పేరు (ఆంగ్లం) | Vempalli Shariff |
పేరు (తెలుగు) | వేంపల్లి షరీఫ్ |
కలం పేరు | షరీఫ్ |
తల్లిపేరు | నూర్జహాన్ |
తండ్రి పేరు | రాజాసాహెబ్ |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | – |
మరణం | – |
పుట్టిన ఊరు | – |
విద్యార్హతలు | – |
వృత్తి | టీవీ జర్నలిస్టు, రచయిత |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | అంజనం,తియ్యని చదువు (2017)- పిల్లల కథలు టోపి జబ్బార్ (2017)- కథల సంపుటి కథామినార్ (2018) – కథా సంకలనం తలుగు – ఏక కథాపుస్తకం |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | https://www.telugubooks.in/products/jumma, |
పొందిన బిరుదులు / అవార్డులు | కేంద్రసాహిత్య అకాడెమి యువ పురస్కారం (జాతీయ పురస్కారం) 2012 గిడుగు రామ్మూర్తి పంతులు భాషా పురస్కారం (ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం) 2017 విమలాశాంతి సాహిత్యపురస్కారం (అనంతపురం) డా.కవితా స్మారక సాహిత్య పురస్కారం (కడప) కొలకలూరి భగీరథి కథా పురస్కారం (తిరుపతి) కథాపీఠం సాహిత్య పురస్కారం (రచన ప్రతిక) అక్షర గోదావరి కథా సాహిత్య పురస్కారం (విశాఖ) 2017 వేదగిరిరాంబాబు కథానిక పురస్కారం (హైదరాబాద్) 2017 విళంబి నామ ఉగాది పురస్కారం ( ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం) 2018 కన్నడ సాహిత్యపరిషత్ పురస్కారం (కర్ణాటక ప్రభుత్వం) 2018 చాసో సాహితీ స్ఫూర్తి పురస్కారం (విజయనగరం) 2018 కువెంపు భాషా భారతి ప్రాదికార పురస్కారం (బెంగళూరు) 2019 |
ఇతర వివరాలు | – |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | ముస్లిం దృక్కోణంలో మనిషి కథలు |
సంగ్రహ నమూనా రచన | నూరేళ్ళు పైబడ్డ తెలుగు కథ అనేక వాదాలు, ఉద్యమాల మీదుగా ప్రయాణం చేసింది. ప్రముఖంగా గత రెండు మూడు దశాబ్దాలలో స్త్రీవాద, దళితవాద కథలు, ఈ మధ్య కాలంలో మైనారిటీ కథలు విరివిగా వచ్చి తెలుగు కథకు విస్తృతిని పెంచాయి. ఈ తరహా కథలను నేను రెండు రకాలుగా విభజిస్తాను. |
వేంపల్లి షరీఫ్
ముస్లిం దృక్కోణంలో మనిషి కథలు
నూరేళ్ళు పైబడ్డ తెలుగు కథ అనేక వాదాలు, ఉద్యమాల మీదుగా ప్రయాణం చేసింది. ప్రముఖంగా గత రెండు మూడు దశాబ్దాలలో స్త్రీవాద, దళితవాద కథలు, ఈ మధ్య కాలంలో మైనారిటీ కథలు విరివిగా వచ్చి తెలుగు కథకు విస్తృతిని పెంచాయి. ఈ తరహా కథలను నేను రెండు రకాలుగా విభజిస్తాను. మొదటిరకం కథలు ఒక వర్గం మరో వర్గం నుంచి ఎదురయ్యే discrimination గురించి తెలియజేసేవి. ఆ రకంగా చూస్తే ప్రతి పేదవాడి తిరుగుబాటు కథ ఇదే కోవలోకి వస్తుంది. పురుషాహంకారాన్ని వ్యతిరేకిస్తూ రాసిన ప్రతి స్త్రీవాద కథా ఇదే కోవలోకి వస్తుంది. బ్రాహ్మనిజాన్ని అధిక్షేపించే ప్రతి దళిత కథ ఇదే కోవలోకి వస్తుంది. ఇక రెండో వర్గం కథలు చూపించే జీవితాలు, వినిపించే వ్యధలు వేరే. ఇవి ఆయా సామాజిక వర్గానికి మాత్రమే చెందిన కొన్ని పార్శ్యాలను చూపిస్తాయి. వారి జీవనవిధానాన్ని, వారికి జీవితాలలో మాత్రమే జరిగే కథలను వినిపిస్తాయి.
ఈ రెండు రకాల కథలకూ వాటి వాటి ప్రయోజనాలు ఉన్నాయి. సాహిత్యంలోనే కాకుండా, సోషయలజీ దృక్కోణంలో చూసినా ఈ రెండు రకాల కథల అవసరం ఉంది. మొదటిది కొంత ధిక్కార ధోరణిని, మరి కొంత తిరుగుబాటు లక్షణాలని ప్రదర్శిస్తూ కొన్ని మౌలికమైన ప్రశ్నలతో సమాజాన్ని ఆలోచింపజేస్తుంది. రెండో రకం కథ ఆయా సామాజిక, సాంఘిక వర్గాన్ని మరింత దగ్గరగా అర్థం చేసుకునే అవకాశాన్ని ఇవ్వడం ద్వారా రెండు వర్గాల మధ్య సమన్వయానికి దోహదపడుతుంది. నా ఉద్దేశ్యంలో మొదటి రకం కథ రాయడం కన్నా రెండో రకం కథలు రాయటం కష్టమైన పని. అందుకు ఎంతో అవగాహన, ప్రశ్నించే కసితో పాటు మరెంతో సంయమనం అవసరం. అలాంటి సంయమనంతో రాసిన కథలే వేంపల్లి షరీఫ్ రాసిన జుమ్మ లో కనిపిస్తాయి.
నిజానికి ఈ కథలలో అత్యధికం ముస్లిం జీవనానికి సంబంధించినవే అయినప్పటికీ వీటిని కేవలం మైనార్టీ కథలుగా గుర్తించడం ఆ కథల విస్తృతిని కుదింపజేయడమే అవుతుంది. దృక్కోణం ఒక సామాజిక వర్గానిదే అయినా సార్వజనీయమైన ఒక మానవతాంశాన్ని కదిలించి, ప్రతి ఒక్కరి చేత కన్నీరు పెట్టించగలగడం ఈ కథల ప్రత్యేకత. ప్రతి కథ రాయటంలో ఎంతో శ్రద్ధ, కథాంశంలో ఒక నిబద్దత, అక్షరం అక్షరం వెనుక ఒక తపన స్పష్టంగా కనిపిస్తాయి. అందువల్లే ఈ కథలు జాతీయస్థాయి గుర్తింపును అందుకోగలిగాయి.
ఈ పుస్తకంలో ఉన్న మొదటి మూడు కథలు – పర్దా, జుమ్మా, ఆకుపచ్చ ముగ్గు, తెలుగోళ్ళ దేవుడు కథలను మినహాయించి మిగిలిన కథలలో ముస్లిం పాత్రలను తీసి వేరే ఏ పేరు పెట్టినా కథ మారదు. ఆ మూడింటి గురించి తర్వాత మాట్లాడుకుందాం. మిగిలినవి ఇందాక చెప్పినట్లు సార్వజనీయమైన కథలు. “చాపరాయి”, ’జీపొచ్చింది” కథలు ముస్లింలకు సంబంధించినవి కావు. నిజానికి “రజాక్ మియా సేద్యం” కథలో రజాక్ మియాకి, “జీపొచ్చింది” కథలో వెంకట్రెడ్డి కి కథ పరంగా చూస్తే పెద్ద తేడా వుండదు. రజాక్ మియాను వేధించింది అంగబలం వున్న వ్యక్తి అయితే, వెంకట్రెడ్డిని వేధించింది సాక్షాత్తూ సర్కారే. కానీ ఒక ముస్లిం సేద్యం చెయ్యాలని ప్రయత్నించడంలో ఒక వేదన వుంది. తరతరాలుగా దర్జీలుగా, మెకానిక్కులుగా వుంటూ తద్ఫలితంగా పేదరికాన్ని అనుభవిస్తున్న ఒక జాతి మొత్తాన్ని అతను ప్రతిబింబిస్తాడు. అలాగే అమ్మమ్మ దగ్గరకు వెళ్ళాలన్న కోరిక తీరక “దస్తగిరి చెట్టు” చెట్టును అరచేతిలోనే చూసుకోని మొక్కుకునే పిల్లాడు ప్రతి పేదింటిలోనూ కనిపిస్తాడు. ఎవరో “అంజనం” వేసి చెప్పిన మాట నమ్మి తన బిడ్డ వస్తాడని ఆశగా ఎదురుచూసే జమ్రూత్ లాంటి అమ్మలు అందరికీ తెలిసివాళ్ళే. “పలక పండగ” కోసం పలక కావాలని వేధించే మదారు లాంటి పిల్లలూ మనకి కొత్తకాదు. “రూపాయి కోడిపిల్ల” తో ఆడుకునే అంజాద్ మనందరి బాల్యంలోనూ వున్నాడు.
అలాగని కథకుడు ముస్లింలకి, ముస్లిమేతరులకు మధ్య వున్న వ్యత్యాసాన్ని, ఇతరులలో ముస్లింల పైన వున్న అభిప్రాయాన్ని విస్మరించాడని అనడానికి లేదు. “అమ్మమ్మోళ్ల వూరికెళ్తే ఏమొస్తాదిరా నీ బొంద…. ఎక్కడిగైనా ఎళ్లి ఒగ మంచి పదేశం జూసిరా” అనే ఎక్కాల్సారు (దస్తగిరి చెట్టు), “పిల్లాడికి పలకిప్పంచంది బడికి పంపొద్దని” చెప్పే రామకృష్ణ సారు (పలక పండగ), “సాయిబులు మీకెందుకు మామా సేద్యం” అనే అంజిగాడు (రజాక్ మియా సేద్యం) వీళ్ళందరూ ముస్లిం జీవన విధానాన్ని, వారి పేదరికాన్ని విస్మరించారని అంతర్లీనంగా చెప్తూనే వున్నాడు. ఇక “తెలుగోళ్ళ దేవుడు” కథలో ఆ విషయాన్ని స్పష్టంగా చెప్తూ, పరిష్కారానికి అందరూ కలిసి నడవాలని సూచించాడు కూడా.
ఇక ఈ కథా సంకలనానికి తలమానికమైనవి మొదటి మూడు కథలు.
కొడుకు చిన్నప్పుడు పస్తులున్నాడని ఇల్లిల్లూ అడుక్కున్న తల్లి, అదే బిడ్డ పెద్దై గోషా పేరుతో పర్దా కట్టడాన్ని నిరసించే జేజి కథ – “పర్దా”. ఇక్కడ పర్దా కేవలం ముస్లిం సాంప్రదాయానికి సంబంధించినది కాదు. పర్దా మనందరిలో వుండే హిపోక్రసీకి ఒక సింబల్. అందుకే మన చుట్టుపక్కల హిపోక్రసీ కనపడినప్పుడల్లా ’జేజి’ ఒక దెప్పిపొడుపులా గుర్తొచ్చి తీరుతుంది. మళ్ళీ ఇక్కడ కూడా జేజి పాత్ర మనకు బాగా పరిచయమైన వ్యక్తి లాగే వుంటుంది. తిరిగే కాలు, తిట్టే నోరుతో రౌడీలా బతికిన జేజి కేవలం చరమాంకంలో కొడుకు, కోడలు పంచన చేరి మాటపడాల్సి రావడం బాధిస్తుంది. ఎన్ని మాటలన్నా పడ్డ జేజి కొడుకు పరువు కోసం సంప్రదాయం ముసుగును పర్దాగా వేస్తానంటే తిరగబడుతుంది. పల్లె పట్నం మధ్య వున్న వ్యత్యాసాన్ని గుర్తించి – “అడుక్కున్నా పర్వాలా.. నేనీడ ఉండలేను” అని ప్రకటిస్తుంది.
అవకాశం లేకపోయినా ఆశల్ని వదులుకోని జీనత్ అక్క “ఆకుపచ్చ ముగ్గు”లో అబ్బురపరుస్తూనే కలుక్కుమనిపిస్తుంది. హిందువుల ఇంటి ముందు ముగ్గు ముస్లిం చేతి పైన మెహందీ అవుతుంది. రెండు మతాల మధ్య తేడా ఇంతేనా అంటాడు కథకుడు. ఇంత చిన్న వ్యత్యాసాన్ని తెలుసుకోడానికి జీనత్ అక్క చిన్నప్పటి నుంచి ఎన్ని తిట్లు తింటుందో. ఎన్నెన్ని కష్టాలు కొని తెచ్చుకుంటుందో. ఇదంతా ఒక ఎత్తు.. జీనత్ అక్క పట్టుదలతో చెయ్యాలనిపించిన పని చెయ్యగలగడం చూస్తే మనకి ఏదో పర్వతారోహణ చేసిన తృప్తి కలుగుతుంది. అలాంటి అక్క మీద జాలేస్తుంది. ఆమె గుంటపడిన కళ్ళలో కన్నీరవ్వాలనిపిస్తుంది.
ఇక జుమ్మా – ఇది జుమ్మా కథే కాదు. అమ్మ కథ కూడా. ప్రతి జుమ్మాకీ మసీదు వెళ్ళాలని కొడుకుని ప్రోత్సహించిన ఓ తల్లి, ఒక శుక్రవారం మసీదులో జరిగిన బాంబు పేళ్ళుళ్ళకి భయపడి – “నువ్వు కానీ మసీదుకు వెళ్ళలేదు కదా నాయనా” అంటుంది. ఆ మాట అనడానికి ఆ తల్లి ఎంత మధనపడి వుంటుందో కదా..! కన్నపేగు కోసం మతాచారాన్నే కాదనాల్సి వచ్చిందని ఆ తల్లి ఎంత తల్లడిల్లి వుంటుందో..!! కలకాలం గుండెల్లో గుబులుగా మిగిలిపోయే కథ.
ఈ కథలు ఇంత బలమైన అనుభూతిని ఇవ్వగలిగాయంటే అందుకు కారణం ఒకటే – ఇవన్నీ ప్రతి మనిషికి సంబంధించిన primal emotions తట్టి లేపుతాయి. కాబట్టే ఇవి ఇంత వైశిష్ట్యాన్ని సంతరించుకున్నాయి.
తప్పకుండా చదవాల్సిన పుస్తకం.
http://pustakam.net/?p=14226
———–