పేరు (ఆంగ్లం) | Bhusurpalli Venkateswarlu |
పేరు (తెలుగు) | భూసురపల్లి వెంకటేశ్వర్లు |
కలం పేరు | – |
తల్లిపేరు | సుబ్బరత్నమ్మ |
తండ్రి పేరు | భూసురపల్లి వెంకటేశ్వర్లు ఆదిశేషయ్య |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | 11/04/1955 |
మరణం | – |
పుట్టిన ఊరు | ప్రకాశం జిల్లా |
విద్యార్హతలు | ఎం.ఎ. (తెలుగు) |
వృత్తి | ఉపాధ్యాయుడు |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | తెలుగు సాహిత్య రూపకాలు( పిహెచ్.డి.కోసం చేసిన పరిశోధన). ఆంధ్రప్రదేశ్ నాదస్వర డోలు కళాకారుల చరిత్ర-1986 దేవులపల్లి కృష్ణశాస్త్రి ఒక అనుభవం నుంచి -2003 నేతాజి (నవల)(ఒరిస్సాలో ఉపవాచకంగా 1986లో ఉంది). త్యాగరాజు(చారిత్రక నవల) |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | https://archive.org/details/in.ernet.dli.2015.386161/mode/2up |
పొందిన బిరుదులు / అవార్డులు | కీర్తి పురస్కారం |
ఇతర వివరాలు | – |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | తెలుగువారి మంగళవాద్య కళావైభవం |
సంగ్రహ నమూనా రచన | జానపదంలో పుట్టి జనసామాన్యంలో పెరిగి సంస్కృతిలో భాగమై విరాజిల్లిన ప్రజాకళ మంగళవాద్యం. భారతీయ వైవాహిక వ్యవస్థలోనూ, ఆరాధనా విధానంలోనూ, ఉత్సవ సంప్రదాయాల్లోనూ మంగళప్రదమై వినిపించే మహోన్నత వాద్యసంగీతం ఈ మంగళవాద్య సంగీతం. |
భూసురపల్లి వెంకటేశ్వర్లు
జానపదంలో పుట్టి జనసామాన్యంలో పెరిగి సంస్కృతిలో భాగమై విరాజిల్లిన ప్రజాకళ మంగళవాద్యం. భారతీయ వైవాహిక వ్యవస్థలోనూ, ఆరాధనా విధానంలోనూ, ఉత్సవ సంప్రదాయాల్లోనూ మంగళప్రదమై వినిపించే మహోన్నత వాద్యసంగీతం ఈ మంగళవాద్య సంగీతం. అందునా దక్షిణాదిన ఏఇంట ఏశుభం జరిగినా మొదట వినిపించేది మంగళవాద్యమే. ఈ కళలో నాదస్వరం ప్రధానవాద్యం. అందులో పలికే కృతులకు అనుకూలంగా వినిపించే లయవాద్యం డోలు. రెండు నాదస్వరాలు రెండు డోళ్ళు ఒక శృతి, ఒక తాళం కలిసి ఒక మంగళవాద్య బృందంగా (మేళం) ఏర్పడుతుంది. ఈ బృందం సమష్టి ఆలాపన నుంచి భారతీయ సంస్కృతే మేలుకుందంటే అతిశయోక్తి కాదు.
ఒకనాడు జానపదంలో ఆచార వ్యవహారాలకు సంప్రదాయ సంస్కారాలకు గుర్తుగా నిలిచిన మంగళవాద్యం హరికథ వంటి కళల్లాగే క్రమంగా సంప్రదాయ సంగీతం వైపు ప్రయాణించింది. పరిణామక్రమంలో ఆ ప్రయాణం భాగమే అవుతుంది. క్రమంగా దైవదత్తమైన సంగీత ప్రక్రియగా రూపుదిద్దుకొంది. అంతేగాదు ప్రధాన కర్ణాటక సంగీత విధానంగా తన స్థానాన్ని పదిలపర్చుకొంది. డోలువాద్యంతో ప్రారంభమయ్యే నాదస్వర సభలో మొదట తోం తోం తోం అని వినిపిస్తే అందు పరమేశ్వరుని ఢమరుక విన్యాసంలో పలికే ఓంకారం ధ్వనిస్తుంది. హిందూ ధర్మంలో ఓంకారం శుభసూచకం. సృష్టికి మూలం. అనాహత జన్యం.
ఓంకారంచ పరబ్రహ్మం యావదోంకార సంభవ:
నాదము, స్వరము అనే రెండు సంగీత ప్రధానాంగాలను పేరులోనే నిలుపుకుందంటే వాద్యం సంగీత ప్రపంచంలో ఎంత గౌరవస్థానంలో నిలిచియున్నదో గమనించవచ్చు. అంతేగాక నాదోపాసనలో మిగిలిన తంత్రీ, సుషిర, ఘన వాద్యాలకన్నా ఉన్నత ప్రమాణాలు కలిగి ఉన్నది. మిగిలిన వాద్యాల కన్నా నాదపోషణ విషయంలో ఎక్కువ సాధన అవసరమైంది కూడా.
నాదస్వర వాద్యం గొప్ప యోగసాధనం కూడ. ఊర్ధ్వ ముఖంగా ప్రాణవాయువును ప్రేరేపించి నాదాన్ని పూరించడంలోనూ వినడంలోనూ పొందగలుగు సౌభాగ్యం.
నకారం ప్రాణనామానం దకార మనలం విదుః
జాతః ప్రాణాగ్ని సంయోగాత్తేన నాదోభి ధీయతే ॥
హైందవంలో త్రిమూర్తుల్ని నాద స్వరూపులుగా భావించారు.
నాదోపాసయా దేవా బ్రహ్మ విష్ణు మహేశ్వరాః
త్యాగరాజస్వామి నాదమే శ్రీరామచంద్రుడై ఉద్భవించిందని చెప్పాడు.
నాదసుధారసం బిలను నరాకృతాయెరా మనసా
అన్నాడు. ఇంత పవిత్ర స్థితి సమకూరింది కనుకనే ఈ వాద్యం రాజవాద్యంగా చెలామణీ అయింది.
ఆంధ్ర దేశంలో నాదస్వరానికి సన్నాయి అనే పేరుండడం అందరికీ తెలిసిందే! ఇది పారశీక పేరు. అందులో నాదస్వరాన్ని పోలిన నయీ-యీ-షా (రాజవేణువు) అనే వాద్యం ఉండేది. అది పోను పోను పద వ్యత్యయంలో షా-యీ-నయీగా మారి కాలక్రమేణా షహ్‌నాయీ – సన్నాయిగా మారింది.
అలాగే నాదస్వరానికి ప్రక్కవాద్యం డోలు ఢమరుకం నుంచి వచ్చినట్లు తెలుస్తుంది. దీన్ని తమిళ ప్రాంతంలో తవిల్ అంటారు. మన పూర్వీకులు శృంగభేరి, డిండిమ వాద్యమనీ పిలిచినట్లు పూర్వ సంగీత లక్షణగ్రంథాలు చెబుతున్నాయి.
నాదస్వరం పాము ఆకారంలో పొడవుగా ఉండి చివర గిన్నె కలిగి రెల్లు ఆకుతో చేసిన పీక ద్వారా వాయించడం జరుగుతుంది. గొట్టంవంటి పొడవైన భాగంలో ఉన్న సప్తరంధ్రాల ద్వారా నాదానికి సప్తస్వర స్వరూపం ఏర్పడుతుంది. రెండు నాదస్వరాలు కలిపి వాయించడంలో నాద విరామంలేక శృతి శుభగమై మరింత మాధుర్యాన్నిస్తుంది.
డోలువాద్యం రెండు వైపులా చర్మంతో మూయబడి ఒకవైపు చేతితోను, మరోవైపు అడుగు పొడవున్న కర్రపుల్లతోను ప్రయోగించబడుతుంది. అమేయమైన ద్రుతకాల తిరుగుడు వరుసలు పలికించగల, గంభీరమైన నాదాన్ని వినిపించగల మహావిద్వాంసులు ఎందరో ఈ వాద్యాన్ని స్వీకరించి ప్రయోగించి ప్రపంచానికి ఆనందం పంచుతున్నారు.
నాదస్వర సంగీతంలో ప్రధానాంశం సుదీర్ఘ రాగాలాపన. అలాగే విస్తారమైన స్వర ప్రస్తారం. రెండు నాదస్వరాలు పంచుకొని అనేక గతుల్లో స్వర ప్రస్తారం చేస్తుంటే పరవశించని రసిక హృదయం ఉండదు. జంట నాదస్వరాల్లో కీర్తన కూడా మాధుర్యవంతమౌతుంది. ప్రవాహంగా సాగిపోయే రాగాలాపన నాదస్వరంలో సాగినంతగా మరే వాద్యంలో సాగదంటే అతిశయోక్తి కాదు.
అలాగే డోలు వాద్యంలో కూడ విస్తారమైన గణన సామర్థ్యం పెరిగింది. మిగిలిన సంగీతసభల్లో మృదంగం ఒక్కటే ఉంటుంది. ఘటం, కంజీర వంటి ఉపవాద్యాలున్నా అవి సహవాద్యాలే కాని సమ వాద్యాలు కాదు. కాని నాదస్వర సభలో రెండు డోళ్ళుంటాయి. అందువల్ల ఆ ఇద్దరు వాద్యకారుల మధ్య కాంబినేషన్‌తో పాటు కాంపిటీషన్ కూడ పెరగడంతో మిగిలిన అన్ని చర్మ వాద్యాల కంటే డోలులో వాద్యం విస్తారంగా పెరిగింది.
మొత్తంమీద డోలు నాదస్వర సమ్మేళనంతో దేవాలయాలే పండి పునీతమైనాయి. హిందువుల ఇంట పసుపుకొమ్ము విరిస్తేచాలు మంగళవాద్యం మ్రోగవలసిందే.
ఇక తెలుగునాట వెలసిన మంగళవాద్య కళాకారుల్ని ఆయా పీఠాల్ని పరిచయం చేసేముందు నాదస్వర కళలో అగ్రస్థానంలో నుండి తెలుగు కళాకారులకు మార్గగాములైన తమిళదేశ నాదస్వర ప్రస్థానాన్ని రేఖామాత్రంగా చెబుతాను.
దాదాపు ఒక వెయ్యి సంవత్సరాలుగా ఈ వాద్యాలు ప్రముఖ స్థానంలో ఉన్నట్లు చెప్పవచ్చు. అంతకుముందు ఉన్నా తగిన ఆధారాలు లభించడం లేదు. శిలప్పడిగారం, మణిమేఖలై వంటి గ్రంథాల్లోగాని, తెలుగులో శ్రీ మదాంధ్ర మహాభారతంలోగాని మంగళతూర్యరావము అనేమాట తప్ప అందులో ఫలానా వాద్యాలని ఎక్కడా చెప్పలేదు. తెలుగులో వల్లభరాయుడు నాదస్వర పదప్రయోగం చేశాడు. తమిళనాడులో కూడ సంగం కాలంలోగాని తరువాత గాని వాద్యాల పేర్లు కనబడవు. దాదాపు 15వ శతాబ్దం నుంచి దక్షిణాది అంతటా కనిపిస్తున్నాయి.
నాదస్వర సంగీతానికి తంజావూరు జిల్లా పెట్టింది పేరు. కావేరి ప్రాంతంలో వందలాది కుటుంబాలు మంగళవాద్యాన్ని వృత్తిగా స్వీకరించాయి. తంజావూరు, తిరువావడదురై, నాబియార్ కోయిల్, మన్నార్గుడి, నీడామంగళం, కుంభకోణం, మధురై, సేలం, కోయంబత్తూర్ వంటి గ్రామాలు నాదస్వర డోలు వాద్య నిలయాలుగా వెలిశాయి. మధురై పొన్నుస్వామి పిళ్ళై, తిరువాడదురై రాజరత్నం పిళ్ళై, తిరువెంగాడు సుబ్రహ్మణ్య పిళ్ళై, కారైకురిచ్చ అరుణాచలం, తిరువిడ మరుదూర్ వీరుస్వామి, నామగిరి పేటై కృష్ణన్, పద్మశ్రీ తిరువిళమళై సుబ్రహ్మణ్య పిళ్ళై సోదరులు నాదస్వర వాద్యంలో గొప్పవారు. అలాగే డోలు వాద్యంలో నీడామంగళం మీనాక్షిసుందరం పిళ్ళై, ఇల్లిపురం పంచాపకేశ పిళ్ళై, నాబియార్ కోయిల్ రాఘవన్, నీడామంగళం షణ్ముఖ వడివేల్, ఏళ్పాణం దక్షిణామూర్తి, వలంగైమాన్ షణ్ముఖ సుందరం పిళ్ళై, వలైపట్టి సుబ్రహ్మణ్యం, పద్మశ్రీ హరిద్వార మంగళం, పళనివేలు గొప్పవారు. ఒకవిధంగా తెలుగునాట వెలసిన అందరు నాదస్వర డోలు కళాకారుల మీద ఈ విద్వాంసుల ప్రభావం ఎంతో కనిపిస్తుంది.
తెలుగునాట దాదాపు 1900 సం॥ ప్రాంతం నుంచి చిలకలూరిపేట సంస్థానంలో నాదస్వర విద్వాంసులున్నట్లు తెలుస్తుంది. వారి సంతతికి చెందిన నాదబ్రహ్మ షేక్ చిన పీరు సాహెబ్ చాలా గొప్పవారు. నాదస్వరం మీద వీణ తంత్రులు మీటినట్లు మాధుర్యభరితమైన నాద విన్యాసం వీరి ప్రత్యేకత. ఇంకా వీరి కుటుంబంలో ఆదంసాహెబ్ ప్రసిద్ధుడు. అలాగే తమిళదేశ సంప్రదాయాన్ని తెలుగునాట నెలకొల్పిన మహావిద్వాంసుడు గుంటూరు నాగయ్యగారు. వీరి గురువు తిరువళ్ళూర్ రామదాసు. వీరి సంప్రదాయంలో తిరువళ్ళూరు సుబ్రహ్మణ్యం, యతిరాజులు సోదరులు, యనమదల గళ్ళా వెంకటస్వామి, బెజవాడ నారాయణ మొదలగువారు ప్రసిద్ధులు. గుంటూరువారి సంప్రదాయంలో కీర్తన భావయుక్తంగా పరిమళించింది. నాగయ్యగారి గొప్పతనంతో గుంటూరు మరో తంజావూరుగా వెలిగింది.
తెలుగునాట నాదస్వర సంగీతంలో మరో ముఖ్య క్షేత్రం బందరు. నాదస్వర చతుర్ముఖుడుగా ప్రసిద్ధి పొందిన గానకళాప్రపూర్ణ దాలిపర్తి పిచ్చ హరిగారు బందరు వాస్తవ్యులు. మైసూర్ రాజాస్థానంలో అర్ధ సింహాసన గౌరవాన్ని పొందిన మహా విద్వాంసుడు శ్రీ పిచ్చ హరిగారు. రాగం తానం పల్లవి వారి సంప్రదాయంలో మహోన్నతంగా సాగాయి. వారి సోదరులు సూర్యనారాయణ, డా॥ దోమాడ చిట్టి అబ్బాయి మొదలగు గొప్పవారెందరో ఆ సంప్రదాయానికి చెందినవారు.
ఇంకా నాదస్వర వాద్యంలో గాడివిల్లి పైడిస్వామి, శిరిపురం పాపన్న, కాకుమాను రామచంద్రయ్య, గుడివాడ రాఘవులు, కొమ్మూరు పెంటుసాహెబ్, కుంకలగుంట సైదులు సాహెబ్, దెందులూరు నాగయ్య, కంచర్ల సుబ్బనారాయణ, అవిలేలి వెంకయ్య, కస్మూర్ సుబ్బన్న మొదలగువారు ప్రసిద్ధులు.
తెలుగునాట కరవది గ్రామంలో పుట్టి యావద్భారత దేశంలో మొదటివాడుగా నిలిచిన నాదస్వర చక్రవర్తి పద్మశ్రీ డాక్టర్ షేక్చిన్న మౌలానా చిలకలూరిపేట నాదస్వర సంగీత సంప్రదాయానికి చెందినవారు. ఆ పిదప వచ్చిన వారిలో షేక్ మహబూబ్ సుభానీ, కాలీషాబీ దంపతులు తిరిగి ఈనాడు దేశంలోనే ప్రథమస్థానంలో నిలిచారు. ఇంకా ఒంగోలు రంగయ్య, కనుపర్తి సోదరులు, యల్లమంద వెంకటేశ్వర్లు, ఖాసిం బాబులు సోదరులు, కుంకలగుంట లాల్‌సాహెబ్, గోసవీడు హస్సన్ మొదలైన ఎందరో లబ్ధప్రతిష్ఠులున్నారు.
ఇక డోలువాద్యానికొస్తే పెనుగుదురుపాడు అంకమ్మ, మోదుకూరి బాలకోటయ్య, కుంటుపల్లి గురవయ్య, పారెళ్ళ అమ్మిశెట్టి, తురుమెళ్ళ సుబ్బరాయుడు మొదటితరం విద్వాంసులు. తరువాత తంజావూరు బాణీతో పరిమళించిన డోలు విద్వాంసుల్లో అన్నవరపు బసవయ్య, ఈమని రాఘవయ్య, ముట్లూరు తిరుపతి స్వామి, ఉప్పలపాటి అంకయ్య, అన్నవరపు గోపాలం, వెల్లటూరి నారాయణ ముఖ్యులు.
ఆంధ్రదేశంలో వివిధ లయలు, గతులు చూపించిన డోలు విద్వాంసులు తిరుపతి మునిరామయ్య. అనంతరం వచ్చినవారిలో లయబ్రహ్మ భూసురపల్లి ఆదిశేషయ్య, నిడమానూరి లక్ష్మీనారాయణ, విజయవాడ కన్నారావు, తిరుపతి రాజగోపాలు, మున్నంగి వెంకటేశ్వర్లు, తరిగొపుల నారాయణ, డా॥ భూసురపల్లి వెంకటేశ్వర్లు మొదలగువారు ముందు నిలిచినవారు.
పైన పేర్కొన్న ప్రముఖులందరి కుటుంబాలూ తరతరాలుగా ఈ కళ నాశ్రయించి బ్రతుకుతున్నవే. కాని ఈనాడు విదేశీ వాద్యాల హోరులో శ్రావ్యమైన నాదస్వర డోలు వాద్యాలు కొన ఊపిరితో బ్రతుకుతున్నాయి. ఆ విద్యనే ఆశ్రయించి అభ్యసించిన యువ కళాకారుల జీవనం ప్రశ్నార్థకంగా మారింది. ప్రభుత్వం, సాంస్కృతిక శాఖ, సాంస్కృతిక సంస్థలు ఈ మంగళ కళాకారుల పోషణ నొక కంట కనిపెట్టి ఉద్ధరించవలసిన రోజులొచ్చాయి. ఆ దిశగా నా ఈ విన్నపాన్ని మన్నింతురని భావిస్తున్నాను.
———–