| పేరు (ఆంగ్లం) | Dr. V.Chandrasekhar Rao | 
| పేరు (తెలుగు) | డా. వి.చంద్రశేఖరరావు | 
| కలం పేరు | – | 
| తల్లిపేరు | – | 
| తండ్రి పేరు | – | 
| జీవిత భాగస్వామి పేరు | – | 
| పుట్టినతేదీ | – | 
| మరణం | – | 
| పుట్టిన ఊరు | – | 
| విద్యార్హతలు | – | 
| వృత్తి | కథకుడు, నవలా రచయిత, మరియు వైద్యుడు | 
| తెలిసిన ఇతర భాషలు | – | 
| చిరునామా | – | 
| ఈ-మెయిల్ | – | 
| ఫోను | – | 
| వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – | 
| స్వీయ రచనలు | జీవని’, ‘ఎలీసా ఎలీసా’, ‘మదర్ అండ్ చైల్డ్’ | 
| ఇతర రచనలు | – | 
| ఈ-పుస్తకాల వివరాలు | – | 
| పొందిన బిరుదులు / అవార్డులు | – | 
| ఇతర వివరాలు | – | 
| స్ఫూర్తి | – | 
| నమూనా రచన శీర్షిక | – | 
| సంగ్రహ నమూనా రచన | – | 
డా. వి.చంద్రశేఖరరావు
‘‘జీవితాన్ని అధ్యయనం చెయ్యటానికి నేనెంచుకున్న ప్రక్రియ కథ. కథ నాకూ ప్రపంచానికీ మధ్య ఒక instructor లా నిలబడి నన్ను విద్యావంతుణ్ణి చేసింది. నాలోనికి తొంగి చూసుకోవటానికి అవసరమైన చూపునిచ్చింది. ఫ్రెండ్, ఫిలాసఫర్, గైడ్ అంటామే, అట్లాంటి ఆత్మీయమైన అనుభూతిలా నన్ను స్పృశించింది కథ.’’
– డా. వి. చంద్రశేఖరరావు
పై మాటలు 1994లో తన తొలి కథాసంపుటి ‘జీవని’కి స్వగతంలో చంద్రశేఖరరావు రాసుకున్న ముందు మాటలోనివి. ఆయన కథలన్నీ జీవితాన్ని అధ్యయనం చేసే క్రమంలో రూపొందినవే. నిజానికి జీవితాన్ని నిర్వచించడం చాలా కష్టం. జీవితాన్ని అన్వేషిస్తున్న, అధ్యయనం చేస్తున్న క్రమంలో సంఘటనలుగా, కలలుగా, సముద్రం లోని అలలుగా విస్తరించిన జీవిత శకలాలను ఒడిసి పట్టుకుని జీవితాన్ని నిర్వచించే ప్రయత్నం తన కథల ద్వారా చేశాడు. ఇది కూడా అంత తేలిగ్గా జరిగే పని కాదు. అనుక్షణం తనను తాను దహించుకుంటూ, పుటం పెట్టుకుంటూ ప్రయాణం సాగిస్తేతప్ప సాధ్యం కానిపని. అందుకే ఇరవై తొమ్మిది సంవత్సరాల కాలంలో కేవలం 71 కథలు మాత్రమే రాయగలిగాడు. కథ రాయటం కోసం నిద్రలేని అసహనపు రాత్రులు గడపడం నాకు తెలుసు. కథ రాయడం కోసం రచయిత ఇంతగా ఆత్మహననం చేసుకోవాలా అనిపించేది నాకు ఆయన మానసిక స్థితి చూసినప్పుడు.
2012లో వెలువడిన 20 కథల ‘ద్రోహవృక్షం’ ఆయన బ్రతికుండగా వచ్చిన ఆఖరు కథాసంపుటి. ఆయన మరణా నంతరం 2018లో మరో ఏడు కథలతో ‘ముగింపుకు ముందు’ కథాసంపుటాన్ని మిత్రులు, కుటుంబ సభ్యులు ప్రచురించారు. 2003 నుంచి 2017 వరకు అంటే 15 సంవత్సరాల కాలంలో రాసినవి 27 కథలు. ఒకరకంగా చంద్రశేఖరరావు సాహిత్య జీవితంలో అత్యంత ప్రభావ వంతమైన కాలం ఇది. మరీ ముఖ్యంగా 2012 వరకు. ఆ తరువాత ఆయన తరచూ అనారోగ్యానికి గురవుతూ వచ్చాడు. రాయటం బాగా తగ్గిపోయింది. ఈ కాలం లోనే రెండు ముఖ్యమైన నవలలు ‘ఆకుపచ్చని దేశం’, ‘నల్లమిరియం చెట్టు’ కూడా రాశారు. తను అప్పటి దాకా రాస్తున్న శైలిని తానే ఛేదించుకుని, కొత్త తరహాలో కథలు రాయటం మొదలుపెట్టిందీ ఈ కాలంలోనే. ‘జీవని’ (1994), ‘లెనిన్ప్లేస్’ (1998), ‘మాయాలాంతరు’ (2003) కథాసంపుటాలకు మధ్య కథానిర్మాణం, శైలిలో ఎంత తేడా ఉందో అదే తేడాని, వాటికీ ‘ద్రోహవృక్షం’, ‘ముగింపుకు ముందు’ సంపుటాల్లోని కథల్లో కూడా చూడవచ్చు. అంతేకాదు, అప్పటిదాకా ఉన్న వామపక్ష ఉద్యమ కథావస్తువు మారుతూ వచ్చింది.
ఆ స్థానంలో గ్లోబలైజేషన్ పరిణామాల వల్ల, అస్తిత్వవాద ఉద్యమాల వల్ల వచ్చిన మార్పులన్నిటినీ ఎప్పటికప్పుడు కథల్లోకి తర్జుమా చేసుకుంటూ వచ్చాడు. తెలుగు కథాసాహిత్యంలో ఈ పని చేసింది బహుశా చంద్రశేఖరరావు ఒక్కడే. ‘ద్రోహవృక్షం’ కథా సంపుటిలో ఉన్న కథల్లో ఇటువంటి వస్తువిస్తృతిని, దానితోపాటు శైలీ, శిల్పాల వైవిధ్యాన్ని చూడవచ్చు. అంతేకాదు, భాష విషయంలోనూ చాలా మార్పు కనబడుతుంది. తొలిసంపుటికి రాసిన ముందు మాటలో ప్రముఖ విమర్శకులు వల్లంపాటి వెంకట సుబ్బయ్య, ‘‘పాండిత్యపు బరువునే కాదు, భాష బరువును కూడా సహించలేని సాహిత్య ప్రక్రియ కథ,’’ అంటూ ఎక్కువగా ఆంగ్లపదాలు ఉపయోగించనవసరం లేదని, భాష బరువుగా ఉండనవసరం లేదని రచయితని సున్నితంగానే హెచ్చరించారు. ఈ మాటలకు చంద్రశేఖర రావు నొచ్చుకుని, ఆ క్షణానికి బాధపడినా మార్చుకోవ డానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. ఆ మార్పు ‘ద్రోహ వృక్షం’ కథాసంపుటి నుంచి స్పష్టంగా కనబడుతుంది. బరువైన భాష స్థానంలో బరువైన భావవ్యక్తీకరణ, నూతన పద చిత్రాలు చోటుచేసుకున్నాయి.
ఈ పదేళ్లకాలంలో సమాజంలో వచ్చిన ఏ చిన్న మార్పుని, సంఘటనని చంద్రశేఖరరావు వదిలిపెట్టలేదు. కొన్ని ఏకంగా కథావస్తువులయినాయి. మరికొన్ని ఆయా కథల్లో సంఘటనలుగా, భాగాలుగా అయ్యాయి. లైఫ్ అండ్ టైమ్ ఆఫ్ సత్యప్రకాశం, మోహరుతువు, ఆమె 45వ పుట్టిన రోజు, ఋతుసంహారం, హెచ్.నరసింహం ఆత్మహత్య, మినర్వా పత్రిక… ఇవన్నీ అలాంటి కోవలోని కథలే. అయితే, కొన్ని ప్రధాన విషయాలు అప్రధాన సంఘటనలుగానూ, అప్రధానమనిపించే కొన్ని విషయాలు ప్రధాన వస్తువుగా ఈ కథల్లో రూపొందాయి. ఇందుకు కారణం, రచయిత ఆ క్షణంలో ఆయా సంఘటనలకు లోనైన మానసిక ఉద్వేగపు స్థాయీభేదం కావచ్చు.
ఎప్పుడో 80ల్లో కన్నడంలో లంకేష్ ప్రారంభించిన ‘లంకేష్ పత్రిక’ అనే చిన్న పత్రిక 2000 సంవత్సరంలో లంకేష్ చనిపోయేనాటికి దాదాపు రెండు లక్షల పైచిలుకు సర్యులేషన్తో కన్నడనాట పెను సంచలనం సృష్టించింది. దళిత వర్గాలకు, వారి ఆరాటాలకు, పోరాటాలకు గుండె చప్పుడు అది. ఆ తర్వాత ఆయన కూతురు గౌరీ లంకేష్ (అవును, 2017లో సంఘ్ పరివార్ చేతుల్లో హత్యకు గురైన గౌరీనే) దాని సంపాదక బాధ్యతలు చేపట్టినప్పటి తరువాత ఒక దశలో గౌరి పై తీవ్రమైన దాడి జరిగింది. ఆనాడు గౌరిపై జరిగిన దాడిని ఏ తెలుగు వార్తాపత్రిక ప్రముఖంగా ప్రస్తావించలేదు. చిన్న వార్తగా కొన్ని వేశాయి, కొన్ని పత్రికలు అదీ లేదు. సరిగ్గా ఇక్కడే చంద్రశేఖర రావు ప్రత్యేకత కనపడుతుంది. తెలుగునేలపై అప్రధానంగా కనిపించిన ఆ సంఘటన ఆయన్ని కదిలించింది. గౌరి సునీతారాణి అయ్యింది తన ‘మినర్వా పత్రిక’ కథలో. ఆ సంఘటన కేవలం ప్రేరణే. అనేక కొత్త విషయాలను చర్చిస్తూ, చిన్న చిన్న అధ్యాయాలతో అద్భుతమైన కథగా దాన్ని రూపొందించాడు. దళిత ఉద్యమానికి సంబంధించిన అనేక విషయాలను వివిధ కోణాల నుంచి ఆ కథలో ప్రస్తావించి, చర్చించాడు.
కథ చివర మినర్వా పత్రిక సంపాదకురాలు సునీతారాణి, ఆమె కూతురు గురించి రాస్తూ, ‘‘ఆ పిల్ల, వాళ్లమ్మ, వాళ్లిద్దరూ మన ఇవాళ్టి ఆశలు కదా’’ అంటాడు రచయిత. ఇప్పుడు గౌరీ లంకేష్ని ఏకంగా చంపేశారు. మనం నోరు మెదపలేదు. ఏ రచయితా కథ రాయలేదు. ఇలాంటి సందర్భల్లోనే చంద్రశేఖరరావు పదే పదే గుర్తుకు వస్తాడు.
చంద్రశేఖరరావు కథల మీద ఒక ఆరోపణ ఉంది. ఆయన రాసే కథలు పాఠకుల కోసం రాసినవి కాదు, కేవలం విమర్శకుల నుద్దేశించి రాసినవి అని. ఇంకొంచెం ముక్కుసూటిగా మాట్లాడుకుంటే ఆయన కథలు అర్థంకావు అనేది ఆ ఆరోపణ సారాంశం. పైపైన చూస్తే ఈ ఆరోపణ సబబేననిపిస్తుంది. కానీ లోతుల్లోకి వెళ్లి చూద్దాం. తన కథలు ఖచ్చితంగా భిన్నమైనవే. మామూలు వార, మాస పత్రికల్లో అచ్చయ్యే కథలున్నంత తేలికగా, పలచగా ఉండవు. అదే సందర్భంలో పరిణతి చెందిన పాఠకులకు జిజ్ఞాసను, అవగాహనను కలిగించే కథలు. హృదయాన్ని తాకి, జీవితాంతం వెంటాడే కథలు కావాలనుకుని పాఠకుల కోసం రాసిన కథలవి. అంతేకాదు, కథ రాయడంలో రచయితకి బాధ్యత ఉన్నట్లే, చదివే పాఠకుడికి కూడా ఒక బాధ్యత ఉంటుంది అనిపించే కథలవి. పాఠకుల జ్ఞానతృష్ణకు పని కల్పించే కథలు. అయినా, ఆయన కథల్లో అస్పష్టత ఉంటే ఉండి ఉండవచ్చు.
రిత్విక్ ఘటక్ (చంద్రశేఖర రావుకి ఇష్టమైన బెంగాలీ దర్శకుడు. తన కొడుక్కి ఆ పేరే పెట్టుకున్నాడు.) ఒక సినిమా చివర్లో ఫిలిం తగలబడుతున్న శబ్దంతో పాటు మంటల దృశ్యంతో సినిమా ముగుస్తుంది. దానిమీద అనేక వ్యాఖ్యానాలు, చర్చలు, ఆలోచనలు ముందుకొచ్చాయి. ఒక రకంగా చంద్రశేఖరరావు కథలూ అంతే. చర్చించగలగాలే కాని కథ ప్రారంభ, ముగింపులే కాదు కథలోని ప్రతి సన్నివేశానికి ఒక ఓపెన్ ఎండ్ ఉంటుంది. కథ చదివాక రచయితలోంచి ఒక ఎంపతీ లాంటిదేదో పాఠకుడిలోకి ప్రసారమవుతుంది. తరచి చూస్తే అర్థంకానిదేదీ ఉండదు.
చంద్రశేఖరరావు విమర్శకుల కోసం రాశాడు అన్నది ఎంత సత్యదూరమో, అలా తప్పుకునే పాఠకుల కోసం కూడా రాయలేదు అనేది అంతే సత్యం. అందుకే అతని కొన్ని కథల్ని వస్తువు, శైలీ, శిల్పం అంటూ వింగడించి చర్చించడం సాధ్యంకాదు. కొన్ని కథల్లో సంఘటనలే శిల్పమూ, వస్తువూ కూడా (మినర్వాపత్రిక, ఆదివారం, నిద్ర, అతను అతనిలాంటి మరొకడు, ముగింపుకు ముందు లాంటి కథలు). కొన్ని కథల్లో పాత్రలు, వాటి ఆలోచనలు, అవి కన్న కలలు, వాటి కన్ఫెషన్స్ లాంటివే వస్తువు (మోహరుతువు, ఋతుసంహారం, లైఫ్ అండ్ టైమ్స్ ఆఫ్ సత్యప్రకాశం వంటి కథలు).
క్రానికల్స్ ఆఫ్ లవ్, జనవరి నెల ప్రేమ, ద్రోహవృక్షం, నేను-పి.వి.శివం వంటి కథల్లో కొంతవరకూ స్పష్టాస్పష్టంగానైనా వస్తువు ఇదీ అని చెప్పవచ్చు. ఈ కథల్లో కూడా కథను చెప్పిన ప్రత్యేక పద్థతే శిల్పంగా రూపొందాయి. ఆ మాటకొస్తే ఇది చంద్రశేఖర రావు మార్కు కథ అనిపిం చేటట్టుగా తన ముద్రను కథల్లో వేసిన ప్రత్యేక కథకుడు చంద్రశేఖరరావు. ఆ శైలిలో భాగంగానే పాత్రలు కూడా మళ్లీ మళ్లీ అవే వస్తుంటాయి. మోహనసుందరం, పూర్ణ మాణిక్యం, మోహన, శంకరం, మాలతి, సునీత- అన్ని కథల్లో దాదాపు ఇవే పాత్రలు. ఆ పాత్రను రూపుదిద్దిన పద్ధతుల వల్ల, చేసిన వర్ణనల వల్ల వాటిల్లో సమకాలీన రాజకీయ వ్యక్తులు లేదా సామాజిక ఉద్యమకారులు పాఠకులకు స్ఫురించే అవకాశం ఉంది. అయితే, సామాజిక ఉద్యమాల్లోని అనేక మంది వ్యక్తుల ఛాయలు ప్రతి పాత్రలోనూ కనబడతాయి.
నిజానికి ఆ పాత్ర ఒక వ్యక్తి కాదు. ఈ సమాజంలో ఒకనొక కాలంలో ఉద్యమాల మధ్య నిలబడిన అనేకమంది వ్యక్తుల, వ్యక్తిత్వాల సమాహారం. ఉద్యమాలలోని వ్యక్తుల, నాయకుల బలాలు, బలహీనతలు, రాగద్వేషాలు, దిగజారిన తత్వాలు అన్నీ పెనవేసుకుని ఉంటాయి ఆయా పాత్రల్లో. అందుకే కథలోని ఒకే పాత్రతో పాఠకులు ఒక దశలో ఆదర్శవంతంగా ప్రయాణం చేస్తారు, మరో దశలో ఈసడించు కుంటారు కూడా. అతను, అతనిలాంటి మరొకడు వంటి కథల్లో ఈ విషయం కొంత స్పష్టంగా తెలుస్తుంది. ఇంతకీ ఈ గొడవంతా అతని పురుష పాత్రలతోనే. ఎన్ని వైరుధ్యా లున్నా ఏ కథలోనూ స్త్రీ పాత్రలు దారితప్పినవి కాదు. తప్పినా కన్ఫెషన్ ఉంటుంది. అందుకే మోహిని, పూర్ణమాణిక్యం, మాలతి వంటి పాత్రల్లో ఎక్కడా ప్రతికూల ఛాయలు అంతగా కనబడవు. చంద్రశేఖరరావు కథల్లోని స్త్రీ పాత్రలన్నీ ఆదర్శమూర్తులే, మార్గనిర్దేశకులే, దీపధారులే!
చంద్రశేఖరరావు తన కథాపాత్రల గురించి తానే ఒకచోట, ‘‘నేనే మోహనసుందరాన్ని, నేనే లలితను, నేనే మోహినిని. ఆ పాత్రల గుండెల్లోని ట్ఛట్ఛుఽ్టఝ్ఛుఽ్ట నేనే జిౌట్టజీజూజ్టీడని నేనే. తన శరీరంపై తానే గాయాలు చేసుకుంటున్న కాలం నేనే. నా కథల్లోని ప్రొటాగనిస్టులు నా లోపలి రిప్రెషన్ నుంచి, సందేహాల నుంచి, కోట్లాది భయాల నుంచి, చిటికెడంత ఆశ నుంచి, పుట్టుకొచ్చిన వాళ్లే,’’ అని చెప్పుకున్నాడు.
1988లో డ్యూటీ కథతో ప్రారంభించిన కథారచన 2017లో ఆంధ్రప్రదేశ్ మాసపత్రికలో అచ్చయిన పూర్ణ మాణిక్యం ప్రేమకథలుతో ఆగి పోయింది. ఇదే అచ్చయిన ఆయన ఆఖరికథ. ఇవికాక ఎన్నో రాయాలనుకున్న కథలు, మరెన్నో కథా శకలాలు ఆయన డైరీల నిండా పరుచుకుని ఉన్నాయి. బతికుంటే మరో 70 కథలు వచ్చేవి కదా!
ఒక్క మాటలో చెప్పా లంటే సమకాలీనంలో బ్రతు కుతూ, భవిష్యత్తులోని వస్తువుతో మానవక్షోభను, ఆవేశాన్ని ప్రతి బింబిస్తూ వర్తమానంలో రాయటం అంత తేలికైన పనికాదు. సమాజాన్ని, చరిత్రను, చరిత్రగతిని సీరియస్గా తీసుకుని రాసిన చంద్రశేఖరరావు కథల గురించి తెలుగు సాహిత్య లోకం చర్చించాల్సినంతగా చర్చించకపోవడం, అర్థంకాని కథలనే వ్యాఖ్యల మాటున దాక్కోవడం తెలుగు కథకు జరిగిన నష్టంగానే భావించాలి.
చంద్రశేఖరరావు కథలు ఖచ్చితంగా భిన్నమైనవే. మామూలు వార, మాసపత్రికల్లో అచ్చయ్యే కథలున్నంత తేలికగా, పలచగా ఉండవు. అదే సందర్భంలో పరిణతి చెందిన పాఠకులకు జిజ్ఞాసను, అవగాహనను కలిగించే కథలు. హృదయాన్ని తాకి, జీవితాంతం వెంటాడే కథలు కావాలనుకుని పాఠకుల కోసం రాసిన కథలవి. అంతేకాదు, కథ రాయడంలో రచయితకి బాధ్యత ఉన్నట్లే, చదివే పాఠకుడికి కూడా ఒక బాధ్యత ఉంటుంది అనిపించే కథలవి. పాఠకుల జ్ఞానతృష్ణకు పని కల్పించే కథలు.
జీవితాన్ని అన్వేషిస్తున్న, అధ్యయనం చేస్తున్న క్రమంలో సంఘటనలుగా, కలలుగా, సముద్రంలోని అలలుగా విస్తరించిన జీవిత శకలాలను ఒడిసిపట్టుకుని జీవితాన్ని నిర్వచించే ప్రయత్నం తన కథల ద్వారా చేశాడు చంద్రశేఖరరావు. ఇది అనుక్షణం తనను తాను దహించుకుంటూ, పుటం పెట్టుకుంటూ ప్రయాణం సాగిస్తే తప్ప సాధ్యం కాని పని. అందుకే ఇరవై తొమ్మిది సంవత్సరాల కాలంలో కేవలం 71 కథలు మాత్రమే రాయగలిగాడు. కథ రాయటం కోసం నిద్రలేని అసహనపు రాత్రులు గడపడం నాకు తెలుసు.
-వాసిరెడ్డి నవీన్
https://m.andhrajyothy.com/telugunews/abnarchievestorys-754026
———–
 
					 
																								 
																								