దుగ్గినపల్లి ఎజ్రా శాస్త్రి (Ezra Sastry)

Share
పేరు (ఆంగ్లం)Ezra Sastry.
పేరు (తెలుగు)దుగ్గినపల్లి ఎజ్రా శాస్త్రి
కలం పేరు
తల్లిపేరు
తండ్రి పేరు
జీవిత భాగస్వామి పేరుకమల
పుట్టినతేదీ
మరణం
పుట్టిన ఊరు
విద్యార్హతలుడిగ్రీ, ఐటిఐ
వృత్తికవి, రచయిత, నవలాకారుడు
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుమా ఎర్ర ఓబన్నపల్లె-16 భాగాలు
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలుబహుజనులను తన రచనల ద్వారా ఆలోచింపచేస్తూ, నిద్రాణ స్థితిలోని జాతిని జాగృతం చేస్తున్న కవి, రచయిత, నవలాకారుడు దుగ్గినపల్లి ఎజ్రా శాస్త్రి. ఏలేరు ప్రాజెక్టులో పని చేస్తున్న ఎజ్రాకు పాఠాలు చెప్పిన శాస్త్రి పంతులుగారు తారసపడి పదవ తరగతి పూర్తి చేయమని హితబోధ చేసి ఫీజు కట్టుట. తన భవిష్యత్తుకు దిశ నిర్దేశించిన శాస్త్రి పంతులు గారికి కృతజ్ఞుడై తన పేరును ఎజ్రా శాస్త్రిగా మార్చుకున్నాడు.
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికమా ఎర్ర ఓబన్నపల్లె – ఎజ్రా శాస్త్రి
సంగ్రహ నమూనా రచనమా ఎర్ర ఓబన్నపల్లె – ఎజ్రా శాస్త్రి

కరువు రక్కసి కోరల్లో చిక్కిన వలస బతుకుల కన్నీటి వెతలను తన అక్షరాలలో చిత్రించిన నవలే మా ఎర్రఓబనపల్లె.
నవల రచన- నేపథ్యం

ఎజ్రా శాస్త్రి

 మా ఎర్ర ఓబన్నపల్లె నవల మీద రోజు అమరావతి టైంమ్స్ పత్రికలలో సమగ్ర పరిశోధనాత్మక విశ్లేషణ

——————————————–/

, బహుజనులను తన రచనల ద్వారా ఆలోచింపచేస్తూ, నిద్రాణ స్థితిలోని జాతిని జాగృతం చేస్తున్న కవి, రచయిత, నవలాకారుడు దుగ్గినపల్లి ఎజ్రా శాస్త్రి. కరువు రక్కసి కోరల్లో చిక్కిన వలస బతుకుల కన్నీటి వెతలను తన అక్షరాలలో చిత్రించిన నవలే మా ఎర్రఓబనపల్లె.

నవల రచననేపథ్యం

———————————

ఆరవ తరానికి చెందిన నవలాకారుడు తమ పూర్వీకుల కాలం నుండి తమ కుటుంబం, తమ ప్రాంతపు ప్రజలు ఎదుర్కొన్న కరువు కాటకాలను, జీవన పోరాటం కోసం వలస పోయి బతుకీడ్చిన విధానాన్ని 16 భాగాలలో తమ కన్నీటి గాథలను ఆవిష్కరించిన బతుకు పుస్తకమే మా ఎర్రఓబనపల్లె నవల. ప్రాంతీయ మాండలికంలో పదునైన పదాలతో సంభాషణలు సృష్టించి, సామాజిక అసమానతలను ప్రశ్నించిన తీరుకు, మాదిగ వలస కుటుంబాలలో వచ్చిన సామాజిక చైతన్యానికి మరియు ప్రతిఘటన శక్తికి తార్కాణమే మా ఎర్ర ఓబనపల్లె.

పాత్రలు

————-

నవలలో ప్రముఖ పాత్రలుగా ఆరు తరాల దుగ్గినపల్లి వంశీయులైన ఎలమంద, నాగమ్మ, ఎర్ర ఓబయ్య, అచ్చమ్మ ,యంగటమ్మ , ఎర్ర చెన్నయ్య, సుజానమ్మ, బాల నరసయ్య, సుబ్బమ్మ, రాజు, సంతోషమ్మ, ఎజ్రాశాస్త్రి కమలమ్మ పాత్రలతో పాటుగా నర్సిరెడ్డి, పెద్దిరెడ్డి, కూరేశు, ముత్యాలమ్మ, సౌలు, ఎలమందారెడ్డి, వంగెపురపు పెద్దన్న వంటి పాత్రలను ఎజ్రా శాస్త్రి తీర్చిదిద్దారు.

కరువు తాండవం

———————–

ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతానికి చెందిన ఒక పల్లె ఎడమ కల్లు. కరువు తాండవించడం వల్ల గ్రామానికి చెందిన నర్సిరెడ్డి తొలకరి చినుకులు పడినప్పుడైనా ఎలిపొలంలో జొన్న పంట వేసుకుంటే గొడ్డు గోదాకు జొన్న కర్రలైన దక్కుతాయి అనే ఉద్దేశంతో నవలలోని రెండవ తరానికి చెందిన తన ఇంటి మాదిగ ఎర్రఓబయ్యను తనతోపాటు ఎడవల్లి ప్రాంతానికి చెందిన దిరిశింత సంతకు జాతి ఎడ్లను కొనడానికి తీసుకువెళతాడు. ఇంటి మాదిగోడు అంటే యజమాని కుటుంబానికి చెప్పులు కుట్టి ఇవ్వడమే కాకుండా వారి ప్రతి కార్యములో వెన్నంటే ఉంటూ సుఖదుఃఖాలలోను, కష్టనష్టాలలోనూ పాలి పంపులు పంచుకునేవారు. కులాలు వేరైనా వారి ఆకలి ఒక్కటే . జీవిత నేపథ్యం ఒక్కటే. వారికున్న తపన ఒక్కటే. కరువు నుండి తమ కుటుంబాలను పశుపక్షాదులను కాపాడుకొని ఆకలి తీర్చుకోవడం. ఉద్దేశంతో నర్సిరెడ్డి తో ప్రయాణమవుతాడు ఎర్రఓబయ్య.

సామాజిక అంతరం

—————————

మనిషికి ఆకలి ఒకటే అయినా సామాజిక అంతరాలు మాత్రం ఉన్నట్లు రచయిత ఆనాటి కుల వివక్షతను చక్కగా చిత్రించాడు. సంతలో ఎడ్లు కొనుటకు వెళ్లే నాటికి చీకటి పడడం వల్ల నర్సిరెడ్డి ఊరి భూస్వామి అయిన పెద్దిరెడ్డి ఇంట్లో బస చేస్తాడు కానీ ఎర్రఓబయ్య బస చేయడానికి ఊర్లో మాదిగల ఇల్లు ఒక్కటైనా లేకపోవుట వల్ల నిత్యం సంత జరుగు మూడు ఊళ్లకు అవతల ఉన్న దిరిశింత గ్రామంలో మాదిగ ఇళ్లల్లో బస చేయడానికి వెళ్తాడు దీన్నిబట్టి ఆనాడు మాదిగలు మాదిగల ఇండ్లలోనే బస చేసేవారని, చెయ్యాలనే కట్టుబాటు మరియు వివక్షతను రచయిత భాగంలో వివరించారు.

వలసకు శ్రీకారం

———————

నర్సిరెడ్డి ఎడ్లను కొనడానికి వెళ్లి ఎడవల్లి గ్రామంలో పెద్దిరెడ్డి ఇంట్లో బస చేసి ప్రాంతాన్ని కరువు రహిత ప్రాంతంగా గుర్తించి బతకడానికి అనేకన్నా తమ పశు పక్షాదులను, తమ ప్రాణాలను కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఎడమకల్లు నుండి నర్సిరెడ్డి, ఎర్రఓబయ్య మరియు పెద్ద అంకయ్య కుటుంబాలు ఎడవల్లి చేరి పెద్దిరెడ్డిని ఆశ్రయించు తీరును నవలాకారుడు చక్కగా వివరించాడు.

ఎలమంద జీవితంకుల వృత్తుల ప్రస్థానం

——————————————————–

ఎర్రఓబయ్య తన తండ్రి ఎలమంద ధైర్య సాహసాలు గురించి, తన తల్లి నీతిగా బతికి తమను పోషించిన విధానాన్ని అచ్చమ్మకు వివరిస్తాడు. ఇక్కడ ఎలమంద పాత్ర ద్వారా రచయిత నాటి మాదిగల వృత్తిని గురించి మరియు అడవులలో చిన్నా చితక జంతువులను వేటాడుటతో పాటు, మృగాలు వేటాడి తినగా మిగిలిన కళేబరాలను తీసుకువచ్చి పల్లెలోని అందరూ తినేవారని, మిగిలిన చర్మం ద్వారా తప్పెట మరియు చెప్పులు తయారు చేసే వారని 200 సంవత్సరాల క్రితం ప్రకాశం జిల్లా ప్రాంతంలో మాదిగల వృత్తి, జీవన విధానాన్ని తెలియజేశాడు.

ఎర్రఓబనపల్లె గ్రామ ఆవిర్భావం

ఎడమకల్లు నుండి వలస వచ్చిన నర్సిరెడ్డి, ఓబయ్య కుటుంబాలకు వారు నివసించుటకు తావు చూపిస్తాడు పెద్దిరెడ్డి. అయితే అక్కడ కుటుంబాలు సమూహంగా, ఊరుగా ఏర్పడుటకు, ఏర్పడిన ఊరికి ఎవరి పేరు పెట్టాలి అని ఆనాటి కాలంలో ప్రజలు నమ్మే ఆచారమైన సోది చెప్పే ఎరుకలి సింగమ్మ వద్దకు వెళ్లగా వారు నివసించబోవు గడ్డకు ఎర్రఓబయ్య పేరు పెడితే కలిసి వస్తుందని చెప్పినప్పుడు నర్సిరెడ్డి గానీ తక్కిన కుటుంబాలు గానీ మారు మాట మాట్లాడకుండా అంగీకరిస్తారు. ఊరు కట్టబడి, బతుకు దెరువు కోసం సేద్యం చేసుకొనుటకు నర్సిరెడ్డి, ఎర్రఓబయ్యలు పెద్దిరెడ్డిని పొలం అడుగగా పెద్దిరెడ్డి కౌలు ఆశించడం, అందుకు ఎర్రఓబయ్య నిరాకరించి, నర్సిరెడ్డి తదితరులతో కలిసి ఎడవల్లి ప్రాంతంలోని నల్లమల అడవుల్లో కట్టెలను కొట్టి అడవిని చదును చేసి అరికెలు పంటను వేసి పండిస్తారు. శ్రామికుల జీవితాన్ని, శ్రమైక్య సౌందర్యాన్ని వివరిస్తాడు నవలాకారుడు. అంతేకాక పెద్దిరెడ్డి కౌలు అడిగిన వెంటనే ఎర్ర ఓబయ్య తిరస్కరించిన విధానం, దళిత చైతన్యాన్ని, పట్టుదలను, ఓబయ్య లోని నాయకత్వ లక్షణాన్ని, వారి ఆత్మ భిమాన జీవితాన్ని చక్కగా మలిచాడు నవలాకారుడు.

పల్లెకు పెద్దదిక్కు ఎర్రఓబయ్య

తినడానికి తిండి లేక పొట్ట చేత పట్టుకొని కన్న తల్లి లాంటి ఉన్న ఊరిని వదిలి, అవమానానికి గురై గడ్డ కట్టి, ఊరుగా ఏర్పడుటకు ఎర్ర ఓబయ్య చేసిన కృషిని, అలాగే స్వేదాన్ని చిందించి కొండ బండలను తొలగించి అవసరమైన ధాన్యాన్ని పండించి ఎర్రఓబనపల్లెకు ఒక శక్తిగా ఏర్పడతాడు ఎర్రఓబయ్య. ఐక్యత భావం కలిగి ఆకలి బాధలను అధిగమించి, అన్నదమ్ముల వలె కలిసి జీవనం సాగిస్తుండగా విషయం తెలుసుకున్న పెద్దిరెడ్డి అన్నదమ్ముల వలె కలిసిమెలిసి ఉంటున్న నర్సిరెడ్డి, ఎర్రఓబయ్యలను వేరుచేసి మాదిగ వాడితో నీకు సహవాసం ఏంటి అని నర్సిరెడ్డికి తన పోరంబోకు పొలం ఇచ్చి సన్నిహితులుగా ఉన్న నర్సిరెడ్డి ఎర్రఓబయ్యలను విడదీస్తాడు పెద్దిరెడ్డి. తన పేరు మీద ఏర్పడిన గడ్డ ఊరుగా మారి ఎర్రఓబనపల్లెగా పరిణమించి పల్లెకు ఎర్రఓబయ్య పెద్ద దిక్కు అవుతాడు. క్రమేనా వివిధ కులాలవారు ఎర్రఓబనపల్లెకు చేరి జీవనం సాగిస్తుండగా మాల, మాదిగ కులాలకు చెందిన తిరుపాలు మరియు వంగెపురపు పేరిగాడు కలసి పెద్దిరెడ్డి పశువుల దొడ్డిలోని పశువులను దొంగిలించి అమ్ముకుంటున్నారని వారిని మందలించమని పెద్దిరెడ్డి ఎర్రఓబయ్యకు చెబుతాడు. బతుకుదెరువుకు వలస వచ్చి ఊరు ఏర్పాటులో కీలక పాత్ర వహించి ఒక ఊరు పెద్దగాను, న్యాయ అన్యాయాలను తీర్చు పెద్ద మనిషిగా ఎర్రఓబయ్యను నవలాకారుడు చక్కగా చిత్రీకరించాడు.

నాల్గవ భాగంలో ఎర్రఓబయ్య భార్య అచ్చమ్మ కుక్క కాటుతో మరణించడం, ఓబయ్య పిల్లల సంరక్షణకై ఎండ్లూరి వారి ఇంటి ఆడపిల్లను వివాహం చేసుకోవడం, ఎర్రఓబయ్య పెద్ద కొడుకు ఎర్రచెన్నయ్య వివాహం, అలాగే మాదిగల ఇండ్లలోని పెళ్లి తంతును, వారికి వివాహ సమయంలో ఇచ్చే ఓలి గురించి నవలాకారుడు చక్కగా వివరించాడు. వృద్ధాప్యం వల్ల ఎర్రఓబయ్య మరణించడంతో రెండవ తరం కథను రచయిత ముగించాడు. ఓబయ్య మరణించినప్పుడు మాదిగ పల్లెలోనే కాకుండా ఎర్ర ఓబనపల్లె అంతా విషాదంలో నిండిపోయినట్లు నవలాకారుడు చిత్రీకరించాడు. కుక్కకాటు వలన ఎర్రఓబయ్య భార్య మరణించడం ఆనాడు సరైన వైద్య సదుపాయాలు లేకపోవటకు తార్కాణం.

ఆచారాలు

ఆనాడు గ్రామ దేవత అయిన పోలేరమ్మ జాతరను, ఊరు పంట పొలాలతో ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని రెండు సంవత్సరాలకు ఒకసారి జరిపించు పోలేరమ్మ జాతరను, జాతర జరిపించుటలో యాదవ, మాదిగ మరియు మాదిగ తెగలోని 12 ఉపకులాల వారు నిర్వర్తించాల్సిన విధిని చక్కగా వివరించాడు. పోలేరమ్మ జాతరతో పాటు మాతంగి కొలుపులను జరిగించు విధానాన్ని, నాటి ఆచార సాంప్రదాయ పద్ధతులను చక్కగా వివరించాడు.

దురాచారం

నాటి ఆచారంగా పాటించే దురాచారంలో పెద్ద మాదిగ దున్నపోతును వధించడం. అప్పటివరకు అపురూపంగా పెంచుకొని బలి ఇచ్చే విధానాన్ని, అమ్మవారు పూనే తంతుని రచయిత వివరించారు. బలి ఇచ్చిన దున్నపోతును కోసి నవధాన్యాలతో కుంభం వండించి ఊరు సుభిక్షంగా ఉండడానికి పొలిని ఊరి పొలిమేరలో చల్లడానికి ఊరి మాల కులానికి చెందిన పెద్ద మాల తలకి ఎత్తి పొలిని ఇతర ఊర్లవారు దొంగిలించకుండా ఉండడానికి కాపలాగా మాల, మాదిగ తక్కిన దళిత కులాల కుర్రాళ్ళు కత్తులతో కాపు కాసే వారి వీరత్వాన్ని చక్కగా చిత్రీకరించాడు. ప్రక్క ఊరు నుండి పొలిని కాపాడు తరుణంలో వంగెపురం ఎల్లడు ప్రాణాలు కోల్పోవుట, అప్పుడు మాదిగ స్త్రీ పురుషులు ప్రాణాలు తీసే జాతరలు ఎందుకని రెడ్డిని నిలదీయుట. భాగంలో నవలాకారుడు అనాచారంగాను పశు, జన ప్రాణ నష్టం కలిగించే ఆచారాలను క్రూరమైన తంతును ఎందుకని ప్రజల ద్వారా ప్రశ్నింపచేస్తాడు.

ఎర్రచెన్నయ్య ధైర్య సాహసాలు

ఎర్రఓబయ్య అనంతరం అతని కుమారుడు మరియు మూడో తరానికి చెందిన ఎర్ర చెన్నయ్యను అత్యంత ధైర్యవంతునిగా నవలాకారుడు మలచాడు. దీనికి తార్కాణంగా కరణానికి అనారోగ్యం కారణంగా పన్ను చెల్లించుటకు కనిగిరి బయలుదేరుతున్న ఎర్రచెన్నయ్యకు వడ్డే కులానికి చెందిన స్త్రీని కొందరు దారిదోపిడి దొంగలు బలత్కరిస్తుండగా వారిని అడ్డుకొని తన వద్ద ఉన్న పన్ను సొమ్మును లాక్కోబోయిన వారిని చంపుతాడు. జరిగిన విషయం పెద్దిరెడ్డికి తెలిపి డబ్బును రెడ్డికి అప్పగిస్తాడు. మూడు ఎకరాలు ఎలి పొలాన్ని బహుమానంగా రెడ్డి వద్ద నుండి పొందుతాడు.

కాలజ్ఞాని కురేషు

ఆరవ భాగంలో మహాజ్ఞానిగా కురేషును చక్కగా చిత్రించాడు నవలాకారుడు. వంగెపురపు దేవయ్య, రంగమ్మల సంతానమే కురేషు. కురేషు పుట్టినప్పటి నుండి ఏడుస్తుండగా జడల పంతులుగా పేరుగాంచిన ఎంగట సుబ్బయ్య వద్దకు తీసుకొని రాగా కురేషు పూర్వజన్మలో బ్రాహ్మణ రుషి అని శాపం వల్ల దేవయ్య ఇంట్లో పుట్టాడని జడల పంతులు చెప్తాడు. చిన్నప్పటినుండి కురేషు బడి బయటే చదువుకొని, జంధ్యం వేసుకొని మారుమూల ప్రాంతాల నుండి వచ్చే జనులకు మంచి చెడులు చెప్పటం, అది సహించని గోవిందాచారి, సైదాచారి కుట్ర పన్ని కురేషును చెట్టు కట్టి రక్తం దారాలు కట్టేటట్లు కొట్టగా కురేషు తల్లిదండ్రులు ప్రాధేయపడగా వదిలివేయుట, జంధ్యం తీసివేయమన్నందుకు బ్రాహ్మణులను ప్రతిఘటించుట, చివరకు కురేషు సజీవసమాధిలోకి వెళ్తూ మాదిగలకు అన్యాయం జరుగుతుందని, అందరూ ఐక్యంగా ఉండాలని పలుకుతాడు. బ్రాహ్మణులు అతని సజీవ సమాధి వద్దకు వచ్చి కురేషును పిలవగా మీరంతా అంతరించిపోతారని శపించి ఇంకెప్పుడు కురేషు ఎవరు పిలిచినా పలుకలేదు. ఇది కట్టు కథలాగా అనిపించినప్పటికీ కొన్ని కొన్ని చోట్ల విధమైనటువంటి ఘట్టాలను ఈనాటికి మనం వింటుంటాం.

క్రైస్తవ్యంలోనికి వెళ్ళని దుగ్గినపల్లి వారు

నాడు వర్తకం కోసం మన దేశంలో ప్రవేశించిన బ్రిటిష్ వారు మిషనరీలు ద్వారా క్రైస్తవ మత వ్యాప్తిని విస్తృతంగా చేస్తున్నప్పటికీ దుగ్గినపల్లి వారు తమ కుల దైవం నరసింహ స్వామిని పూజించటం తప్ప క్రైస్తవ్యాన్ని అంగీకరించలేదని వివిధ పాత్రల ద్వారా శాస్త్రి ఏడవ భాగంలో పలికించాడు.

పెళ్లి తంతు

ఎనిమిదవ భాగంలో ఎర్రచెన్నయ్య కొడుకు బాలనరసయ్య సుబ్బమ్మలకు మరియు ఎర్ర చెన్నయ్య కూతురు అచ్చమ్మను బొజ్జోళ్ళ ఇంటికి కోడలుగా పంపడంతో మాదిగ ఇళ్లల్లో పెళ్లి తంతును మాదిగ దాసరితో చేయిస్తారని పెళ్లిలో ముఖ్య ఘట్టాలైన నలుగు, ప్రదానం మూట, ఓలీలను చక్కగా వివరించాడు.

పాముకాటుకు మంత్రించే వైద్యం

సరైన వైద్య సదుపాయాలులేని రోజుల్లో పాముకాటుకు గురైన ఎర్ర చెన్నయ్య రెండవ భార్య యంగటమ్మకు మంత్రించే వైద్యాన్ని చేసినట్లు, ఆమె మరణించినట్లు తెలుస్తుంది. రోజుల్లో నాటువైద్యం, మూఢనమ్మకాలు ఎక్కువగా ఉన్నట్టు భాగంలో నవలాకారుడు తెలియజేశాడు.

నిర్మలమైన భక్తి

నిర్మలమైన భక్తికి నిదర్శనంగా, అచ్చమ్మ నిష్టగా నరసింహ స్వామి గుడి వద్ద ధ్వజస్తంభాన్ని నిటారుగా నిలబెట్టమని నరసింహ స్వామిని కోరగా స్వామి అనుగ్రహంతో ధ్వజస్తంభం నిటారుగా నిలబడటం మాస బత్తిన సుబ్బాచార్యులు అచ్చమ్మకు 1,116 కానీలు ఇచ్చుట. నాడు స్త్రీలలో ఉన్న నిష్టాగరిష్టతను నవలలో శాస్త్రి వివరించాడు.

ఎర్రచెన్నయ్య మరణం

11 భాగంలో మాదిగలపై అఘాయిత్యాలు చేస్తున్న తలకొండపాడు కరణం లచ్చర్సును ప్రతిఘటించి మాదిగ యువకులు చంపుట వారి ప్రతిఘటనకు తార్కాణం.

తన కూతురు అచ్చమ్మ వద్దకు వెళ్తూ కళ్ళు తిరిగి ఎర్ర చెన్నయ్య దిగుడు బావిలో పడి మరణించడం, అతని కాపాడుటలో విఫలమవటంతో ఎర్రచెన్నయ్య అధ్యాయం ముగుస్తుంది.

మానవతకు మచ్చుతునక

12 భాగంలో పెద్ద పోలయ్య మూడో భార్య అయిన ముత్యాలమ్మ ఒకసారి తలకు దెబ్బ తగిలిన పాముకు వైద్యం చేసి, పాము ద్వారా బహుమానంగా మణిని పొందుతుంది. మణి పొందిన విషయం తెలుసుకున్న కొండారెడ్డి ముత్యాలమ్మ పై దౌర్జన్యం చేసి మణి పొందుతాడు. పాము తనని కాపాడిన ముత్యాలమ్మకు బహుమానంగా ఇచ్చిన మణిని దౌర్జన్యంగా తస్కరించినందుకు శాపంగా కొండారెడ్డికి రాచపుండు వస్తుంది. వైద్యం తెలిసిన ముత్యాలమ్మ మానవతా దృక్పథంతో రాచపుండు వలన చావు దాకా వెళ్ళిన కొండారెడ్డిని వైద్యం చేసి కాపాడుతుంది. ఇక్కడ ముత్యాలమ్మ మానవతను చక్కగా చిత్రీకరించారు నవలాకారుడు.

వలస పునరావృతం

నాడు కరువు కాటకాల వల్ల బ్రతుకు తెరువుకు రంగూన్ కు బాలనరసయ్య, కొందరు గ్రామస్తులతో కలిసి వలస పోవడం అక్కడ పనికి తగినట్టు కూలి ఇవ్వనందుకు మేస్త్రి చేసే దోపిడీని బాల నరసయ్య ప్రతిఘటించడం, రంగూన్ లో కొందరు కలింగాంధ్రకు చెందిన మిత్రులతో కలిసి రిక్షా కార్మికునిగా పనిచేయడం, రంగూన్ లో పనికి వెళ్లి తిరిగి వచ్చిన సుందిరిగాడు బాల నరసయ్య భార్య సుబ్బమ్మకు బాల నరసయ్య యోగక్షేమాలను తెలుపుట, ఐదవ తరంకు చెందిన రాజు పుట్టుక 12 భాగంలో రచయిత తెలియజేస్తాడు. ఎర్రఓబయ్య రోజుల్లో బతుకుదెరువుకు వేరే గ్రామ ప్రాంతానికి వలస పోతే బాల నరసయ్య కాలంలో ఇతర దేశానికి వలస వెళ్లినట్లు వలస పునరావృతం అయిన తీరును శాస్త్రి భాగంలో వివరించాడు.

క్రైస్తవ మిషనరీల సేవలు

నాడు మిషనరీలు పల్లె పల్లె తిరిగి క్రీస్తు బోధనలను ప్రచారం చేస్తూ, ప్రజలకు బాప్తిస్మం ఇవ్వడంతో పాటుగా దళితులతో పాటు కలసి భోజనం చేయడం, వారికి విద్య, వైద్యం అందించుటే గాక అందరూ సమానమని బోధించారు. బాల నరసయ్య మరియు రాజాలకు దొరలు బాప్తీస్మం ఇవ్వడం. బాల నరసయ్యకు మద్యపానం అలవాటు ఉండడం అది మానుకో లేకపోవడం, రాజా తన తల్లిదండ్రుల అనుమతితో అమ్మమ్మ ముత్యాలమ్మ ఇంటికి వెళ్లడం ఎవరికీ చెప్పకుండా రాజా మిలట్రీ లో చేరడం. భారతదేశానికి స్వాతంత్రం రావడం, మిలటరీ వాళ్లు స్వచ్ఛందంగా పదవీ విరమణ చేసి వెనక్కి రావడం, అధికారపక్షంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, ప్రతిపక్షంగా ఉన్న కమ్యూనిస్టులు పేదలకు భూపంపిణీ జరగాలని కోరడం వంటి నాటి దేశ కాల పరిస్థితులను శాస్త్రి నవలలో తెలియపరిచారు.

తొలి గ్రామపంచాయతీ ఎన్నికలకు శ్రీకారం

బాల నర్సయ్య గ్రామపంచాయతీ ఎన్నికల్లో పెద్దిరెడ్డి వైపు కాకుండా తమకు అనుకూలంగా ఉన్నటువంటి ఎలమంద రెడ్డికి సంబంధించిన మాలకొండ రెడ్డి వైపు నిలబడి పెద్దిరెడ్డిని ఓడిపోయేటట్టు చేస్తాడు. దాంతో బాల నరసయ్యపై కక్షగట్టి మాల మాదిగలను పొలం పనిలోనికి రాకుండగా పెద్దిరెడ్డి హుకుం జారీ చేయగా, ఎలమందారెడ్డి జోక్యంతో మళ్లీ పెద్దిరెడ్డి తమ పొలాలలో దళితులను పనికి పిలుచుట. విధంగా పల్లెలో దళితులు రాజకీయాలను ప్రభావితం చేయు శక్తిగా ఏర్పడిన విధానాన్ని రచయిత తెలియపరిచాడు.

బాలనరసయ్య ధైర్యసహసాలు

మన దేశానికి స్వతంత్రం రావడంతో మిలట్రీలో చేరిన రాజు స్వచ్ఛందంగా ఉద్యోగ విరమణ చేసి అమ్మమ్మ ముత్యాలమ్మ వద్దకు చేరుట. ముత్యాలమ్మ రాజుకి పెళ్లి సంబంధం చూచుట. కమ్యూనిస్టులు అందరికీ భూ పంపిణీ జరగాలన్న పిలుపుకు ప్రభావితుడై, దున్నేవాడిదే భూమి అనే కమ్యూనిస్టు సిద్ధాంతానికి ఆకర్షితుడై పలుకురాళ్ల దిన్నె వద్ద గల 300 ఎకరాల బీడు భూముని దున్నుకోండి అని బాల నరసయ్య పల్లెలోని వారిని పురమాయించుట. రెడ్డి లేని సమయంలో మాదిగలు బీడు భూమిని ఆక్రమించుకొని దున్నుకొనుట, విషయం తెలుసుకున్న రెడ్డి కక్షపూరిత మనసు కలిగిన ఏమి చేయలేక అశక్తుడగుట. ఇది బాల నరసయ్య తెగువకు నిదర్శనం.

బలిజ కులానికి చెందిన గిడ్డిగాడి పొట్టేలును మాదిగ కులానికి చెందిన బుడ్డెంకటయ్య చంపితినుట. తన పొట్టేలును చంపి తిన్నాడన్న నిజాన్ని తెలుసుకున్న గిడ్డోడు బుడ్డెంకటయ్యను గరిటతో కంటిపై పొడవగా, కన్ను పోయి హాస్పిటల్ కి వెళుతుండగా మార్గం మధ్యలో బుడ్డెంకటయ్య మరణిస్తాడు. గిడ్డిగాడిని, పెద్దంకయ్య, చిన్నంకయ్యలను కరణం సహాయంతో కేసు పెట్టి బాలనరసయ్య అరెస్టు చేయిస్తాడు. రెడ్డికి అనుకూలంగా ఉన్నటువంటి గిడ్డిగాడికి అనుకూలంగా సాక్ష్యం చెప్పమని బాలనరసయ్యను రెడ్డి పొలం ఇస్తానని ఆశ చూపుతాడు. బాలనరసయ్య రెడ్డి మాటలను తిరస్కరించి తనవారికి అనుకూలంగా నిలబడతాడు. ఇక్కడ తన స్వార్థానికి పోకుండా తన వారి సంక్షేమం కొరకు బాల నరసయ్య నిలబడతాడు. విధంగా బాల నరసయ్య పాత్రను ధైర్య సాహసాలకు మారుపేరుగా మాత్రమే కాకుండా నీతి, నిజాయితీకి కట్టుబడిన వ్యక్తిగా నవలాకారుడు తీర్చిదిద్దాడు. గిడ్డిగాడికి యావజీవ కారాగార శిక్ష పడుతుంది. కేసులో గెలిచినందుకు క్రిస్మస్ సంబరాలు ఘనంగా జరుపుతారు.

భాగంలో భద్రయ్య అనే రైతు మరణించగా అతని భార్య అన్నపూర్ణమ్మ వద్ద పొలాన్ని కొందరు కౌలుకు తీసుకొని ఎగ్గొట్టడం, కౌలు అడిగినప్పుడు దౌర్జన్యానికి దిగడం, దిగులుతో అన్నపూర్ణమ్మ మరణించడం ఒంటరి అయిన అన్నపూర్ణమ్మ కొడుకును అతని భార్య వసంతమ్మ (నపుంసకుడు అని తెలియడంతో భర్తను వదిలి పుట్టింటికి వెళుతుంది) తిరిగి చేర్చుకోవడం వంటి సామాజిక విషయాలను నవలాకారుడు తెలియపరిచాడు.

తాండవించిన కరువు

పల్లెలో మరలా కరువు తాండవించడం వల్ల ధర అనుకున్నంతగా రాలేదని దాచి ఉన్న ధాన్యాన్ని అమ్మడానికి తీసుకువెళ్తున్నారని, దాన్ని కొల్లగొట్టమని బాల నర్సయ్య కుమారుడు రాజుకు తిప్పయ్య ద్వారా మాలకొండ రెడ్డి కబురు పంపుతాడు. రాజు లూటీ చేయడానికి నిరాకరించాడని కక్ష గట్టి మాదిగలే లూటీ చేశారని, పోలీసులు మాదిగల ఇళ్లపై పడి దాడి చేసి వారిని లాకప్ లో వేయించుట. తర్వాత వారిని విడిచిపెట్టడం. అకారణంగా కక్షపూరితంగా నాడు దళితులపై జరిగిన దాడులను నవలాకారుడు వివరించారు.

భీమవరం, కైకలూరు ప్రాంతాలలో గాలికుంటు వ్యాధి వలన చనిపోయిన పశువుల తోళ్లను తెచ్చి తప్పెట్లను, చెప్పులను తయారుచేసిన విధానాన్ని, మాదిగల కులవృత్తిని చక్కగా వివరించారు. బాల నరసయ్య, రాజులు వారు తయారుచేసిన చెప్పులను పెళ్లిలో వధూవరులకు ఇచ్చి భోజనాన్ని ఇంటికి తెస్తారు. ఊర్లో పిల్లలు భోజనం కోసం వేచి చూస్తున్న విధానాన్ని, నాటి దళితులు ఎదుర్కొన్న కరువును, పేదరికాన్ని హృదయ విధారక సంఘటనలు చక్కగా మలచాడు ఎజ్రాశాస్త్రి.

గ్రామ కమిటీ ఏర్పాటు నీటి సమస్య పరిష్కారంపై తీర్మానం

ఎలమందరెడ్డి నాయకత్వంలో ఏటుకూరి మాలకొండ రెడ్డి అధ్యక్షతన ఏర్పడిన గ్రామ కమిటీలో బాల నరసయ్య సభ్యునిగా ఎంపిక అవడం పల్లెల్లో నీటి కొరత ఎక్కువగా ఉండడం వల్ల ప్రజలు బ్రతుకుతెరువు కోసం వివిధ ప్రాంతాలకు వలస పోతున్నారని నీటి సమస్యను పరిష్కరిస్తే ప్రజలకు బతుకు తెరువు లభిస్తుందని తన గళాన్ని విప్పుతాడు బాల నరసయ్య. నందికొండ నుండి ఎర్ర ఓబనపల్లెకు నీరు రావడం కోసం పోరాడదామని ఎలమందరెడ్డి తీర్మానం చేస్తారు.

నందికొండ డ్యాం నిర్మాణ పనులకు వలస

గ్రామ కమిటీ తీర్మానం అనంతరం బాల నరసయ్య సౌలు మద్యం సేవించి పెద్దిరెడ్డి మంచాన్ని కాళ్లతో సౌలు తంతాడు. అది తెలిసిన పెద్దిరెడ్డి అనుచరులు మాదిగల ఇళ్లపై దాడి జరప ప్రయత్నించగా బాలనరసయ్య, రాజు, సౌలులు దాడిని తిప్పి కొట్టి జరిగిన విషయాన్ని ఎలమందరెడ్డికి తెలియజేసి తమకు సహాయం చేయమని అప్పటివరకు మునగపాడులో తలదాచుకుంటారు. కోర్టులో బాలనరసయ్యను నిర్దోషిగా నిరూపించడం, పెద్దిరెడ్డి అరాచకాలు సహించలేక, కలిసి రాని సేద్యాన్ని వదిలి రాజుతో సహా బాలనర్సయ్య నందికొండ డ్యాం నిర్మాణ పనులకు వెళ్లి లారీ టైర్లతో చెప్పులు కొట్టడం మొదలు పెడతారు. బ్రతుకుతెరువు కోసం దిక్కుకు వలస వెళ్లిన కులవృత్తిని మాత్రం వదలలేదని కులవృత్తితోనే బతికిడ్చినట్లు నవలాకారుడు తెలియజేశాడు.

వర్షాల కారణం వల్ల డ్యాం వద్ద పని తక్కువగా ఉండటం చేత రాజు, బాల నరసయ్యలు తమ కుటుంబాలను డాం వద్దకు తీసుకువెళ్లాలని ఎర్ర ఓబన పల్లె వచ్చుట. పల్లెలో గొడవలు తమకు సహకరించవలసిందిగా బాల నర్సయ్యను కోరుట, రాజు భార్య తగవుల్లో కలుగజేసుకొవద్దని తిరిగి నందికొండ డ్యాం పని వద్దకు వెళ్లాలని కోరుట. డ్యాం వద్ద అధికారిగా పనిచేస్తున్న శేషగిరిరావు రాజుకు అటెండర్ ఉద్యోగం, బాల నరసయ్యకు విజయ రత్నానికి తాత్కాలికంగా ఉద్యోగం ఇప్పించుట. చెప్పులు కుట్టే వృత్తి నుండి రాజుకు డ్యాంలో ఉద్యోగం పర్మినెంట్ అవుట.చదువులేని బాలనరసయ్య, విజయరత్నాలు డ్యాం పని పూర్తి అవ్వగానే తిరిగి ఎర్ర ఓబనపల్లి వెళ్లి కులవృత్తిని ప్రారంభించారు. రాజు చదువుకోవడం వల్ల చెప్పులు కుట్టే పని నుండి ఉద్యోగం రావడం జరిగింది. ఇక్కడ నవలాకారుడు విద్య యొక్క ప్రాముఖ్యతను తెలియజేశారు. భాగంలో రాజు కుమారుడు విజయరత్నం రెడ్ల కులానికి చెందిన మణిని ప్రేమించుట డ్యాం పని పూర్తికాగానే వారు కూడా ఎర్ర ఓబన పల్లె వచ్చుట. పల్లెలోని వాతావరణాన్ని మరియు విజయరత్నం కుటుంబాల్లో ఉన్న ఆహారపు అలవాట్లతో సర్దుబాటు కాలేక మణి పెద్దల సమక్షంలో విడాకులు తీసుకొనుట.

నవలాకారుని ప్రస్థానంపాఠశాలలో వివక్షత

పల్లెలో పాఠశాల నడపటానికి బడి మిద్దె లేని కారణంగా కొట్టాలలో బడిని నడిపేవారు. పంతులు గారి వద్ద అక్షరాలు రాయించుకొనుటకు వెళ్తూ ఎజ్రా శాస్త్రి పంతులు గారి ముంతను తాకుట, అది గమనించిన పంతులుగారు ముంతను పారవేయగా ముంత పగిలిపోవుట. విధంగా ఏమీ తెలియని బాల్యంలోనే శాస్త్రి వివక్షతను ఎదుర్కొన్నాడు.

హాస్టల్ జీవితం

ఉద్యోగ విరమణ చేసిన ఎజ్రా శాస్త్రి తండ్రి రాజు ఎర్రఓబనపల్లె కి చేరడం, తన ముగ్గురు కుమారులను కనిగిరి బీ ఎం హాస్టల్లో చేర్చుట. హాస్టల్లో వార్డెన్ వివక్షత చూపుట. సరిపడ భోజనం పిల్లలకు పెట్టకపోవడం అలాగే క్రిస్మస్ పండక్కి బట్టలు దర్జీ వద్ద వేయగా దర్జీ కుట్టడానికి ఇచ్చిన బట్టలతోపాటు డబ్బులతో ఒక అమ్మాయితో లేచిపోవడం, రాజు తిరిగి పిల్లలకు కొత్త బట్టలు కొనలేకపోవడం నాటి పేదరికాన్ని శాస్త్రి వివరించారు.

అపోహలు

రోజుల్లో నాటు వైద్యం, ప్రకృతి వైద్యం ప్రభావం ఎక్కువగా ఉండటం వల్ల ఇంగ్లీష్ మందులపై ప్రభుత్వం ఇచ్చు టీకాల పై అపోహ ఎక్కువగా ఉండేది. అందువల్ల ఆనాడు పల్లెల్లో ప్రబలే మసూచి ఆటలమ్మ వ్యాధులకు ముందుస్తుగా ప్రభుత్వం ఇచ్చే టీకాలను పల్లెల్లోని ప్రజలు తిరస్కరించేవారు. రాజు పిల్లలు చదువుకోవడం వల్ల టీకాలు వేయించడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసుకొని టీకాలు వేయించుకున్నట్లు శాస్త్రి తెలియజేశాడు.

పడమటి ప్రాంతాలలో దుమురోగం వల్ల మరణించిన శవాలను పారవేస్తున్నారని, శవాలకు ఉన్న బంగారాన్ని తీసుకుందామని పల్లెలో జనాలకు దానేలు పాత్ర ద్వారా తెలియజేశాడు. దీనిని బట్టి ఆనాటి పల్లెలో ప్రజలు జీవనం సాగించడం ఎంత కష్టమో నవల్లో తెలియజేశారు.

 

ఒడిదుడుకుల బతుకులు

నవలాకారుని కుటుంబీకులలో విద్యాధికునిగా రాజును చెప్పవచ్చు. మొట్టమొదటి ఉద్యోగి కూడా రాజే. అయినప్పటికీ నలుగురు బిడ్డలతో బతుకు భారమై ముగ్గురు మగ పిల్లలను హాస్టల్లో ఉంచి చదివిస్తాడు. శాస్త్రి చెల్లెలకు పోలియో రావడం వలన హాస్టల్లో పెట్టే అన్నాన్ని కొంచెం హాస్పిటల్ కి వచ్చిన తల్లికి పెట్టి, మిగతా దానితో ముగ్గురు సర్దుకునేవారు. హాస్టల్లో చదువు సరిగా సాగక ఎజ్రాతో సహా వారి అన్నలు హాస్టల్ విడిచి పెట్టుట. ఆరో తరగతి వరకు చదివిన శాస్త్రి చదువు మానేసి పాట్నా వెళ్లి కొందరు ఆంధ్ర ప్రాంతం వాళ్లతో కలిసి మూడు నెలలు పాటు హోటల్లో పని చేయుట. అక్కడ ఉండలేక తిరిగి తన తండ్రి బదిలీ అయినా రాజమండ్రిలో ఒక లాడ్జిలో పని చేయడానికి వెళ్లి ఒక కస్టమర్ చెప్పు కుట్టించడానికి వెళ్తూ తన తండ్రికి ఎదురు పడుట. చదువు వంట పట్టదని ఉద్దేశంతో రాజు శాస్త్రిని ఎర్ర ఓబనపల్లెలో రైతులు వద్ద జీతగాడిగా పెట్టుట. రాజు రాజమండ్రి నుండి గోకవరంకి బదిలీ అయిన తర్వాత ఎజ్రా తిరిగి చదువుకొనుట. ఎస్ ఎస్ సి తప్పడం వల్ల ఏలేరు ప్రాజెక్టులో ఎజ్రా పని చేయుట.

ఎజ్రా శాస్త్రిగా మారిన ఎజ్రా

ఏలేరు ప్రాజెక్టులో పని చేస్తున్న ఎజ్రాకు పాఠాలు చెప్పిన శాస్త్రి పంతులుగారు తారసపడి పదవ తరగతి పూర్తి చేయమని హితబోధ చేసి ఫీజు కట్టుట. తన భవిష్యత్తుకు దిశ నిర్దేశించిన శాస్త్రి పంతులు గారికి కృతజ్ఞుడై తన పేరును ఎజ్రా శాస్త్రిగా మార్చుకున్నాడు. తరువాత ఇంటర్మీడియట్ చదువుతూ వామపక్ష భావాలకు ఆకర్షితుడై విద్యార్థి నాయకునిగా పోటీ చేసి గెలుపొందుట. డిగ్రీ చదువుతూ మధ్యలో మానివేసి ఐటిఐ చదివి ఏలేరు ప్రాజెక్టులో ఎన్ ఎం ఆర్ గా ఉద్యోగంలో చేరి పనిచేయుట. తాను ప్రేమించిన యువతిని పెండ్లాడడానికి పెద్దల అంగీకారం లేకపోవడంతో తన అక్క కూతురు కమలను వివాహం చేసుకొనుట.

ఉద్యమాలలో ఎజ్రా

చదువుకున్న రోజుల్లోనే వామపక్ష భావాలకు ఆకర్షితుడైన ఎజ్రా శాస్త్రి విద్యార్థి నాయకుడిగా విద్యార్థుల సమస్యలకు పరిష్కారం కొరకు కృషి చేశారు. రిక్షా కార్మికులకు, చెప్పులు కుట్టే కార్మికులకు గౌరవ అధ్యక్షునిగా పనిచేసి వారి సమస్యల పరిష్కారానికి పాటుపడ్డాడు. ఎస్సీ వర్గీకరణ పోరాటాన్ని జరిపిన మందకృష్ణ మాదిగతో కలిసి పనిచేశాడు.

భాషా ప్రయోగం ప్రాంతీయ మాండలిక ప్రభావం

ప్రకాశం జిల్లా నేపథ్యంలో సాగే నవల్లో నవలాకారుడు భాష విషయంలో ప్రాంత మాండలికానికి పెద్దపీట వేశాడు.

కాలు కాలిన పిల్లి, మెత్తబడ్డాయి, కవెల, ఎలి పోలం, జీవాలు, కలో గంజొ, కాత్తె, పొద్దు కొండ లో బడింది, చీకటేత్తునే, బీరానే ,పావలో బేడ, పురుగు పుట్టా, గొడ్డొచ్చి నేల బిడ్డొచ్చి నేల, ఇల్లేటం, మింటబెట్టిన దీపం, ఎగసాయం, అడపాదడపా, తూరున, యాదయ్యి, గోరోజనం, ముసలి ముతక, కూలీ కుండకు రాదు, రంకు పన్నుకు రాదు, కోరముట్లు, ఒంటిమీద పడ్డ దెబ్బ ఏట్లో పడ్డ నీళ్లు మల్ల వస్తాయా, గబ్బు సమరు, వైదిగం నేదరు బిడ్డలు పొలంపుట్ర, తెల్ల గడ్డలు, ఉగ్గ బట్టి, ఉద్దాగం, సాంగాలు, మరవ, పెడ దిమ్మలు, కసురు చూసి రారా అంటే కాల్చి వచ్చుట, గుణుకు పేరం, రవేసరాలు, బాగి సాలి, నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా, ఆటవిక న్యాయం, బలవంతుడిదే రాజ్యం, తృణమో ఫణమో, ఏత వాతా , మాపిటి జాము కల్లా, ఉడుకు నీళ్లు, ఉల్లిట, గరగె ముంత, అదును, మబ్బు చాటున దాక్కున్న నెలవంక, దొంతి కొండలు, పిల్లా జెల్లా, ఆడ మగ, జాలాటి, ఉనకేసిన, పెద్ద చిన్న, గురువు దైవం, అతలాకుతలం, ఒంటి కాలు, ఒంటేలు, లిక్కి దొకుడు బార, మా పిటికల్లా, శవం సద్ది పడిద్దిరా, బొరుగులు, పట్టపగ్గాలు లేవు, మాట మంచి, బొక్కెన, కొట్టం,గొడ్డు గోదా, వెన్నతో పెట్టిన విద్య సిగమార్లు, పట్టేళ్ళు, బొడ్డార్లు, బాడవ, రాచ పుండు, నాలుగు రాళ్లు వెనకేసుకునుట, యాతలేక, ఆరె, కొండ్ర వారు, అనాదినం, అగ్గి బుగైండు, కవలం, గాలి వాన, ఆటపాట, గాలికుంటు, దొమ్మరోగం, బాసిక మటమేసుకుని, బరీగా, ఉన్న ఊరు కన్నతల్లి, పూస గుచ్చినట్లు, శరవా, ఆలనా పాలనా, మాలు, కర్ర పోయి గొడ్డలిలో దూరింది, నాము, తెల్ల మొహం, మాడి చెక్కలు, తొర్రి కూతలు, పనీళ్ళ బువ్వ, దూము వంటి దేశి పదాలను, మాండలిక పదాలను, జంట పదాలను, సామెతలును, జాతీయాలను, నానుడులను, నుడికారాలను నవలలో ఎజ్రాశాస్త్రి విరివిగా ప్రయోగించాడు

అన్య భాష పదాలు

దళారి, హుకుం, కాగడ, రసీదు, తాఖీదు, కురేషు, తావీజు, కౌలు, లైట్లు, పంచనామా, దేదీప్యమానం, ఇంగ్లీషు, మనీ ఆర్డర్, బ్రోకర్, రిక్షా, తర్జుమా, తర్ఫీదు, వెరీ గుడ్, మిల్ట్రీ, సార్ ఆర్మీ, పార్టీ, నోటిఫికేషన్, పార్టీ ప్రెసిడెంట్, పార్టీ ఆఫీస్, లేబర్, దర్బార్, తహసిల్దారు, కలరా, కేసు, రిపోర్టర్, రిపోర్టు, పోలీసు, జీపు, ఎస్సై, కానిస్టేబుల్, కోర్టు, జడ్జి, బోన్, డ్రామా, స్టేజ్, డ్రైవర్, క్లీనర్, లాకప్, లోడ్, వ్యాన్, పార్సిల్, మీటింగ్, కమిటీ, ఎస్టేట్, ఫొటోస్, పోస్టుమార్టం, కేసు, ఫైనల్ హియరింగ్, కస్టడీ, కోర్టు , డిఫెన్స్, డ్యామ్, బూర్జువా, లేబర్ కాలనీ, పాలిష్, ఇనాము, మీరాసీ, వరండా, ఆఫీస్ అటెండర్, సర్టిఫికెట్లు, ఎంప్లాయ్మెంట్ ఎక్సేంజ్, డివిజన్, కాల్ లెటర్, సెలెక్ట్, జాయిన్, స్కూల్ బిల్డింగ్, టేబుల్, హాస్టల్, వార్డెన్, కరస్పాండెంట్, కిచెన్, కాంపౌండ్, డిసిప్లైన్, పనిష్మెంట్, టైలర్, జాకెట్లు, టీకాలు, డిశ్చార్జ్, పెన్సిల్, పెన్ను, ఫ్యాక్టరీ, హోటల్, టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్, రైల్వే ట్రాక్, టాటా, బోల్తా, మేనేజర్, కౌంటర్, కస్టమర్, ఆఫీస్ రూమ్, సపోర్ట్, జోక్స్, ప్రిన్సిపాల్ మేడం, క్యాంప్ కాలనీ, చైర్మన్, టెంపరరీ, ఫుట్ పాత్, మసీద్, ఖబరస్తాన్, లజ్జ, వర్కర్స్ అసోసియేషన్ వంటి పరభాష పదాలను ఆయా సందర్భాలలో నవలాకారుడు ప్రయోగించారు.

ముగింపు

ఆరు తరాల తమ కుటుంబీకుల జీవన పోరాటాన్ని నవలగా ఆవిష్కరించిన ఎజ్రా శాస్త్రి ఒకవైపు ఉద్యోగిగాను , సామాజిక ఐక్యతకు పాటుపడుతున్న వ్యక్తిగాను, తన సాహిత్యం ద్వారా ప్రజలను మేలుకొలుపుచున్న కవిగాను రచయితగాను అనేక రచనలను చేశారు. ఆరు తరాల కథను తెలిపిన ఎజ్రా శాస్త్రి

———–

You may also like...