సయ్యద్ నసీర్ అహ్మద్ (Syed Naseer Ahmed)

Share
పేరు (ఆంగ్లం)Syed Naseer Ahmed
పేరు (తెలుగు)సయ్యద్ నసీర్ అహ్మద్
కలం పేరు
తల్లిపేరుతల్లి బీబీ జాన్
తండ్రి పేరుసయ్యద్ మీరాఁ మొహియుద్దీన్
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ11/22/1955
మరణం
పుట్టిన ఊరునెల్లూరు
విద్యార్హతలు
వృత్తిపరిశోధకుడు
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుభారత స్వాతంత్య్రోద్యమం : ముస్లింలు
భారత స్వాతంత్య్రోద్యమం : ముస్లిం మహిళలు
భారత స్వాతంత్య్రోద్యమం : ముస్లిం ప్రజాపోరాటాలు
భారత స్వాతంత్య్రోద్యమం : ఆంధ్ర ప్రదేశ్‌ ముస్లింలు
భారత స్వాతంత్య్రసంగ్రామం : ముస్లిం యోధులు (ప్రథమభాగం)
షహీద్‌-యే – ఆజం అష్ఫాఖుల్లా ఖాన్‌
మైసూరు పులి టీపూ సుల్తాన్‌
చిరస్మరణీయులు
1857: ముస్లింలు
అక్షరశిల్పులు (333 మంది ముస్లిం తెలుగు రచయితల, కవుల వివరాలతో కూడిన పుస్తకం)
కువైట్ కబుర్లు
అష్ఫాఖ్ – బిస్మిల్
చరితార్దులు (1757 నుండి 1947 వరకు సాగిన బ్రిటిష్ వలస పాలకులకు వ్యతిరేకంగా పోరాడిన 155 మంది ముస్లిం యోధుల ఆల్బమ్)
రాంప్రసాద్ బిస్మిల్ – అస్ఫాక్హుల్లా ఖాన్
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికనసీర్ అహ్మద్ రచనల ప్రధానాంశం
సంగ్రహ నమూనా రచనఆయన దృక్పథంలో ప్రధానాంశం భారతీయ ముస్లింలు, జాతీయోద్యమ థ నుండి అంతకుముందు సాగిన సాయుధ పోరాట థ నుండి భారతదేశాన్ని రక్షించడానికి, విముక్తం చేయడానికి భారత స్వాతంత్య్రోద్యమంలో తమ నెత్తురు ధారబోశారు. అది ఈ భూమిలోకి ఇంకినంతగా అక్షరాల్లోకి ప్రవహించలేదు.

సయ్యద్ నసీర్ అహ్మద్

ఆయన దృక్పథంలో ప్రధానాంశం భారతీయ ముస్లింలు, జాతీయోద్యమ థ నుండి అంతకుముందు సాగిన సాయుధ పోరాట థ నుండి భారతదేశాన్ని రక్షించడానికి, విముక్తం చేయడానికి భారత స్వాతంత్య్రోద్యమంలో తమ నెత్తురు ధారబోశారు. అది ఈ భూమిలోకి ఇంకినంతగా అక్షరాల్లోకి ప్రవహించలేదు. ఆ కారణంగా ప్రజాబాహుళ్యం ఎరుకలోకి రాలేదు. ఇది కుట్రే. అని ఆయన ఉద్దేశం. అంతేకాదు భారతీయ ముస్లింలు భారత స్వాతంత్య్రోద్యమంలో ప్రజాస్వామిక సైన్యంగా పాల్గొన్నారు, పోరాడారు. తమ సామాజిక శక్తిని, రాజకీయశక్తిని మొత్తంగా భారతీయ సమాజానికి అర్పించారు. చరిత్ర ఈ విషయాన్ని విస్మరిస్తే అది అసమగ్ర చరిత్ర అవుతుందని నశీర్‌ అహమ్మద్‌ ప్రతిపాదన. ఈ ప్రతిపాదనే ఆయన నూతన చారిత్రిక దృక్పథానికి వెలుగు తెచ్చింది. అయితే ఇటువంటి ప్రతిపాదనలు చేయడం అంత తేలికైన పనికాదు. అణిచివేసిన వాడి నుండే ఆయుధాన్ని చేత బూనాలి. అంతేకాదు దేన్ని నాశనం చేశారో అక్కడి నుండే మూలాలు వెతకాలి. దానికి అవసరమగు పరిశోధనా దృష్టి నశీర్‌కు ఉంది. చరిత్రకారుడు పరిశోధకుడు కలిస్తే చరిత్ర కాల్పనికం కాకుండా సత్యనిష్టం అవుతుంది. అందుకనే తాను రాసిన చరిత్ర గ్రంథాలలో ఆయన పుంఖాను పుంఖాలుగా ఉపపత్తులు మన ముందుంచుతున్నారు. ఎవ్వరూ కాదనలేని ప్రమాణాలు చూపిస్తున్నారు. అది సత్యనిష్టయే కాకుండా చారిత్రక పరివర్తితం కావడం కోసం తేదిలు, సంఘటనలు కూడా ఆయన ఇస్తున్నారు. దీంతో ఆయన ఒక ప్రామాణిక చరిత్రకారుడుగా నిగ్గుతేలారు.
ముస్లింల చరిత్రలో మూడు గొప్పతనాలు ఉన్నాయి. ముస్లింలు లేకుండా భారతదేశ చరిత్ర నిర్మించలేము. ముస్లింల శ్రమ లేకుండా భారత ఉత్పత్తులు లేవు. ముస్లింల సంస్కృతి లేకుండా భారతదేశ సంస్కృతి-నాగరికత పరిపూర్ణం కాదు. ఈ మూడు అంశాలను నశీర్‌ అహమ్మద్‌ తన గ్రంథాలలో అంతర్లయగా ప్రవహింపచేశారు. అంతేకాదు సోషలిస్టులుగా, గాంధేయవాదులుగా, విప్లవోద్యమకారులుగా, సెక్యులరిస్టులుగా ముస్లింల భావజాల ఉద్యమాలను కూడా లిఖించడం, ఆయనలోని హేతుబద్ద ఆలోచన విధానం వల్లే సాధ్యమైంది. మత దురహంకారానికి భిన్నంగా ఎవరెవరు ప్రవర్తించారో చెబుతూ, భారత స్వాతంత్య్రోద్యమం ః ఆంధ్రప్రదేశ్‌ ముస్లింలు’ గ్రంథం (101వ పుట) లో ఆయన ఇలా పేర్కొన్నాడు.
‘ఆ రోజుల్లో మతదురహంకారానికి దూరంగా ఉన్న సిరాజుల్‌ హసన్‌ తిర్మిజ్‌, డాక్టర్‌ అక్బర్‌ అలీ, జలాలుద్దీన్‌, హసన్‌ ముహమ్మద్‌ పహిల్వాన్‌, విూర్‌ అహమ్మద్‌ అలీ ఖాన్‌, డాక్టర్‌ లతీఫ్‌ సయూద్‌ లాంటి వారు స్వాతంత్య్రోద్యమంలో పాల్గొనడం మాత్రమే కాదు విలీనం కోరుతూ కూడా ఉద్యమించారు. సామ్యవాద సిద్థాంతాలకు ఆకర్షితులై సమసమాజ స్థాపన లక్ష్యంగా కమ్యూనిస్టు పార్టీలో భాగస్వాములైన మగ్దూం మొహిద్దీన్‌, అలం ఖుంద్‌ విూర్‌, హసన్‌ నాసిర్‌, జవ్వాద్‌ రజ్వి, ఆఖ్తర్‌ హుస్సేన్‌, జహందర్‌ అస్ఫర్‌, కుతుబ్‌-యే-ఆలం, అహసన్‌ అలీ విూరజ్‌, విూరాజ్‌ హైదర్‌ హుస్సేన్‌, హుస్సేని షాహిద్‌ లాంటి వివిధ రంగాలలో ప్రతిభావంతులైన ప్రముఖులు నైజాం సంస్థానం ఇండియన్‌ యూనియన్‌లో విలీనం కావాలని డిమాండ్‌ చేశారు.’ ఇందులో ఆయన ఇరువది నామవాచకాలను ఇచ్చారు. ఇవన్నీ చరిత్రలో నిర్లక్ష్యం చేయబడిన పేర్లే.
భారతదేశంలో వచ్చిన అన్ని వాదాలకు బ్రాహ్మాణులే నాయకులు. బ్రాహ్మణేతరులున్నా వారు త్రైవర్ణాల్లోని వారే. గాంధీవాదానికి గాంధీ నాయకుడు. ఆయన వైశ్యుడు. కమ్యూనిస్టు వాదానికి డాంగే నాయకుడు. ఆయన బ్రాహ్మణుడు. సోషలిస్టు వాదానికి రాం మనోహర్‌ లోహియా నాయకుడు. ఆయన వైశ్యుడు. ఈ మూడు వాదాల్లో పనిచేసిన ముస్లింలు అందులో కూడా ఆణగద్రొక్కబడ్డారు. వారందర్ని నశీర్‌ అహమ్మద్‌ ముందుకు తెచ్చారు. డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ ‘వాట్‌ కాంగ్రెస్‌ అండ్‌ గాంధీ హ్యావ్‌ డన్‌ టు అన్‌టచ్‌బుల్స్‌’ గ్రంథంలో గాంధీ కాంగ్రెస్‌ అశ్ప్రశ్యులను నిర్లక్ష్యం చేసిందని చెప్పాడు. ‘భారత స్వాతంత్య్రోద్యమం ః ఆంధ్రప్రదేశ్‌ ముస్లింలు’ గ్రంథంతోపాటుగా సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ వెలువరించిన గ్రంథాలన్నిటిలో జాతీయోద్యమంలో పనిచేసిన ముస్లింలు చారిత్రక నిర్లక్ష్యానికి గురయ్యారని సాధికారికంగా, సప్రమాణంగా నిరూపించారు. అంతేకాకుండా ఆయన ప్రతిపాదించిన ముస్లిం స్వాతంత్య్ర సమరయోధులందరూ ఎదోక ఆంశంలో ప్రతిభావంతులు అని కూడా నిగ్గుతేల్చారు. నశీర్‌ గొప్పతనం ఎమిటంటే మెయిన్‌ స్ట్రీమ్‌ సమాజం కూడా వీటినుండి ఎంతో నేర్చుకోవాల్సి ఉంది అని చెప్పాడు. వ్యక్తిత్వ నిర్మాణం మీద కూడా ఆయన తన గ్రంథాలలో కృషిచేశారు. దీని వల్ల ముస్లిం విద్యార్థులు, మేధావులు ఈయన గ్రంథాలను చదివి ‘మాలో నుండి ఇంతమంది గొప్పవారు వచ్చారు. వీరంతా మాకు ఆదర్శం. వీరి జీవితాలను అధ్యయనం చేయడంవల్ల మాలో కూడా గొప్ప వ్యక్తిత్వ నిర్మాతలున్నారు’ అనే ఆత్మగౌరవ భావం ప్రదీప్తమవుతుంది.
భారత స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్‌ ముస్లింల గురించి ఆశ్చర్యాన్ని కలిగించే వివరాలతో నశీర్‌ రూపొందించిన ‘భారత స్వాతంత్య్రోద్యమం ః ఆంధ్రప్రదేశ్‌ ముస్లింలు’లో మీర్‌ అక్బర్‌ అలీ ఖాన్‌ గురించి రాస్తూ, ముస్లింల్లోని ప్రముఖులు జాతీయోద్యమ కాలంలో కళాశాల నుండి విశ్వవిద్యాలయాల నుండి పోరాటాలలో పాల్గొని ఆ తరువాత లండన్‌ వెళ్ళి తమ విద్యాభ్యాసాలు కొనసాగించి మళ్ళీ తమకు తాము ఎలా నిలబడ్డారో (279 పేజీలోని) ఒక్క పేరాలోనే ఆయన ఇలా చెప్పాడు.
‘1920లో ఖిలాఫత్‌-సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగంగా ప్రభుత్వ గ్రాంటులతో నడుస్తున్న కళాశాలలను బహిష్కరించమని గాంధీజీ ఇచ్చిన పిలుపు మేరకు అలీఘర్‌లో విద్యాభ్యాసం చేస్తున్న అక్బర్‌ అలీ ఖాన్‌, డాక్టర్‌ జాకీర్‌ హుస్సేన్‌ లాంటి ప్రముఖుల బాటలో జాతీయోద్యమంలో ప్రవేశించి కళాశాలను బహిష్కరించారు. ఆ తరువాత జాతీయ ముస్లిం విశ్వవిద్యాలయం (జామియా మిలియా ఇస్లామియా) లో ప్రవేశించి విద్యాభ్యాసం చేస్తూ జాతీయోద్యమంలో పాల్గొన్నారు. ఆ ఉద్యమ విరమణ తరువాత లండన్‌ వెళ్ళి న్యాయశాస్త్రంలో పట్టా పొంది న్యాయవాదిగా తిరిగి వచ్చి హైదరాబాద్‌లో స్థిరపడ్డారు’. నశీర్‌ రాసిన ఈ చరిత్రను చదివితే ఆయనలోని అధ్యయనశీలత బయటపడుతుంది. అంటే అనేక అంశాలను తన దృక్పధం నుండి సంక్షిప్తీకరించి చెప్పడం.
నశీర్‌ అహమ్మద్‌ చరిత్రను తరంగాలు తరంగాలుగా పెయింట్‌ చేస్తారు. అంటే ఆయన రచనా క్రమంలో ఒక విజ్యువలైజేషన్‌ ఉంది. అందువల్లే ఆయన పుస్తకాలు ఆయనతోపాటుగా పాఠకుడ్ని సుదూరాలకు తీసుకువెడతాయి. దృక్ఫదం లేని గ్రంథాలు విజ్ఞానంగా మిగిలిపోతాయి. మన గ్రంథాలయాలన్నీ ఈ పుస్తకాలతో నిండి పోయాయి. పుస్తకం చదివాక ఒక ఫీల్‌ ఉంటుంది గాని ఒక దిశానిర్ధేశనం ఉండటం లేదు. నశీర్‌ గ్రంథాల్లో దిశానిర్దేశనం ఉంది. స్పష్ఠమైన మార్గం ఉంది. అందుకే ఆయనను మనం చరిత్రకారుడుగానే కాకుండా ఇంటలెక్చువల్‌గా చూడాలి. ఇంటలెక్చువల్‌ అంటే విషయ సంపన్నంగా ప్రచారం ఉంది. కాని విషయం నుండి కొత్త అంశాన్ని సృష్టించే వాడ్నే ఇంటలెక్చువల్‌ అంటాం. ఇటువంటి కొత్త ప్రతిపాదనలు నశీర్‌ చాలా చేశారు. చాలా నిశితంగా చూసినప్పుడు ఆయన ప్రతిపాదనలు అందుతాయి. పాఠకుడు నశీర్‌ను అభిమానించటమో, ప్రేమించటమో చేయాలి. చేయకపోతే సమాచారాన్ని మాత్రమే అందుకుంటాడు. అయన అంర్గతంగా ప్రవహింప చేసిన భావజాలాన్ని, భావోద్వేగాన్ని అందుకోలేడు. అందుకని పాఠకుడ్ని ఒక మూడుసార్లన్నా ఆయన ప్రతి గ్రంథం చదవమని నేను కోరుతున్నా.
ముఖ్యంగా నశీర్‌ తాను అనుకున్న విమర్శలను వ్యక్తిత్వాల చేత చెప్పిస్తారు. ప్రస్తుతం నా అధ్యయనంలో ఉన్న ‘భారత స్వాతంత్య్రోద్యమం ః ఆంధ్రప్రదేశ్‌ ముస్లింలు’లో జాతీయోద్యమంతోపాటుగా కమ్యూనిస్టు ఉద్యమంలో పాల్గొన్న మహిళానేత జమాలున్నీసా బాజీ గురించి రాస్తూ కమ్యూనిస్టులు ఏం చేస్తున్నారో అన్న ఆమె వ్యాఖ్యానాన్ని (పేజీ 300లో) ఇలా ఉటంకించారు. ‘చివరి వరకు కమ్యూనిస్టుగా కొనసాగిన ఆమె ఆనాటి త్యాగాలను, ఈ వివరాలను తెలిపేనాటికి కమ్యూనిస్టు పార్టీ పరిస్థితి, పార్టీ నాయకులు వారి కుటుంబాల తీరుతెన్నులను తన కుటుంబ సభ్యుల త్యాగాలతో పోల్చుతూ, ఇక, ఇప్పుడు పార్టీ లీడర్ల పిల్లల్ని చూస్తే…వాళ్ళు పార్టీకై ఏమి చేయరు. కొంత మంది మాస్కో వెళ్ళి వచ్చారు. అయితే పార్టీకేంచేశారు? నా అన్నదమ్ములు-జఫర్‌ ఆక్సిడెంటులో చనిపోయాడు. ఆన్వర్‌ చాలా కష్టాలు పడ్డాడు. జాల్నా జైలులో ఉన్నాడు. ఆరోగ్యం పూర్తిగా దెబ్బతిని తర్వాత చనిపోయాడు. ఆయన కూతురు ఎం.ఎస్‌.సి చేస్తున్నది. భార్య తర్వాత చదువుకుని ఉద్యోగం చేసింది…ఆ రోజుల్లో 500 మంది స్త్రీలను పోగుచేయగలిగేదాన్ని. ఇప్పుడు 50 మంది రారు, అంటూ జమాలున్నీసా బాజీ నిరాశను వ్యక్తంచేశారు.’ కమ్యూనిస్టు పార్టీ ఏ క్యాపిటలిజాన్ని ఎదిరించిందో ఆ క్యాపిటలిజంలో ఇరుక్కుపోయింది. చాలా మంది కమ్యూనిస్టు కార్యకర్తలు లగ్జరీకి, ఇండువిడ్యులిజానికి అలవాటు పడ్డారు. దీంతో పాతరతం కమ్యూనిస్టులు ఇప్పుడున్న వారితో పోల్చి విశ్లేషణ చేస్తున్నారు.
బహుగ్రంథ రచయిత సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ మంచి మనిషి, స్నేహపాత్రులు. అందుకే ఆయన తాను రాసే వ్యక్తులు జీవించి ఉంటే కలిశారు. సుదూర ప్రయాణాలు చేశారు. వారి కుటుంబ సభ్యులతో మమేకం అయ్యారు. వారి వ్యధను అర్థం చేసుకున్నారు. నిర్లక్ష్యపూరిత మైనది ప్రతిదీ వ్యధార్థమవుతుంది. దాన్ని లిఖించాడు. అదే ఈనాడు కావాల్సింది. ఇప్పటి రచయితలు పుస్తకాలు మాత్రమే వెతికి రాస్తారు. మస్తకాల గురించి వారికి తెలియదు. పుస్తకాన్ని మస్తకాన్ని కలిపి పెనవేయడమే నశీర్‌ రచనా శిల్పం.

———–

You may also like...