ఉపాధ్యాయుల అప్పల నరసింహమూర్తి (U A Narasimhamurthy)

Share
పేరు (ఆంగ్లం)U A Narasimhamurthy
పేరు (తెలుగు)ఉపాధ్యాయుల అప్పల నరసింహమూర్తి
కలం పేరు
తల్లిపేరు
తండ్రి పేరు
జీవిత భాగస్వామి పేరురమణమ్మ
పుట్టినతేదీ10/02/1944
మరణం27/04/2015
పుట్టిన ఊరువిజయనగరం జిల్లా, లింగాలవలస (గజపతినగరం)
విద్యార్హతలుతెలుగు భాషలో ఎంఏ, పీహెచ్‌డీ
వృత్తిరచయిత, అనువాదకుడు,కవి,
సాహితీవేత్త, సమీక్షకుడు, విమర్శకుడు
ఉపాధ్యాయుడిగా విజయనగరం మున్సిపల్‌ పాఠశాలలో జీవితాన్ని ప్రారంభించిన నర్సింహమూర్తి మహారాజా డిగ్రీ కళాశాలలో తెలుగు శాఖాధిపతిగా పదవీ విరమణ చేశారు
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలు. కవిత్వ దర్శనం, యశోధర, నోబుల్‌ సాహిత్య ఉపన్యాసాలు, కన్యాశుల్కం ఇతర భాషలతో తులనాత్మక పరిశీలన, విశ్వనాథ సంగీత దర్శనం లాంటి అనేక గ్రంథాలు రాశారు.
19వ శతాబ్దపు కన్యాశుల్కం నాటకపు విశిష్టతను తులనాత్మక పరిశీలన చేశారు.‘తెలుగు వచన శైలి’ విశ్లేషణను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రచురించింది.నోబెల్ సాహిత్య పురస్కార గ్రహీతల పుర స్కార ప్రసంగాలను తెలుగులోకి అనువాదం చేసి ప్రచురణ చేశారు. ‘విశ్వనాథ సౌందర్య దర్శనం’, గిడుగు రామ్మూర్తి రచనలను సరళ భాషలో తిరిగి రాశారు. నరసింహ మూర్తి గారు రచించిన ‘నన్నెచో డుడి కుమార సంభవం’ ఉత్తమ విమర్శకునిగా గుర్తింపు తెచ్చింది
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలుhttps://eemaata.com/em/issues/201101/1671.html/6
https://sanchika.com/uanarasimha-murthy-rachanalu/
https://www.logili.com/short-stories/parinatha-bharathi-u-narasimhamurthy-smarika/p-7488847-26348750798-cat.html
పొందిన బిరుదులు / అవార్డులుచాసో కథాశిల్పం గ్రంథానికి తెలుగు విశ్వవిద్యాలయం అవార్డు, సాహితీమూర్తిగా అజోవిభో అవార్డులు దక్కాయి. గురజాడ 150వ జయంతి ఉత్సవాల్లో రాష్ట్ర ప్రభుత్వం నరసింహమూర్తికి గురజాడ సాహితీ పురస్కారం అందజేసింది. ప్రతిష్ఠాత్మకమైన రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ ఫెలోషిప్‌ తెలుగువారిలో ఈయనకొక్కరికే దక్కింది.గురజాడ 150వ జయంతి రాష్ట్ర వ్యాప్త ఉత్సవాల్లో భాగంగా గుర జాడ పురస్కారం పేరిట లక్ష రూపాయల నగదు పురస్కారం పొందారు. అజో-విభో సంస్థ జీవిత సాఫల్య పురస్కారం అందించింది. విజయభావన ‘అధ్యయన భారతి’ బిరుదాన్ని సమర్పించింది.
ఇతర వివరాలునిరంతర అధ్యయనం అయన అభిరుచి. క్రమశిక్షణ, పట్టుదల అయన వ్యక్తిత్వం. మూర్తీభవించిన వినయశీలి, నిగర్వి, అందరికి ఆదర్శప్రాయుడు, తెలుగు సాహిత్యంలో పరిచయం వున్న ఒక్కరికి సుపరిచితులు డా ఉపాధ్యాయుల అప్పల నరసింహమూర్తి. 1992 లో తెలుగు శాఖాధ్యక్షులుగా విజయనగరం మహారాజా కళాశాల నుండి పదవీవిరమణ చేశారు. అప్పటికే అంటే 1978 లో “నన్నెచోడని కుమార సంభవం” పై వ్రాసిన వ్యాసం ఆంధ్ర విశ్వవిద్యాలయంలో స్వర్ణోత్సవ సంచికలో ప్రచురితమయింది. భారతి పత్రికలో అనేక వ్యాసాలు ప్రముఖుల మన్ననలు పొందాయి. “ఔచిత్యప్రస్థానం – సూరన కవిత్వం” అనే విమర్శక సిద్ధాంత గ్రంథాన్ని 1988 లో వెలువరించారు. చా. సో. మీది మక్కువతో చాసో కథా విశిష్టతను పరిచయం చేసే వ్యాసమాలికను 2002 లో ప్రచురించింది.
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికవిశిష్ట విమర్శకుడు: సంపత్కుమార -: యు.ఎ. నరసింహమూర్తి
సంగ్రహ నమూనా రచనవిశిష్ట విమర్శకుడు: సంపత్కుమార -: యు.ఎ. నరసింహమూర్తి

1915లో కురుగంటి సీతారామయ్యగారి ‘అలంకారతత్త్వ విచారం’ వెలువడడంతో తెలుగు విమర్శలో మలితరం మొదలయిందని సంపత్కుమార భావించారు. తొలితరం భిన్నసంప్రదాయాల మధ్య సమన్వయసాధనకు కృషి చేస్తే మలితరం సంఘర్షణపథంలో పడి సంప్రదాయ విఛ్ఛేదానికి పూనుకుందని అంటూ సంపత్కుమార ఆ తరానికి చెందిన సామాన్య విమర్శరీతిని వివరించారు.

ఉపాధ్యాయుల అప్పల నరసింహమూర్తి (యు.ఎ. నరసింహమూర్తి)

విశిష్ట విమర్శకుడు: సంపత్కుమార
రచన: యు. ఎ. నరసింహమూర్తి
జనవరి 2011
1915లో కురుగంటి సీతారామయ్యగారి ‘అలంకారతత్త్వ విచారం’ వెలువడడంతో తెలుగు విమర్శలో మలితరం మొదలయిందని సంపత్కుమార భావించారు. తొలితరం భిన్నసంప్రదాయాల మధ్య సమన్వయసాధనకు కృషి చేస్తే మలితరం సంఘర్షణపథంలో పడి సంప్రదాయ విఛ్ఛేదానికి పూనుకుందని అంటూ సంపత్కుమార ఆ తరానికి చెందిన సామాన్య విమర్శరీతిని వివరించారు. వ్యాకరణాలంకారాదులను గూర్చి పాఠపరిష్కరణాదులకు సంబంధించి మానవల్లి, వేటూరి, వజ్ఝల, టేకుమళ్ళ రాజగోపాలరావు వంటివారు ఈ తరం విమర్శకుల సామాన్య లక్షణాలకు భిన్నమైన రీతిలో తమ విమర్శను కొనసాగించిన వైనాన్ని సంపత్కుమార విశదం చేశారు. తన తరంలో బలపడుతూన్న సంప్రదాయ విఛ్ఛేద ప్రవాహానికి ఎదురీది అడ్డుకట్ట వేయడానికి అవిఛ్ఛిన్న సంప్రదాయార్థిగా విశ్వనాథ ఆధునిక తెలుగుసాహిత్య విమర్శలోకంలో అవతరించారని సంపత్కుమార విశ్వసించారు.
1949-50 మధ్య విశ్వనాథ కవిత్వంతో పరిచయమైనది లగాయతు తుదిశ్వాస విడిచే పర్యంతం సంపత్కుమార తన సర్వప్రయత్నాలను విశ్వనాథ సాహిత్య ప్రచారం కోసం, సాహిత్య విమర్శ వ్యాప్తి కోసం మీదుకట్టి ఉంచారు. ‘కుడి ఎడమల డాల్‌ కత్తులు మెరయగ’ అన్నట్లుగా ఒకవంక ఆచార్య సుప్రసన్న, ఇంకొకవంక ఆచార్య కేతవరపు రామకోటిశాస్త్రి బాసటగా నిలువగా కాకతీయ విశ్వవిద్యాలయాన్ని విశ్వనాథ కంచుకోటగా మార్చారు సంపత్కుమార. ఉస్మానియా, కేంద్రీయ, కాకతీయ విశ్వవిద్యాలయాలలో చిరకాలంగా, బహుముఖీనంగా విశ్వనాథ సాహిత్య సంబంధమైన పరిశోధన కృషి జరగడానికి సంపత్కుమార స్ఫూర్తిదాయకులయారు. ‘సంపత్కుమారే విశ్వనాథకు ఒక వ్యాఖ్యానం’ అని భావించిన విమర్శక మిత్రులున్నారు. “కవిత్వమన్న పవిత్రాగ్నిలో నుండి ఆయన పుట్టినాడు. కల్పవృక్షంలో నన్నయగారి నుండి సాగివస్తున్న ఉత్తమకవితా సంప్రదాయాలన్నీ పరిస్ఫుటంగా ప్రత్యక్షమవుతాయి. కవిత్వమంటే సుకుమారమైన పదాలను ప్రోగుచేయడం, ధారాళంగా పద్యాన్ని నడిపించడం, ఎక్కడికక్కడ పద్యం విచ్చుకొని పోవడం ఇత్యాదులే అనే అభిప్రాయాలున్న సాహిత్యరంగంలో సత్యనారాయణగారు ఒక విధంగా విప్లవాన్ని తీసుకు వచ్చారు” – అన్నది సంపత్కుమార వ్యాఖ్యాన సారాంశం.
విశ్వనాథ సాహిత్యాన్ని గూర్చి, సాహిత్యవిమర్శను గూర్చి అనేక విషయాలను సంపత్కుమార ఆవిష్కరించారు. అద్వైతభావనాబంధురమైన విశ్వనాథ జీవుని వేదనను భారతీయాలంకార మహాధ్వంలో ఒక విశిష్ట ప్రస్థానంగా ప్రతిష్ఠించడానికి సంపత్కుమార చేసిన ప్రయత్నం ఆ ఆవిష్కరణకు శిఖరప్రాయమైనది. విశ్వనాథను మహాకవిగా, రామాయణ కల్పవృక్షాన్ని మహాకావ్యంగా నిరూపించే ప్రయత్నంలో ఆయన రాసిన వాక్యాలిలా ఉన్నాయి – “జీవుని వేదన సర్వకావ్య సమాజానికీ బీజభూతమైన అంశం. ఈ వేదనయొక్క జ్వలనశీలంలోని తీవ్రతయొక్క తరతమ భేదాలను బట్టి కావ్యపరంపరలోనూ తారతమ్యం అనంతంగా వస్తుంది. నిత్య ప్రజ్వలనశీలం ఈ వేదన తీవ్రతాస్థాయికి చేరినప్పుడు మహాకావ్యం అవతరిస్తుంది. మహాకవి మనకు దర్శనమిస్తాడు.” ఈ విషయమంతా అటు సాహిత్యనిర్మాణంలోను, ఇటు సాహిత్యవిమర్శలోను విశ్వనాథ వెలయించిన అప్రతిహత వైఖరిని స్థాపించేదిగా కనిపిస్తుంది.
రససముద్రగంభీరుడైన విశ్వనాథ సాంప్రదాయిక రసమార్గ నిర్వహణతో బాటు అందులో ఆధునికమైన పోకడలు పోయిన విధాలు కూడా సంపత్కుమార తన ‘నర్తనశాల’ నాటక విమర్శలో వెల్లడించారు. సుదీర్ఘ రసచర్చ కొనసాగించిన అనంతరం “నర్తనశాలలో కీచకుని నాయకత్వం పాశ్చాత్యదేశీయ విషాదాంత నాటకాల నాయకుడి నాయకత్వం వంటిది. విషాదాంత నాటకాలలో సాధారణంగా రసం – ఆ దృష్టి ఉంటే అభాసంగానే ఉంటుందనవచ్చు. ప్రాచ్యనాటకాలు సాధారణంగా విషాదాంతాలు కాకపోవటానికి ప్రధానహేతువు అవి రసభాసానికి కాక రసానికి అంగిత్వం నిర్వహించటమే కావచ్చు. అయితే రసాభాసం ఉన్నచోటనల్లా విషాదాంతత్వం ఉంటుందనటానికి వీలులేదు. ప్రహసనాదులు ఇందుకు అడ్డు తగులుతాయి” అని తీర్మానించారు. విశ్వనాథ ఎంత సాంప్రదాయికుడో అంత ఆధునికుడు అని సమకాలికులకు విశదం చేసే ప్రయత్నం ఇక్కడ కనిపిస్తుంది. కీచకమంటే వెదురని, దానికి మృదుత్వం లేకపోయినా దానిలోంచి పుట్టిన నిస్వనం మృదువు, మధురం కూడా – అంటూ కీచకపాత్ర స్వభావాన్ని విశదం చేసిన సంపత్కుమార వ్యాఖ్యానశైలిని అనుగమించిన వారికి విశ్వనాథశీలంలో కనుపించే ఒక పెళుసుతనంతో పాటు అంతర్నిహితమైన మృదుత్వం, మాధుర్యం కూడా నిండి ఉన్నాయని స్ఫురింపజేయడమే సంపత్కుమార లక్ష్యం. అది నిరూపించడానికే విశ్వనాథను గూర్చి వారనేక గ్రంథాలు రాశారు. ఆ గ్రంథరచన అంతా ఒక ఎత్తు, విశ్వనాథ సాహిత్య పరిశోధకులకు, విమర్శకులకు దుర్లభంగా ఉన్న విశ్వనాథ అసంకలిత సాహిత్యాన్ని తన స్వంతఖర్చుతో ఆరు సంపుటాలుగా ప్రకటించడం ఇంకొక ఎత్తు. నిస్వార్థబుద్ధితో, కేవలం సాహిత్య పక్షపాతంతో సమకాలీనుడైన సాహితీవిరాట్పురుషుని ఇంతగా సేవించిన వారెవరున్నారు? ఒక్క సంపత్కుమార తప్ప.
దేశీయత సంపత్కుమార జీవనశైలి. ఆయన జీవనశైలి, విమర్శశైలి ఒక్కటే. అది నూతనపథప్రవర్తకము, నిరాడంబరము, సంస్కారభూషితము, పరిణామరమణీయము. ఈ విశిష్ట లక్షణాలను పురస్కరించుకొని తెలుగు విశ్వవిద్యాలయంవారు తమ విజ్ఞానసర్వస్వ నిర్మాణంలో భాగంగా వెలువడనున్న విమర్శసంపుటానికి సంపత్కుమారను ప్రధానసంపాదకునిగా ఎన్నుకొని తమ గౌరవాన్ని పెంచుకున్నారు. ఆయన నిర్వహణలో బహువిషయ వ్యాపృతమైన ఆ విమర్శసంపుట నిర్మాణం పురోగమనపథంలో ఉంది. నాపై గల ఆదరభావం కారణంగా రెండు విడతలలో పదిహేను అంశాలను గూర్చిన వ్యాసాలను రాయవలసినదిగా వారు నన్ను నియోగించారు. ఆయా రంగాలలో నిష్ణాతులైన వారెందరినో వ్యాసాలు రాయవలసినదిగా ప్రోత్సహించి ఆ విమర్శసంపుటాన్ని సర్వాంగసుందరంగా తీర్చిదిద్దాలని చివరిక్షణం వరకు కృషిచేస్తూనే వచ్చారు. వారి జీవితకాలంలో ఆ సంపుటం వెలువడి ఉంటే ఆయనకు ఎంతో తృప్తి కలిగి ఉండేది.
ఆయన అముద్రిత రచనలలో సాహిత్యవిమర్శకు సంబంధించిన రచనలు ఇంకా మిగిలి ఉన్నాయని వారి సన్నిహితులు చెప్తున్నారు. ఆయన రాసిన లేఖలలో, పీఠికలలో విలువైన సాహిత్యవిమర్శ కనిపిస్తుంది. ఈ అన్నింటిని సేకరించి ప్రచురించడం తెలుగు సాహిత్యవిమర్శను అధ్యయనం చేయగోరేవారికి ఎంతో అవసరం. ఇప్పటికే విస్తరించిన ఈ నా వ్యాసంలో సంపత్కుమార సాహిత్యవిమర్శ మార్గాన్ని దిఙ్మాత్రంగా మాత్రమే చూపగలిగాను. దాని సమగ్రస్వరూపం తెలియాలంటే విస్తృత అధ్యయనశీలము, సాధికారప్రవృత్తి కలిగి ఉండి దేశీయతకు నిబద్ధమైన సంపత్కుమార విమర్శసంస్కారంతో సహమతి కలిగిఉన్న యువవిమర్శకులు అందుకు పూనుకొనవలసి ఉంటుంది. సంపత్కుమార కేవలం తన అభిరుచి మార్గాన్ననుసరించి విమర్శ చేయడం మాత్రమే కాక అంతకు మించి గురుతరమైన సామాజిక బాధ్యతను నిర్వహించే లక్ష్యంతో, ఒక నూత్న సంస్కారంతో తన కృషిని కొనసాగించారు. యువవిమర్శకులు ఆయన నుండి ఆ బాధ్యతను, ఆ సంస్కారాన్ని వినీతచిత్తంతో స్వీకరించి సాహితీకృషిని కొనసాగించవలసి ఉంది.

———–

You may also like...