పేరు (ఆంగ్లం) | Eanuganti Venugopal |
పేరు (తెలుగు) | ఎనుగంటి వేణుగోపాల్ |
కలం పేరు | – |
తల్లిపేరు | – |
తండ్రి పేరు | – |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | 12/27/1966 |
మరణం | – |
పుట్టిన ఊరు | కరీంనగర్ జిల్లా జగిత్యాల |
విద్యార్హతలు | ఎం. ఏ |
వృత్తి | కథా రచయిత మరియు ఉపాధ్యాయుడు |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | అమ్మ నేర్పిన పాట అమ్మనై కరిగిపోతా ఆ దృశ్యం చెదిరిపోనీయకు ఆఫీసర్ అంజి ఆషాఢమా మాకీ వగపెందుకే ఎవరు పిలిచినా ఆ… కథ మలుపు తిరిగింది కనురెప్పలు క్షమించుకన్నా ఋణం గురుదేవోభవ చిట్టిబాబు ప్రేమకథ చెల్లియో…చెల్లకో తగినశాస్ అమ్మ ఆవేదన తల్లిమనసు నన్ను దోచుకొందువటే పంపకాలు పరివర్తన పసందైన వంటకంబు పాపం గోపాలం పుత్రధర్మం పేరులేని కథ (ది రేప్) ప్రేమాయనమ బావిపోయింది బాస్ బుజ్జిగాడి బెంగ[2] మట్టి జీవితాలు మనసంతా నువ్వే మిధునం మిలీనియం బేబీ మాతుఝె సలామ్ యమలోకంలో భూలోక రెండుగుండెల చప్పుడు సురభి లంచం లాలిపాటనై… లిఫ్ట్ |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | – |
ఇతర వివరాలు | ఎనుగంటి వేణుగోపాల్ (జననం: డిసెంబర్ 27, 1966) కథా రచయిత మరియు ఉపాధ్యాయుడు.ఇతని కథలు ఆంధ్రప్రభ, ఆంధ్రభూమి, ఈవారం, నవ్య, కథాకేళి మరియు స్వాతి వంటి పత్రికల్లో కథలు వ్రాసారు. |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | బుజ్జిగాడి బెంగ |
సంగ్రహ నమూనా రచన | చల్లగాలి ఎంచక్కా ఆగి ఆగి వీస్తోంది. వెనకాలే మట్టివాసన వస్తోంది. ఆ వాసన ఎంతో బావుంటుంది. అందుకే గట్టిగా పీల్చాను. వెంటనే మాథ్స్ రీడర్ పక్కన పడేసి కిటికీలో నుంచి బయటకు తొంగి చూశాను. గాలి నెమ్మదై చిటపట చినుకులు మొదలయ్యాయి. చప్పున లేచాను. బయటకు పరిగెత్తాలనుకొని గుమ్మందగ్గరే ఆగిపొయాను. సన్నగా పర్షం మొదలైంది. కింద పడ్డ చినుకులు ముత్యల్లా పైకిలేస్తున్నాయ్. ముచ్చటేస్తుందలా చూస్తుంటే…..! కన్రెప్పలు టపటపలాడించాను. |
బుజ్జిగాడి బెంగ
-ఎనుగంటి వేణుగోపాల్
చల్లగాలి ఎంచక్కా ఆగి ఆగి వీస్తోంది. వెనకాలే మట్టివాసన వస్తోంది. ఆ వాసన ఎంతో బావుంటుంది. అందుకే గట్టిగా పీల్చాను.
వెంటనే మాథ్స్ రీడర్ పక్కన పడేసి కిటికీలో నుంచి బయటకు తొంగి చూశాను. గాలి నెమ్మదై చిటపట చినుకులు మొదలయ్యాయి.
చప్పున లేచాను. బయటకు పరిగెత్తాలనుకొని గుమ్మందగ్గరే ఆగిపొయాను. సన్నగా పర్షం మొదలైంది. కింద పడ్డ చినుకులు ముత్యల్లా పైకిలేస్తున్నాయ్. ముచ్చటేస్తుందలా చూస్తుంటే…..! కన్రెప్పలు టపటపలాడించాను.
ఆకాశంలోంచి రాలిపడే ఆ నీటిబుగ్గల్ని అలా చూడడమంటే భలే సరదా.
వర్షంపడ్తుంటే భలేగా వుంటుంది మరి. చల్లని ఇస్‌క్రీం చప్పరిస్తున్నంత ఆనందం కలుగుతుంది. చెల్లాయికి తెలీకుండా క్రీంబిస్కట్స్ నేనొక్కన్నే తింటున్నంత సంబరంగానూ ఉంటుంది.
చెప్పొద్దూ! నాలో ఉత్సాహం ఉరకలు వేస్తొంది. మరే ఎగిరి గంతేయాలనిపిస్తోంది.
నిజం….. వర్షం అంటే నాకెంతో ఇష్టం. వర్షంలో తడవడమంటే మరీమరీ ఇష్టం. వర్షంలో గంతులేయడమంటే బోల్డంత సరదా.
వర్షాకాలం వచ్చిందంటే చాలు.
“రెయిన్ రెయిన్
కం అగేయిన్…” అనే రైమ్ అస్తమానం పాడేస్తుంటాను.
ఇలా వర్షంవచ్చినప్పుడల్లా బయటకొచ్చి సరదాగా తడవాలనుకుంటాను. మరి వీలవద్దూ!
కానీ ఓసారి బలేగా అయ్యిందిలే.
వర్షం కురుస్తుంటే బయటకొచ్చి నిలబడ్డా. నా వెనకాలే చెల్లాయ్ వచ్చింది. తన చిన్ని కళ్ళని చక్రాల్లా తిప్పుతూ నన్నే మార్చిమార్చి చూస్తోంది. నేనే అంటే నాకంటే గడుగ్గాయి. మహా అల్లరి పిల్ల. ఎప్పుడైనా అంతే! డైనోసార్‌లా నన్నొదలకుండా వెంబడిస్తుంది. నే చేసే పనుల్ని పసిగడ్తుంది.
చెల్లాయ్ చదవదు. డాడీకేమో నేను చదవట్లేదని చెబుతుంది. మమ్మీ డాడీలకేమో చెల్లాయంటే బలేముద్దు. బాగా మురిపెం చేస్తారు. ఇంకా స్కూల్‌కి పోవట్లేదుగా… అందుకనేమో!
నేనారోజు ఎలాగైనా వర్షంలోకి వెళ్ళాలనుకున్నాను. చెల్లాయ్ ఎప్పటిలాగా కాపుకాస్తోంది. నెమ్మదిగా ఎడంకాలెత్తి చినుకులకడ్డం పెట్టాను. కాలు తడుస్తుంటే బలేగా అన్పించింది. చెల్లాయ్ మొహం చూద్దామని తలతిప్పా… ఉంటేగా!
ఇంకేం, ఎవరూ చూడ్డంలేదని వర్షంలోకెళ్ళబోయాను. చెల్లాయ్ బామ్మకి చెప్పేసిందేమో? బామేమో డాడీ చెవిన వేసినట్లుంది.(ఎందుకంటే నేను మీదపడి రక్కి గొడవచేస్తానని తన భయం) డాడీ కేకేసి పిల్చారు. చదువుమానేసి ఏంటాపనంటూ కోప్పడ్డారు. మమ్మీ కూడా మందలించింది. ఆరోగ్యం చెడుతుందని చీవాట్లేసింది. చాటుగా నిలబడి చెల్లాయ్ చప్పట్లుకొడ్తుంటే కొరకొరా చూశాను.
చెల్లాయ్ నాజట్టుకాదు కదా నేను తిట్లుతింటుంటే దానికి మహా సరదా. ఇంకేం! ఇలా ఎప్పుడు వర్షంలోకి వెళదామన్నా చెడుతూ వస్తోంది.
ఈసారి వర్షం మరింత ఎక్కువగా వుంది.
“బుజ్జీ, ఒరేయ్”లోపల్నుండి మమ్మీ పిలుపు.
“అమ్మో! ఇక్కడిలా నిలబడ్డం చూస్తే ఇంకేమైనా వుందా?” అనుకున్నదే తడవు గబుక్కున లోపలికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాను.
* * *
మా డాబాకి ఎదురుగా ఓ గుడిసె వుంది. అందులోని పిల్లవాణ్ణిచూస్తే బలే ముచ్చటేస్తుంది. నా అంతుంటాడు. వాడి పేరేమో శీను.
నేను ఎంచక్కా దువ్విన క్రాఫ్, స్కూల్‌డ్రెస్, టై, టక్, షూలతో నీట్‌గా వుంటానా?
చింపిరితల, చిరిగిన డ్రెస్, దుమ్ముపట్టిన శరీరం, చెప్పుల్లేని కాళ్ళతో వాడు డర్టీగా వుంటాడు.
అయితేనేం! ఎంచక్కా ఆడుకుంటాడని?
ఫ్రెండ్స్‌తో కూడి మట్టిలో గెంతుతాడు. మట్టిని తడుపుతాడు. ముద్దలు చేస్తాడు. వాటితో బొమ్మలాటలాడ్తాడు. మరే ఎంత ముచ్చటేసుందని? నాకూ వాడితో కలిసి ఆడాలనుంటుంది. శీనులా ఇసుకలో దుముకాలనుంటుంది. పిచ్చుకగూళ్ళు కట్టుకోవాలని ఉంటుంది. లాగు జేబుల్నిండా ఇసుక నింపుకుని ఎగరాలనుంటుంది. ప్చ్! నన్ను బయటకే వెళ్ళనివ్వరు. ఇంకెలా ఆడుకునేది.
మాణింగ్ లేస్తానా? లేస్తూనే ట్యూషన్! ట్యూషన్ నుండొచ్చి స్నానం చేసి, టిఫిన్ తిని రడీ అవుతానా? స్కూల్‌బస్ సిద్ధం. సాయంత్రం హోంవర్క్. తర్వాత మళ్ళీ ట్యూషన్. ట్యూషనయ్యక కాసేపు స్టడీ. ఇవన్నీ అయ్యేసరికి రాత్రి తొమ్మిదవుతుంది. అన్నం తినిపించి పడుకోపెడతారు.
అవునూ మాణింగ్-ఈవినింగ్ రెండుసార్లూ ట్యూషన్ ఎందుకో చెప్పలేదు కదూ!
సెకండ్ యూనిట్‌లో నాకు సెకండ్‌ర్యాంక్ వచ్చింది. డాడీ ఏంత కోపం చేశారని. మమ్మీ కూడా మండిపడింది. బామ్మ అడ్డురాకపోతే వీపు చిరిగేది.
పక్కింటి చిట్టి ఫస్టొచ్చిందిగా. బాగా చదివి, చిట్టిని వెనక్కినెట్టేసి నన్ను ముందుకెళ్ళమని ఒకటే పోరు పెట్టేస్తున్నారు. సెలవురోజు కూడా చదవాల్సిందే. నాకేమో హాలిడేనాడు ఆడుకోవాలనుంటుంది. అస్తమానం చదువంటే బోరవదూ!
సండే వచ్చిందంటే చాలు. వీధి పిల్లలంతా జట్టుకడతారు. కలిసి ఆడతారు. కలిసి ఎగుర్తారు. అంతా గోలగోల. రోజూ సాయంత్రాలు సరేసరి! నాకేమో ఆ సమయంలో ట్యూషన్ కదా!
శీను గ్యాంగ్ రోజుకొక్క ఆటాడ్తుంటారు. చాలా సరదాగా గమ్మత్తుగా వుంటాయి. వాళ్ళాడే ఆటల్లో కొన్నింటిపేర్లే నాకు తెలీవు. గోళీలాటాడ్తారు. వింతగా వుంటుందా ఆట. కాగితపు పడవలు చేసి నీళ్ళలోకి వదుల్తారు. ఆ పడవలలా నీళ్ళలో కొట్టుకుపోతుంటే ఎంత బావుంటుందని? ఎవరి పడవ ముందుకెళితే వాళ్ళు విన్ అన్నమాట.
బొంగరం అటాడ్తారు. నాకసలైతే దాన్ని పట్టుకోవడమే రాదు. వాళ్ళాడ్తుంటే చూస్తుంటానలా! ఇంకోసారి దాగుడుమూతలాడ్తారు. బావుంటుందా ఆట. మరోసారి ఎంచక్కా క్రికెట్టాడ్తారు.
కనీసం క్రికెట్టయినా ఆడ్తాను అంటే మమ్మీ ఒప్పుకోదు. దెబ్బలు తగుల్తాయంటుంది. వద్దంటుంది. అన్నీ వద్దు-వద్దనడమే! ఎందుకనో! మరేమో నాకైతే ఏడ్పొస్తుంది. దిగాలుగా కూచొంటాను. డాడీకూడా అంతే. టీవీలో వస్తుందిగా చూడమంటారు. నాకేమో ఆడాలని. చూడ్డం కంటే ఆడ్డమే బావుంటుంది. వీళ్ళకేమో అర్థం కాదు. వినరు. వినిపించుకోరు. ఆడనివ్వరు.
వీడియో గేం తెచ్చారు డాడీ. వీడియోగేమ్స్ ఆడుకోమంటారు. ఆడుకొంటాను సరే. అదీ ఎంతసేపని? ఒక్కడ్నీ ఆడుకోవడమంటే బోరవ్వదూ? వీళ్ళకెలా చెప్పేది? ఫ్రెండ్స్ ఎవరైనా వస్తే మమ్మీ-డాడీలు గంటల తరబడి ముచ్చట్లేసుకుంటారా? మరే నన్ను శీనుతో గాని, వీధి వాళ్ళతో గాని మాటాడనివ్వరు. ఆటాడుకోనివ్వరు. ఎందుకో మరి? అర్థమై చావక బుర్ర గోక్కుంటాను.
మమ్మీ ఇంతున్నప్పుడు తొక్కుడుబిళ్ళాటాడేదిట. దాగుడుమూతలు, చెమ్మాచెక్కా… ఎన్నని చెప్పను? అన్నీ ఆడేసేదట. అమ్మమ్మ చెప్పింది. మరి నన్నేమో ఆడుకోనివ్వట్లేదు.
డాడీ అయితే స్కూల్‌నుండి వస్తూనే బ్యాగ్ ఇంట్లోకి విసిరేసి బయటకి వెళ్ళేవాడట. డాడీ ఆడని ఆట, తిరగని వీధి లేదుట. సెలవు వస్తే చాలు ఇంటిపట్టున ఉండేవాడు కాదుట.
“నిన్నేమో చదువు చదవంటూ బాగా కట్టడి చేస్తున్నాడు. నీ అంతున్నప్పుడు వీడు వీధులు పట్టుకు తిరిగేవాడు కాదూ?” అంటూ డాడీకి వినపడకుండా బామ్మ బలేగా కోప్పడ్తుంది.
అదీ ఎంతసేపని? కాళ్ళు పట్టేశాయని, లాగేస్తున్నాయని గగ్గోలుపెడుతూ… నా గెడ్డం పట్టుకొని బతిమిలాడినపుడు- పోన్లే పాపమని చూసి జాలిపడి బామ్మ కాళ్ళు నేను ఒత్తుతా చూడండి. అంతవరకన్నమాట. కాళ్ళు ఒత్తేపని పూర్తయిన తరువాత బామ్మ వాళ్ళ జట్టే చేరుతుంది.
నన్ను వీధిలోకి వెళ్ళనివ్వరు. వీధిపిల్లల్ని లోనికి రానివ్వరు. వర్షంలో తడవద్దు అంటారు. వీధిలో ఆటలాడొద్దంటారు. మరెలా?
ఎప్పుడైనా కాస్త టైం దొరికితే టీవీలో మాత్రం చూడమంటారు. నాకేమో బోర్ కొడుతుంది. అయినా ఎంత సేపని టీవీ చూడను?
నాకేది ఇష్టమో తెలీదు వీళ్ళకు. వాళ్ళకేది ఇష్టమైతే అది చేయమంటారు. అలాగే ఉండమంటారు. ఇదేమైనా బావుందా? నాకదే నచ్చదు. బలేగా కోపమొస్తుంది. ఏం చేస్తా చిన్నపిల్లాడ్నిగా!
* * *
ఈసారి బలేగా అయ్యిందిలే.
స్కూల్నుండి వచ్చాక డ్రెస్‌విప్పేసి, బ్యాగ్‌లోపల పెట్టేసి, హార్లిక్స్‌తాగి పోర్టికోకిందికొచ్చి, చెంపమీద చెయ్యాన్చుకొని దిగులుగా కూచున్నాను.
ట్యూషన్‌లేదీరోజు. అందుకన్నమాట ఖాళీగా కూచుంది. ఎక్జామ్స్ అయ్యాయిగా. హోంవర్క్ లేదోచ్. మరింక దిగులెందుకా? వినండి…
తలెత్తి ఆకాశంవంక చూశానా? శీనూగ్యాంగ్ వీధిలో కలుసుకున్నట్లు ఆకాశంలో మబ్బులు గుమిగూడ్తున్నాయి. గాలి చల్లబడింది.
ఎంచక్కా మట్టి వాసన వస్తోంది. ఆవాసన నాకెంతో బావుంటుందని చెప్పానా? అయినా ఆనందంగా పీల్చలేదు. మనసు బావోలేదు అందుకని.
వర్షం అంటే
ఎక్కడో వర్షం పడ్తోంది. ఎట్లాగూ ఇక్కడా వర్షం పడ్తుంది. వర్షంలోకి ఎప్పుడెళ్దామా అని నాకుంది. ఎలా కుదుర్తుంది?
బామ్మ వుంది. మమ్మీ వుంది, డాడేమో ఆఫీసు నుండి పెందరాళే వచ్చారు.
చెప్పలేదు కదూ! మా చెల్లాయ్‌కూడా వుంది.
బలేగా చెప్పారు. ఎంచక్కా అక్కడే వుంటుంది.
నా వెనకాల చూడండి. నావంకే తొంగితొంగి చూస్తుంటుంది. చూస్తూ వుందా? వుంటుందుంటుంది. నే చెప్పలా! అది నాచుట్టూనే తిరుగుతూ వుంటుందని. మరేమో నాకు బెంగగా వుందా? దిగులుమొహం వేసుక్కూచున్నానా? అప్పుడు వచ్చారు డాడీ నా చెంతకు.
నే చెప్పినట్టే వర్షం పడ్తోంది.
చినుకులెప్పుడో మొదలయ్యాయి.
“వర్షం పడ్తోంది. లోపలికొచ్చేయ్‌రా బుజ్జీ” అని డాడీ అంటారనుకున్నా. అన్లేదులే.
అదే చూస్తున్నా!
“బుజ్జీ…” ప్రేమగా పిల్చారు.
గిర్రున వెనక్కి తల తిప్పాను.
“యస్, డాడీ!” అన్నాను.
“కమాన్ మై బోయ్!” చాలా ఆప్యాయంగా పిల్చారు నన్ను దగ్గరకు రమ్మని.
లేచి నిల్చున్నాను. ఏమీ జవాబివ్వలేదు.
దగ్గరికి వెళ్ళాను.
“ఈ రోజు నీ ఇష్టం. చినుకుల్తో ఆడుకోవచ్చు. నీళ్ళల్లో గెంతొచ్చు. ఇలా వర్షంలో తడవడం మాత్రం ఈ ఒక్కసారికి మాత్రమే సుమా! కాకపోతే రేపటి నుండి స్కూల్‌నుండి వచ్చింతర్వాత సాయంత్రం ఓ గంటసేపు నీ ఫ్రెండ్స్‌తో ఆనందంగా ఆడుకోవచ్చు. ఓకే మై బోయ్?” నా బుగ్గమీద ప్రేమగా ముద్దుపెట్టుకుంటూ చెప్పారు డాడీ.
“యాహూ….!” అని అరిచాను.
చెల్లాయ్ సంగతి వేరే చెప్పాలా? మూతి ముడుచుకుంది. పంజరంలోంచి వదిలిన పక్షిలా స్వేచ్చగా కదిలాను. ఒక్క పరుగుతో పోర్టికో దాటాను.
వర్షంలోకి వెళ్ళబోతూ వెనుదిరిగి డాడీ వంక చూశాను, నవ్వుతున్నారు డాడీ. విస్మయంగా చూశాను. ఆయన చేతిలో నా చిన్ని డై…రీ…!?
మరో చేతిలో నా ప్రొగ్రెస్ రిపోర్ట్.
ఇంతకీ విషయం చెప్పనేలేదు కదూ? చిట్టిని తోసేసి, నే క్లాసు ఫస్టొచ్చాన్లెండి.
———–