పేరు (ఆంగ్లం) | Alluri Bairagi |
పేరు (తెలుగు) | ఆలూరి బైరాగి |
కలం పేరు | – |
తల్లిపేరు | సరస్వతి |
తండ్రి పేరు | ఆలూరి వెంకట్రాయుడు |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | 11/05/1925 |
మరణం | – |
పుట్టిన ఊరు | తెనాలి |
విద్యార్హతలు | – |
వృత్తి | ప్రముఖ తెలుగు కవి, కథా రచయిత, గుంటూరు జిల్లా ప్రత్తిపాడు హైస్కూల్లో హిందీ ఉపాధ్యాయుడు |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | చీకటి నీడలు ఆగమ గీతి (కేంద్ర సాహిత్య ఆకాడెమీ పురస్కారం) నూతిలో గొంతుకలు దివ్య భవనం (కథలు) |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు |
ఇతర వివరాలు | – |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | చీకటి నీడలు! |
సంగ్రహ నమూనా రచన | నీడలు! నీడలు! చీకటి నీడలు! గాలిమేడలకు ఎగిరే గోడలు! అమావాస్య, చిక్కని చీకటిలో చలిచీమల్లా ముసిరే నీడలు! |
ఆలూరి బైరాగి
నీడలు! నీడలు! చీకటి నీడలు!
గాలిమేడలకు ఎగిరే గోడలు!
అమావాస్య, చిక్కని చీకటిలో
చలిచీమల్లా ముసిరే నీడలు!
నీడలు! నీడలు! ఊళ్ళూ, ఇళ్ళూ
పేదలగూళ్ళూ, కుబేరులమేడలు!
ఆకాశంలో మబ్బులనీడలు!
భూమిపైన ప్రారబ్ధపునీడలు!
కునుకుకనులలో నిద్దురనీడలు!
అచేతనంలో అద్దపునీడలు!
ప్రేమలనీడలు! ద్వేషపునీడలు!
శాంతపునీడలు! రోషపునీడలు!
కదిలేనీడలు! కదలనినీడలు!
తెలిసేజాడలు! తెలియనిజాడలు!
రంగులనీడలు! తావులనీడలు!
తెల్లకాగితపు టావులనీడలు!
గడచినకాలపు చారల నీడలు!
గడిచేకాలపు భారపు నీడలు!
గడువనికాలపు దూరపు నీడలు!
కాలసముద్రపు తీరపునీడలు!
అంతులేని బ్రహ్మాండపుతెరపై
దేశకాలముల మార్పులనీడలు!
విరహప్రణయములు, సృష్టిప్రళయములు
ఏడ్పులపై ఓదార్పుల నీడలు!
పురిటిపాప చిరునగవు పెదిమపై
పాకేచావుల పురుగుల నీడలు!
ప్రొద్దుటిపూటల లే ఎండలపై
మబ్బులచీకటి చెరగులనీడలు!
జీవితసీమ, నీలికొండలపై
ఎండలనీడల దాగుడుమూతలు!
పూలజల్లులా చిరుకన్నీరులు!
వెలుగుకుంచతో బంగరుపూతలు!
మానవజీవిత కాళరాత్రిలో
ప్రేమచితాగ్నుల ఎర్రనినీడలు!
నైరాశ్యపు చిక్కని చీకటిలో
అక అస్పష్టపు కదలిక జాడలు!
రివ్వున దూసుకపోయే నీడలు!
నీడలనే వెన్నాడే నీడలు!
చీకటి మూలల ఏకాంతంలో
ఎందులకో వెదుకాడే నీడలు!
గాలిలోన మృతకాత్మల నీడలు!
నేలపైన కృతకాత్మల నీడలు!
ఆశయాల ఆకాశపు నీడలు!
వాస్తవాల యమపాశపు నీడలు!
నీడల యుద్ధం, యుద్ధపు నీడలు!
కర్తవ్యాల విరుద్ధపునీడలు!
నిశ్చల విశ్వాసపు నీడల్లో,
సంశయాల కదులాడే నీడలు!
ఉత్సాహపు ఉరికే నీడల్లో
అనుమానపు వెనుకాడే నీడలు!
చావు పుట్టుకల కొండలోయలో
బ్రతుకుల దోబూచులాడే నీడలు!
నీడలు; నీడలజగత్తు
మానవులంతా సుఖదుఃఖాల
కోల్పోయిన అడుగులజాడలు!
వెదుకుతున్న నల్లని నీడలు!
ఘోరనిశీథపు చీరచెరగులో
మూగరహస్యపు నీలిముసుగులో
త్వరత్వరగా ముందుకు అడుగిడుతూ
తడబడుతూ మరిమరి పొరబడుతూ
పోతున్నారా? లేస్తూ పడుతూ
నీడలు వారల మిగిలినజాడలు!
నీడలు! నీడలు! చీకటినీడలు!
———–