| పేరు (ఆంగ్లం) | Sarada S.Natarajan |
| పేరు (తెలుగు) | శారద యస్. నటరాజన్ |
| కలం పేరు | శారద |
| తల్లిపేరు | భాగీరధి |
| తండ్రి పేరు | సుబ్రహ్మణ్య అయ్యర్ |
| జీవిత భాగస్వామి పేరు | – |
| పుట్టినతేదీ | 01/01/1924 |
| మరణం | 08/17/1955 |
| పుట్టిన ఊరు | తమిళనాడుకు చెందిన పుదుక్కోట |
| విద్యార్హతలు | – |
| వృత్తి | – |
| తెలిసిన ఇతర భాషలు | ఆంగ్ల, ఫ్రెంచి |
| చిరునామా | – |
| ఈ-మెయిల్ | – |
| ఫోను | – |
| వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
| స్వీయ రచనలు | ఏది సత్యం, మంచీ చెడూ, అపస్వరాలు. మహీపతి |
| ఇతర రచనలు | – |
| ఈ-పుస్తకాల వివరాలు | – |
| పొందిన బిరుదులు / అవార్డులు | – |
| ఇతర వివరాలు | – |
| స్ఫూర్తి | – |
| నమూనా రచన శీర్షిక | శారద యస్. నటరాజన్ |
| సంగ్రహ నమూనా రచన | – |
శారద యస్. నటరాజన్
శారద యస్. నటరాజన్ తెలుగు కథా రచయిత. ఆయన “శారద” అనే కలంపేరుతో విజయవాడ, తెనాలి నేపథ్యంతో అద్భుతమైన కథలు నవలలు అందించారు.
ఆయన తమిళనాడుకు చెందిన పుదుక్కోటలో భాగీరధి, సుబ్రహ్మణ్య అయ్యర్ దంపతులకు 1924లో జన్మించాడు. వారిది అతి బీద బ్రాహ్మణ కుటుంబం. వారికి పూట గడవటమే కష్టం. అట్టి పరిస్థితులలో, నటరాజన్ జోలెబట్టి మధూకరం తెచ్చుకొని చదువు కొనటమే కాకుండా, తల్లి తండ్రులను కూడా పోషించాడు. తీరిక సమయాలలో, దేవాలయాల వద్ద గంధం, విభూతి అమ్మి కొంత ధనాన్ని సంపాదించేవాడు. అతి చిన్న వయసులోనే, ప్రాచీన, ఆధునిక తమిళ సాహిత్యాన్ని పూర్తిగా ఆకళింపు చేసుకున్నాడు. ఎక్కువగా హాస్య, వ్యంగ్య రచనలు ఆయనను ఆకట్టుకున్నాయి. సహజంగా ఆయనకూ సునిశితమైన హాస్య దృష్టి అబ్బింది.నటరాజన్ తన రెండవ ఏటనే తల్లిని కోల్పోయాడు. అక్కలిద్దరినీ తెనాలికి చెందిన వారికిచ్చి వివాహం చేయటంతో, సుబ్రహ్మణ్య అయ్యర్ నటరాజన్ తో తెనాలికే చేరాడు. 1937 లో తెనాలికి వచ్చారు. మొదటినుండి పుస్తకాలను చదవటం, స్వయంగా కొత్త విషయాలను నేర్చుకోవటం నటరాజన్ కు అలవాటు. అలానే, ఆయన, ఆంగ్ల, ఫ్రెంచి భాషలను నేర్చుకోవటమే కాకుండా, నెమ్మదిగా ఆ భాషల్లో ఉన్న కథలను తమిళం లోకి అనువదించటం ద్వారా, తనలోని రచయితను మేల్కొలిపాడు. తెనాలికి వచ్చినప్పుడు ఆయనకు తెలుగు మాట్లాడటం గానీ, వ్రాయటం గానీ తెలియనే తెలియదు. తెలుగును నేర్చుకోవాలని ఆయనకు ఎంతో ఉబలాటం ఉండేది. కానీ, అతని ముందర ఉన్న సమస్య పొట్టనింపుకోవటం, తండ్రిని పోషించటం. తెనాలిలో మారీసుపేటలో ఉన్న ‘ఆంధ్ర రత్నహోటల్ ‘లో సర్వర్ గా చేరాడు. ఇక తెలుగు నేర్చుకోవటం తప్పని సరి అయింది, హోటల్ కు వచ్చిన వారితో మాట్లాడటం మొదట నేర్చుకున్నాడు. తరువాత స్వయంగా తెలుగు భాషను చదవటం, వ్రాయటం నేర్చుకున్నాడు. ఆ రోజుల్లోనే, ఆయన ఆంగ్ల పత్రికలలోని పజిల్సును పూర్తి చేసేవాడు. అలా, చాలా సార్లు బహుమతులు కూడా పొందాడు. తెలుగులో ప్రాచీన సాహిత్యం వైపు పోకుండా, ఆధునిక, సమకాలీనపు సాహిత్యాన్ని విశ్లేషణాత్మకంగా చదవటం అలవాటైంది. కొడవటిగంటి, చలం లాంటి వారి సాహిత్యాన్ని బాగా అర్ధం చేసుకున్నాడు. కనిపించిన ప్రతి తెలుగు పుస్తకాన్ని చదివే వాడు. అలా నటరాజన్ కాస్తా’శారద’ అయ్యాడు. ఆయనకు తెనాలిలో తెలుగు నేర్పిన అధ్యాపకుడు తురగా వెంకటేశ్వరరావు. ఆయన, ‘శారద’చేత గజేంద్రమోక్షం, శ్యామలాదండకం లాంటివి కంఠస్థం చేయించారు. శారద, తన పదిహేనవ ఏటనే తండ్రిని కూడా పోగొట్టుకున్నాడు. ఏకాకి అయిన ‘శారద’ తీవ్రమైన మనోవేదనకు గురయ్యాడు. ఒక రకమైన షాక్ కు గురయ్యాడు. తండ్రికి దహన సంస్కారాలు చేసిన నాటి రాత్రే మూర్ఛ వ్యాధికి గురయ్యాడు ‘శారద’. ఆఖరికి ఆ వ్యాధే అతనిని మృత్యులోకాలకు తీసుకొని వెళ్ళింది. కాలువ పక్క పడిన అతని మృతదేహాన్ని మరుసటి రోజుకు గానీ గుర్తించలేకపోయారు. అలా అర్ధాంతరంగా ముగిసింది ‘శారద’జీవితం.
చిన్నతనం నుండి తమిళ పత్రికలు ఆనందవికటన్, కల్కి చదువుతూ ఉండేవాడు. 14వ ఏట, తెనాలిలో అక్క, బావగారింటికి వచ్చి, అక్కడ బావ భీమారావు నడుపుతున్న హోటలులో పనిచేస్తూ, తెలుగు నేర్చుకుని తెలుగు కథలూ, నవలలూ రాశాడు. అనేక సాహిత్య సభలలో పాల్గొన్నాడు.
నటరాజన్ కేవలం వ్రాసింది ఏడేళ్ళపాటు, 1948 నించి 1955 వరకూ అంటే ఆశ్చర్యం కలక్కమానదు. 1945-55 మధ్య రాసిన నవలలు – ఏది సత్యం, మంచీ చెడూ, అపస్వరాలు. మహీపతి, మొదలైనవి. 1950-51లో తెలుగు స్వతంత్రలో ధారావాహికంగా క్షణంలో సగం శీర్షికతో ఆనాటి రాజకీయ, సాంఘిక పరిస్థితులపై వ్యంగ్య రచనలు చేశాడు.
నటరాజన్ బాల్యం పుదుక్కోటైలో గడిచింది. తల్లి పోయేనాటికి నటరాజన్ కి రెండేళ్ళు. తండ్రి సుబ్రహ్మణ్య అయ్యర్‌కి ముగ్గురు ఆడపిల్లలు, ఇద్దరు మగపిల్లలు. నటరాజన్ కడసారి బిడ్డ. ఇద్దరు అక్కలకి తెనాలిలో అబ్బాయిలకిచ్చి పెళ్ళి చేసాడు తండ్రి. ఒక అల్లుడు భీమారావు హోటల్ యజమాని. ఆయన మామగారు కోరినమీదట బావమరిది నటరాజన్ కి హోటల్లో ఉద్యోగం ఇచ్చాడు. తెనాలి వచ్చేనాటికి నటరాజన్ కి పన్నెండేళ్లు. అక్కడ పని ఎక్కువా జీతం తక్కువా అయి శారద తిండికి చాలానే తిప్పలు పడ్డాడు.
పదిహేనేళ్ళు తిరక్కుండా తండ్రి గతించాడు. తండ్రి దహనక్రియలు అయింతరువాత, యింటికి తిరిగి వస్తూ, మూర్ఛ వచ్చి రోడ్డుమీద పడిపోయేడుట. ఆ మూర్చవ్యాధితోనే 32వ ఏట 17.8.1955 న మరణించారు.
నటరాజన్ కి చిన్నతనంనించీ కథలమీద ఆసక్తి. మద్రాసులో తండ్రి దినమణికదిర్ ఆఫీసులో సంపాదకుడుగా కొంతకాలం పనిచేయడం నటరాజన్‌కి పత్రికలూ, కథలమీద ఆసక్తి పెంచుకోడానికి దోహదం అయిందేమో. తెనాలి వచ్చిన తర్వాత ఒక వీధిబడి పంతులు దగ్గర పట్టుదలతో తెలుగు నేర్చుకుని కథలు రాయడం మొదలు పెట్టేడు. కాయితాలు కొనడానికి స్తోమతు లేక కలెక్టరాఫీసువారు పారేసిన చిత్తుకాయితాలు ఏరుకుని, రెండోవేపు రాసేవాడుట. హోటల్లో నిలకడలేని ఉద్యోగం చేస్తూనే.
1946లో అరసం నిర్వహించిన సాహిత్య పాఠశాల శారదకి తనదైన దృక్పథం, మార్గం ఏర్పరుచుకోడానికి దోహదం అయిందంటారు సురేష్.
తెలుగు స్వతంత్రలో 1950-51 మధ్యలో క్షణంలో సగం అన్న ధారావాహిక శీర్షికలో రాజకీయ వ్యంగ్యరచనలు చేశాడు. రెండు నాటికలు, ఆరు నవలలు రాశాడు. చివరినవల చీకటితెరలు అసంపూర్ణం. ఇంకా కవితలు కూడా రాశాట్ట. నేను చూడలేదు.
శారద కర్తవ్యోన్ముఖుడు. తెలుగుస్వతంత్రలో ప్రచురించిన నా సమస్యలు అన్న ఒక వ్యాసంలో తన ఆర్థికబాధల గురించి రాస్తాడు. స్వాతంత్ర్యం వచ్చేక దేశం బాగుపడుతుందనుకున్నాడు కానీ తనలాటి వారిజీవితాలలో ఏమీ మార్పు లేదని వాపోతాడు. రచయితలకి పారితోషికం హక్కు అని ఉద్యమం లేవదీశాడు. మూర్ఛ జబ్బు వలన ఎప్పుడు ఎక్కడ పడిపోతాడో తెలీనిబాధతో, ఏపూట పస్తో తెలీని పరిస్థితుల్లో కూడా చందాలు వసూలు చేసి అన్నదానం చేసేడంటే ఆయన సంస్కారం, కార్యదీక్ష అర్థం చేసుకోవచ్చు.
తెలుగు సాహిత్యంలో’శారద’కు ఒక ప్రత్యేక స్థానం ఉంది. దురదృష్టమేమంటే, ‘శారద’అంటే చాలా మందికి తెలియదు. ఆ మహనీయుని గురించిన చిన్నపరిచయమే ఈ వ్యాసం. యస్.నటరాజన్ అనే వ్యక్తి ‘శారద’గా మారటం వరకు ఆయన జీవితంలో అనేక మలుపులు ఉన్నాయి. ఆలూరి భుజంగరావు వ్రాసిన సాహిత్య బాటసారి–‘శారద’ అనే జీవిత చరిత్రలో, ‘శారద’ను గురించిన కొన్ని విశేషాలను వ్రాసాడు.
తొలిసారిగా ఆయన వ్రాసిన వ్యంగ్య రచన ‘ప్రపంచానికి జబ్బుచేసింది’. ఇది 1946 లో ప్రజాశక్తి పత్రికలో ప్రచురించబడింది. ఆ రచన వారి సొంత పేరైన యస్.నటరాజన్ పేరు మీదే అచ్చయింది. ఆ రోజుల్లోనే, ఆయన ‘ప్రజావాణి’ అనే వ్రాత పత్రికను ప్రారంభించారు. ఆ తరువాత ‘చంద్రిక’ను మొదలు పెట్టారు. అయితే, వాటిని అనారోగ్య పరిస్థితులు, ఆర్థిక స్తోమత లేకపోవటం వల్ల ఎక్కువకాలం కొనసాగించ లేకపోయారు. 1948 నుండి1955 వరకు అంటే ఏడేళ్ళు మాత్రమే రచనలు చేశారు. తెలుగు స్వతంత్ర, జ్యోతి, హంస వంటి పత్రికలు ఆయనకు మంచి ఊతమిచ్చాయి. ప్రస్తుతం, రక్తస్పర్స, శారదరచనలు, శారద నవలలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఇవి కూడా, ‘శారద’ అభిమానుల పూనికవల్లనే వెలుగు చూశాయి. శారద, రావూరి భరద్వాజలు దాదాపుగా ఒకే సమయంలో రచనలను ప్రారంభించారు. ఇద్దరి మీదా చలం గారి ప్రభావం పూర్తిగా ఉంది. శారద జీవితమంతా దరిద్రంతోనే గడిచింది. ఒక చేత్తో, గారెలు చేసి అమ్ముతూ, మరో చేత్తో ‘మంచి-చెడు’ అనే నవలను వ్రాశారు. ఎంత దుర్భర పరిస్థితులు ఎదురైనా రచనా వ్యాసంగాన్ని మానలేదు. ఇక అతని శైలి చాలా భిన్నమైనది. ఎంచుకునే కథా వస్తువు విభిన్నంగా ఉండేది. ఈ రెండు లక్షణాలే శారదను తెలుగు సాహితీలోకంలో విశారదుడిగా నిలబెట్టాయి.”కొడవటిగంటి కుటుంబరావు, రావిశాస్త్రి గార్ల రచనలకు వారధి వంటి వాడు శారద” అని ఆ రోజుల్లోనే సాహితీ ప్రియుల మన్ననలను పొందాడు శారద. కార్మిక ఉద్యమాలతో సంబంధమున్న ఈయన రచనలలో, కార్మికుల జీవనవిధానం కనపడేది. కమ్యూనిస్టు పార్టీలో గుర్తింపు పొందిన కార్యకర్త. ఇంతటి సాహితీ సుసంపన్నుడైన ‘శారద’ దుర్భర దారిద్ర్యంతో, మూర్ఛవ్యాధితో, 17-08-1955 న, తన 31 ఏటనే శాశ్వతనిద్రలోకి జారుకున్నాడు. ఇదీ, ‘శారద నీరదేందు ఘనసార’ కన్నీటి కథ. నటరాజన్ అనే తమిళ యువకుడు ‘శారద’గా మారిన నిజమైన కథ. ‘శారద’జీవితం మరో సత్యాన్ని చెబుతుంది–కష్టాల కొలిమినుండే ప్రజలకు ఉపయోగపడే సజీవ సాహిత్యం ఉద్భవిస్తుంది. ఆకలిదప్పులు, దారిద్ర్యంఅతనిని భౌతికంగా బాధపెట్టాయేమో కానీ, అతనిలోని సాహితీ పిపాసను అంటుకోవటానికి, అడ్డుకోవటానికి కూడా అవి భయపడ్డాయి. కేవలం అతను ఒక రచయితే కాదు, తత్వవేత్త, క్రాంతదర్శి, దార్శనికుడు. తెనాలిలో ఆయన స్మారకచిహ్నాలు లేకపోవటం చాలా విచారకరం. ఆ మహనీయుని ఫోటో కోసం, నా దగ్గరవున్న ఆయన నవలనొక దానికోసం వెదికాను.ఆ నవల వెనకవైపు అట్టమీద ఆయన ఫోటో ఉంది. ఆ నవల కోసం ఎంత వెదికినా కనబడలేదు. “మంచి పుస్తకాలకు రెక్కలు వచ్చి ఎగిరి పోతాయి” అన్న నార్ల వారి మాటలు నిజమే కాబోలు. ఎవరైనా ఆయన ఫోటోను పంపితే ఆనందిస్తాను. తెలుగువారికి మంచి కథలను అందచేయటానికే ఆంధ్రదేశానికి వచ్చిన ఈ విశారదుడికి బాష్పాంజలి!
———–