| పేరు (ఆంగ్లం) | Jampala Chowdary |
| పేరు (తెలుగు) | జంపాల చౌదరి |
| కలం పేరు | – |
| తల్లిపేరు | – |
| తండ్రి పేరు | – |
| జీవిత భాగస్వామి పేరు | – |
| పుట్టినతేదీ | – |
| మరణం | – |
| పుట్టిన ఊరు | దుగ్గిరాల |
| విద్యార్హతలు | – |
| వృత్తి | చైర్మన్, డైరెక్టర్ల బోర్డు, తానా (తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా) |
| తెలిసిన ఇతర భాషలు | – |
| చిరునామా | – |
| ఈ-మెయిల్ | – |
| ఫోను | – |
| వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | http://telugunaadi.com/ |
| స్వీయ రచనలు | – |
| ఇతర రచనలు | – |
| ఈ-పుస్తకాల వివరాలు | http://www.anandbooks.com/Re |
| పొందిన బిరుదులు / అవార్డులు | – |
| ఇతర వివరాలు | తెలుగునాడి పత్రికకు సంపాదకత్వం వహిస్తూ, తెలుగు సాహిత్యానికి సంబంధించిన అన్ని చర్చల్లోనూ విరివిగా పాల్గొనే జంపాల చౌదరి గారికి పరిచయం అక్కర్లేదు జగమెరిగిన వారు వారు. ముఖ్యంగా తెలుగు కథల గురించి విశేషమైన కృషి చేసిన చౌదరి గారు, చాలా కాలం తానా పత్రికకు సంపాదకత్వం వహించారు. |
| స్ఫూర్తి | – |
| నమూనా రచన శీర్షిక | తెలుగు కథ సమకాలీనత, సార్వజనీనత |
| సంగ్రహ నమూనా రచన | కథాసాహితి (హైదరాబాద్) సంస్థ తమ వార్షిక ప్రచురణ కథ పదవ సంపుటం (కథ99) ఆవిష్కరణ సందర్భంగా నేను వ్రాసిన అభిప్రాయానికి శీర్షిక “ఒక దశాబ్దపు తెలుగునాడు కథ.” కథ సంపాదకులను (వాసిరెడ్డి నవీన్, పాపినేని శివశంకర్) అభినందిస్తూ, నేను “తెలుగునాట వీస్తున్న వివిధ రాజకీయ పవనాల్నీ, వాటి తీవ్రతనూ, ఈ కథల సహాయంతోనే తెలుసుకోగలిగాను” అని వ్రాశాను. |
జంపాల చౌదరి
తెలుగు కథ సమకాలీనత, సార్వజనీనత
(డెట్రాయిట్ లో జరిగిన మూడవ అమెరికా తెలుగు సాహితీ సదస్సులో, అక్టోబరు 20, 2002న, చదివిన ప్రసంగ వ్యాసం ఆధారంగా)
కథాసాహితి (హైదరాబాద్) సంస్థ తమ వార్షిక ప్రచురణ కథ పదవ సంపుటం (కథ99) ఆవిష్కరణ సందర్భంగా నేను వ్రాసిన అభిప్రాయానికి శీర్షిక “ఒక దశాబ్దపు తెలుగునాడు కథ.” కథ సంపాదకులను (వాసిరెడ్డి నవీన్, పాపినేని శివశంకర్) అభినందిస్తూ, నేను “తెలుగునాట వీస్తున్న వివిధ రాజకీయ పవనాల్నీ, వాటి తీవ్రతనూ, ఈ కథల సహాయంతోనే తెలుసుకోగలిగాను” అని వ్రాశాను. ఆ అభిప్రాయంలో స్పష్టంగా ఒక ధ్వని ఉంది సమకాలీన జీవితాన్నీ, చరిత్రనూ మంచి కథలు ప్రతిబింబిస్తాయి అని. ఆ వ్యాసం గురించి నాతో ప్రస్తావించిన మిత్రులు ప్రత్యేకంగా ఆ ధ్వనిని గురించే చర్చించారు.
ఒక కథ మంచి కథగా ఎంచబడటానికి సమకాలీనతకు ( contemporaneity ) ఉన్న సంబంధమేమిటి? సమకాలీనం కాని కథలు మంచివి కావా?
కథ2001 సంపుటాన్ని పరిశీలిస్తే, 18 కథల్లో 12 కథలు (అంటే మూడింట రెండు వంతులు) ఇప్పుడు తెలుగునాట జరుగుతున్న సామాజిక, ఆర్థిక, రాజకీయ మార్పుల ఆధారంగా వ్రాసినవే. పోనీ ఇది “కథ” సంపాదకుల అభిరుచి ఫలితం అనుకుని వదిలేసినా, కోడూరి శ్రీరామమూర్తి సంపాదకత్వంలో వచ్చిన కథావార్షిక 2001 పరిశీలించినా ఇదే ధోరణి కనిపిస్తుంది. ఆ సంపుటం తొమ్మిది కథల్లో మూడు కథలు గ్లోబలైజేషన్ నేపధ్యంలో వ్రాసినవి. మరి రెండు మారుతున్న ఆర్థిక నేపధ్యంలో భార్యభర్తల సంబంధాల గురించినవి. ఇంకో రెంటికి ఐటి రంగం నేపధ్యంలో అమెరికాతో ఆంధ్రుల సంబంధాలు ఆధారం. మరో కథకు శ్రీకాకుళం పోరాటం నేపధ్యం. ఒకే ఒక్క కథకు మనుషుల మధ్య ఉన్న సంబంధాలలోని సంక్లిష్టత ముఖ్య వస్తువు.
అంటే తెలుగులో మంచి కథలు అని మనం ఎన్నుకొంటున్న వాటికి ఉన్న సామాన్యత ( commonality ) వర్తమాన సంక్షోభాల్ని ప్రతిబింబించటం. రచనల ముఖ్య లక్ష్యం జీవితాన్ని ప్రతిబింబించటం, వాస్తవిక పరిస్థితుల్ని చిత్రీకరించటం అన్న సిద్ధాంతాలు ఒక అర్థ శతాబ్దంగా తెలుగు సాహిత్యాన్ని నిబద్ధిస్తున్న నేపధ్యంలో, మన కథలకు సమకాలీన సంక్షోభాలే ముఖ్య వస్తువు కావటంలో ఆశ్చర్యం లేదు. ఇదే ధోరణి మిగతా ప్రపంచ సాహిత్యంలో కూడా కనబడుతుందా అని గత రెండేళ్ళ బెస్ట్ అమెరికన్ షార్ట్ స్టోరీస్ సంపుటాల్ని పరిశీలిస్తే, ఇలాటి సమకాలీన నేపధ్యం ఉన్న కథలు నలభై కథల్లో నాలుగో, మహా అయితే ఆరో ఉంటాయి.
శైలి, శిల్పం, భాష, నిర్మాణ సౌష్టవం వంటి శిల్పపరమైన లక్షణాలను కాసేపు పక్కన పెట్టి, ఈ సమకాలీన వస్తువులున్న తెలుగు కథలను పరిశీలిస్తే రెండు రకాల ధోరణులు కనిపిస్తాయి. కొన్ని కథల దృష్టి ప్రస్తుత సమాజంలో ఉన్న సంక్షోభాలు, వైరుధ్యాల పైనే కేంద్రీకరించటంతో, ఆ కథల్లో సార్వజనీనత ( universality ) లోపిస్తుంది. ఆ కథలు వస్తుబలం వల్ల మంచి కథలే అయినా, అవి అసమగ్రంగానూ, ఏకముఖంగానూ ( one-dimensional ) గానూ మిగిలిపోతున్నాయి. కొన్ని కథల్లో మాత్రం జీవితం పట్ల, మానవ సంబంధాల పట్ల రచయితకు ఉన్న తాత్విక దృక్పథం, ప్రశ్నల వల్ల కొన్ని సార్వజనీన సత్యాలను వెలికితీసే ప్రయత్నం ఉంది. ఈ కథలు మిగతా కథలకన్నా ఒక మెట్టు పైన ఉంటున్నాయి.
సార్వజనీనమైన కథ సమకాలీనమే అయి ఉండాల్సిన అవసరం లేదు. ఉదాహరణకు శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి రెండు ప్రసిద్ధ కథలు చూద్దాం. కలుపుమొక్కలు కథాకాలం శాస్త్రిగారికి సమకాలీనమయింది. వడ్లగింజలు కథ ఆయనకు పలు తరాల ముందుది. రెండు కథల్లోనూ (మిగతా విషయాలకు తోడుగా) కనిపించే సార్వజనీన సత్యాలు కొన్నున్నాయి. ప్రభుత్వంలో భాగమైన చిన్నా చితకా అధికారుల అవినీతి, అహంకారాలకు బడుగువారు ప్రతిభ ఉన్నా బలికావటం; ఆర్ద్రత,దయ కల్గిన ఇతర బడుగు వారివద్దే ఆ బడుగువారికి తోడు దొరకటం. ఈ సార్వకాలీన విషయాలకు, కథా సమయం పెద్దాపురం సంస్థానంలో దివాను ఠాణేదార్లు పెత్తనాలు చేసే తరం కాని, స్వాతంత్య్రానంతర కాలంలో తాలూకా బోర్డు అధికారుల తరం కాని అడ్డం రాలేదు.
ఇంకో ఉదాహరణగా నాలుగు సమకాలీన కథలను పరిశీలిద్దాం. ఈ మధ్యలో మనందరినీ బాగా ప్రభావితం చేసిన సంఘటన వరల్డ్ ట్రేడ్ సెంటర్ విధ్వంసం. ఈ సమకాలీన సంఘటన, తత్పరిణామాలు వస్తువులుగా నలుగురు అమెరికన్ తెలుగు రచయితలు వ్రాసిన కథలు నాకు తెలుసు. చంద్ర కన్నెగంటి వ్రాసిన బతుకు (సుజనరంజని డిశంబరు 2001; ప్రజాతంత్ర ప్రత్యేక సాహిత్య సంచిక 2002; కథ2001); కె.వి.ఎస్.రామారావు వ్రాసిన 911 (ప్రజాతంత్ర ప్రత్యేక సాహిత్య సంచిక 2002); ఆరి సీతారామయ్య వ్రాసిన జీతగాళ్ళు (ప్రజాతంత్ర ప్రత్యేక సాహిత్య సంచిక 2002); అక్కిరాజు భట్టిప్రోలు వ్రాసిన నాక్కొంచెం నమ్మకమివ్వు (ఈమాట జులై 2002).ఈ కథలన్నీ సమకాలీన కథలే. పదమూడు నెలల క్రితం జరిగిన ఒక సంఘటన మన జీవితాల్ని ఎలా ప్రభావం చేసిందో చెప్పేవే. శైలీపరంగా బలమైనవే. మనతో చకచకా చదివింపచేసేవే. అయితే ఈ కథల్లో ఉన్న తాత్వికత, సార్వజనీనతల సాంద్రతలలో చాలా తేడాలు ఉన్నాయి. ఆ తేడాలు ఈ కథలు మన మనసులపై వేసే ముద్రల్లో కూడా తేడాలకు కారణమవుతాయి.
కె.వి.ఎస్.రామారావుగారి “911″ కథలో ముఖ్యపాత్ర (ఒక ముస్లిం యువకుడు; ఏ దేశస్థుడో స్పష్టంగా తెలీదు) సెప్టెంబర్ 11న డల్లాస్ వెడుతుండగా అతని విమానం చికాగోలో అర్థాంతరంగా దిగిపోతుంది. అతను ఎఫ్.బి.ఐ. ద్వారానూ, అనేక ఇతర రకాలుగానూ వేధింపులకు గురవుతాడు. అతనికి ముస్లిం టెర్రరిస్టులంటే చాలా సానుభూతి ఉందనీ, అతను కూడా అవకాశం కోసం ఎదురు చూస్తున్న స్లీపర్ టెర్రరిస్టు అయి ఉండవచ్చనీ సూచించే కొసమెరుపుతో కథ ముగుస్తుంది. ఈ కథలో ముఖ్యపాత్ర మనస్తత్వ విశ్లేషణగాని, ఇతర సార్వజనీన విశేషాలగురించి చర్చగానీ లేవు. కనీసం చాలా వివాదాస్పదమైన “ప్రొఫైలింగ్” సమస్య గురించి కూడా రచయిత దృక్పథం ఏమిటో స్పష్టంగా తెలీదు. అందుచేత కథ ముగింపులో రచయిత చమత్కారం ( cleverness ) తప్ప ఈ కథలో గుర్తుపెట్టుకోవాల్సిన, ఆలోచించాల్సిన విషయాలేం మిగల్లేదు.
కన్నెగంటి చంద్ర కథ “బతుకు” సెప్టెంబర్ 11 సంఘటనలు జరిగిన వెంటనే వ్రాసిన కథ. ఈ కథలో ఐటి సంక్షోభంలో, జీవితపు పరుగుపందెంలో సతమతమవుతూ, వ్యాపారపు ఒత్తిళ్ళలో కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తున్న ఒక తెలుగు యువకుడు డబ్య్లుటీసీ విధ్వంసాన్ని టీవీలో చూసిన తర్వాత, డబ్బు, వ్యాపారాల తపనకన్నా కుటుంబసభ్యులతో చిన్న చిన్న ఆనందాలు పంచుకోగలగటమే ముఖ్యం అని గమనిస్తాడు. “ఈ స్పృహ ఇంకా ఎన్నాళ్ళుంటుంది? ఈ స్పృహ రావటానికి ఇంత దారుణం అవసరమా?” అన్న ప్రశ్నలతో కథ ముగుస్తుంది. ఈ కథలో కొంత సార్వజనీనత ఉన్నా, అది సెప్టెంబర్ 11 తర్వాత అమెరికన్లలో కుటుంబంతో కలిసిగడపటం ఎక్కువయింది అనే న్యూస్‌రిపోర్ట్‌ల స్థాయి దాటక పేలవంగా మిగిలిపోయింది. (సహజంగా కవి అయిన చంద్ర డబ్య్లుటీసీ విధ్వంసాన్ని గూర్చి వ్రాసిన కొన్ని పేరాలు మనసును తట్టి ఈ కథను గుర్తుంచుకొనేలా చేస్తాయి అనేది వేరే విషయం).
అక్కిరాజు భట్టిప్రోలు “నాక్కొంచెం నమ్మకమివ్వు” కథలో న్యూయార్క్ డౌన్‌టౌన్లో పని చేస్తున్న ఒక హిందూ భారతీయ యువకుడు, సెప్టెంబరు 11న డబ్య్లుటీసీ 83వ అంతస్తులో పని చేసే పాకిస్తానీ ముస్లిం స్నేహితుడు ఏమయ్యాడో అని పడే ఆందోళనను చిత్రించిన కథ. తమకు బాగా తెల్సిన వాడే అయినా, పాకిస్తానీ ముస్లిం కాబట్టి అతనికి టెర్రరిస్టులతో ఏమన్నా సంబంధం ఉందేమో అని వెనుకాడే మిగతా స్నేహితులతో ఘర్షణ పడి ఆ స్నేహితుడి ఇంటికి బయలుదేరిన కథానాయకుడికి అతని భార్య తోడుగా రావటం ముగింఫు. ఈ కథకు ప్రాణం డబ్య్లుటీసీ సంఘటన రేపిన అనుమానపు విషపరిణామాల గురించి, ఆ విషవాతావరణంలో మనకుండవల్సిన మానవత్వపు విలువల గురించి రచయితకున్న స్పష్టమైన అభిప్రాయం, దాన్ని ఉద్వేగభరితంగా వెలిబుచ్చిన విధానం, స్నేహం, భయం, నమ్మకం, అనుమానం వంటి వైరుధ్యాల మధ్య సంఘర్షణ ఈ కథని బలీయం చేస్తుంది. “స్నేహితుడి మీద ఉన్న నమ్మకం నామీద లేకపోయిందా” అని కథానాయకుడి భార్య వేసిన ప్రశ్న ఈ కథకు ఇంకొక పొరను చేరుస్తుంది.
ఆరి సీతారామయ్య గారి “జీతగాళ్ళు” కథ మిగతా మూడు కథలకన్నా విలక్షణమయింది. ఈ కథ అమెరికాలో జరగదు. అమెరికానుంచి తన గ్రామానికి వెళ్ళిన ఒక యువకుడు అమెరికన్ జెండా ఉన్న టీషర్టు వేసుకోవటం అతని స్నేహితుల్లో కుతూహలాన్ని రేపుతుంది. సెప్టెంబరు 11 తర్వాత, ఇలాటి చిహ్నాలు ధరించి అమెరికా పట్ల ఉన్న ప్రేమ ప్రకటించటం మామూలయిందనీ, ముఖ్యంగా మనబోటివాళ్ళు భద్రతకోసం తీసుకొనే చర్యల్లో ఇది ఒకటనీ వివరిస్తాడు ఆ యువకుడు. ఇదంతా వింటున్న ఒక ముసలాయనకు ఆ ఊళ్ళోనే జరిగిన ఒక విషయం జ్ఞపకానికి వస్తుంది. ఈ యువకుడి తాతకు తను పుట్టిన ఊళ్ళో గడవక, ఈ ఊరికి మొదట కూలివాడుగా వచ్చి, కాలక్రమేణా స్థితిపరుడై, ఊరిపెద్దల్లో తాను ఒక్కణ్ణి అనుకొంటూ ఉంటాడు. ఆ తర్వాత గ్రామంలో ఏదో ఘర్షణలో ఇరుక్కున్న తర్వాత అతనికి అర్థమవుతుంది ఎంత సంపాదించినా, ఎన్నేళ్ళు గడిచినా, ఆ వూళ్ళో తను ఎప్పటికీ జీతగాడుగానే చూడబడుతాడు గానీ, సాటివాడుగా కాదని.
ఈ కథలో రెండు విభిన్న కాలాల, ప్రాంతాల కథలున్నాయి. మొదటి సగం అమెరికాలో సమకాలీన కథ. రెండవ సగం ఆ ఊళ్ళో రెండు తరాల క్రితం కథ. మొదటి భాగం ఒక్కటే కథగా వ్రాసి ఉంటే ఈ కథ పేలవంగానే మిగిలిపోయేది. రెండవ భాగం మొదటి (సమకాలీన) భాగానికి పుష్టిని కలుగజేసింది. మొదటిభాగాన్ని పూర్తిగా వదిలేసి రెండవ భాగం ఒక్కటే ఇంకొంత పెద్దకథగా వ్రాసినా ఆ కథ చిక్కగా, గొప్పగా నిలబడేదే. ఈ కథలో ఉన్న సార్వజనీనత అలాంటిది. రచయిత చెప్తున్న విషయం పొరుగూరు జీతగాడుగా వెళ్ళిన తాతకీ, అమెరికా వెళ్ళిన అతని మనవడికే కాదు, విదేశాలలో ఉన్న భారతీయులకే కాదు, వలస వెళ్ళిన అందరికీ అది తెలంగాణా వెళ్ళిన కోస్తా వారే అయినా, విజయవాడ వలస వచ్చిన సిక్కు కుటుంబం అయినా వర్తిస్తుంది. ఈ సార్వజనీనతే పాఠకుణ్ణి ఒక్క నిమిషం నిలబెడ్తుంది, ఆలోచింపచేస్తుంది. అందుకే ఈ నాలుగు కథలలోనూ నాకు బాగా నచ్చిన కథ ఇదే.
సమకాలీనత పాఠకుడిలో ఉత్సుకత రేపుతుంది. రచయిత దృక్పథం, శైలి, సమర్థత సమకాలీన వస్తువుని మంచికథగా మలచవచ్చు. ఆ కథలు గొప్ప కథలు కావాలన్నా, నాలుగు కాలాలు నిలవాలన్నా ఆ కథల్లో సార్వజనీనత, సార్వకాలికత కూడా ఉండాల్సిందే.
https://eemaata.com/em/issues/200211/1660.html
———–