| పేరు (ఆంగ్లం) | Ravinder Vilasagaram |
| పేరు (తెలుగు) | రవీందర్ విలాసాగరం |
| కలం పేరు | – |
| తల్లిపేరు | లస్మమ్మ |
| తండ్రి పేరు | శంకరయ్య |
| జీవిత భాగస్వామి పేరు | – |
| పుట్టినతేదీ | 08/06/1971 |
| మరణం | – |
| పుట్టిన ఊరు | బెజ్జంకి, కరీంనగర్ జిల్లా, తెలంగాణ |
| విద్యార్హతలు | – |
| వృత్తి | – |
| తెలిసిన ఇతర భాషలు | – |
| చిరునామా | హైదరాబాద్ , తెలంగాణ |
| ఈ-మెయిల్ | – |
| ఫోను | – |
| వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
| స్వీయ రచనలు | ప్రచురితమయిన మొదటి కవిత • ఒక విషాదం ఒక సంతోషం – ఎన్నీల ముచ్చట్లు – 4 సంచిక2013 నవంబరు 17 కవితల జాబితా 1. కవిసంగమం 2. శూన్యంలోంచి శూన్యంలోకి 3. నది పలికిన వాక్యం ప్రచురితమయిన పుస్తకాల జాబితా 1. నది పలికిన వాక్యం (2016) – మొదటి కవిత్వ సంపుటి న 2.నిప్కలు నానీలు – 2018 |
| ఇతర రచనలు | – |
| ఈ-పుస్తకాల వివరాలు | – |
| పొందిన బిరుదులు / అవార్డులు | – |
| ఇతర వివరాలు | • వీరు కవిసంగమం 21వ కార్యక్రమంలో పాల్గొన్నారు. • 442 కవుల “తొలి పొద్దు” కవిత్వ సంకలనంలో వీరు ఒకరు. • కరీంనగర్ లో నెలనెలా జరిగే “ఎన్నీల ముచ్చట్లు” కార్యక్రమానికి సి.వి. కుమార్ తో కలిసి సమన్వయ కర్తగా పనిచేస్తున్నారు. • “తెలంగాణా రచయితల వేదిక” కరీంనగర్ లో కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్నారు. |
| స్ఫూర్తి | – |
| నమూనా రచన శీర్షిక | విలాసాగరం రవీందర్ కవిత్వం ‘నది పలికిన వాక్యం’ |
| సంగ్రహ నమూనా రచన | విలాసాగరం రవీందర్ కవిత్వం ‘నది పలికిన వాక్యం’ అసంఖ్యాక వెలుతురు మెతుకులలో అస్తిత్వాన్ని వెతుకుతూ శూన్యంలో జారిపోయే ఒంటరి అస్థిపంజారాల్లా మనం. గ్రహాలు గ్రహాల్లా మారాక మనిషికీ మనిషికీ మధ్యన మాయ తెరలు వెలిశాక నువ్వూ నేనూ అడుగు దూరంలో ఉన్న గ్రహాంతర వాసులమే కదా…!(గ్రహాంతర వాసులం) |
రవీందర్ విలాసాగరం
విలాసాగరం రవీందర్ కవిత్వం ‘నది పలికిన వాక్యం’
రవీందర్ విలాసాగరం పేరుతో మనకందరికీ సుపరిచుతులైన కవి. జీవితంలోని అన్ని పార్శ్వాలను తడుముతూ కవిత్వం చెప్పడం సాధారణమైనది కాదు. ఈ కవి నేపథ్యం అందుకు దోహదం చేసింది కావచ్చు. ముందు మాటలో యాకూబ్ గారు చెప్పినట్లు కవిత్వం అనుభూతి – ఆలోచనల సమాహారం. అనుభూతి మనసును తడితే ఆలోచన మెదడును మేల్కొలుపుతుంది. ఈ రెండింటిని సమన్వయం చేసుకుంటూ తన కవిత్వ సాగర మధనం చేసిన కవి రవీందర్. జీవితం పట్ల వున్న ఆప్యాయత మనుషుల పట్ల మనిషితనం పట్ల వున్న ఆత్మీయత తన ప్రతి రాతలోను మనకు కవి దృష్టికోణాన్ని తెలియచేస్తుంది. గత మూడేళ్ళుగా రాసిన కవితలను సంపుటిగా కూర్చి అందించిన ఈ నది పలికిన వాక్యం తనలో ప్రవహించిన భావపరంపరకు అక్షర రూపం. యాకూబ్ గారు చెప్పినట్లే ఇది తన కవిత్వ మానిఫెస్టో. కవిత్వం ద్వారా తాను ఆశించేదాన్ని నిర్ద్వంద్వంగా తెలియ చేస్తారు రవీందర్. ఇందులో అధిక భాగం కవిత్వ నిర్మాణంపై అక్షర రూపాలపై రాసినవి వున్నందున కవి యొక్క మనసు మనకు సులభంగా గ్రాహ్యమవుతుంది. తెలంగాణా యాసను అత్యంత చాకచాక్యంగా కవిత్వంలోకి అనువదించడం ఈయనకు వెన్నతో పెట్టిన విద్యలా అనిపించింది. అలాగని ఇతర ప్రాంతీయులకు అర్థం కానంతగా లేకుండా తీసుకున్న జాగరూకత కూడా గమనించవచ్చు. ఇందుకు కవిసంగమం గ్రూపు దోహదపడిందని నాకు అనిపిస్తుంది. ఇంక తన కవిత్వంలోకి ప్రయాణిద్దాం.
మనిషిని మనిషి దూరం చేసుకుంటున్న ఒక మాయాప్రపంచపు వ్యామోహాన్ని కవి చాలా చోట్ల నిరసిస్తారు.
అసంఖ్యాక వెలుతురు మెతుకులలో
అస్తిత్వాన్ని వెతుకుతూ శూన్యంలో జారిపోయే
ఒంటరి అస్థిపంజారాల్లా మనం.
గ్రహాలు గ్రహాల్లా మారాక
మనిషికీ మనిషికీ మధ్యన
మాయ తెరలు వెలిశాక
నువ్వూ నేనూ
అడుగు దూరంలో ఉన్న
గ్రహాంతర వాసులమే కదా…!(గ్రహాంతర వాసులం)
నరుని కోసం నరుడే కంట తడి పెట్టాలె
ఆర్తిగా నిలువెల్లా తడుమాలె
మనసు గదిలోనికి వెళ్ళి కన్నీరిడువాలె.
మనిషిని మనిషే అర్థం చేసుకోవాలె
గడ్డ కట్టిన ఎడద ఎడారిలో
శాంతి పూలు పూయించాలె
మనిషితో మనిషి జీవించాలి
తనివితీరా సంభాషించాలి
జీవితాన్ని ఒంపుకోవాలి (శాంతి పూలు)
నీకూ నాకూ మధ్య
అడుగు దూరం కూడా వుండదు
పెదాలు విప్పేసరికి
నువ్వేమో ఆవలి ప్రపంచాన
నేనేమో యీవలి గట్టు మీద (మరో నేను)
మనిషి పిరికితనంతో తన చుట్టూ జరుగుతున్న అన్యాయాన్ని భరిస్తూ కళ్ళు మూస్తూ బతికేయడాన్ని కవి ఇలా నిరసిస్తారు.
ఎన్నాళ్ళుంటావిక్కడ?
పుట్టినప్పుడేం తెచ్చినవు
ఎదిరిస్తే ఏం పోగొట్టుకుంటవు?
రెండు మూడు కిలోల మాంసపు ముద్దను
అరకింటాలుకో ముప్పావు కింటాలుకో పెంచినవు
గుప్పేడు గుండెకింత తెగింపు నియ్యలేవా? (నిరసన వాక్యం)
నిప్పుకణికలాంటి అక్షరాలు
నీ మనసును చేరడం లేదంటే
నువ్వు జీవమన్నా కోల్పోయి ఉండాలి
లేదా కన్నీటి తడి ఆరి
స్పందన లేనివాడవన్నా కావాలి (వంచన)
ప్రపంచీకరణ పేరుతో గ్లోబల్ విలేజిగా మారిపోతున్నాం అని మోసకారి మాటలతో జరుగుతున్న విధ్వంసకర అభివృద్ధి పట్ల కూడా కవి చాలా చోట్ల తన నిరసనను నిర్ధ్వందంగా తెలియచేస్తారు.
మా ఊరికి కన్నారానికి
రెండు గంటల తొవ్వ
నేను పదోదిల లాగుదొడిగినప్పుడు
పనిమీద ఆడికి పోవాలంటే
ఎర్రబస్సొక్కటే సుక్కదెగిపడ్డట్టు అచ్చేది అంటూ దానిలో వెలుతుంటే కనులముందు పచ్చగా కనపడే ప్రకృతి అందాలు పంచిన ఆనందాన్ని చెపుతు నేడు
కోట్లాది పువ్వుల మొక్కల్ని బొండిగ పిస్కి
నాలుగు రాష్ట్రాల నడుమ
గన్నేరు మొక్కల కింద పాతరేసిండ్రు
ఇప్పుడు
మా ఊరు బెజ్జంకికి కన్నారంకు
నలభై నిమిషాల తొవ్వ!
కానీ మనసుకు మాత్రం
నలభయి గంటల్లెక్క. (మా ఊరి తొవ్వ)
ప్రపంచం కుగ్రామం అయ్యాక
జాతరలూ సెలబ్రిటీలయ్యాయి
వ్యక్తిగత జీవితమూ వ్యాపార వస్తువయింది
అడవిని జల్లెడ పట్టి
మానవ హక్కుల హననమొనర్చిన
డ్రోన్ డేగలు
పుష్కర ఘాటుల వద్ద మాటు వేస్తున్నాయి
జాగ్రత్త…. జాగ్రత్త…. (డ్రోన్ డేగ కళ్ళు)
కవిత్వాన్ని తన జీవనయానంలో సంపూర్ణ భాగస్వామిని చేసుకున్న రవీందర్ కవిత్వం పట్ల తన అక్షరం పట్ల వున్న నిబద్ధతను ఇలా ప్రకటిస్తారు
నా మాటల్లో సత్యం లేని వేళ
రాసిన అక్షరాలన్ని
ముడుచుకు పోయి ఉంటయి
శతాధిక వృద్ధిడిలా
మనసు చీకిపోయి
ముక్కలు ముక్కలుగా విడివడుతుంటుంది
పురుగుల మందు తిన్న బొద్దింకలా.
శరీరం మొత్తం కూలబడి
కళ వెలిసిపోతుంది
శవంలా…! (వెలసిపోతయ్) అని తనను తాను శపించుకుంటూ తాను రాసిన అక్షరంలోని సత్యవచనాన్నిఅందులో మమేకత్వాన్ని మనముందుంచడం కవి యొక్క గొప్పతనం.
కవి ఒక్కోసారి తనలోకి తాను ప్రయాణిస్తూ ఒక ఒంటరితనాన్ని అనుభవిస్తాడు. అప్పుడు ఒక అస్పష్టత గోచరిస్తుంది, అలాగే తనలోని ఖాళీలు కనిపిస్తాయి. ఇది అందరికీ అనుభవైకమే. దానినిలా చెప్తారు రవీందర్.
రోజూ చూస్తున్న అక్షరాలే
అయినా ఏదో అస్పష్టత
చిక్కుబడిన దారంలా.
రాసిన భాషకు చెప్పాలనుకున్న
భావానికి పొసగనితనం.
పదానికి పదానికి మధ్య
వాక్యానికి వాక్యానికి మధ్య తెగిన వంతెన
మనిషికి మనిషికి మధ్యన వేలాడే ఖాళీలా. (అస్పష్టత)
రవీందర్ గారి దృష్టిలోనుండి ఏదీ తప్పుకోలేదు కవిత్వం కాకుండా. నరేంద్ర దభోల్కర్ గారిని హత్య చేసిన వార్త తననెంత కలచివేసిందో ఈ కవిత మనకు తెలియచేస్తుంది.
రాలుతున్న నక్షత్ర దేహాలపై
ఎర్రటి నెత్తుటి చుక్కలు
అక్షరాలకు
తిరుగుబాటు నేర్పినందుకే కావచ్చు.
ఈ సాయం సమయమెందుకో
మంటల్లో మండుతోంది
పదాలకు
ప్రశ్నించడం నేర్పినందుకే కాబోలు. (నెత్తుటి చుక్కల గాలింపు)
రోహిత్ వేముల స్మృతిలో ఇలా
ఆదివారం పూట
ఆ సాయంత్రాన్ని
చీకటిలో అలా ఉరి తీయాల్సింది కాదు
ఎన్ని సముద్రాల దిగులు
నీ మొహమ్మీద తుఫానై సంచరించినా
ఇలా చేయాల్సింది కాదు
ఎన్ని సర్కారు తుమ్మముండ్లు
నీ బతుకు చుట్టూతా
రక్తపు మడుగులు గడ్డ కట్టిస్తూ వెళ్ళినా
ఒక గడ్డి పువ్వు
మెరుపుకోసమయినా
నువ్వు బతికుండాల్సింది.
ఇంకా ఈ సంపుటిలో బతుకు చిత్రంలోని అన్ని వర్ణాలను తనదైన శైలిలో మనముందు ఆవిష్కరిస్తారు రవీందర్ గారు. శ్రీలంక తమిళులపై జరిగిన దాడి నుండి తెలంగాణా ఉద్యమం పట్ల రాజ్యం మోపిన ఉక్కుపాదం వరకు, విప్లవోద్యమంలో అమరులైన వారి పట్ల తనకున్న ఆరాధనను, బతుకు భారంతో చిద్రమవుతున్న బాల్యాన్ని ఇలా ఈ నూటపదకొండు పద చిత్రాలలో ముద్రించారు. చివరిగా తన మాటలలోనే
మానేటి గలగలల అలల వాగొడ్డున
మనసు నది పలికిన వాక్యం
జీవితాన్ని తెరిచి అంకితమిస్తుంది
నదిలో తళుక్కుమంటుంది
నీ జ్ఞాపకాల పొట్లం తెరచాపలెత్తుతుంది.
———–