పేరు (ఆంగ్లం) | Devipriya |
పేరు (తెలుగు) | దేవిప్రియ |
కలం పేరు | – |
తల్లిపేరు | షేక్ ఇమాం బీ |
తండ్రి పేరు | షేక్ హుస్సేన్ సాహెబ్ |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | 1949 ఆగస్టు 15 |
మరణం | 2020 నవంబరు 21 |
పుట్టిన ఊరు | గుంటూరు, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ |
విద్యార్హతలు | – |
వృత్తి | రచయిత |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | గాలిరంగు,రన్నింగ్ కామెంటరీ,అరణ్యపురాణం,దేవిప్రియ సంపాదకీయాలు – “అధ్యక్షా మన్నించండి” |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | http://kinige.com/author/Devipriya |
పొందిన బిరుదులు / అవార్డులు | సాహిత్య అకాడమీ అవార్డు |
ఇతర వివరాలు | – |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | అరణ్యపురాణం |
సంగ్రహ నమూనా రచన | కవిత్వమంటే పందిరిమీదికి ద్రాక్షతీగని పాకించడం, పద్మవ్యూహంలోంచి బయటపడే ప్రయత్నం చేయడం, నీటిలోకి నిటారుగా దిగిన కత్తిలా నిశ్శబ్దంగా చీల్చుకుపోవడం, అనేక అంతస్తుల ఆకాశ హర్మ్యాలు నిర్మించడం, పియానో మెట్లమీద సమ్మోహన రాగ జలపాతాలను దూకించడం. |
దేవిప్రియ కవితలు మూడు
నా పుట్టినరోజుదేముంది
ఒక కాడ్వెల్ తరువాత
ఒక శ్రీశ్రీ తరువాత
ఒక పాణిగ్రాహి తరువాత
ఒక చెరబండరాజు తరువాత
పుట్టినవాణ్ని నేను
అన్న ఈ కాలపు విశిష్టమైన కవి, ఈ యుగం వేదనల్ని అక్షరాలుగా చెక్కిన శిల్పి దేవిప్రియ. 1992లో “ఆధునికత- అత్యాధునికత” అనే నా వ్యాసాల సంపుటిలో దేవిప్రియ గారి గురించి ప్రత్యేక రచన వుంది. అందులో ఇవీ నా మాటలు: గొప్ప ఉద్వేగాన్ని కూడా నింపాదిగా చెప్పడం దేవిప్రియ లక్షణం. కార్యకారణ సంబంధాలు తెలిసి వుండడం వల్ల ఈ కవిలో అకారణమైన ఆవేశం నుంచి పదచిత్రాలు అదేపనిగా రాలవు. ఆయన భావాన్ని ఒక పదచిత్రంతోనే చిత్రిక పడ్తాడు. తాత్విక సంకోచాలు లేనప్పుడు మాత్రమే కవిలో ఈ స్పష్టత సాధ్యపడుతుంది.
దేవిప్రియ గారి కవితలు అందించడం “సారంగ” గర్వంగా భావిస్తోంది. చదవండి. మీ అభిప్రాయాలు రాయండి!
-అఫ్సర్
1
గమనించావా?
~
గమనించావా,
వలలో పడి ఒడ్డున గిలగిలలాడేది చేపలే,
ఏరు అలా పారుతూనే ఉంటుంది
జాలరి కోసం కొత్త కొత్త చేపలని ప్రసవిస్తూ.
అలా మెరిసి ఇలా మాయమయ్యేది చుక్కలే,
లెక్కచేయని ఆకాశం అలా
వ్యాపిస్తూనే ఉంటుంది కొత్త తారల్ని పొదువుకుంటూ
గొంతెత్తి పాడిన తరువాత
గాలిలో కలిసి తరలిపోయేది పాటలే,
కంఠం అక్కడే అలాగే వుంటుంది
అవిరళ రాగ మాలికల కోసం అజనిత సుమాలను ఏరుకుంటూ
సాగిపోయేది నౌకలే, సముద్రాలు కాదు.
ఎగిరిపోయేది పక్షులే, వృక్ష సముదాయాలు కాదు.
నడిచిపోయేది పాదాలే, లోపలిపొరలలో రోదించే రోడ్లు కాదు.
గమనించావా,
అంతర్థానమౌతున్నది మూర్తి మాత్రమే,
అంతా తానే అయివున్న మూలం కాదు.
2
లిపి
~
రయ్యిన వీచే గాలిలో
వినిపిస్తొందొక రమ్యవాద సమ్మేళనం.
రపరపలాడుతూ పైఫ్యాను గాలికి
తెరుచుకుంటున్న పేజీలలోంచి
ఎగిరి పడతాయి యెవరో
అక్షరాలుగా మార్చి దాచిపెట్టుకున్న ఆలోచనలు.
అన్నట్టు, అక్షరాలు లేని పుస్తకాలు కూడా
ఉంటాయన్నాడట ఒక చైనావాడు.
నిజమేనేమో నేనిప్పుడు రోజూ
చదువుతున్నది అలాంటి అలిఖిత
ఊహాగ్రంథాలనేనేమో.
నేనిప్పుడు రాస్తున్నది, ఏమో, రేపటి
లిపి లేని ప్రళయానంతర నవ మానవ
భాషలోనేనేమో…. ఏమో!
3
చిన్మయ ఏకాంతం
మహోదధిలో ఒక
బిందువు ఒంటరితనం వంటిదే
నా ఈ ఏకాంతం.
యోజనాల పర్యంతం ఎక్కడా
ఏ నౌక మీద ఎగిరే ఏ పతాకమూ
కనిపించని నిర్జనదీవి వంటిదే
నా ఈ ఏకాంతం.
తీగలు తెగి గోడకి వేలాడుతున్న
వయొలిన్ లాంటిదే
నా ఈ ఏకాంతం.
నా ఒక్కడికి మాత్రమే వినిపించే
ఆమె సమాధి నుంచి వెలువడే
సిల్కుదారపు సనసన్నని మృదులరాగమే
నా ఈ ఏకాంతం.
ఇన్ని పుస్తకాల దొంతరల మధ్య
ఒంటరిగా పరిమళించే ఒక మహా కావ్యమే
నా ఈ ఏకాంతం.
మృతికి ముందే
స్మృతిగా మారిన ఒక లోకాతీత అనుభవమే
నా ఈ చిన్మయ ఏకాంతం.
——-