| పేరు (ఆంగ్లం) | Nayani Subbarao |
| పేరు (తెలుగు) | నాయని సుబ్బారావు |
| కలం పేరు | – |
| తల్లిపేరు | – |
| తండ్రి పేరు | – |
| జీవిత భాగస్వామి పేరు | హనుమాయమ్మ |
| పుట్టినతేదీ | 10/29/1899 |
| మరణం | 7/8/1978 |
| పుట్టిన ఊరు | ప్రకాశం జిల్లా పొదిలి |
| విద్యార్హతలు | – |
| వృత్తి | ఉపాధ్యాయుడు |
| తెలిసిన ఇతర భాషలు | – |
| చిరునామా | – |
| ఈ-మెయిల్ | – |
| ఫోను | – |
| వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
| స్వీయ రచనలు | 1937లో రాసిన సౌభద్రుని ప్రణయ యాత్ర అనే ఆత్మ కథాత్మక కావ్యం. మాతృగీతాలు (1939), వేదనా వాసుదేవము (1964), విషాద మోహనము (1970) అనే స్మృతి కావ్యాలూ, జన్మభూమి (1973) అనే మహాకావ్యం |
| ఇతర రచనలు | – |
| ఈ-పుస్తకాల వివరాలు | – |
| పొందిన బిరుదులు / అవార్డులు | – |
| ఇతర వివరాలు | తెలుగు భావకవి. భారత స్వాతంత్ర్యసమరయోధుడు |
| స్ఫూర్తి | – |
| నమూనా రచన శీర్షిక | నాయని సుబ్బారావు కవితలు |
| సంగ్రహ నమూనా రచన | నాయని సుబ్బారావు తొలితరం తెలుగు భావకవి. భారత స్వాతంత్ర్యసమరయోధుడు. సుబ్బారావు అక్టోబర్ 29, 1899న ప్రకాశం జిల్లా పొదిలి పట్టణములో జన్మించాడు. ఈయన రచనలలో ప్రముఖమైనది 1937లో రాసిన సౌభద్రుని ప్రణయ యాత్ర అనే ఆత్మ కథాత్మక కావ్యం. ఈయన మాతృగీతాలు (1939), వేదనా వాసుదేవము (1964), విషాద మోహనము (1970) అనే స్మృతి కావ్యాలూ, జన్మభూమి (1973) అనే మహాకావ్యమూ రాశాడు. |
నాయని సుబ్బారావు
కవితలు
నాయని సుబ్బారావు తొలితరం తెలుగు భావకవి. భారత స్వాతంత్ర్యసమరయోధుడు.
సుబ్బారావు అక్టోబర్ 29, 1899న ప్రకాశం జిల్లా పొదిలి పట్టణములో జన్మించాడు. ఈయన రచనలలో ప్రముఖమైనది 1937లో రాసిన సౌభద్రుని ప్రణయ యాత్ర అనే ఆత్మ కథాత్మక కావ్యం. ఈయన మాతృగీతాలు (1939), వేదనా వాసుదేవము (1964), విషాద మోహనము (1970) అనే స్మృతి కావ్యాలూ, జన్మభూమి (1973) అనే మహాకావ్యమూ రాశాడు.
సుబ్బారావు స్వాతంత్ర్యపోరాటములో సహాయనిరాకరణోద్యమములో పాల్గొన్నాడు. ప్రముఖ తెలుగు కవయిత్రి నాయని కృష్ణకుమారి ఈయన కూతురు. విశ్వనాథ సత్యనారాయణ, తన వేయి పడగలు నవలలో కిరీటీ పాత్రను నాయని సుబ్బారావు దృష్టిలో పెట్టుకునే చిత్రించారు.
1928 నుండి అధ్యాపక వృత్తిలో కొనసాగి, 1955లో గుంటూరు జిల్లా, నరసరావుపేట పురపాలక ఉన్నతపాఠశాల ప్రధానోపాధ్యాయులుగా పదవీ విరమణి చేసిన సుబ్బారావు. 1958లో హైదరాబాదు నగరంలో నివాసమేర్పరచుకొని హైదరాబాదు ఆకాశవాణి కేంద్రంలో ఆయా ప్రసారాలకు అవసరమయ్యే విషయాలను వ్రాసే పనిని చేపట్టాడు. ఎక్కువగా గ్రామస్థుల కార్యక్రమాలకు వ్రాస్తుండేవాడు. స్త్రీల కార్యక్రమాలు నడిపే న్యాపతి కామేశ్వరి కూడా సుబ్బారావుచే తన కార్యక్రమాలకు కవితలు, పద్యాలు, నాటికలు వ్రాయించుకునేది.
హైదరాబాదుకు వచ్చిన కొత్తలో వివిధ అంశాలపై వ్రాసిన 25 ఖండికలను
భాగ్యనగర కోకిల అనే కావ్యంగా ప్రకటించాడు.
శుక్ర వారము
ప్రేమ మధు పూర్ణమైన నా హృదయ పాత్ర
నీ దినము నీ పెదవుల కందింతు ననెడు
నాసలో గన్ను విచ్చితి , నమృత సరసి
ఆ త్రిలోకైక జననిపాదాజ్జసవిధ
భూమి,మీలితనేత్రవై మోకరిల్లి
నీవు పూజాసుమమ్మ వై నావు
హృదయ
కర్ణి కామూలమున భక్తి కందళించి
అడరు పారవశ్యమ్మున తొడిమ యూడి
నేను పూవునై పడితిని నీదు చెంత;
జంటపూవుల యమృత విశ్వాస సౌర
భముల రోదసి శుక్రవారము ధ్వనించె .
నిత్యక్రీడ
ఉదయసంద్యానవాంశువు లదుమ దద్ద
రిల్లి ఆశాంతములనుండి మెల్ల మెల్ల
కుంచుకొనిపోవు నీనీడకొనలవెంట
చేరుకొందును నీ పధాంభోరుహములు!
ప్రబలమధ్యాహ్న తీక్ష్ణాతపమున కలిగి
అలసిపోయిన నీ నీడ కలసిపోయి
ప్రణయ భావాతిమధుర విశ్రాంతికొరకు
నీ శరీరాంచలము లంటి నిలిచియుంచు!
అపర సంధ్యార్ధ్ర రోచుల నమృతరాగ
మంజురంజితమై సాగి మరల దెసలు
క్రమ్ముకొనిపోవు నీనీడ కలసివెడలి
ఆ యనంతదిగంతమ్ము లావరింతు!
ప్రళయము
భాద్రపధమట!విమలాభ్రపధము గ్రమ్ము
నీ వినీలాంభుదోద్గత మ్మీ యఖండ
వర్షధారాప్రవాహమ్ము వచ్చి వచ్చి
నా హృదయగోళమునయందు నదులు గట్టు!
జీర్ణవసనుండ నీ చలి చించుకొనెడు
నా కృశీభూతదేహమ్ముపైకి పొర్లు
నీ ప్రవాహవేగము నిల్వనీదు నన్ను
ప్రళయసూచనయేమొ నా ప్రణయమునకు ;
అంతకంతకు దుర్వారమై ధరిత్రి
యింతయును ముంచుకొనుటే యీ యకాండ
విలయజలరాశి నా నిరుపేద జీవ
కళిక తనలోన నొక యశ్రుకణముజేసి ;
ఆ మహా క్రూర జలరాశియం దనంత
భంగము లుద గ్రగతుల నుప్పొంగు ననుము .
అచట నా ప్రేమయను మఱ్ఱి యాకు పఱచి
నేను పవళించెదను సుధాని భ్రుత మూర్తి ;
ఫలశ్రుతి
అంత శ్రమపడి పావన మభ్రగంగ
ధారుణికి దెచ్చి నాడు భాగీరధుండు
అంతమధియించి కలశ రత్నాకరమ్ము
అమృత భాండమ్ము పడసినా రమరవరులు ;
మత్పురానేక జన్మములు పండి
జాహ్నవీ స్వచ్చపును సుధా స్వాదు మూర్తి
వైన నీ దివ్య సాన్నిధ్య మందుకొంటి
బుడమికిన్ స్వర్గమున కొక్క ముడి రచించి ;
ఇంత కాలమ్ముగా నా క దృష్టములయి
ఎన్ని యానందధామము ళీ యనంత
భువ నసంధుల భాసిల్లు నవియు నేడు
మత్ప దాక్రాంతములు భావన్మహిమజేసి ;
అసురకృత్యము
ఎవ్వడే నీ గళమ్మునం దిరవు కొనగ
నేను విసరిన ప్రేమ ప్రసూన మాల
మదుమ , నీవు చూడగ బట్టి నలిపివై చి
నీ కనులయందు నెత్తురుల్ నింపినాడు ?
భావి భాగ్యోదయ ప్రభా భాసమాన
సుందరమ్మైన స్వాప్ని కానందమందు
మై మఱచియుండ , నెవ్వడే , మచ్చరించి
నా యెడదలోన చురకత్తి నాటినాడు ;
ఈ నిరంతరతీవ్ర భాధానివృత్త
మైన నా ముగ్ధ హృదయమ్ము నంత రాళ
శూన్య తలి , నెవ్వడే , నిలుచుండ బెట్టి
ఎడతెగని సంశయముల బంధించినాడు ;
ఈ యగమ్య వాయు పథమ్ము లేగనేర్చి
మన నడుమ దూతలైన యీ వినయశీల
పరమపరమాణువులకు వాగ్బంధనమ్ము
నెవ్వడే కఠోరముగా శాసించినాడు ?
ఎవ్వడే రాక్షసుడు , మన మీదనున్న
యవధియంతయు తానయై యాక్రమించి
వికటహాసండు నన్నిట్లు వెక్కిరించు ?
పడవ పగిలిన
ఇది పగిలిపోవు ననుభయ మ్మింతవరకు
ఈ తలంపున నానంద మిపుడు పొంగు
పగిలిపోయిన చెక్కలపట్టు విడువ
కీవు పాధోనిదాన మీదించెద వని ;
ఇది పగిలిపోవు ననుభయ మ్మింత వరుకు
ఈ తలంపున నిపు డుల్ల మిగురులెత్తు
తునిగిపోయిన చెక్కులతో పయోధి
గర్భమున రత్నరధ మీవు కట్టెదవని ;
ఇది పగిలిపోవు ననుభయ మ్మింత వరకు
ఈ తలంపున నిపు డాత్మ కింత శాంతి
విరిగిపోయిన చెక్కల దరికి జేర్చి
నీ చితికి కాష్ఠములుగ మన్నించెద వని ;
రచన :నాయని సుబ్బారావు
సేకరణ :వైతాళికులు సంకలనం నుంచి ……….
———–