పేరు (ఆంగ్లం) | P. Kesava Reddy |
పేరు (తెలుగు) | పి. కేశవరెడ్డి |
కలం పేరు | – |
తల్లిపేరు | – |
తండ్రి పేరు | – |
జీవిత భాగస్వామి పేరు | ధీరమతి |
పుట్టినతేదీ | 3/10/1946 |
మరణం | 2/13/2015 |
పుట్టిన ఊరు | తలపులపల్లి, చిత్తూరు, ఆంధ్ర ప్రదేశ్ |
విద్యార్హతలు | ఎంబీబీఎస్ |
వృత్తి | నవలా రచయిత, వైద్యుడు |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | మూగవాని పిల్లనగోవి – 1996 చివరి గుడిసె – 1996 అతడు అడవిని జయించాడు – 1980 క్షుద్ర దేవత(ఇంక్రెడిబుల్ గాడెస్) – 1979 శ్మశానం దున్నేరు – 1979 సిటీ బ్యూటిఫుల్ – 1982 రాముడుండాడు – రాజ్యముండాది – 1982 మునెమ్మ – 2008 బానిసలు – భగవానువాచ – రెండు పెద్ద కధల సంకలనం – 1975 మూగవాని పిల్లనగోవి : బల్లార్డ్ ఆఫ్ ఒంటిల్లు – 2013 |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | – |
ఇతర వివరాలు | డా. పి. కేశవరెడ్డి (1946 మార్చి 10 – 2015 ఫిబ్రవరి 13) ఒక తెలుగు నవలా రచయిత. ఆయన రాసిన ఎనిమిది నవలలు పాఠకుల ఆదరణ పొందాయి. ఆయన రాసిన కొన్నినవలలు హిందీలోకి తర్జుమా కాగా, ఇంగ్లీషులో మాక్మిలన్, ఆక్స్‌ఫర్డ్ వంటి ప్రముఖ ప్రచురణ సంస్థలు ప్రచురించాయి. రచయితగా కేశవరెడ్డి ఏ వాదాలతోనూ, ఉద్యమాలతోనూ సంబంధం ఉన్నవారు కాదు. అవేవీ లేకుండా తన పాఠకవర్గాన్ని సృష్టించుకున్న రచయిత డాక్టర్ కేశవరెడ్డి. కేశవరెడ్డి అణగారిన ఎరుకలకు, యానాదులకు, మాలలకు రెక్కలు ముక్కలు చేసుకున్నా కడుపు నిండని బక్కిరెడ్డి వంటి కాపోనికి, బతుకు భారమై నూతిని, గోతిని వెతికే సమస్త కులాల కష్టజీవులకు, వ్యథార్త జీవులకు కావ్య గౌరవం కలిగించి వారి జీవిత కదనాన్ని కథనంగా మలిచి పాఠకుడి ముందు నిలిపిన రచయిత కేశవరెడ్డి |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | అతడు అడవిని జయించాడు |
సంగ్రహ నమూనా రచన | అతడు అడవిని జయించాడు – ఒక రాత్రిలో ఓ మనిషి చేసిన జీవన పోరాటం; డా. కేశవరెడ్డి రాసిన నవలిక. అప్పుడే ఈనిన ఓ పంది, పుట్టిన పిల్లలని (సలుగులు) తినేందుకు దాడులు చేసే నక్కలు, తన పందినీ, దాని పిల్లలనూ కాపాడుకునేందుకు పోరాటం చేసే ముసలివాడు.. ఇవీ పాత్రలు, ఇదే కథ! నేపథ్యం – అడవి. నక్కలే కాదు, తానెవర్ని రక్షిస్తున్నాడో స్వయానా ఆ పంది కూడా ఈ పోరాటంలో ముసలివాడి ప్రత్యర్థే! ఎందుకంటే “అది మొరటు జీవం, శత్రువులు శ్రేయోభిలాషులు అని చూసుకునే ఇంగితం దానికి లేదు” |
పి. కేశవరెడ్డి
అతడు అడవిని జయించాడు – ఒక రాత్రిలో ఓ మనిషి చేసిన జీవన పోరాటం; డా. కేశవరెడ్డి రాసిన నవలిక.
అప్పుడే ఈనిన ఓ పంది, పుట్టిన పిల్లలని (సలుగులు) తినేందుకు దాడులు చేసే నక్కలు, తన పందినీ, దాని పిల్లలనూ కాపాడుకునేందుకు పోరాటం చేసే ముసలివాడు.. ఇవీ పాత్రలు, ఇదే కథ! నేపథ్యం – అడవి. నక్కలే కాదు, తానెవర్ని రక్షిస్తున్నాడో స్వయానా ఆ పంది కూడా ఈ పోరాటంలో ముసలివాడి ప్రత్యర్థే! ఎందుకంటే “అది మొరటు జీవం, శత్రువులు శ్రేయోభిలాషులు అని చూసుకునే ఇంగితం దానికి లేదు”
ఈతకొచ్చిన పంది, మంద నుండి తప్పించుకు పోయి అడవిలో ఓ పొద మాటున ఈనుతుంది. తప్పిపోయిన తన పందిని వెతుక్కుంటూ వెళ్ళిన ముసలివాడు, వెతికి, వెతికి చివరికి దాన్ని కనుక్కుంటాడు. అప్పటికే రాత్రయి పోతుంది. అది వాణ్ణి దగ్గరికి రానివ్వదు; ఈనిన పంది తాను బతికుండగా మరో జీవిని తన దాపులకు కూడా రానివ్వదు మరి! దాని దాడి నుండి ఎలానో తప్పించుకుని, పక్కనున్న చెట్టెక్కి, ఇక ఆ రాత్రంతా నక్కల బారి నుండి తన పందిని, సందమావల్లాంటి దాని సలుగులను కాపాడే ప్రయత్నం చేస్తాడు, ముసలివాడు.
నక్కలు పంది పిల్లల వాసన పసిగట్టి, వాటి కోసం ప్రయత్నాలు మొదలెడతాయి. రెండు నక్కలనైతే పంది అమాంతం పీక కొరికి చంపి పడేస్తుంది. మరో నక్కను ముసలివాడు తన ఈటెతో చంపేస్తాడు. కానీ నక్కలు ఊరుకుంటాయా, నక్కలు మరి! ఓ రెండు సలుగులను ఎత్తుకు పోనే పోతాయి. ఆ తరువాత ఏకంగా నక్కల గుంపే దాడికి తరలి వస్తుంది. ఒక్క పంది అన్ని నక్కలను ఎదుర్కోలేదు. చెట్టు మీద నుండి కిందకి దిగితే, ముసలివాడు వాటిని అదరగొట్టి తరిమెయ్యగలడు. కానీ వాడేమో చెట్టు దిగలేడు, దిగితే పంది మీదపడి చంపేస్తుంది. మరిప్పుడెలా?
అప్పుడు వస్తుంది ముసలివాడికి మెరుపులాంటి ఆలోచన. ప్రాణానికి ప్రాణమైన పందినే ఈటెతో చంపేస్తాడు. ఆ తరువాత నక్కల్ని తరిమేసి, సలుగుల్ని బుట్టకెత్తుకుని బయల్దేరుతాడు. కొన్ని గంటలపాటు జరిపే ప్రయాణంలో పాలు లేకపోవడం చేత, పంది పిల్లలు చచ్చిపోతాయి, రాబందుల పాలవుతాయి. ఇంత యుద్ధమూ చేసి ఉత్త చేతుల్తో ముసలివాడు ఇంటికి తిరిగి వస్తాడు.
ఇదీ కథ.
సాయంకాలం నుండి, మరుసటి రోజు పొద్దు పొడిచేదాకా జరిగే కథ ఇది. నిజానికి ఇది కథ కాదు. ఇదో నాటకం. ప్రతీ దృశ్యం మన కళ్ళ ముందు జరుగుతూ ఉన్నట్లే ఉంటుంది. అతడు అడవిని జయిస్తున్న విధానం మనల్ని లీనం చేసేసుకుంటుంది. కేశవరెడ్డి రచనా కౌశల్యం మనల్ని ఊపిరి తిప్పుకోనివ్వదు. ముసలివాని కార్యకుశలత మనల్ని కట్టిపడేస్తుంది. రక్షించేందుకు ముసలివాడు కడు సమర్థుడని మనకు కథలోని ప్రతీ వాక్యమూ చెబుతూనే ఉంటుంది. అంచేతే.. నక్క రెండు కళ్ళ మధ్య నుండి దూరి, ముచ్చిలిగుంటలో నుండి బయటికి వచ్చేలా ఈటెను విసిరినపుడు, ఒక్క వేటుతో పందిని చంపినపుడు, బాకును విసిరి తోటిగువ్వను చంపినపుడు, అవలీలగా కుందేలును వేటాడినపుడు మనకేమాత్రం ఆశ్చర్యం కలగదు. అతడి పనితనంపై మనకంత నమ్మకం కలిగిస్తాడు, రచయిత!
– తన పందులను వెదుక్కుంటూ వెళ్ళే ముసలివాని నడక ఎలా ఉందో చెప్పిన వైనం (“పెద్ద అంగలు వేసుకుంటూ, చేతిలోని ఈటెను ఊపుకుంటూ అస్తమిస్తున్న సూర్యునిపై దండెత్తిన వాడి వలె అతడు నడుస్తున్నాడు”.)
– పందిని వెతికే క్రమంలో ముసలివానికి అడవి పట్లా, అడవి జంతువుల పట్లా గల అవగాహనను తెలియ జేసిన వైనం.
– ఆకలి తీర్చుకోవడం కోసం అతడు కుందేలును వేటాడి, చెకుముకితో మంట చేసి, దాన్ని కాల్చి తిన్న విధానం.
– సుగాలోల్ల అడవిలో, అర్ధరాత్రి, వానలో, తప్పిపోయి పిచ్చిగా పరుగెత్తుకుంటూ పోతున్న ఎనుబోతును వెంటాడి, పట్టి తెచ్చిన వైనం.
ఇవీ, ఇలాంటివెన్నో.. ఇవన్నీ మనకు చెప్పేదొకటే – ముసలివాడు పందినీ, దాని పిల్లల్ని రక్షించి తీరతాడని.
కానీ పందిని స్వయంగా తానే చంపుకుని, పిల్లలు చస్తూ ఉంటే చూడవలసిన నిస్సహాయ స్థితి ఏర్పడుతుంది, ముసలివాడికి. ఏ పందినైతే రక్షించేందుకు మిన్నూ మన్నూ ఏకం చెయ్యబూనాడో, ఆ పందినే తన చేజేతులా చంపుకుంటాడు. ఎంత చిత్రం! ముసలివాని ఈ చేష్టకు మనం నిశ్చేష్టులమౌతాం. తేరుకున్నాక ఆలోచిస్తే ఆ చర్య ఎంతో తార్కికంగా అనిపిస్తుంది. కేశవరెడ్డి రచనా చమత్కృతి అది!
ఈ నవలికలోని పరిసరాల వర్ణన మనలను ముగ్ధుల్ని చేస్తుంది. అడవి, అక్కడి చెట్లూ చేమలు, జంతువులు, పక్షులు, వాటి అలవాట్లు ఎంతో వివరంగా వర్ణిస్తాడు రచయిత. వీటిని చదువుతూ ఉంటే మనకా దృశ్యాలు కళ్ళ ముందు కదులుతూ ఉంటాయి. అందుకే ఓ నాటకం చూస్తున్న అనుభూతి కలుగుతుంది మనకు. ముసలివాని లాగానే రచయితకు కూడా అడవుల్లో జీవించిన అనుభవం ఉందేమో ననిపిస్తుంది.
“నిటలాక్షుండెత్తివచ్చినన్ రానీ..” తాననుకున్నది సాధించే తీరతానన్నట్టుగా పట్టుదల చూపిన మనిషి ప్రకృతి ముందు ఓడిపోయిన విధానం ఈ కథ. ఎంతో శ్రమ పడినా పని సాధించలేకపోయిన మనిషి నైరాశ్యం, అంతలోనే తిప్పుకుని.., తరువాతి సమరానికి తయారౌతున్న విధానం ఈ కథ. పందినీ సలుగులనూ పోగొట్టుకుని గుడిసెకొచ్చి నేలపై వాలిపోయిన ముసలివాని ఆలోచనలు చూడండి..
“.. అలసిన నా మనసుకు ఒకింత విశ్రాంతి ఇవ్వాలి. ఆ తర్వాత నేను చెయ్యవలసిన పనులు చాలా ఉన్నాయి. ఎందుకంటే ఇది నా జీవితంలో చివరి రోజు కాదు గనుక…”
ముసలివాడు సిసలైన హీరో! అతడు అడవిని జయించాడు. కేశవరెడ్డి పాఠకుల మనసుల్ని జయించాడు.
డా.కేశవరెడ్డి రాయలసీమలో పుట్టి ప్రస్తుతం నిజామాబాదు జిల్లా డిచ్‌పల్లిలో డాక్టరుగా పని చేస్తున్నారు. ప్రముఖ రచయిత, మధురాంతకం రాజారామ్ ఇలా అంటారు: “కేశవరెడ్డి తల్లి పుట్టినూరు మావూరే. అంతటి రచయితను కన్న తల్లి మావూరి ఆడపడుచే కావడం నాకు గర్వకారణం”.
———–