న విషయంపై ఎన్నో రోజులు రాత్రింబవళ్ళూ మథనపడ్డాను. తల్లిదండ్రుల్లాంటి మీ ఇద్దరికీ తలవంపులు తెస్తానని తెలుసు. అలా సంఘర్షణ పడిపడి చివరికి మీ అందరినీ బాధపెట్టయినా సరే నేను సుఖపడాలనే స్వార్థానికి తలవంచాను.
ఆ తర్వాత నా భవిష్యత్తును బేరీజు వేసుకున్నాను. ఇందులో నేను రిస్కు కూడా తీసుకున్నాను. ఒకవేళ వివేక్ నన్ను మోసం చేస్తే ఏంచెయ్యాలి? అన్నది కూడా ఆలోచించుకున్నాను. ఎట్టిపరిస్థితుల్లోనూ అలా జరిగినా కూడా భర్త దగ్గరకు కానీ పుట్టింటికి కానీ రాకూడదనీ, ఎక్కడో ఓచోట నా కాళ్ళమీద నేను నిలబడాలనే ఖచ్చితమైన నిర్ణయం తీసుకున్నాను. అందుకే ధైర్యంగా ముందుకు అడుగువేశాను వదినా! వివేక్ వెంట వెళ్ళిపోయాను.
నా అదృష్టం బావుంది. నీ ఆశీర్వాదం నా వెంట ఉంది. వివేక్ నన్ను స్వస్థలం మద్రాస్ తీసుకువెళ్ళాడు. అతని తల్లిదండ్రులు, అక్కచెల్లెళ్లు ఒక్కమాట కూడా అనలేదతన్ని. నన్ను వివేక్ ఏదో స్వయంవరంలో గెల్చుకుని తీసుకొచ్చినంత గొప్పగా ఆదరించారు. నన్నొక్క వివరం కూడా అడగనివారి సంస్కారానికి వారి పాదాలకు మొక్కాను.
అక్కడ మేం మామూలుగా శాస్త్రోక్తంగా పెళ్ళిచేసుకున్నాం. అతను అక్కడే జాబ్ సంపాదించుకున్నాడు. నేను కూడా ఎం.కాం.చేసి ఉద్యోగం చూసుకున్నాను. ఇప్పుడు పాపకు మూడేళ్ళు. ఆయన స్నేహితుడింటికి హైద్రాబాద్ వచ్చామన్నమాట. ఇది వాళ్ళిల్లే. ఇవాళ భార్యాభర్తలిద్దరూ ఆఫీసుకు వెళ్ళిపోయారు. నిన్నయితే వాళ్ళమధ్య మనిద్దరికీ ఫ్రీగా ఉండదనే నిన్నివాళ రమ్మన్నాను.
ఎలాగయినా నిన్ను కలిసి వెళ్లాలని భగవంతుణ్ణి కోరుకుంటూ ఇక్కడికి వచ్చాను. దేవుడు నాపై దయతలచి నిన్ను చూపించేశాడు. అన్నయ్య, పిల్లలులేని టైంలో నిన్నెలాగైనా పట్టుకుని చూసిగానీ వెళ్ళేదాన్ని కాదులే. వెతకబోయిన తీగలా కనబడిపోయావ్ వదినా!
ఇప్పుడు చెప్పువదినా! నీ అభిప్రాయం ఏమిటి? నేను చేసిన పనివల్ల మీ అందరికీ చెప్పలేనంత బాధ కలిగి ఉంటుంది. నేను ఒప్పుకుంటాను. కానీ, వదినా! నేను సుఖపడుతున్నాను. మనసారా తృప్తిగా జీవిస్తున్నాను. దేవుడిలాంటి భర్త నీడలో నిశ్చింతగా ఉన్నాను. నీ కడుపు చల్లగా నేను సుఖంగా ఉన్నాను.
అన్నయ్యకి మొహం చూపించే సాహసం చెయ్యలేను. చేసి అన్నయ్యను బాధపెట్టేకంటే ఇలా అజ్ఞాతంలో ఉండడం మేలని మంచిదనుకుంటున్నాను.
మరి నువ్వు ఆశీర్వదిస్తావో, తిడతావో నీ ఇష్టం. నువ్వు బంగారుతల్లి లాంటి దానిన్వి. నీ దీవెన నాక్కావాలి. తిట్టేటట్టైతే మనస్ఫూర్తిగా తిట్టు వదినా! సంతోషంగా పడతాను. ఆ తర్వాతయినా నువ్వు నన్ను దీవించాలి. అది నా కోరిక.”
ఇంతవరకూ చెప్పి వదిన ఒడిలో తల పెట్టుకుని పడుకుంది రేణుక.
రెండు నిముషాలు రాజ్యమేలింది. “నేను చేసింది తప్పంటావా వదినా?” నెమ్మదిగా అడిగింది రేణుక.
ఒక నిముషం తర్వాత కామేశ్వరి గొంతు స్థిరంగా పలికింది. “అనలేను. వ్యక్తి జీవితం వ్యవస్థను వ్యతిరేకించప్పుడు, వ్యక్తికీ, వ్యవస్థకూ ఘర్షణ ఏర్పడినప్పుడూ వ్యక్తి ధర్మాన్నే ఉత్కృష్టమైనదిగా అంగీకరించాలి. తప్పదు. ఎన్ని నీతిబోధలు విన్నా మనిషి తన సుఖం తర్వాతే సమాజం గురించి ఆలోచిస్తాడు. అది మానవ నైజం. కాదనలేని సత్యం. స్వ్యం కృషితో నువ్వు తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉన్నప్పుడు నిన్ను అభినందించి తీరతాను”
ఆ అపురూపమైన మాటలు ఇన్నేళ్ళుగా రేణుక మదిలో గడ్డకట్టి ఉన్న క్లేశాన్ని తొలగించాయి. రేణుక గుండె ఉప్పొంగి పోయింది సంతోషంతో.
రెట్టించిన ఆనందంతో కూడిన ఆత్మవిశ్వాసంతో రేణుక కామేశ్వరి చుట్టూ చేతులు వేసింది. “థాంక్యూ వదినా!” అంటూ ఆ ఒడిలో మరింతగా వొదిగిపోయింది పసిపాపలా.
https://sites.google.com/site/kathajagat/katha-jagattuloki-adugidandi/svayanvaram—alluri-gaurilaksmi
———–