| పేరు (ఆంగ్లం) | Janaki Chamarthi |
| పేరు (తెలుగు) | జానకి చామర్తి |
| కలం పేరు | – |
| తల్లిపేరు | – |
| తండ్రి పేరు | – |
| జీవిత భాగస్వామి పేరు | – |
| పుట్టినతేదీ | – |
| మరణం | – |
| పుట్టిన ఊరు | – |
| విద్యార్హతలు | – |
| వృత్తి | – |
| తెలిసిన ఇతర భాషలు | – |
| చిరునామా | – |
| ఈ-మెయిల్ | – |
| ఫోను | – |
| వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
| స్వీయ రచనలు | – |
| ఇతర రచనలు | https://www.neccheli.com/2021/02/%e0%b0%a8%e0%b0%bf%e0%b0%a8% |
| ఈ-పుస్తకాల వివరాలు | – |
| పొందిన బిరుదులు / అవార్డులు | – |
| ఇతర వివరాలు | జానకి చామర్తి ( వరిగొండ) మనసులో భావాలు మనసులోనే కధలల్లి పెట్టుకోవడం ఎప్పటినుంచో చేస్తున్నా , అక్షరాలలో పెట్టడం ముఖపుస్తకంలో మొదలయ్యింది. సుందరమైన తెలుగునే నమ్ముకున్నా. అందంగా కవితలా రాయాలని , రోజూవారీ జీవితాన్నైనా ప్రకృతి యే ఆనందం , ఇప్పటికీ చదువు చెప్పే గురువు అదే. నిజం చదువు MA Bed, ఉపయోగపడే విద్య yoga లో చేసిన PG Diploma,. నివాసం విశాఖపట్టణం , ఎక్కువకాలం ప్రవాసం. ప్రస్తుత నివాసం కౌలాలంపూరు. |
| స్ఫూర్తి | – |
| నమూనా రచన శీర్షిక | నిన్ను చూడకుంటే నాకు బెంగ (కథ) |
| సంగ్రహ నమూనా రచన | తలుపు తీయంగానే విసురుగా తాకిన హేమంతగాలికి కట్టుకున్న నూలు చీర ఆపలేక వణికింది విజయ. అమ్మ చీర , రాత్రి రాగానే పెట్లోంచి తీసి కట్టేసుకుంది .. చూసుకు నవ్వుకుంది, పెద్దవాళ్ళచీరలా ఉందని.నీళ్ళ పొయ్యి ముందుకు వచ్చి , మోకాళ్ళు మునగదీసుకు కూచుని , అరచేతులు చాపి మంట వేడికి వెచ్చపెట్టి చెంపలకు తాకించుకుంటోంది. నీళ్ళకాగులో నీళ్ళు కాగే కళపెళా చప్పుడు వింటూ కేకెట్టింది, “ నీళ్ళు కాగాయి, ఎవరు పోసుకుంటారు “ అంటూ. |
జానకి చామర్తి
నిన్ను చూడకుంటే నాకు బెంగ (కథ)
తలుపు తీయంగానే విసురుగా తాకిన హేమంతగాలికి కట్టుకున్న నూలు చీర ఆపలేక వణికింది విజయ. అమ్మ చీర , రాత్రి రాగానే పెట్లోంచి తీసి కట్టేసుకుంది .. చూసుకు నవ్వుకుంది, పెద్దవాళ్ళచీరలా ఉందని.నీళ్ళ పొయ్యి ముందుకు వచ్చి , మోకాళ్ళు మునగదీసుకు కూచుని , అరచేతులు చాపి మంట వేడికి వెచ్చపెట్టి చెంపలకు తాకించుకుంటోంది. నీళ్ళకాగులో నీళ్ళు కాగే కళపెళా చప్పుడు వింటూ కేకెట్టింది, “ నీళ్ళు కాగాయి, ఎవరు పోసుకుంటారు “ అంటూ.
“ మంట కాస్త ఎగదోయండి , అమ్మాయిగారూ , ఎప్పుడొచ్చారు “ అడిగాడు రంగన్న , ముసలి పాలేరు , ఆ అడగడం ఎందుకొచ్చారు , అన్నట్టుంది అని విసుక్కుంటూ .. “రాత్రి” , అంది విజయ.
మడి చీర సరిచేసుకుంటూ కాఫీగ్లాసు తెచ్చి కిందెట్టి , అక్కడే నుంచుంది అమ్మ , పక్కనే ఉన్న పీట లాక్కుని కూచుని, కాఫీ చప్పరిస్తూ తాగుతోందివిజయ , స్వర్గం లో ఉన్నట్టుంది అనుకుంటూ.
“ అబ్బాయికి , చెప్పే వచ్చావా “ అమ్మ. ఆ మాటలో అనుమానధ్వనికిచర్రుమంటూ ,“చెప్పకుండాఎందుకొస్తాను, ఆయనే ఎక్కించారు బండి “ అంది.
“ హఠాత్తుగా వచ్చావని అడిగానే బాబూ “ అంటూ“ ఏం కూర చేయనూ , నీకిష్టమైన వంకాయముద్దకూరచేస్తానుసరేనా.. ,పిల్లఎలాచిక్కిపోయిందోనమ్మా..”
అనుకుంటూ వంటింట్లోకి వెళిపోయిందావిడ.
చంటివాడికి పోయడానికి వేడినీళ్ళు తీసుకోవడానికి వచ్చిన వదిన కాంతం , “ కృష్ణగారి మీద అలిగావేంటోయ్ విజయా! మా తమ్ముడు ఏం సినిమాకి తీసుకెళ్ళనన్నాడా , నువు చెప్పినమాట వినలేదా , ఏమయ్యిందేమిటి , చెప్పా పెట్టకుండా ప్రత్యక్షమయ్యారు తమరు , “ అంది ఆటపట్టిస్తున్నట్టుగా.ఉడుక్కుని “ అదేం లేదు “ అంది విజయ, కాఫీగ్లాసులోకి చూస్తూ.
కాంతం నవ్వి నీళ్ళు తీసుకు వెళిపోయింది.
లేచి లోపలకి రాబోతున్న విజయకు అన్నగారు ఎదురయ్యాడు,
“ఈ కొత్తబండి ఏమిటే.. బావుంది,టక్కున వక్కదానివే ప్రయాణం చేసి వచ్చేయగలిగావు,బావగారు ఎలా ఉన్నారు , తీసుకురాలేదేం “ అడిగాడు అన్నగారు.
ఏమనాలో తోచలేదు విజయకి.
“ అవును బావుంది, ఆయన బావున్నారు “ అంటూ లోపలకి వెళిపోయింది.
నీళ్ళగదిలో స్నానం చేస్తున్న విజయకి , పనిమనిషి లక్ష్మి తల్లిని అడగడం వినిపిస్తోంది.“ ఏంటమ్మా, అమ్మాయిగారు ఒక్కరే వచ్చేసారు, మొన్నేగా కాపురానికి దింపొచ్చారు మీరు , అల్లుడుగారు రాలేదా” అంటూ. జవాబుగాతల్లి ఏమందో వినిపించలేదు .
వంటయ్యింది, వడ్డించేసా రండన్న అమ్మ కేకకి , పరుగెత్తికెళ్ళి, నాకూ పెట్టెయ్యమంది విజయ.
అన్నగారు, అన్నగారు తో కలిపి భోజనానికి ఉపక్రమించింది. అమ్మ వడ్డిస్తుంటే కూచుని తినడం ఎంత బావుంది అనుకుంటూ.అమ్మ చేసిన వంకాయకూర .. ఆ రుచికి పరిసరాలు తెలియడంలేదు, ఉసిరికాయపచ్చడిలో ఇంకాస్త కమ్మనినెయ్యి వంపుకుంది. ఈ చిలకడదుంపఆనపకాయముక్కలపులుసు , అమ్మ తప్ప ఇంకెనరైనా బాగా చేయగలరా..తన్మయంగా తింటున్న విజయ ఉలికిపడింది.
“నాన్న అడుగుతున్నదానికి చెప్పవేం “ అన్న గారి మాటతో ఈలోకంలోకి వచ్చింది.
“ ఏమ్మా, ఇలావచ్చేసావ్, విషయం చెప్పవూ, ఏం జరిగిందీ “ తండ్రి అడుగుతున్నాడు …
అన్న నిశ్శబ్దంగా , విజయ ఏం చెపుతుందో వినడానికి సిద్ధంగా ముద్ద చేత్తో పట్టుకు ఉన్నాడు.
వడ్డిస్తూన్న అమ్మ మడి చీరలో ఉందని కూడా మరచిపోయి, గభాలున లేచి అమ్మని చుట్టుకుపోయి,
“ అమ్మా! నా వంట నాకు బాలేదు, అయినా నీ చేతి వంట తినాలనిపించింది, అమ్మా! బెంగడి అందరనీ చూడాలనిపించి వచ్చేసాను, నిను చూడాలని , పట్టుకు కూచోవాలనిపించింది ఒకసారి. అంతే, నేనేం దెబ్బలాడి వచ్చేయలా. మళ్ళీ మధ్యాన్నం బండెక్కించేయండి , వెళిపోతాను” అంటూ ఆపుకోలేక వెక్కిళ్ళు పెడుతూ ఏడవడం మొదలెట్టింది విజయ.
తండ్రికి , అన్నకి తేలికపడి పెదవులపై నవ్వొచ్చినా .. కళ్ళు మాత్రం చెమర్చాయి తడితో. పిల్లవాడికి అన్నంపెడుతూ , “అత్తయ్యా కాస్త పప్పు వెయ్యండి “, అని అడుగుతూ అక్కడకొచ్చిన వదిన కాంతం కు కూడా కన్నీరు పొంగుకొచ్చింది.
నిబ్బరంగా ఉన్నది అమ్మే. విజయని పట్టుకు ఆపేక్షగా వెన్ను నిమురుతూ , తల చేత్తో రాస్తూ..నెమ్మదిగా” ఓసి పిచ్చిపిల్లా! ఇంతేనా నాకోసమా పరిగెట్టుకొచ్చావు. అమ్మ కోసమా, వెర్రిదానా.. అమ్మ ఎప్పుడూ నీకోసం ఉంటుంది, ఎప్పుడొచ్చినా ఎలా వచ్చినా. సరేనా,దా కూచో, కడుపు నిండాఅన్నం తిను ముందు“ అంది చల్లగా అన్నపూర్ణలా.
ఆ అమ్మ కంచం లో వడ్డించినది అన్నంతో పాటు ,
చెక్కుచెదరని ప్రేమ ధైర్యం నమ్మకం కూడా .
https://www.neccheli.com/2021/02/%e0%b0%a8%e0%b0%bf%e0%b0%a8%e0%b1%8d%e0%b0%a8%e0%b1%81-%e0%b0%9a%e0%b1%82%e0%b0%a1%e0%b0%95%e0%b1%81%e0%b0%82%e0%b0%9f%e0%b1%87-%e0%b0%a8%e0%b0%be%e0%b0%95%e0%b1%81-%e0%b0%ac%e0%b1%86%e0%b0%82/
———–